Friday, September 13, 2013

షో.. దో ఘంటే కా!!


9/13/2013 5:28:44 AM


-రెండు గంటల సమైక్యవాదం.. సీమాంధ్రలో జోరుగా కిరాయి ఆందోళనలు
-కథ.. స్క్రీన్‌ప్లే.. దర్శకత్వం సీమాంధ్ర నేతలు
-నిర్మాతలు.. రాజకీయ పెట్టుబడిదారులు!
 
 
హైదరాబాద్, సెప్టెంబర్ 12 (టీ మీడియా): ‘హైదరాబాద్ మాకు కాకుండా పోతే మేమేం చేయాలి? ఇక్కడి పచ్చటి పొలాల్లో సెక్రటేరియట్  కట్టుకోమంటారా?’.. ఇది కృష్ణాజిల్లాలో సమైక్య రాష్ట్రాన్ని కాంక్షించే ఓ ఉపాధ్యాయురాలి స్వరం! ‘హైదరాబాద్‌ను మేమే అభివృద్ధి చేశాం.. దాన్ని తెలంగాణకు ఇచ్చేస్తామంటే ఎలా? తెలుగు జాతి అన్నదమ్ముల్లా.. ఐక్యంగా ఉండాలి’ ఇది మరో సమైక్యవాది అభిప్రాయం! పొట్టి శ్రీరాములు ఆశయాన్ని సాధిస్తామంటూ మరో ఆవేశపరుడి నినాదం.. 


నెలరోజులకు పైగా సీమాంధ్రలో సాగుతున్న ఆందోళనల్లో వినిపిస్తున్న అభిప్రాయాల్లో ఇవి కొన్నే!! కేవలం రెండు మూడు గంటలకే పరిమితమవుతున్న ఈ ఆందోళనల్లో పాల్గొని.. తమ అభిప్రాయాలను టీవీ చానళ్లముందు ప్రకటించే సమైక్యవాదులు.. కార్యక్రమం పూర్తిగాకాగానే.. దులిపేసుకుని వెళ్లిపోతున్నారన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.

దీనికి సూత్రధారులుగా ఉన్న సీమాంధ్ర పెట్టుబడిదారులు, స్వార్థ రాజకీయ నాయకులు.. తమ ప్రయోజనాలనే ప్రజల ప్రయోజనాలుగా మభ్యపెట్టి.. మాయ చేస్తున్నారన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. పనిలోపనిగా.. సమైక్యాంధ్ర ఉద్యమం నిర్వహణ కోసమంటూ చోటామోటా నాయకులు ఎవరికి వారుగా పెద్ద ఎత్తున విరాళాలు సేకరించే పని చేసుకుంటూ పోతున్నారని తెలుస్తోంది. మరికొందరు నాయకులు రానున్న 2014 ఎన్నికల్లో తమ పోటీ అవకాశాలను మెరుగుపర్చుకునే పనికి ఈ కార్యక్రమాలను ఉపయోగించుకుంటున్నారని సమాచారం. ఇందుకోసం తాము తరలించే వివిధ సెక్షన్ల వారి సంఘాలకు పది నుంచి ఇరవై వేల రూపాయల వరకూ చెల్లిస్తున్నారని తెలిసింది. ఇవికాకుండా హాజరైనవారికి వ్యక్తిగతంగా వంద నుంచి రెండు వందల వరకూ ఇస్తూ.. బిర్యానీ, మందు అందజేస్తున్నారని ఈ ఆందోళనలకు రెండు రోజుల పాటు వరుసగా హాజరైన ఒక వ్యక్తి చెప్పారు.

రెండు గంటల షో..
సమైక్య ఉద్యమాలు సినిమా షూటింగుల్లో ఏర్పాటు చేసే సెట్స్‌ను తలపిస్తున్నాయి. ఇంతాచేసి.. ఆ సెట్టింగులపై జరిగే ఆందోళన మాత్రం ఎటు చూసినా రెండు గంటలు మించడం లేదు. ఇందులో ప్రధాన పాత్రధారులు స్కూలు పిల్లలే. రంగు రంగుల యూనిఫారాల్లో ముచ్చటగా నడుచుకుంటూ వచ్చే విద్యార్థులు.. కాసేపు ఉత్సాహంగా నినాదాలు చేసి.. షో పూర్తికాగానే.. ఊస్సూరుమంటూ స్కూలు బస్సు ఎక్కి మళ్లీ బడికెళ్లిపోతున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఈ ప్రహసనానికి ముందు సీమాంధ్ర మీడియా ఆధ్వర్యంలో మరో తతంగం నడుస్తుంది. ఫలానా రోజు ఆందోళన ఎక్కడ నిర్వహించాలో ముందే నిర్దేశించుకుంటారు. అవసరమైన ‘ఏర్పాట్లు’ పూర్తి చేస్తారు.

ఇక సమయం కాగానే.. ప్రైవేటు స్కూళ్ల విద్యార్థులు.. తమ తమ స్కూలు బస్సుల్లో సదరు ఆందోళన జరిగే ప్రదేశానికి చేరుకుంటారు. తమ రాజకీయ అవకాశాలను పరీక్షించుకునే నేతల మందీమార్బలం కూడా అక్కడకు చేరుకుంటుంది. విద్యార్థులను క్రమపద్ధతిలో కూర్చొనేలా చూసే బాధ్యత ప్రైవేటు స్కూళ్ల టీచర్లదే! ఇక వేదికపై కొన్ని సంగీత నృత్య కార్యక్రమాలు! వాటికి చానళ్ల లైవ్ కవరేజ్! అదే సమయంలో కొందరు ఉద్యోగులు.. వృత్తిదారులు హాజరవుతారు.. గంటో రెండు గంటలో అక్కడ ఉండి.. కొన్ని నినాదాలు చేసి.. తిరిగి వెళ్లిపోతారు! షో పూర్తికాగానే.. పిల్లలను స్కూళ్లకు తీసుకెళ్లి.. మళ్లీ పాఠాలు చెప్పే పనిలో టీచర్లు నిమగ్నమైపోతుంటారని ఈ ఆందోళన క్రమాన్ని పరిశీలించినవారు చెబుతున్నారు.

కొద్ది రోజుల క్రితం ఏలూరులో జరిగిన లక్ష జనఘోష కార్యక్రమానికి వివిధ స్కూళ్లనుంచి విద్యార్థులను తరలించారు. ఇందులో ఉద్యోగులు కూడా పాల్గొన్నారు. ఈ కార్యక్రమం ఉదయం 11 గంటలకు మొదలై మధ్యాహ్నం 12.30 ముగిసిందని ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఒక ప్రభుత్వ ఉపాధ్యాయుడు తెలిపారు. ఇంతే కాదు రాష్ట్ర విభజన ప్రకటన వచ్చిన నాలుగు రోజుల తరువాత తిరుపతిలో సినీనటుడు మోహన్‌బాబు తన విద్యాసంస్థల విద్యార్థులతో ఒక్కరోజు సమైక్యాంధ్ర ర్యాలీ చేయించారు. విశాఖలో అసలు ఆందోళనలే లేవని, ఆర్కే బీచ్‌లో సాయంత్రం పూట కాసేపు కాలక్షేపానికి సభలు పెట్టుకుంటున్నారని అక్కడివారు అంటున్నారు. విశాఖలో సమైక్య ఉద్యమం అంతా రెండు స్థానిక ఆధిపత్య సామాజికవర్గాల మధ్య పోటీగా మారిందని చర్చ జరుగుతోంది. కర్నూలు, అనంతపురంలోని పామిడి, ఏలూరు, తదితర పట్టణాలలో జరుగుతున్న లక్షజన గళార్జనకు రెవెన్యూ అధికారులు, ఆర్టీఏ అధికారులు వాహనాలను ఏర్పా టు చేశారని సమాచారం. ఇంతచేసీ కాకినాడలో లక్ష గళార్చ నకు 40వేలమందిని కూడా తరలించలేకపోయినట్లు తెలిసింది.

సమైక్య ఆందోళనల్లో నష్టపోతున్నది బడుగుల పిల్లలే
సమైక్య ఆందోళనల్లో కార్పొరేట్ కళాశాలలు, పాఠశాలల విద్యార్థుల చదువులకు ఏ మాత్రం భంగం కలగడం లేదు. కేవలం రెండు గంటల షోలో పాల్గొనే వీరు.. తిరిగి స్కూలుకు వెళ్లిన తర్వాత బుద్ధిగా పాఠాలు నేర్చుకుంటున్నారు. ఇది కూడా రోజూ అన్ని స్కూళ్ల విద్యార్థులు ఆందోళనల్లో పాల్గొనరు. ఒక్కో రోజు.. ఒక్కో విద్యా సంస్థ వంతు! కానీ.. సర్కారీ బళ్లలో చదివే బడుగు వర్గాల పిల్లల్ని మాత్రం పట్టించుకునేవారే లేకపోయారు. ప్రభుత్వ టీచర్లు సమ్మెలో ఉండటంతో.. గవర్నమెంటు స్కూళ్లు మూతపడ్డాయి. సమ్మెపేరుతో టీచర్లు సెలవులను ఎంజాయ్ చేస్తుంటే.. పాఠాలు చెప్పేవారు లేక తమ పిల్లల చదువులు చట్టుబండలవుతున్నాయని పలువురు తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ఆర్టీసీ ఆగం.. ప్రైవేటు లూటీ
సీమాంధ్రలో జరుగుతున్న సమ్మెలో వ్యాపారస్తులు.. పెట్టుబడిదారులు తమ ప్రయోజనాలు దెబ్బతినకుండా చూసుకుంటున్నారనడానికి ప్రత్యక్ష నిదర్శనంగా నిలుస్తున్నది రవాణా రంగం. సీమాంధ్ర ప్రజల ప్రయాణ అవసరాలను దెబ్బతీసే విధంగా ఆర్టీసీని సమ్మెలో దించిన సీమాంధ్ర నేతలు.. ప్రైవేట్ ట్రావెల్స్‌ను మాత్రం ఉద్దేశపూర్వకంగానే వదిలేశారన్న చర్చ జరుగుతోంది. ఫలితంగా ప్రైవేటు ఆపరేటర్లు.. అందినకాడికి దోచుకుంటూ ప్రధాన నగరాలకు బస్సు సర్వీసులు నడుపుతున్నారన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. అనంతపురం జిల్లాకు చెందిన కాంగ్రెస్ నేత జేసీ దివాకర్‌డ్డి వంటివారి బస్సులు యథేచ్ఛగా తిరుగుతున్నాయి. పైగా.. వీటిని ఎవరైనా ఆపితే.. నేరుగా పోలీసులే రంగంలోకి దిగుతున్నట్లు సమాచారం. ఇటీవల పొద్దుటూరులో కొందరు దివాకర్ బస్సులను ఆపేయడం తో పోలీసుల వేధింపులను ఎదుర్కొనాల్సివచ్చిందని తెలిసింది.

చివరకు పోలీసుల కాళ్లపై పడిన ఆందోళనకారులు.. ఇంకెప్పుడూ దివాకర్ బస్సు లు ఆపబోమని కాగితం రాసిచ్చి మరీ అక్కడి నుంచి బయటపడాల్సి వచ్చిందని అంటున్నారు. కేశినేని, ఎస్‌వీఆర్, సూరి, ఎంఎం, కాళేశ్వరి తదితర ప్రైవేటు బస్సులుకూడా ఎలాంటి ఆటంకాలు లేకుండా నడుస్తున్నాయి. పైగా రెట్టించిన చార్జీలు వసూలు చేస్తూ ప్రజలను లూటీ చేస్తున్నాయి. ఈ ట్రావెల్ బస్సుల ఆపరేటర్లు హైదరాబాద్ నుంచి విజయవాడకు రూ.380 చార్జి ఉంటే.. ఏకంగా రూ.800 నుంచి వేయి రూపాయల వరకు వసూళ్లు చేస్తున్నట్లు ప్రయాణికులు ఆరోపిస్తున్నారు. ఆపరేటర్లు మాత్రం సీమాంధ్రలో ఎంతఎక్కువ కాలం సమ్మె జరిగితే తమకు అంత లాభమని చంకలు గుద్దుకుంటుండటం విశే షం. మరోవైపు ఆర్టీసీ బస్సులను రోడ్లపైకి రానీయకపోవడంతో సంస్థ తీవ్ర నష్టాల్లోకి వెళ్లిపోతున్నది.

ఉద్యమానికి దూరంగా ప్రజలు
సీమాంధ్రలో జరుగుతున్న ఉద్యమాల్లో సాధారణ ప్రజలు పాల్గొంటున్న దాఖలాలు కనిపించడం లేదని పలువురు అంటున్నారు. కేవలం ప్రైవేట్ స్కూళ్లు, కాలేజీల విద్యార్థులు, ఉద్యోగులతో మమ అనిపిస్తున్నారన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. ఏపీఎన్‌జీవోలు సమ్మెకు పిలుపు ఇచ్చినప్పటికీ దళిత, బడుగు, బలహీన వర్గాలకు చెందిన ఉద్యోగులు ఆందోళనల్లో పాల్గొనడం లేదు. ఇప్పటికే సీమాంధ్ర ప్రాంతానికి చెందిన జర్నలిస్టులు ఆంధ్రా జర్నలిస్టు ఫోరమ్ ఏర్పాటు చేసుకున్నారు. విభజన జరిగిపోయిందని, సీమాంధ్ర రాజధాని అభివృద్ధి, నీటి సమస్యలపై కేంద్రంతో చర్చించి నిధులు తెచ్చుకోవాలని, సమస్యలు పరిష్కరించుకోవాలని వారు అంటున్నారు. ఇదే విషయంలో ప్రకాశం జిల్లాకు చెందిన జర్నలిస్టులు స్థానిక ఎంపీని నిలదీశారు. ఈ ఆందోళనలతో చిన్న జీతగాళ్లే బాగా నష్టపోతున్నారు. వచ్చే జీతం తప్ప వేరే ఆదాయ వనరులు లేకపోవడంతో.. నెల జీతం రాక.. నానా అవస్థలు పడుతున్నారు.

ఇవన్నీ ప్రాయోజిత ఉద్యమాలే
రాష్ట్ర విభజన ఖాయమని తెలిసిన తర్వాత కూడా కావాలని తమ ప్రాంత నాయకులు విద్వేశాలు రెచ్చగొడుతున్నారు. మా ప్రాంతంలో జరిగేవన్నీ ప్రాయోజిత ఉద్యమాలు. తెలంగాణలో ఉద్యమాలపై విధించిన నిర్బంధాన్ని ఇక్కడా విధిస్తే.. ఒక్కరు కూడా రోడ్లమీదకు వచ్చే పరిస్థితి లేదు. ప్రభుత్వ పెద్దలే తెర వెనుక ఉండి సమైక్య ఆందోళనలు చేయిస్తుంటే.. ఇక అడ్డే ముంటుంది?
- భోజ్యానాయక్, లంబాడ హక్కుల
పోరాట సమితి ప్రధాన కార్యదర్శి, ఆంధ్రా ప్రాంత ఇన్‌చార్జి

No comments:

Post a Comment