Thursday, September 12, 2013

సిగ్గుతో సమైక్యాంధ్ర, సిగ్గు విడిస్తే హైదరాబాదు



విభజన కొరకై తెలంగాణా వాదులు లేవనెత్తిన ఏ ఒక్క కారణానికి కూడా బదులు చెప్పలేని సమైక్య వాదులు సమైక్య నినాదం అందుకుంటారు. అన్నదమ్ములం, తెలుగుజాతి అంటూ పడికట్టు పదాలను వల్లెవేస్తారు. కొంచెం ఆవేశం ఎక్కువ కాగానే సమైక్యం పక్కన పెట్టి హైదరాబాదు భాష మొదలవుతుంది. వాళ్ళ మనసులోని అత్యాశలు నగ్నంగా బయట పడతాయి.

ఈ సమైక్య వాదులకు తెలుగుజాతి భావన ఎప్పుడూ లేదు. అలా ఉన్నవారైతే తెలంగాణా వారు ఇన్ని సంవత్సరాలుగా లేవనెత్తుతున్న సమస్యలకు సానుకూలంగా స్పందించే వారు. మలిదశ ఉద్యమం మొదలైన గత పన్నెండు సంవత్సరాలలో నైనా రాష్ట్రం ఒక్కటిగా ఉంచడం ఎజెండాగా వారు ఒక్క మీటింగు కూడా పెట్టుకొని చర్చిన పాపాన పోలేదు. తీరా రాష్ట్ర విభజనకు నిర్ణయం జరిగిందని ప్రకటించినాక మాత్రమె బజార్న పడ్డారు. అది కూడా వారికి జరుగబోయే(?) నష్టాలను ఏకరువు పెడుతున్నారు తప్ప, కలిసుంటే జరిగే ఒక్క మేలు కూడా చెప్పలేక పోతున్నారు.

హైదరాబాదు కోసం వీరు చేసే వాదనలు బహు విచిత్రంగా వుంటాయి. కేంద్ర ప్రభుత్వం స్థాపించిన ప్రభుత్వ సంస్థలను చూపిస్తారు. కేంద్ర ప్రభుత్వ రక్షణ సంస్థలు నెలకొల్పేందుకు అనువైన ప్రదేశాలను చూస్తారు తప్ప అది రాష్ట్ర రాజధానా కాదా అన్న విషయం కాదు. ఆ పద్ధతిలోనే వైజాగ్ లో, పోర్టు, షిప్ యార్డ్, నావికాదళం, స్టీల్ ప్లాంట్ వగైరా... శ్రీహరికోటలో స్పేస్ స్టేషన్ ఏర్పడ్డాయి. నిజాం వెళుతూ వెళుతూ ఇచ్చి పోయిన లక్ష ఎకరాల సర్ఫ్-ఎ-ఖాస్ భూములు ఉన్నాయి కాబట్టి ఆ పరిశ్రమలు ఇక్కడికి వచ్చాయి. అంటే కాని ఆ ఆంధ్రా నాయకుడో లాబీయింగు చేస్తే కాదు. కోల్పోయిన విలువైన భూములు తెలంగాణా వారివైతే, అందులో వచ్చే ఉద్యోగాలు అందరివీ.  

హైదరాబాదులో విలువైన ప్రభుత్వ భూములున్నాయి కాబట్టే వాటిని ప్రైవేటు వ్యాపారులకు అప్పనంగా పందేరం పెట్టి కమీషన్లు దండుకున్నారు ఆంధ్రా నాయకులు. చివరికి దాన్ని కూడా నిస్సిగ్గుగా తాము చేసిన అభివృద్ధిగా ప్రకటించు కుంటారు. హైటెక్ సిటీలో ఇప్పుడున్న సెజ్ ల ఒప్పందాలన్నీ కూడా పెట్టుబడిదారులకు మేలు చేసేవే తప్ప ప్రభుత్వానికి కాదు. కోల్పోబడ్డవి మాత్రం తెలంగాణా ప్రజలకు చెందినా విలువైన భూములు.

సాఫ్టువేర్ రంగంలో అయినా ఫార్మా రంగంలో అయినా జరిగిన అభివృద్ధి ఇక్కడి సమశీతోష్ణ వాతావరణం, కార్మికుల లభ్యత వల్లనే కాని నాయకుల వాళ్ళ కాదు. నాయకుల వల్ల జరిగే పనైతే విజయవాడ, విశాఖల్లో కట్టించిన సెజ్ లు కూడా అదే విధంగా అభివృద్ధి చెందేవి. 

హైదరాబాదు తెలంగాణా అంతర్భాగం. ఏ వైపునుండి చూసినా ఆంధ్రా నుండి హైదరాబాదు చేరుకోవాలంటే కనీసం 200ల కిలోమీటర్లు ప్రయాణించాల్సి ఉంటుంది. ఎవరైనా రాజధాని తమ భూభాగంలో ఉండాలనుకుంటారు, సిగ్గు లేని సమైక్యవాదం ముసుగు తొడిగిన హైదరవాదులు తప్ప. వీరు 1956లో తెలంగాణతో కలిసినప్పుడు హైదరాబాదు వెంట తీసుకు రాలేదు, ఇప్పుడు తీసుకెళ్ళడానికి.

విభజన ప్రక్రియ అంటూ మొదలైతే అన్ని లెక్కలో తేలుతాయి. హైదరాబాదు నుండి ఎంత రెవెన్యూ  వచ్చిందో, ఎంత కర్చు పెట్టారో? అదేవిధంగా విశాఖ, విజయవాడ, తిరుపతి, కాకినాడ వంటి పట్టణాలు హైదరాబాదు కన్నా ఎన్ని రెట్లు ఎక్కువ అభివృద్ధి చెందాయో. హైదరాబాదు గురించి మరీ ఎక్కువ నీలిగితే ఇన్నాళ్ళూ తెలంగాణా మీద పడి తిన్న నిధులు, నీళ్ళు మొదలైన వాటి లెక్కలు కూడా తిరగదోడాల్సి ఉంటుంది.




  

No comments:

Post a Comment