Friday, September 6, 2013

బంద్


ఈమధ్య బొత్తిగా ఇంటిపట్టున ఉండడం మానీసినావు మావా? నామీద కోపం గానీ వచ్చిందేమిటి? ఎప్పుడు చూసినా పనీ పనీ అంటూ పొద్దుళ్ళు, రేత్రిళ్ళు డ్యూటీ కాడికే పోతన్నావు!

అదేం కాదే ఎంకీ! కరెంటు ఉత్పత్తి పెంచేకని ఓవర్ టైం  డ్యూటీలు ఏత్తన్నారు. నాలుగు రాళ్లు దొరుకుతాయి గదా అని నేనూ ఎల్తన్నాను.

అలాగా? నువ్వేమో కరెంటు పెంచుతున్నా మని చెప్తున్నావు. మరి మనకేమో రోజుకు నాలుగ్గంటలు కోత  పెరిగిందేమిటి మావా?

కరెంటు ఉత్పత్తి పెంచేది మనకివ్వడానికేటే? పెద్దోళ్ళ వ్యాపారాలకి కరెంటు సరిపోటం లేదని మా సారు మూడు షిఫ్టులు పని చేయిత్తన్నాడు.

పెద్దోళ్ళ యాపారాలకి ఇప్పుడు కొత్తగా కరెంటు లోటెందు కొచ్చింది మావా?

నీదంతా ఎడ్డి ఎవ్వారం! గవర్నమెంటు పవర్ ప్లాంటు ఉద్యోగులు సమైక్య సమ్మె చేస్తున్నారు కదా?

అవునూ!

మరి కరెంటు ఉత్పత్తి తగ్గుతుంది కదా? పెద్దోళ్ళ యాపారాలు ఎట్లా నడుత్తాయి?

ఇంట సమ్మె జరుగి, పేదోళ్లకు తిండి కూడా దొరక్కుంటే,  పెద్దోళ్ళ యాపారాలు మాత్రం ఎందుకు నడవాలి మావా, తెలవక అడుగుతాను?

నీ పిచ్చిగానీ, పెద్దోళ్ళు తమ లాభాలను వొదులు కుంతారేటే? సినిమా, మందు యాపారాలతో సహా వాళ్ళ యాపారాలు సక్రమంగా సాగాలంతే. ఆగేది మాత్రం RTC బస్సులూ, గవర్నమెంటు స్కూళ్ళూ, ప్రభుత్వ ఆఫీసులూ!

అవును మావా! పక్కింటి పార్వతి సెప్తుండాది... వాళ్ళాయన RTC ఉద్యోగానికి వెళ్ళకుండా సమ్మె చేస్తూ, అదేదో బస్సుల కంపెనీలో ప్రైవేటు బస్సు నడుపుతున్నాడట!

అవునే! నీకు అసలు సంగతి తెలుసా? ఆ బస్సుల కంపెనీ ఓనరే సమైక్య ఉద్యమ నాయకుడు! తన బస్సులు డబల్ రేట్లకి నడుపుతాడు... RTC బస్సులు దగ్గరుండి బందు చేయిత్తాడు. అంతెందుకు? మా కరెంటు కంపెనీ ఓనరు కూడా సమైక్య ఉద్యమ నాయకుడే! ఆయన గవర్నమెంటు పవర్ ప్లాంటులు ఆపు చేసి, తనయి మాత్రం మూడు పొద్దులూ నడుపుతాడు. రాష్ట్రం ఎటు పోయినా వాళ్ళకు కావాల్సింది లాభాలేనే! లాభం వస్తుందనుకుంటే ప్రత్యెక ఉద్యమం కూడా చేపించగల మొనగాళ్ళు వీళ్ళు!!

వీళ్ళ అసాధ్యం గూలా? ఎంతకు తెగిస్తున్నారు మావా, వీళ్ళ బతుకు జెడ!!!

No comments:

Post a Comment