Saturday, February 11, 2012

ఒక అబద్ధం, వందమంది గోబెల్స్



చాలా కాలం క్రితం- 2003లో అనుకుంటాను- ఒక ప్రముఖ జర్నలిస్టు యథాలాపంగా ఒక గొప్ప సూత్రం చెప్పారు. అది చాలా గొప్ప సూత్రమని తెలంగాణ ఉద్యమ సందర్భంగా నాకు మరింత బాగా అర్థం అయింది. అది తెలంగాణ రాష్ట్ర సాధన, కులాలు, అధికారాలపై చర్చ జరుగుతున్న సందర్భం. ఆయన చెప్పిన విషయం ఆయన మాటల్లోనే ‘‘తెలంగాణ వాళ్లు ప్రత్యేక రాష్ట్రాన్ని, సొంత రాజకీయ అస్తిత్వాన్ని సంపాదించుకోలేదు. సంపాదించుకున్నా నిలబెట్టుకోలేదు. తెలంగాణ వాళ్లు ఇంకా అమాయకత్వాన్ని అధిగమించి ఎదగలేదు. తెలంగాణ వాళ్లు అధికారంలోకి వచ్చినా మూన్నాళ్లకే వాళ్లకు తాటాకులు కట్టి గద్దె దింపేయగల శక్తులు వారికంటే బలంగా ఉన్నాయి. వాళ్లను ఎదుర్కొనే సాధనాలేవీ తెలంగాణ వారి వద్ద లేవు’’ అని ఆయన అన్నారు. ‘‘ఏమిటా సాధనాలు? ఎందుకిలా జరుగుతోంది?’’.

‘‘వేదకాలం, ఇతిహాసకాలం, చరిత్ర, చివరకు ఆధునికాంధ్రప్రదేశ్ నేర్పిన పాఠం నీకు అర్థం అవుతుందా? సమాజంపై అధికారాన్ని, ఆధిపత్యాన్ని శాశ్వతం చేసుకోవడానికి, దానిని జస్టిఫై చేసుకోవడానికి అక్షరం అన్నది ఒక బలమైన ఆయుధం. ఆ ఆయుధాన్ని సమర్థంగా ఉపయోగించుకున్నవాళ్లే నాటినుంచి నేటి వరకు సమాజంపై నిరాటంకంగా పెత్తనం కొనసాగించగలుగుతున్నారు. మా విషయమే తీసుకోండి. వేదాలు, ఉపనిషత్తులు, మంత్రం, తంత్రం రాసుకున్నాం. మాకు మేము అతీంద్రియ శక్తులను, అలౌకిక శక్తులను ఆపాదించుకున్నాం. ఈ ప్రపంచమంతా మంత్రభూతమైందని, ఆ మంత్రం తెలిసినవాళ్లం మేమేనని, ఇక్కడ శాంతిగా బతకాలన్నా, దర్పంగా రాజ్యాలు ఏలాలన్నా మమ్మల్ని ప్రసన్నం చేసుకోవాలన్న స్పృహను సమాజం నిండా వ్యాప్తి చేశాం.

మేము కేవలం అక్షరాన్ని, మంత్రాన్ని నమ్ముకున్నాం. చక్రవర్తులయినా మాకు సాష్టాంగపడవలసిందే. దేశాధినేతలయినా మా ఆశీర్వాదం పొందాల్సిందే. అది మా గొప్పతనం కాదు. మా అక్షరం గొప్పతనం. మేము సృష్టించుకున్న సాహిత్యం గొప్పతనం వేల సంవత్సరాలయినా ఆ అక్షరాల మహిమ తగ్గలేదు చూశావా?’’.
‘‘రాజులయినా అంతే. ఇతిహాసం చూడండి. చరివూతను చూడండి. మంచి రాజులుగా, స్వర్ణయుగకర్తలుగా, సాహితీ వల్లభులుగా చరిత్రలో మిగిలిపోయినదెవరు? ఒక్కసారి గుర్తు చేసుకోండి. రుషి, పండిత, కవి, గాయకులను చేరదీసి సాంస్కృతిక పోషణ చేసిన వారు, తమ పాలనకు సమర్థనగా అపారమైన సాహిత్యాన్ని సృష్టించుకున్నవారు, స్వయంగా అక్షరాలతో సహవాసం చేసినవారు మాత్రమే చరిత్రలో యుగపురుషులుగా మనకు ఇవ్వాళ మిగిలిపోయారు. వారిని గురించి మాత్రమే బాగా చదువుకుంటాం. గొప్పగా చెప్పుకుంటాం. వారిని గురించి మాత్రమే ఇతిహాసం లేక చారిత్రక కథలు, గాధలు, ఆధారాలు తరతరాలకు అందుతూ వచ్చాయి.

ఇన్ని వేల సంవత్సరాల్లో ఈ దేశాన్ని ఎంతమంది రాజులు, చక్రవర్తులు పరిపాలించి ఉంటారు? కానీ మహాభారత, రామాయణ పురుషుల సార్వకాలీనత, భోజరాజు గొప్పతనం, చంద్రగుప్తుని స్వర్ణయుగం, కష్ణదేవరాయల భువనవిజయం... ఇలా కొంతమంది గురించి మాత్రమే మనం ఎక్కువగా మాట్లాడుకుంటాం... ఎందుకు? మళ్లీ అక్షరమే కారణం. వారు సృష్టించుకున్న సాంస్కృతిక ప్రతిష్ఠ, సమర్థన, స్థానం(కల్చరల్ ఫేసు, జస్టిఫికేషన్ అండ్ స్పేసే) కారణం. ఆధునిక యుగంలో సీమాంధ్ర రాజకీయ నాయకత్వం, పారిక్షిశామిక నాయకత్వం, అందునా సీమాంధ్రకు చెందిన ఒక ప్రధాన సామాజిక వర్గం అటువంటి సాంస్కృతిక, సాహిత్య ఫేసు, స్పేసు సృష్టించుకుంది. ఆ ఫేసు, స్పేసుకోసం పుట్టినవే సీమాంధ్ర పత్రికలు, చానెళ్లు. తమకు అనుకూలంగా ఉన్నవారి పరిపాలనను జస్టిఫై చేసుకోవడానికి, తమకు నచ్చని వారిని ఎగతాళి చేసి ఎండగట్టడానికి ఈ పత్రికలు ఆది నుంచీ కృషి చేస్తూనే ఉన్నాయి.

మహాకవి శ్రీశ్రీ అన్నట్టు ఈ పత్రికలు తలుచుకుంటే ‘అనకొండలను, గోలకొండలను దాచగలవు. గోరంతలను కొండంతలు చేయగలవు’. ఒక కులాధిపత్యాన్ని, ఒక ప్రాంతాధిపత్యాన్ని, ఒక నేత ఆధిపత్యాన్ని కాపాడడానికి ఈ మీడియా ఎటువంటి కుట్రలు చేయగలదో ఈ మూడు దశాబ్దాల అనుభవం చాలు. అవినీతి పరుడిని ధర్మరాజుగా చూపగలవు. నీతిమంతుడికి తాటాకులు కట్టి మంట పెట్టగలవు. జలగం వెంగళరావును మహానుభావునిగా చిత్రించి నాలుగేళ్లు ఊరేగించిన పత్రిక, మర్రి చెన్నాడ్డిని ఏడాది తిరగకుండానే చెన్నాడ్డి చందాలడ్డి అని ముద్రవేసి సాగనంపేందుకు దోహదం చేయగలదు. నాదెండ్ల భాస్కర్‌రావును వెన్నుపోటుదారుగా చిత్రించి, ప్రజాస్వామ్య ఉద్యమం నడిపిన ఆ రెండు పత్రికలు, 1995 లో అదే పనిచేసిన నారా చంద్రబాబునాయుడిని ప్రజాస్వామ్య పరిరక్షకునిగా కీర్తించి నిలబెట్టగలవు.

తిమ్మిని బమ్మి చేయడం, బమ్మిని తిమ్మి చేయడం అనాదిగా నడుస్తూనే ఉంది. ఆ పత్రికలు నంది అంటే నంది, పంది అంటే పంది. వాళ్లు రాసిందే చరిత్ర. వాళ్లు ఇచ్చేదే కాండక్ట్ సర్టిఫికెట్. తెలంగాణవాళ్ల దగ్గర ఒక పత్రిక లేదు. ఒక చానెల్ లేదు. మీరు ఏం చేయగలరు? మీ ఉద్యమాన్ని ఎలా కాపాడుకోగలరు? మీ మీద జరిగే దాడిని ఎలా తిప్పికొట్టగలరు? తెలంగాణలో బలమైన సాహితీ సృజన ఉంది. కానీ తెలంగాణ రాజకీయాలు, ఉద్యమాలు, అస్తిత్వ పోరాటాల ప్రతినిధిగా ఒక బలమైన సాంస్కృతిక మీడియం ఏది?’’. ఇదంతా ఆయన ఆందోళనతో చెప్పిన విషయ మే. తరచి చూస్తే ఆయన చెప్పింది అక్షరాలా నిజమని తెలిసిపోతుంది. అనేకసార్లు రుజువయింది.

ఎనిమిదేళ్లు గడచిపోయాయి. తెలంగాణకు ఇప్పుడొక పత్రిక వచ్చింది. ఒక చానెల్ వచ్చింది. మరికొన్ని చానెల్‌లు కూడా తెలంగాణవాదాన్ని నిజాయితీగా రిపోర్టు చేస్తున్నాయి. ఈ పరిణామాన్ని సీమాంధ్ర నాయకత్వం, వారి ఆధిపత్యంలోని టీడీపీ, కాంగ్రెస్‌లు జీర్ణించుకోలేకపోతున్నాయి. తెలంగాణ ఉద్యమానికి వ్యతిరేకంగా, నమస్తే తెలంగాణ పత్రికకు వ్యతిరేకంగా కుట్రలు చేస్తున్నాయి. నమస్తే తెలంగాణను నైతికంగా దెబ్బతీయడానికి వీళ్లు చేయని ప్రయత్నం లేదు. ప్రత్యర్థిని దెబ్బతీయడానికి వీరు మొదటి నుంచీ అనుసరించే విధానం ఒక్కటే. ఇప్పుడూ అదే పద్ధతి అనుసరిస్తున్నారు. నిజాయితీగా యుద్ధం చేయడం చంద్రబాబు జాతకంలో లేదు. ఎదురొడ్డి పోరాడ్డం ఆయన నైజానికి విరుద్ధం.

కుట్రలు, కుతంత్రాలు ఆయనకు బాగా అచ్చొచ్చిన మార్గం. ఆయన కుట్ర ఎలా ఉంటుందంటే ‘ప్రత్యర్థిని దెబ్బతీయడానికి ఒక అబద్ధాన్ని సృష్టించు, వంద మంది గోబెల్స్‌ను తయారు చెయ్యి. ఆ ముఠాతో అదే అబద్ధాన్ని పదేపదే మాట్లాడించు. ఆ అబద్ధ ప్రచారకులు కూడా వీలైతే బడుగు బలహీనవర్గాలకు చెందిన వారయితే మంచిది. నోటిగదరోడయితే ఇంకా మంచిది. పత్రికలు, చానెళ్లలో ఆ అబద్ధానికి కొండంత ప్రచారం వచ్చేట్టు చూడు. ప్రత్యర్థి ఒక నేత కావచ్చు, ఒక ఉద్యమం కావచ్చు. మరో పత్రిక కావచ్చు’. నాడు ఎన్‌టిఆర్ విషయంలో అయినా సరే, నేడు కేసీఆర్ విషయంలో అయి నా సరే.

ఎవరి పోలవరం? ఎవరి టెండర్? టెండర్లు ఎలా వేస్తారు? డబ్బులు ఎప్పుడు వస్తాయి? తెలంగాణ ఉద్యమానికి, నమస్తే తెలంగాణ కు, పోలవరానికి ఏమిటి సంబంధం? కానీ సీమాంధ్ర నాయకత్వం, సీమాంధ్ర మీడియా లక్ష్యం ఉద్యమాన్ని, ఉద్యమకారుల నైతిక స్తైర్యాన్ని, నమస్తే తెలంగాణ నైతిక బలాన్ని దెబ్బతీయడం. అస్తిత్వం కోసం పోరాడుతున్న ఒక ప్రాంత ప్రజలపై సాగిస్తున్న అనైతిక యుద్ధంలో గెలవడమే తెలుగుదేశం, దాని అనుబంధ మీడియాకు ముఖ్యం. సత్యాసత్యాలు, నిజానిజాలు, ఉచ్ఛనీచాలు తర్వాత సంగతి. తడిగుడ్డలతో గొంతులుకోయడంలో వీళ్లు దిట్టలు. తెలంగాణ ఉద్యమం అదృష్టం-పోలవరం టెండర్ రద్దయి ఈ అబద్ధాల ముఠా నిజస్వరూపాన్ని బట్టబయలు చేసింది. కానీ ఒక అబద్ధాన్ని ఇంత నీచంగా మార్కెట్ చేయగలిగిన చంద్రబాబును ప్రజలు ఇంకా ఎందుకు నమ్మాలి? ‘స్యూ’ కంపెనీకి నమస్తే తెలంగాణకు ఏ విధంగానూ సంబంధం లేదు.

అది కృష్ణా జిల్లాకు చెందిన స్వర్గీయ వల్లూరిపల్లి నాగేశ్వర్‌రావు అనే పెద్దాయన ఎప్పుడో ఏర్పాటు చేసిన కంపెనీ. అందులో నమస్తే తెలంగాణ చైర్మన్‌కు ఉన్నది మూడు శాతం వాటా. కాంట్రాక్టర్లు, కార్పొరేట్లు, పవర్ బ్రోకర్‌ల సిండికేట్ అయిన టీడీపీకి కంపెనీల గురించి, ప్రాజెక్టుల గురించి, టెండర్ల గురించి, ఆదాయాల గురించి తెలిసినంతగా మరెవరికీ తెలిసే అవకాశం లేదు. సీక్రెట్ కొటేషన్ ద్వారా టెండర్లు పిలవడం అంటేనే, అది తెరిచే దాకా ఎవరికి వస్తుందో తెలియదు. తెరిచిన వెంటనే ప్రభుత్వం ఆమోదించి, అప్పగించాలనీ లేదు. అప్పగించినా డబ్బులు వెంటనే రావు. ఇన్ని విషయాలు తెలిసీ, తెలంగాణ ఉద్యమాన్ని, సకల జనుల సమ్మెను వేలకోట్ల రూపాయలకు అమ్మేశారని, నమస్తే తెలంగాణ పోలవరం డబ్బులతో నడుస్తోందని మోత్కుపల్లి, ఎర్రబెల్లి వంటి వారు వాగడం, సీమాంధ్ర మీడియా వాటిని ప్రముఖంగా ప్రచురించడం-ఇవన్నీ అమాయకంగా జరిగేవి కాదు.

ఒక ప్రాంతం, ఒక కులం, కొందరు నేతలు మీడియాను అడ్డం పెట్టుకుని తెలంగాణకు వ్యతిరేకంగా సాగిస్తున్న అధర్మ, అనైతిక, కుట్రపూరిత యుద్ధంలో భాగం ఈ ప్రచారం. అయితే తెలంగాణ ఒకప్పటి అమాయకత్వంలో ఇప్పు డు లేదు. చంద్రబాబు ఎప్పుడు ఏ జూదం ఎందుకు ఆడతాడో, ఏ కీలుబొమ్మకు ఎప్పుడు కీ ఇస్తాడో, మోత్కుపల్లి, ఎర్రబెల్లి వంటి బొమ్మలు ఎందుకు మాట్లాడతాయో ఇప్పుడు తెలంగాణవాదులు తేలికగానే అర్థం చేసుకుంటున్నారు. తెలంగాణకు ఇప్పుడు అనేక ఆయుధాలు ఉన్నాయి. ఒకనాడు ఆ జర్నలిస్టు ఆశించినట్టు తెలంగాణకు ఇప్పుడు సాంస్కృతిక ఫేసూ, స్పేసూ ఆవిర్భవించాయి. కుట్రలను పసిగట్టగల నేర్పు ఇప్పుడు తెలంగాణ ప్రజలకు ఉంది. ఆలస్యం అయితే కావచ్చు, కానీ అంతిమ విజేత తెలంగాణ ఉద్యమమే.

4 comments:

  1. నమస్తే తెలంగాణా పత్రిక CEO కట్టా శేఖరరెడ్డే కానీ 'స్యూ' కంపెనీలో వాటా ఉన్న సి.ఎల్. రాజం కాదు కదా. ఈ విషయం తెలుగు దేశంవాళ్ళకి తెలిసినా తెలియనట్టు నటిస్తారు. ఒక అబద్దాన్ని నమ్మాలంటే వంద నిజాలని మర్చిపోవాలి.

    ReplyDelete
  2. అందరం ఇదే అనుకుంటున్నం... ఎంత నీచంగా అబద్దాలను పేపర్లలో టీవీలల్లో వేస్తున్నరని.. వాళ్ళకి బానిసలని సజీవంగ బొంద పెట్టాలె...అప్పుడు తప్ప.. నకిలీ నాలుకలకు అబద్దాలు చెప్పాలంటే భయం ఐతది.

    ReplyDelete
  3. ఆ రెండు పత్రికల అరాచకం తెలంగాణా మీదే కాదు ,అన్ని ఇతర సామాజిక వర్గాల మీద కూడా ఉంటుంది. ఇంకొక రెండు సంవత్సరాలు వీళ్ళని భరించక తప్పదు. తరువాత వాళ్ళ కుల పార్టీ కి శాశ్వతంగా మూత పడుతుంది. ఆతరువాత వీళ్ళు కాళ్ళ బేరం లేదంటే శ్రీకృష్ణ జన్మస్థానం చూస్తారు. వీళ్ళ అరాచకం పండి పక్వానికి వచ్చింది.

    ReplyDelete
  4. choodandi ee kula gajji yellow Paper Andhra jyothy..Third Rated edavalu..asalu journalism lo ilaanti language choostaara meeru..

    http://www.youtube.com/watch?v=Qy2cnTCXGrk&feature=related


    ilaanti manushulu mana telugu raastram lone untaaru adi media roopam lo..ee cheap edavala paapam pande roju vachchindi..

    ReplyDelete