Sunday, February 12, 2012

చంద్రబాబూ, జర చూసుకొని పో


చంద్రబాబూ! తెలంగాణా ఉద్యమంపై ఎంత అక్కసు వున్నా ఎన్నడూ నేరుగా దాడి చేయ సాహసించని మీరు, తెలంగాణా వాదాన్ని దెబ్బ తీయడానికి తెలంగాణా వాదులపై దాడులు చేయడానికి ఏ చిన్న అవకాశాన్నైనా వదులుకోవు. అందులో భాగమే KCR పై ఆరోపణలు. ఒక రాజకీయ నాయకునిగా చూసినప్పుడు నీకు KCR కి పెద్దగా తేడా లేక పోవచ్చు. కాని KCR తెలంగాణా ఉద్యమంలో ఉన్నంత వరకు తెలంగాణా ప్రజలు ఆయన్ను సపోర్టు చేసి తీరతారు. తెలంగాణా ఉద్యమంపై కుట్రలు చేస్తున్నంత వరకూ తమరిని, తమరి పార్టీని అధఃపాతాళానికీ తొక్కుతూనే వుంటారు.

KCR ఎక్కడ పుట్టాడని ఆయన తమరి సందేహం. ఎక్కడ పుడితే ఏమిటి చంద్రబాబూ? ఒక వేళ ఆయన కోస్తాలోనే పుట్టినా తెలంగాణా సాధన కోసం పాటు పడకూడదా? "నా ప్రాంతం వాడు, నాకులం వాడు" అనే ఆలోచనలు నీలాంటి పచ్చకామెర్ల రోగికి ఉంటే ఉండవచ్చు. అంతే గానీ తెలంగాణా ప్రజలు మనిషి ఏ ప్రాంతం వాడు అని కాదు, వారి అభిప్రాయాలు ఎటువంటివి అని మాత్రమే చూస్తారని తెలుసుకో.

ఇక పోతే KCR కుటుంబ పాలన గురించి మీ రెండో ఆరోపణ. KCR వారసులు ఉద్యమంలో క్రియాశీలక పాత్రను పోషిస్తున్నారు. ఆ క్రమం లో పదవులు పొందితే పొందవచ్చు. అది తప్పో రైటో కాసేపు పక్కకు పెడితే మహానాడులో ఏ పాత్రా లేని తమ పుత్రరత్నం భారీ కటౌట్లు ఎందుకు పెట్టించినట్టు స్వామీ? దానిమీద అలిగే కదా జూనియర్, హరికృష్ణ తమరికి దూరం జరిగింది? అంతెందుకు? మరి తమరెక్కడి నుండి ఊడి పడ్డారో? NTR వారసుల వరసలో కాదా?     

KCR కి మంత్రి పదవి ఇచ్చుంటే TRS పార్టీయే పెట్టేవాడు కాదని, తెలుగుదేశం లోనే ఉండేవాడని తమరి మరో ఆరోపణ. నిజమే కావచ్చు. మరి మంత్రి పదవి ఎందుకివ్వలేదో తమరు? ఆయన పార్టీలో తమకన్నా సీనియర్ కాదా? తమకన్నా ఎక్కువ రాజకీయ చతురత, వాగ్ధాటి ఉన్న నాయకుడనేగా మీరు అణగదొక్కాలని చూసింది? తమ పార్టీలో నాయకులంటే తమరి చెప్పుకింద తేళ్ళ లాగా, మన్ను తిన్న పాముల్లాగా పడి వుండాలి. తమరు కీ ఇస్తే బొమ్మల్లాగా ఆడాలి. అలా కాక పోతే తమరు సాహించరన్న విషయం జగమెరిగిన సత్యం కాదా? అలాంటప్పుడు KCR పార్టీని వదిలి వెళ్లిపోవడంలో వింతేముంది?

KCR సంగతి పక్కకు పెడితే, అసలు మీ మామగారు తెలుగుదేశం పార్టీ పెట్టక పోయున్నట్టైతే తమరెక్కడ ఉండేవారు స్వామీ? హస్తం నీడలో సోనియా జపం చేస్తూ తరించే వారు కాదా? NTR పార్టీ పెట్టినా అధికారం లేనంత  వరకూ అధికారంలో వున్న కాంగ్రేసునే పట్టుకొని వేళ్ళాడుతూ, మామ పైనే సవాళ్లు విసరలేదా? NTR అధికారం లోకి రాగానే అంగలార్చుకుంటూ వచ్చి, అల్లుడి హోదా అడ్డం పెట్టుకుని తెలుగుదేశం పార్టీలో ప్రవేశించి, ఆనక పార్టీ  చక్రం అంది పుచ్చుకున్న చరిత్ర తమది కాదా? చివరకి ఆదరించిన మామనే వెన్నుపోటు పొడిచిన తమ ఘనచరిత్ర మరచి పోయారా?        

ఆరేడువేల పోలీసు బలగాలను, మరో పదివేల మంది కిరాయి గూండాలను వెంటేసుకెళ్ళి తెలంగాణలో జనం లేని మీటింగొకటి పెట్టి, ఆ వాపును బలుపని భావిస్తున్నారేమో! KCR ని మాత్రమె కాదు, తెలంగాణా కోసం పాటు పడుతున్న ఏ నాయకుణ్ణి తిట్టినా తెలంగాణా ప్రజలు సహించరు. సమస్య పై ధైర్యంగా నిర్ణయం చెప్పే దమ్ములేని తమరు, తెలంగాణా వాదులను కించ పరచడం ద్వారా ఉద్యమాన్ని దెబ్బ తీయాలని చూస్తే, నిజం తెలుసుకోలేని వారు కాదు ప్రజలు.
   
   

No comments:

Post a Comment