తెలంగాణా ఏర్పాటుపై ప్రతిష్టంభన ఏర్పడడానికి రెండు ముఖ్య కారణాలు కనిపిస్తున్నాయి. మొదటిది తెలంగాణా ప్రాంతాన్ని వలస ప్రాంతంగా చేసుకొని నిరాఘాటంగా గడిచిన అర్థ శతాబ్ద కాలంగా దోచుకుంటున్న దోపిడీ శక్తులకు ఈ విభజన అస్సలు నచ్చక పోవడం.
రాజశేఖర్ రెడ్డి, చంద్రబాబు లాంటి కుహనా రాజకీయ వేత్తలు తెలంగాణాను సమర్థిస్తూ ఎన్ని మాయమాటలు చెప్పినా అసలు విభజన జరగనే జరగదని గట్టిగా విశ్వసించిన ఈ శక్తులకు డిసెంబరు తొమ్మిదిన వచ్చిన చిదంబరం ప్రకటన ఆశనిపాతమైంది.
అయితే అప్పటికే సీమాంధ్ర లోని ప్రజలు విభజనకు దాదాపుగా సిద్ధపడ్డారు. కాంగ్రేసు, తెలుగుదేశం వంటి పెద్ద పార్టీలు తెలంగాణను బహింరంగంగా సమర్థించినా, చిరంజీవి సామాజిక తెలంగాణా అంటూ విధాన నిర్ణయాన్ని ప్రకటించినా వారికి ఆ ప్రాంతం నుండి పెద్ద ఎత్తున వోట్లు పడడమే అందుకు నిదర్శనం.
అంతే కాదు, చంద్రబాబు తెలంగాణా ఏర్పాటుకు సంబంధించి నిర్ణయం తీసుకునే ముందు రెండున్నరేళ్ళ పాటు సీమాంధ్ర మొత్తం వార్డు మెంబరు స్థాయిలో చర్చలు జరిపామని వారే చెప్పుకున్నారు. ప్రజల్లో వ్యతిరేకత ఉన్నట్టయితే 2009 వ సంవత్సరంలో చంద్రబాబు తెలంగాణా అనుకూల నిర్ణయాన్ని, ఏదో తెలంగాణా ప్రజల కన్నీళ్లను తుడవడానికి తీసుకునే వాడని అనుకోలేం. కాబట్టి ఆ నిర్ణయాన్ని తీసుకునే ముందు సీమాంధ్రకు చెందిన ప్రజల్లో ఎలాంటి వ్యతిరేకత లేదన్న విషయం వారు తప్పక పరిగణన లోకి తీసుకొనే వుంటారు.
ఈ నేపథ్యంలో డిసెంబరు 2009 న హటాత్తుగా తెలంగాణా ఏర్పాటుపై కేంద్ర ప్రభుత్వ ప్రకటన రావడం వలసవాద వ్యాపారులు భరించలేక పోయారు. ప్రజలు అప్పటికే సంసిద్ధులై వున్నారు కాబట్టి తమకు నచ్చని విషయాన్ని బహిరంగంగా చెపితే ప్రజలు నిజం గ్రహించి తమ ముఖాల మీదే ఉమ్ముతారు కాబట్టి 'సమైక్యత' అనే అందమైన అబద్ధాన్ని ప్రజల ముందుకు తీసుకు వచ్చారు.
రాత్రికి రాత్రే డబ్బులు డబ్బులు జలపాతంలా ప్రవహించాయి. ముందుగా ముఖ్య ప్రతిపక్ష నాయకుణ్ణి దార్లోకి తెచ్చుకున్నారు. అతని నేతృత్వంలో చక్రం గిరగిరా తిరిగింది. రెండు రోజుల క్రితం అసెంబ్లీలో బిల్లు పెట్టండి, సంర్తిస్తాం అని చెప్పిన మనిషి, అర్థరాత్రి నిర్ణయమేమిటి అని అడిగే పరిస్థితి వచ్చింది. దేశానికి స్వాతంత్ర్యం కూడా అర్థరాత్రే వచ్చిన వైనం గుర్తిస్తే ఆ నాయకుని ప్రకటన ఎంత విడ్డూరమో అర్థం కాక మానదు.
ఇక పావులు చక చకా కదిలాయి. ఒక ప్రముఖ కాంగ్రెస్ నాయకుడు ఏకంగా పదిహేను నిమిషాల భావోద్వేగాలను రెచ్చగొట్టే తరహా ప్రకటన భారీ హంగులతో నిర్మించాడు. ప్రతీ అరగంట కోక సారి ఈ ప్రకటన అన్ని చానేల్లలోనూ ప్రదర్శించ బడింది. ఏదో జరిగిపోతుంది, రాష్ట్రం మధ్యన అడ్డుగోడలేర్పడుతున్నాయి, ఇటువాళ్ళు అటు వెళ్ళడానికి వీల్లేదు లాంటి అపోహలు ఒక ప్రాంతం వారిలో కల్పించ దానికి ఈ ప్రకటనలు ఉద్దేశించ బడ్డాయి. తమ ప్రయత్నంతో తెలంగాణా ప్రాంతాన్ని ఏమాత్రం ప్రభావితం చేయలేక పోయినా కోస్తా, రాయలసీమ ప్రాంతాల ప్రజల్లో కొంతమందిని మాత్రం ప్రభావితం చేయ గలిగారు.
ఇక రెండో కారణం విషయానికి వస్తే, అది ప్రజల అవగాహనా రాహిత్యం. తెలంగాణా ప్రాంత ప్రజలు చేస్తున్న పోరాటం తమ అస్తిత్వం కోసం చేస్తున్న పోరాటంగా కాక అది ఆంధ్రా ప్రాంతం ప్రజలకు వ్యతిరేకంగా చేస్తున్న పోరాటంగా ఆ ప్రాంతం యువజనం భావించడం.
ఇలాంటి భావన కలగడానికి ముఖ్య కారణం మన విద్యావిధానం. చరిత్ర పై, సామాజిక శాస్త్రం పై ప్రజల అవగాహనా రాహిత్యం. విద్యావిధాన నిర్ణయాలు ప్రభుత్వం చేతుల్లోంచి శ్రీచైతన్య, నారాయణ లాంటి పెట్టుబడుదారుల చేతుల్లోకి వెళ్లినందువల్ల కలిగే దుష్పరిణామం.
వీరికి గనుక చరిత్ర పై అవగాహన వుండివుంటే మనం చేసిన మహత్తర స్వాతంత్ర్య పోరాటం బ్రిటన్ ప్రజలపై వ్యతిరేక పోరాటం కాదనే కనీస అవగాహన ఉండేది. బ్రిటీష్ వారు మానని దోచుకుంటున్నారని మనం ప్రచారం చేస్తున్న తరుణంలో బ్రిటన్లో బిచ్చగాళ్ళు కూడా ఉండే వారని అర్థమయ్యేది. ఒక వేల దోచుకునేది బ్రిటీష్ ప్రజలే అయితే అక్కడ పేదవాళ్ళు, బిచ్చగాళ్ళు వుండడం ఎలా సాధ్యం?
చరిత్రపై అవగాహనా రాహిత్యం వల్ల సీమాధ్ర ప్రాంతంలోని కొంతమేర జనం వలసశక్తులు చేస్తున్న వాదనకు తలొగ్గడం జరిగింది. తమ ధన బలంతో, తద్వారా చేసిన విష ప్రచారం వల్ల కొంతమంది యువజనులను కూడగట్టి ప్రదర్శనలు. విధ్వంసాలను సృష్టించ గలిగారు. వీటిని తమ ప్రచార సాధనాలతో భూతద్దంలో చూపించి కేంద్ర ప్రభుత్వంలో భయాందోళనలను సృష్టించ గలిగారు.
Image Curtesy: GIDEE TELANGANA CARTOON BOOK
No comments:
Post a Comment