Monday, February 27, 2012

దొందూ దొందేనా?



తెలంగాణా ప్రజలను మోసం చేయడంలో ఎక్కువా, తక్కువా అని లేకుండా కాంగ్రేసు, తెలుగుదేశం ఇప్పటివరకూ సమాన భూమిక నిర్వర్తించాయి.

ఈ రెండింటిలో ఏది పెద్ద శత్రువు? అనే ప్రశ్న వచ్చినప్పుడు జవాబు చెప్పడం కొంత కష్టతరమే. మానిఫెస్టోలో తెలంగాణా అంశాన్ని పెట్టి ఎన్నికల తర్వాత చంద్రబాబు తెప్ప తగలేస్తే, ఇచ్చేదీ తెచ్చేదీ మేమే నని తెలంగాణా అంతటా ప్రచారం చేసుకొని, తెలంగాణాలో పోలింగు పూర్తయిన మరుక్షణమే తెలంగాణా ఏర్పడితే వీసా తీసుకుని వెళ్లాని వక్కాణించిన ప్రభుద్దుడు మరొకడు. ఈ రెండు పార్టీలు తమకు చేసిన మోసాలు మరిచిపోవడానికి తెలంగాణా ప్రజలకు ఇంకో శతాబ్దమైనా సరిపోదు.


ఈ నేపథ్యంలో ఈ రెండింటిలో తెలంగాణా ప్రజలకు ఎక్కువ శత్రువు ఎవరన్నది బేరీజు వేయడం కొంచెం కష్టమైన పనే. ఈ రెండు పార్టీలు కూడా తెలంగాణా ప్రజలను నమ్మించి మోసం చేశాయి. రెండు పార్టీలు కూడా తమ ఎన్నికల అవసరాల కోసం తెలంగాణా అంశాన్ని వాడుకున్నాయి. తెలంగాణా ప్రజల భావోద్వేగాలతో చెలగాటమాడాయి. ఇప్పుడు తెలంగాణా ప్రజల వంతు వచ్చింది.


తెలంగాణా ప్రజలకు సంబంధించి ఈ రెండు పార్టీలు, సమాన శత్రువులే. కాక పోతే ఈ రెండు పార్టీల విధానాల్లో గుణాత్మకమైన విలక్షణత వుంది.


జాతీయ పార్టీ అయిన కాంగ్రేసుకు తెలంగాణా ఇవ్వడంవల్ల జాతీయ స్థాయిలో పెద్దగా పోయే దేమీ లేదు. ఇన్నాళ్ళు సమస్యను ముదిర్చి పాకాన బెట్టిన తర్వాత, తిరిగి అదే సమస్యతో రాష్ట్రంలో అధికారం వోట్లు తెచ్చుకునే అవకాశం ఎటూ లేదు. ఆ విషయం ఆ పార్టీకి కూడా తెలుసు. ఇక రాష్ట్రం ఇస్తేనే 'చిన్నరాష్ట్రాలకు తాము అనుకూలం' అంటూ ఉత్తర ప్రదేశ్ వంటి రాష్ట్రాల్లో అది చేసుకుంటున్న ప్రచారాలకు ఊతం దొరుకుతుంది. కాక పోతే ఆంధ్రా నాయకుల వ్యతిరేకతే అది ఏ నిర్ణయాన్ని తీసుకోక పోవడానిక్ ముఖ్యకారణం.

జాతీయ అవసరాలకు పెద్ద పీట వేయాల్సిన అవసరం కనుక వస్తే, అది ఈ వినాయకుల అడ్డంకులను ఏమాత్రం ఖాతరు చేయదు. పైగా దాని పక్కలో బళ్ళెంలా BJP అధికారంలోకి వస్తే మేం తెలంగాణా ఇస్తాం అని ఇప్పటికే ప్రచారం మొదలు పెట్టింది. పార్టీ పరంగా జాతీయ దృక్కోణంలో చూస్తే ఆ పార్టీకి తెలంగాణాను అడ్డుకోవలసిన అవసరం అంతగా కనిపించదు.

కానీ తెలుగుదేశం పరిస్థితి దానికి పూర్తిగా భిన్నం. ఆ పార్టీ పుట్టినప్పటినుండి తెలంగాణా నుండి ఏ ఒక్క వ్యక్తిని కూడా పార్టీ అధ్యఖ పదవి గాని, ముఖ్యమంత్రి పదవిగాని వరించిన చరిత్ర లేదు. ఇంకో యాభయ్యేళ్ళ తర్వాత కూడా ఆ పదవులు తెలంగాణా ప్రాంతానికి చెందినా వ్యక్తులకు దక్కుతాయని ఊహించలేం. తెలంగాణా ప్రాంతం వారిని పాలితులు గాను, తమను తాము పాలకులు గాను భావించడం సహజ న్యాయమని భావించే పార్టీ అది.


ఆ పార్టీ మనుగడే రాష్ట్ర ఐక్యతతో ముడివడి వుంది. అటువంటి పార్టీ రాష్ట్రవిభజనను కలలో కూడా ఊహించ లేదు. విభజనను ఆపడానికి అది సాయశక్తులా ప్రయత్నాలు చేస్తుంది. అందుకోసం చివరి నెత్తుటిబొట్టు వరకూ పోరాడుతుంది. ఆ కారణంగానే తెలంగాణా ప్రజలు ఆ పార్టీ ఎడల అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం వుంది.


గత పన్నెండు ఉప ఎన్నికల్లో సంపూర్ణంగా డిపాజిట్లు కోల్పోయి, అచేతనమై పోయిన తెలుగుదేశం పార్టీ, తన తైనాతీ మీడియా సపోర్టుతో, ధన బలంతో తిరిగి తెలంగాణా మీద పట్టు సంపాదించాలని కలలు కంటుంది. సహజంగానే తెలంగాణా ప్రజల విచక్షణా శక్తిపై ఆ ఆపార్టీకి అమితమైన చులకన భావం. కానీ తెలంగాణా ప్రజలు ఆ పార్టీ నేత అనుకుంటున్నట్టు ఊహలకు అందనటువంటి రాజకీయ చైతన్యం గలవారు. ఈసారి ఎన్నికల్లో తిరిగి లేవకుండా నడ్డి విరుస్తారనడంలో ఏమాత్రం సందేహం అవసరం లేదు. 


1 comment:

  1. తెలంగాణ ఏర్పడిన తరువాత కూడా తెలుగుదేశం పార్టీని తెలంగాణలో బ్రతకనీయడం ప్రమాదమే. సీమాంధ్ర నాయకత్వంలో పనిచేసే ఆ పార్టీ తెలంగాణను అభివృద్ధి కాకుండా ప్రతి పనికీ మోకాలడ్డగలదు.

    కొణతం దిలీప్

    ReplyDelete