Sunday, September 8, 2013

సమైక్యవాదమా? సామ్రాజ్యవాదమా?


మధ్య యుగాలలో తెలంగాణా మొఘలుల పాలనలో ఉండేది. రాజధానికి దూరంగా ఉండే ప్రాంతం కనుక పరిపాలించే సర్దార్లలో ఎవడో ఒకడు స్వతంత్రం ప్రకటించు కునేవాడు. అది తెలిసిన డిల్లీ సుల్తాన్ పెద్ద సైన్యంతో తిరిగి దండెత్తే వాడు. హైదరాబాదులో పెద్ద గుడారం వేసుకొని దర్బార్లు నిర్వహించే వాడు. గానా బజానా నెలల కొద్దీ సాగేది.   సైనికులు తిరుగుబాటు దార్లను  పట్టుకుని ఉరి తీసే వారు. ప్రజలమీద పది మాన ప్రాణాలను దోచుకునే వారు. ఆ విధంగా గోల్కొండ మొఘల్ సామ్రాజ్యంలో అవిభాజ్య భాగమని, దాన్ని తన 'సమైక్య' రాజ్యం నుండి ఎవరూ  వేరు చేయలేరని మొఘల్ చక్రవర్తి ప్రపంచానికి చాటి చెప్పే వాడు.

నిన్న జరిగిన APNGO మీటింగును TV లో చూస్తున్నప్పుడు చరిత్ర నాకు మరోసారి స్పురణకు వచ్చింది. ఆంధ్రా ఉద్యోగులు బస్సులలో ససైన్యంగా దండయాత్రకు తమది కాని ప్రాంతానికి వచ్చారు. ఇక్కడ తమది కాని ప్రాంతం అని ఎందుకంటున్నామంటే, వచ్చిన వాళ్ళలో కనీసం కొంత మంది అయినా ఈ ప్రాంతం వారు ఉండి  ఉంటే, ఆమాట అన వలసిన అవసరం వచ్చేది కాదు. కాని జరిగిన మొత్తం తంతులో ఈ ప్రాంతం వారి ప్రాతినిథ్యం శూన్యం. మొత్తం ఆ ప్రాంతానికి చెందినా వారే అయినపుడు, మీటింగు అక్కడే పెట్టుకోవచ్చును. కాని మధ్య యుగ ఫ్యూడల్ సామ్రాజ్యవాద మనస్తత్వం కలిగిన దోపిడీ దారుల ఆలోచనలు ఆవిధంగా ఉంటాయని ఊహించలేం.

ఈ మీటింగు APNGO లు నిర్వహించినా, దీని వెనుక చాలా శక్తులు పొంచి ఉన్నాయని స్వయంగా దాని అధ్యక్షుడు అశోక్ బాబే ఒప్పుకున్నాడు. వారందరికీ తెలంగాణాపై దాడి నిర్వహించడానికి ఇదొక కవచం మాదిరిగా సహాయ పడింది.

ఆ సభకు వారు పెట్టిన పేరు 'సేవ్ హైదరాబాద్'. కాని తీరా మొదలయ్యాక దానికి వారు పెట్టుకున్న పేరు "సమై'ఖ్యాం'ధ్ర పరిరక్షణ వేదిక". సమైక్యతను చాటి చెప్పడానికి వారు చేసింది శూన్యం. వారెంత సీపూ విడిపోవడం వల్ల వాళ్ళకు కలిగే(?) నష్టాలు ఏకరువు పెట్టారు తప్ప, కలిసుంటే తెలంగాణా వారికి కలిగే ఒక్క ప్రయోజనం గురించి చెప్పలేక పోయారు.

ఇంతకీ వాళ్ళు చెప్పినవి ఏమిటి?

విడిపోతే 40000 మంది గవర్నమెంటు ఉద్యోగులు ఆంధ్రాకు తిరిగి వెళ్ళవలసి వస్తుంది. - అశోక్ బాబు

తెలంగాణా ఏర్పడ్డాక కూడా పదేళ్ళ పాటు హైదరాబాదు ఉమ్మడి రాజధానిగా ఉంటుందని ఇదివరకే ప్రకటించారు. అంటే పదేళ్ళదాకా రాష్ట్ర ప్రభుత్వ కేంద్ర కార్యాలయాలలో పనిచేసే ఉద్యోగులు హైదరాబాదు వదిలి వెళ్ళవలసిన అవసరం లేదు. మరి తిరిగివెళ్ళేది ఎవరు? వారెవరో ఇదివరకే గిర్గ్లానీ కమిటీ చెప్పింది. 610 GO చెప్పింది. మొన్న CM ఆ సంఖ్య 19000లని సెలవిచ్చారు. ఇప్పుడు ఆ సంఖ్య 40000లని అశోక్ బాబు వెలువరించాడు. ఇంతకీ అశోక్ బాబు అబద్ధం చెప్తున్నాడా? CM అబద్ధం చెప్తున్నాడా? వీళ్ళిద్దరి కంటే ముందే తెలంగాణా వాదులు ఈ సంఖ్య గురించి, అక్రమంగా రిక్రూటై తిరిగి వెళ్ళాల్సిన వారి గురించి నెత్తీ నోరూ మొత్తుకుంటున్నారు. అపుడు ఆంధ్రా నాయకులు గాని, ప్రజలు గాని ఒప్పుకోలేదు, అలాంటి సంఖ్యే లేదని బుకాయించారు. ఇప్పుడు స్వయంగా వారే ఒప్పుకోక తప్పని పరిస్థితి!

విడిపోతే 10000ల RTC కార్మికులు (సీమాంధ్ర కు చెందిన) రోడ్డు మీద పడతారు.  - సీమాంధ్ర RTC JAC లీడరు

ఇది మాత్రం మనం కొత్తగా వినే సంగతి. ఈ మాటతో RTC లో ఇంతకాలం సీమాంధ్ర నాయకులు, అధికారులు ఇన్నాళ్ళుగా చేస్తున్న గూడుపుఠాని బయట పడింది.

సమైక్యంగా ఉన్నప్పుడు బాగుండే RTC ఆంధ్రా కార్మికులు విడిపోతే రోడ్డుమీద ఎందుకు పడతారు? అక్కడే ఉంది అసలు మతలబు. RTC బిజినెస్ ను EPK తో కొలుస్తారు. EPK (Earning per Kilometer) అంటే కిలోమీటరుకు RTC సంపాదించే ఆదాయం. అది ఆంధ్రాలో ఏవరేజి కన్నా తక్కువ. తెలంగాణలో ఏవరేజి కన్నా ఎక్కువ. అంటే విడిపోతే తెలంగాణలో మరుసటి రోజు నుండే RTC లాభాల బాట పడుతుంది. ఆంధ్రా నష్టాలలో కూరుకు పోతుంది. ఎంతగా అంటే 10000 మంది కార్మికులు రోడ్డున పడే అంతగా. అందుకే సదరు RTC నాయకుడు విడిపోయిన పక్షంలో RTCని ప్రభుత్వ డిపార్టుమెంట్ గా మార్చాలని స్పష్టంగానే చెప్పాడు. ప్రభుత్వ డిపార్టుమెంట్ గా మారిస్తే లాభ నష్టాలతో పని లేకుండా వేతనాలు ఇస్తారు, ఉద్యోగ భద్రతా ఉంటుంది, అదీ విషయం!

మరి ఈ పరిస్థితికి కారణమేమిటి?

అన్ని విభాగాల్లో ఉన్నట్టుగానే RTC లో కూడా సీమాంధ్ర డైరెక్టర్లదే ఆధిపత్యం. సీమాంధ్ర నాయకుల/ముఖ్యమంత్రుల జోక్యం షరా మామూలే.  కాబట్టి అక్కడ ఆదాయం తక్కువగా ఉన్నా, ఇబ్బడి ముబ్బడిగా బస్ డిపోలను స్థాపించారు. కార్మికులను రిక్రూట్ చేశారు. అదే తెలంగాణలో ఎక్కువమంది RTC వినియోగదారులు ఉంది, దాని అభివృద్ధికి తోడ్పడుతున్నప్పటికీ, ఆ ప్రాంతాన్ని నిర్లక్ష్యం చేశారు. సరిపడే సంఖ్యలో డిపోలు/అదనపు బస్సులు వెయ్యని కారణంగా ఇప్పటికీ బస్సులపై వేలాడుతూ ప్రయాణించే పరిస్థితి తెలంగాణలో ఉంది. ఇప్పుడు విభజన కారణంగా ఈ వైరుధ్యాలు బయట పదుతున్నాయి. కాని ఇవి ఎవరు చేసిన పాపం? పుష్కరంగా తెలంగాణా వాదులు వివక్ష గురించి మొట్టుకున్నప్పుడు విన్నదెవడు? 

వారి ఉద్దేశం ఎప్పుడూ తెలంగాణా ప్రజల సమస్యలు తెలుసు కుందామనో, పరిష్కరించి రాష్ట్రాన్ని ప్రజాస్వామ్యయుతంగా సమైక్య భావనను పెంపొందించడం కాదు. తమ మంద బలాన్ని ఉపయోగించి తెలంగాణాను చెప్పు చేతల్లో ఉంచుకోవడం. రాష్ట్రంలో వీలు కాకపొతే కేంద్రంలో తమ డబ్బు ప్రభావం చూపి తమ వలసలను తెలంగాణలో పటిష్ట పరచుకోవడం. అలాంటి మధ్యయుగ భావనల ఫలితమే ఇప్పుడు జరిగిన సీమాంధ్ర సభ. అది సీమాంధ్ర వలసవాద సభ మాత్రమె, సమైక్య భావన పెంపొందించే సభ కాదు. అది వాళ్ళు నిరూపించారు కూడా. 

వారు అశేష వాహనాలలో వచ్చి హైదరాబాదు ముట్టడించారు. జనం మీద దౌర్జన్యం చేశారు. దర్బారు ఏర్పాటు చేసుకుని గానా బజానా చేశారు. తమను వ్యతిరేకించే వారిని అవహేళన చేశారు, సవాళ్లు విసిరారు. అంతకన్నా వారు చేసిందేమీ లేదు.



No comments:

Post a Comment