Wednesday, September 11, 2013

సత్యవాణి


APNGOల సభలో సత్యవాణి అనే ఆవిడ చివరి ప్రసంగం చేశారు. ఊకదంపుడు ఉపన్యాసాలతో విసిగిపోయిన సభికులను తన వాక్చాతుర్యంతో, పురాణ పాత్రలతో ప్రస్తుత పరిస్థితిని పోలుస్తూ చేసిన ఉపన్యాసంతో సభికులను ఆకట్టుకున్నారు. కాని ఆవిడ పోలికలలో ఎంత పసవుందో పరిశీలిద్దాం.

ప్రధానంగా ఆవిడ తెలంగాణా వాదులను మారీచుడితో పోల్చారు. కాని మారీచుడికి, తెలంగాణా వాదులకు గల లింకేమిటో వివరించడంలో విఫలమయ్యారు.

అసలు మారీచుడెవడు? మారీచుడు సీతను అపహరించ డానికి సహాయం అర్థించిన రావణుడికి నీతులు బోధించాడు. తన ప్రయత్నాన్ని విరమించుకొమ్మని రావణునంత వాడికి సలహా ఇచ్చాడు. చివరికి బంధు ప్రీతితో రావణునికి సహాయం చేశాడు. రామున్ని మాయలేడి రూపంలో మోసం చేశాడు.

యాభై ఆరు సంవత్సరాల కింద తెలంగాణా సీతమ్మను అపహరించడానికి ఆనాటి తెలంగాణా కాంగ్రెస్ నాయకులు మారీచులవలెనే ఆంధ్రావణునికి సహాయం చేశారు. మాయలేడి లాంటి పెద్దమనుషుల ఒప్పందంతో రాముడి లాంటి కేంద్రాన్ని మోసగించి, సీతమ్మ లాంటి తెలంగాణాను చెరబట్టేలా చేశారు. రాముడికి సీతమ్మను చెర నుండి విడిపించ దానికి పద్నాలుగేళ్ళు పడితే, తెలంగాణమ్మను విడిపించడానికి యాభై ఆరేళ్ళు పట్టింది.  పోలిక అంటే ఎలా వుంటుందో ఇప్పుడైనా తెలుసు కుంటారా వక్రవాణి గారూ?

ఈ సత్యవాణి వక్రవాణి గానే కాక అసత్యవాణిగా కూడా తనకు తాను రుజువు చేసుకున్నారు. దుర్యోధనుడు సూదిమొన మోపేటంత భూమి ఇవ్వక పొతే పాండవులు ఇంద్రప్రస్తాన్ని నిర్మించారని సెలవిచ్చారు. ఇక్కడ సమైక్య వాదులను పాండవులతో పోల్చాలని ఆవిడ కోరిక! ఈవిడ గారికి మహాభారతం తెలియదని అనుకోలేం, కాబట్టి కావాలనే అబద్ధాలు చెప్తున్నదని అనుకోవాలి.

అసలు పాండవులు ఇంద్రప్రస్తాన్ని నిర్మించుకొన్నప్పుడు సూదిమొన ఊసే లేదు. పాండవులకు ధృతరాష్ట్రుడు వానప్రస్తాన్ని పంచి ఇచ్చాడు. వానాప్రస్తంలో వారు ఇంద్రప్రస్తాన్ని హస్తినాపురం కన్నా మిన్నగా నిర్మించు కున్నారు, కాని నేటి ఆంధ్ర్ల్లా సమైక్యవాదుల్లా పక్కోడి రాజధాని కావాలని గీపెట్ట లేదు. ఇక పొతే పైన రామాయణంలో జరిగినట్టుగానే పెద్దమనుషుల ఒప్పందమనే మాయాజూదంతో పాండవులవంటి తెలంగాణా ప్రజలను మోసగించి వారి రాజ్యాన్ని కబళించారు దుర్యోధనులవంటి ఆంధ్రా నాయకులు.

యాభై ఆరు సంవత్సరాల అరణ్య అజ్ఞాత వాసాల తర్వాత, పాండవుల్లాంటి తెలంగాణా ప్రజలు తమ రాష్ట్రాన్ని తిరిగి అడిగితే అడ్డం నిలువూ కాదంటూ ఒకవైపు మోసగిస్తూనే, చివరికి వీసా తీసుకో వలసి వస్తుంది, సూదిమొన మోపే భూమి కూడా ఇవ్వను తేల్చేశాడో అపర సుయోధన రాజన్న. సమైక్యవాదులనే కౌరవజనం వాడికి వంత పాడారు. చివరికి అధిక సంఖ్యాకులను ఎదిరించి పోరాటంచేసి, పాండవుల్లా అల్ప సంఖ్యాకులైన తెలంగాణా ప్రజలు తమ రాష్ట్రాన్ని సాధించుకోవాల్సి వచ్చింది.

ఇప్పుడు ఒప్పుకుంటారా అసత్యవాణి గారూ, పురాణాల పోలికలు ఎవరిని ఏవిధంగా సూచిస్తున్నాయో? ఈసారైనా కాస్త గట్టిగా హొమ్ వర్కుచేసి రండి.

కొసమెరుపు:
సభ తర్వాత జరిగిన ఒక టీవీ చర్చలో సత్యవాణి గారు తానూ తెలంగాణా కోడలినని, బతుకమ్మ ఆడుతానని చెప్పారు. ఒక బతుకమ్మ పాట తెలిస్తే పాడమ్మా అని దేశపతి శ్రీనివాస్ గారు అడిగితే నీళ్ళు నమలడం ఆమె వంతయ్యింది!
  

No comments:

Post a Comment