Sunday, May 29, 2011

మేక తోలు కప్పుకున్నతోడేండ్లు

ఆంద్రబాబు తన విశాలహృదయాన్ని ఉద్వేగం తోటి ఆవిష్కరించిండు. ఆంధ్రల, తెలంగాణాల తన పార్టీ ఉన్నది కాబట్టి (తెలంగాణాల ఎక్కడ ఉన్నది?) అక్కడ ఇక్కద ఉద్యమాలు చేయిస్తా నంటున్నడు. రెండు దిక్కుల తన పార్టీ ఉన్నది కాబట్టి ఒక్కదిక్కు మాట్లాడ లేనంటున్నడు.

రెండు దిక్కుల పార్టీ ఉన్నప్పుడు, ఈ సమస్యకు పరిష్కారం చెప్పుడు చాతగానప్పుడు తటస్థంగ ఉండాలె సీపీయం లెక్క. మరి ఆంద్రబాబు అట్ల ఉంటున్నడా? ఉంటలేడు. 

ఆయన కాంగ్రెస్ ఒక నిర్ణయం తీసుకున్నప్పుడు దానికి అడ్డుకట్ట వేస్తడు. ఆంధ్రా తెలుగుదేశం నాయకుల తోటి దొంగ ఉద్యమాలు చేయిస్తడు. డిసెంబరు పది తర్వాత చేసిన దొంగ ఉద్యమ నాయకుల మీద క్రమశిక్షణా చర్యలు తీసుకోక పోవుడే దానికి సాక్ష్యం.

అంతే కాదు, తెలంగాణా నాయకులు తెలంగాణా పాలసీ గురించి ప్రకటించమని అడిగిన పాపానికి వాళ్ళను పార్టీనించి సస్పెండు చేస్తున్నడు. నాగమే దానికి సాక్ష్యం. ఆంధ్రా నాయకులు పోటీ ఉద్యమాలు నడిపిస్తే పార్టీకి ఏం గాదట! తెలంగాణా నాయకులు తెలంగాణా మీద పార్టీ స్టాండు ఏందో అడిగితె మాత్రం పార్టీకి నష్టమై పోతదట! 

సరే స్టాండు చెప్పుడు ఇష్టం లేదు. అయిన పరిస్థిని అర్థం చేసుకుందాం. మరి అప్పుడు తెలంగాణాల గాని, ఆంద్రాల గాని న్యూట్రల్ గ ఉండాలే. అటువంటప్పుడు తెలంగాణా ఫోరం పెట్టి పార్టీ జెండా తోని సభలు, పాదయాత్రలు ఎందుకు నిర్వహించాలె? స్టాండే లేనోనికి సభలెందుకు, సమావేశాలెందుకు, ఉద్యమాలెందుకు, దొంగేశాలెందుకు? తన స్టాండు ఏందో తెల్వనోడు ఎక్కడనన్న ఉద్యమాలు చేస్తడా? 

ఆంద్రాల దొంగ ఉద్యమాలు చేసినట్టు, ఇక్కడ గూడ తన చెంచాల తోటి దొంగఉద్యమం చేయిద్దమని ఆయన కోరిక. కాని అక్కడి పరిస్థితి వేరు, ఇక్కడి పరిస్థితి వేరు. ఇక్కడ నిఖార్సైన ఉద్యమం ఇప్పటికే పెద్ద ఎత్తున నడుస్తున్నది. తెలంగాణా ముసుగు కప్పుకున్న సమైక్యవాదులు మేక తోలు కప్పుకున్న తొడేన్ల లెక్క వచ్చి మండల కలుస్తామంటే కుదిరే పని కాదు. తోడేండ్లు మేకలకు దూరంగా ఉండవలసిందే. ఎంత మేక తోలు కప్పుకున్నా, మేకలు వాటిని తమతోటి కలువ నియ్యవు. 

Friday, May 27, 2011

చంద్రబాబూ, నీ పరపతి తగ్గకుండ ఆపుకో

చంద్రబాబు రెండువేల ఎనిమిది వరకు సమైక్య వాదం వినిపించిండు. ఆయన వాదం, ఆయనిష్టం. దానికి ఎవ్వరు అభ్యంతరం చెప్పరు. 

రెండువేల ఎనిమిదిల తెలంగాణా పై స్టడీ చేసేటందుకు ఒక కమిటీ వేసిండు. ఆ కమిటీ రాష్ట్రం మొత్తం తిరిగి, అందరి దగ్గర మంచి చెడులు అరుసుకొని రాష్ట్రం రెండుగ విడిపోవాలె అని నివేదిక ఇచ్చింది. దీన్ని పార్టీ పాలసీగ మార్చి మహానాదుల ప్రకటన చేసిండు. 

ప్రత్యేక తెలంగాణా ఏర్పాటును సమర్తిస్తున్నం అని, మేం కాగ్రెస్ మాదిరిగ మాట మార్చే వాళ్ళం కాదు అని రెండువేల తొమ్మిది ఎన్నికల్ల పోటీ చేసిండు. తెలంగాణల ఆ పేరు మీద 36 సీట్లు గెలిచిన్రు.

2009 డిసెంబరు 7 నాడు తెలంగాణా తీర్మానం ప్రవేశ పెడితే సమర్థిస్తం అని అసెంబ్లీల ప్రకటించిండు. డిసెంబర్ 9 నాడు అకిలపక్షం సమావేశంల తెలుగుదేశం తరఫున హాజరైన అశోకగణపతి రాజు తమ పార్టీ తెలంగాణా ఏర్పాటుకు అనుకూలమని స్పష్టంగ చెప్పిండు. 

కాని డిసెంబర్ 9 అర్థరాత్రి చిదంబరం ప్రకటన చెయ్యంగనే పరిస్థితి మొత్తం మారి పొయ్యింది. పదోతారీకు ఉదయం పది గంటలకే సీమాంధ్ర ప్రజలల్ల పెద్ద ఉద్యమం బయలుదేరిందని పయ్యావుల కేశవ్, తదితరులకు కల వచ్చిందట! వరుసగా రాజీనామాల పర్వం మొదలైంది.

పార్టీ నిర్ణయాన్ని నాయకునిగా నొక్కి చెప్పా వలసిన అవసరం చంద్రబాబుకి ఉండింది. కాని ఆయాన ఆ పని చెయ్యలేదు. పై పెచ్చు తెలంగాణా ప్రక్రియ మొదలైందని ప్రకటించిన చిడంబరాన్నే తప్పు పట్టిండు. ఆ విధంగా రెండు నాల్కల ధోరణి అవలంబించిండు.

చంద్రబాబు సమర్థన చూసి సీమాంధ్ర నాయకులంతా రెచ్చి పోయిన్రు. ఏన్టీయార్ ట్రస్టు భవన్ ల జిరాక్సు తీసిన రాజీనామాలు (అవి దొంగ ప్రొఫార్మావి, ఎలాగూ అప్రూవ్ కావు) అందరికీ పంచి పెట్టు కున్నరు. ఇది అంతా చంద్రబాబు దర్శకత్వంలనే జరిగిందనే ఆరోపణ కూడా ఉన్నది. 

ఇటువంటి డ్రామాలాడించి మొత్తానికి వచ్చే తెలంగాణా రాకుండ చేసిండు చంద్రబాబు నాయుడు. తెలంగాణా ప్రక్రియ ఆగి పోయింది. కాని ఆయినకు తెలంగాణా వోట్లు కావాలె. అందుకని మల్లొకసారి మాట మార్చిండు. ఇప్పుడు ప్రపంచంల ఎక్కడ లేని రెండుకళ్ళ సిద్ధాంతాన్ని ప్రవేశ పెట్టిండు.

ఈయనకు రెండు కళ్ళు ఉన్నా చూపు మాత్రం ఆంధ్రా దిక్కే అని అందరికీ అర్థమైంది. మచ్చుకు చెప్పాలంటే ఈయనకు తెలంగాణా ఆత్మహత్యలు కనపడవు, తెలంగాణా ఉద్యమం పై పోలీసుల ఉక్కుపాదం, పోలీసుఅల కాల్పులు, గాయపడ్డ మనుషులు కనపడరు. ఈయన ఏ కన్ను కూడా తెలంగాణా వైపు చూడదు, ఓట్లు అవసర పడ్డప్పుడు తప్ప.

రెండు కళ్ళ సిద్ధాంతం వెలవెలబొయ్యేసరికి, ఇచ్చేది తెచ్చేది కాంగ్రెస్ అయినప్పుడు మేమెందుకు చెప్పాలే అని కొత్త వాదం లేవదీసిండు చంద్రబాబు. అంటే కాంగ్రెస్ ఇస్తమని చెప్పితే ఆంద్రాల గొడవ లేపాలె. ఇవ్వమని చెప్పితే తెలంగాణాల ఉసిగోల్పాలే. తాను మాత్రం గోడమీది పిల్లి లెక్క నక్కి ఉండాలే. అదీ చంద్రబాబు ఆలోచన.

అయ్యా చంద్రబాబూ, ఒక ప్రధాన ప్రతిపక్ష నాయకునివై ఉంది నువ్వు నీ బాధ్యతా నుండి తప్పించు కోలేవు. నువ్వు ఏదో ఒకటి ప్రజలకు చెప్పవలసిన అవసరం ఉన్నది. ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు చేయ్యాలనైనా చెప్పు. ఒద్దనైనా చెప్పు. అంతే గని ఈ గోడమీది పిల్లి వేషాలు వేస్తే రెండికి చెడ్డ రేవదివయ్యేది మాత్రం ఖాయం. ఇప్పటికే నీకు తెలంగాణాల పన్నెండు డిపాజిట్లు, ఆంద్రాల రెండు డిపాజిట్లు గాయబై పొయినై. నువ్వు గనుక గిట్లనే చేస్తే రేపు వచ్చే జనరల్ ఎన్నికలల్ల మొత్తం   294 అసెంబ్లీ 42 పార్లమెంటు సీట్ల డిపాజిట్లు గల్లంతైతై. అందుకే చెప్తున్నా, ఇప్పటికైనా ఒక లీడర్లెక్క నిర్ణయాలు తీసుకో. జనంల నీ పరపతి తగ్గకుండ ఆపుకో.       


Thursday, May 26, 2011

కాంగ్రెస్ పెద్ద విలనే. ఐతే మన ప్రతిపక్ష నాయకుడు?

కాంగ్రెస్ పెద్ద విలనే. ఐతే మన ప్రతిపక్ష నాయకుడు చెయ్య వలసినది ఏమిటి? ఆ విలనీని ఎండ గట్టాలె. ఆ పార్టీ తప్పులను బయట పెట్టాలె. కానీ వారికంటే ముందు అవే తప్పులు తానే చేస్తూ దొరికి పొతే? అధికార పక్షం మీద వత్తిడి పెంచుడు అటు పెట్టి తానే అధికార పక్షానికి టార్గెట్ గా దొరికిపోతే?

మన ప్రతిపక్ష నాయకుడి ప్రస్థానం పోయిన ఆరు సంవత్సరాల నుండి మొత్తం ఇదే రీతిగా నడుస్తున్నది. రాజశేఖర్ రెడ్డి ఒక వైపు విచ్చలవిడిగా అవినీతికి పాల్పడుతుంటే ప్రతిపక్ష నాయకుడు చేష్టలుడిగి నిలబడి పోయిండు. ఏ కుంభకోణం చూసిన మొదట ఈ మహాత్ముని వ్యవహారాలే ముందు బయటికొస్తయి. 

ఫలితం, ఏ కుంభకోణం మీదా చివరి వరకూ పోరాటం చేయ లేక పోవడం. ప్రతిదీ తనపేరు బయటికి వచ్చే సరికి మధ్యలోనే ఆపి వేయడం.

ఓబులాపురం మీద నాగం గట్టి పోరాటం చేసిండు. కాని అది ఎందుకో మధ్యలో ఆగిపోయింది. తీరా చూస్తే గాలికి గనులు కేటాయించింది ఈ మహానుభావుడే.

MR ప్రాపర్టీ పై పోరాటం అసలు మొదలే కాలేదు. కారణం, ఈయన, ఈయన తైనాతీలు లబ్ది దారులలో ముందు వరుసలో ఉండుడు.

భూముల కేటాయింపు, సెజ్జుల కేటాయింపు, ఏది మాట్లాడ బోయినా అది అధికార పార్టీ వారు పాత ఫైళ్ళు బయటికి తియ్యడం, ఆ ఫైల్లల్ల ఈ మహానుభావుడు చేసిన వ్యవహారం కన్నా వాళ్ళు చేసింది మెరుగ్గానే ఉన్నట్టు నిరూపించడం (కనీసం ఫైళ్ళ మీద) తో ఆరోపణలు అన్నీ వీగి పోయ్యేవి.

కనీసం రామలింగ రాజు విషయం లో కూడా ప్రోభుత్వాన్ని ఏమీ అనలేక, పైనించి ప్రభుత్వం నించి లోకేష్ బాబును రామలింగ రాజే చదివించిండని ఆరోపణలు వస్తే చేష్టలుడిగి నిలబడ్డ చరిత్ర చంద్రబాబుది.

ఫలితంగా 2009లో అధికారం లోకి రాలేక పోయిండు. అధికారం కోసం వేసే వెధవ నాటకాలల్లో భాగంగా తెలంగాణా ఏర్పాటుని సమర్ధించిండు అంతరాత్మ ఏమాత్రం ఒప్పుకోక పోయినా. ఆయన అంతరాత్మ అసలు రంగు డిసెంబరు 9 డిల్లీ హోంమినిస్టర్ అధికారిక ప్రకటన రాంగనే బయట పడ్డది. 

నాయకత్వ పటిమ అదికారంల ఉన్నప్పుడు కాదు, ప్రతి పక్షంల ఉన్నప్పుడే బయట పడుతది. చంద్రబాబు నాయుడు ప్రజాకర్షణ కలిగిన నాయకుడు కాదు. కేవలం ఎత్తులు, పైఎత్తులతో రాజకీయం నడిపే ఇలాంటి నాయకుడు ధైర్యంగా path breaking నిర్ణయాలు తీసుకోలేడని గత ఆరేడు సంవత్సరాలుగా బయట పడి పోయింది. 

తన చేతగానితనం తోటి ఇప్పటికే ఆడిన మాటలు తప్పే నాయకుడిగా పేరు తెచ్చుకున్న ఈయన మాటలు రెండు ప్రాంతాలలోనూ ప్రజలు నమ్మే పరిస్థితి లేదు. ఈయన ఎంత రైతు బాంధవునిగా పోజు పెట్టినా ఈయన గతంలో చెప్పిన 'వ్యవసాయం దండుగ' అన్న మాటలే ప్రజలకు గుర్తు వస్తయి. ఈయన ఎంతగా సబ్సిడీలు ప్రకటించినా గతంలో ఈయన రద్దు చేసిన సబ్సిడీలే ప్రజలకు గుర్తుకు వస్తయి. అలాగే రేపు ఈయన తెలంగాణా ఏర్పాటుకు సపోర్టు చేస్తనని చెప్పినా డిసెంబరు పదో తేదీన నరం తెగిన ఈయన నాలుకనే ప్రజలకు కనపడుతది. తెలంగాణలో నైతే భవిష్యత్తులో ఆయన నాయకత్వంలో పార్టీ బతికి బట్టగట్టే పరిస్థితి లేదు. ఆంధ్రాలో కూడా ఈయన పరిస్థితి అంతకన్నా ఏమంత నయంగ లేదు.


నాగం చేసిన తప్పేంది?

నాగంను సస్పెండు చేసి తానూ నిజంగా ఆంద్రబాబునే అని మరోసారి నిరూపించుకున్నడు ఆపార్టీ నాయకుడు. 'జై తెలంగాణా' అంటే ఆ పార్టీల నేరమని మరోసోఆరి రుజువైంది. 

ఇంతకీ నాగం చేసిన తప్పేంది? తెలుగుదేశం పార్టీ వొళ్ళు మేం తెలంగాణాకి వ్యతిరేకం కాదని, ప్రనభ్ కి లేఖ యిచ్చినం అని ఒక్కతీరుగా చెప్పుకుంటరు. ఆ లేఖనే మరోసారి నాయకుని సంతకం తోటి చిదంబరానికి ఇయ్యమని చెప్పిండు. కాని ఇది తెలుగుదేశం పార్టీ వోళ్లకు పెద్ద నేరంగ కనిపిచ్చింది.

నిజంగా తెలుగుదేశం పార్టీ తెలంగాణాని సమర్ధిస్త వుంటే ఆ విషయాన్ని చిదంబరానికి లేఖ ద్వారా తెలుపోచ్చు. ఆ విధంగ తెలంగాణా ఏర్పాటుకు కాంగ్రెస్ మీద ఒత్తిడి తేవొచ్చు. కాని ఆ పార్టీ ఉద్దేశం అది కాదని, తెలంగాణా ఉద్యమాన్ని ఎట్లైన చేసి అణిచి వేసుడే అనేది చిన్న పిల్లగానికి కూడా అర్థమైన విషయం. ఇంకా మేం జన్నాన్ని మభ్యపెట్టుతున్నమని నమ్ముతున్న ఆంధ్రబాబుకు పన్నెండు డిపాజిట్లు గాయబై పోయినా కూడా బుద్ధి రాలేదు. 

లేఖ రాయమని అధినాయకున్ని ప్రశ్నించిన పాపానికి పోలిట్ బ్యూరో సభ్యుడని గూడ చూడక సస్పెండు చేసిన పార్టీకి, మరి బహిరంగంగా ఆ పార్టీ విధానాలు వ్యతిరేకించుకుంట ముద్దుల ధర్నాలు చేసిన మనుషులు, రాజీనామాలు చేసి ఉద్యమాలు చేసిన మనుషుల మీద మాత్రం చర్య తీసుకోవాలె అని అనిపించ లేదు. దీన్ని బట్టే తెలుస్తది అది ఆంధ్ర పక్షపాత పార్టీ మాత్రమే కాని ఇంకోటి కాదని. 

ఇటువంటి ఆంధ్రా పార్టీని సామాన్య కార్యకర్తలు అందరూ ఇప్పటికే వదిలేసిన్రు. దానికి నిన్న వెలవెల పోయిన రణభేరి సభే సాక్ష్యం. ఇప్పుడు ఆంధ్రబాబు వెనుక ఉన్నది పదవులకు ఆశపడి బూట్లు నాకే కొద్దిమంది నాయకులు మాత్రమే. ఈ నాయకులు నిజాం కాలం నించీ ప్రజలకు ద్రోహం చేసుకుంట ఎవనివో ఒకని బూట్లు నాకుతనే ఉన్నారు. తెలంగాణా పోరాటంల చావు దెబ్బ తిన్న వీళ్ళ తండ్రులకు తెలుసు తెలంగాణా దెబ్బ అంటే ఏందో. ఇప్పటికన్నా వచ్చి ప్రజల్ల కాలువక పొతే వీళ్ళకు అంతకన్నా పెద్దదెబ్బ పడక తప్పదు.

Wednesday, May 25, 2011

విఫలమైన రణభేరి

పిల్లి గడ్డం ఆంద్రబాబు గోడమీది వేషాలు ప్రజలకు పూర్తిగా తెలిసి పొయినై. ఆయిన కల్లబొల్లి మాటలు ఇప్పుడు తెలంగాణాల వినేటందుకు ఎవ్వరు సిద్ధంగ లేరు. దానికి మరో దృష్టాంతం విఫలమైన రణభేరి. ఆయిన కాలం చెల్లిన చాణక్యం ఆ పార్టీ చేవ చచ్చిన భజన సంఘం నాయకుల తోని రణభేరి మోగించ లేదు సరికదా తన పార్టీకి తెలంగాణాల చావుడప్పు మాత్రం మోగించుకుంది. 

తెలంగాణాల అడుగు పెట్టేతందుకు మొకం లేక చెంచాగిరీ చేసే నాయకులతో తెలంగానకోసమని దొంగ సభ పెట్టి, ఓహో తెలంగాణాల మాకూ బలముంది అని నిరూపించుకోవాలన్న దొంగ బుద్ధికి జనం సరిగ్గ బుద్ధి చెప్పిన్రు. ఇప్పటికన్నా ఆ పార్టీ గోడమీది పిల్లి వేషాలు మానకుంటే ఆంధ్రాలనన్న గెలుస్తది. లేకపొతే రెండిటికి చెడ్డ రేవడి కావడం మాత్రం ఖాయం.  

తెలంగాణా తెలుగుదేశం నాయకులందరు కూడి నిర్వహించిన సభల కనీసం వందల మంది జనం కూడ జమ కాలేదంటే ఇంకా తెలంగాణాల ఆ పార్టీ నీళ్ళు వదులుకున్నట్టే. ఇప్పటికైన తెలంగాణా తెలుగుదేశం నాయకులు ఈ విషయం తెలుసుకుంటే వాళ్ళ భవిష్యత్తుకే మంచిది. ఇప్పుడు గూడ తెలుసుకోక పొతే వాళ్ళ రాజకీయ జీవితం భూస్తాపితమై పోయిందని గ్రహించాలె. వీళ్ళకు తెలంగాణాల దిక్కుండదు, ఆంధ్రాల గెలిచే దమ్ములేదు. మొత్తానికి వీళ్ళు ఆంధ్రబాబు వేషాలకు పావుల్లాగా బాగనే పనికొస్తున్నరు. కాని చివరికి ఆంద్రబాబు ఆంధ్రల బాగనే ఉంటడు, కాని తెలంగాణాల వీళ్ళు తిరుగ లేరన్న విషయం మాత్రం వీళ్ళు తెలుసుకోవాలె.

అయ్యా తెలంగాణా తెలుగుదేశం నాయకులారా! మీరు ఇంత వెన్నెముక లేని మనుషులని తెలువక ఇన్నాళ్ళు ఓటేసినందుకు ఇక్కడి ప్రజలు సిగ్గుపడుతున్నరు. మీరు నిజంగా తెలంగాణా రాష్ట్రం ఏర్పాటు కొరుతుంటే ఈ క్రింద ఇచ్చిన అవకాశాల్ల ఏదో ఒకటి చెయ్యండి.
  1. మొదటిది ఆంధ్రబాబు కపట నాటకాలు బయట పడేటట్టు చెయ్యడం. ఈ పని ఇప్పటికే నాగం చేస్తుండు. ఆయినకు సపోర్టు చేయ్యున్రి. మీ పార్టీ విధానం ప్రత్యేక తెలంగాణా నా, సమైక్య వాదమా తేల్చి చెప్పేటట్టు చెయ్యున్రి.
  2. మీ నాయకుడు తేల్చి చెప్పకపోతే మొత్తం తెలంగాణా తెలుగుదేశం పార్టీ వొల్లంత బయటికి వచ్చేయండి. మీరు TRS లనో, ఇంకో పార్టీలనో చేరే అవుసరం లేదు. మీరే ఇంకో తెలంగాణా తెలుగుదేశం పార్టీ ఏర్పాటు చేసుకొని JAC ల కలువున్రి. అందరితోని కలిసి పోరాటం చెయ్యున్రి. అప్పుడు ప్రజలు మిమ్ముల నమ్ముతరు.
  3. పై రెండు పనులు చేసుడు ఇష్టం లేక పొతే 'మేం సమైక్యాంధ్ర వాదులం' అనినా ప్రకటించున్రి. చేతనైతే ప్రజలని సమైక్యాంధ్ర వైపు మళ్ళించే టందుకు ప్రయత్నించున్రి. ఏం జరుగుతదో చూద్దాం. కనీసం నాయకులనిపిచ్చుకుంటరు.
ఇంకా మీరు ప్రజలను మోసం చేస్తం అని అనుకుంటే మాత్రం అది మిమ్ముల మీరు మోసం చేసుకునుడు తప్ప మరోటి కాదు.

దేబిరిస్తూ సాగిలబడే కమిటీ

ఆంద్రబాబు బూట్లు నాకే గుంపు కరీంనగర్ ల సభ పెడుతున్రట! అదీ ఆంద్రబాబు ఫోటో పెట్టి మరీ! ఏం జూపెడ్తరు ఆంద్రబాబు ఫోటోల? రెండు కన్లతోని ఆంద్ర దిక్కు ఒక కన్ను, తెలంగాణా దిక్కు ఒక కన్ను పెట్టి ఎట్ల చూస్తున్నడనా? వీళ్ళది అమాయకత్వమా జాణతనమా అర్థంగాక నవ్వొస్తది! ఇంకా గిట్లాటొల్ల మాటలు తెలంగాణల ఎవ్వరైనా నమ్ముతరని వీళ్ళు ఎట్ల అనుకుంటున్నారా అని! తెలంగాణా ప్రజలకు మాయ మాటలు చెప్పి కలకాలం నమ్మిస్తమని అనుకునే వీళ్ళ అతివిశ్వాసానికి ఆశ్చర్యమైతది.

ఆంద్రబాబు బూట్ల తోలు రుచి పూర్తిగా తలకెక్కినట్టుంది, వీళ్ళకు 'జై తెలంగాణా' అన్నోడు తప్పు మాట్లాడినట్టు అనిపిచ్చిందట! పార్టీల నుండి సస్పెండు జెయ్యమని పెద్దాయనకు సిఫారసు చేసిన్రు. పార్టీ తీర్మానాన్ని తుంగల తొక్కి రెండుకండ్ల సిద్ధాంతం ప్రకటించినాయన మాత్రం వీళ్ళకు తప్పు చేసినట్టు కనిపించదు. 

పార్టీ జెండా పెట్టలేదని నాగం మీద కోపమొచ్చిందట. కాంగ్రెస్ పార్టీ జెండా కింద ధర్నాలు, నిరాహార దీక్షలు, కావలింతలు, ముద్దులు పెట్టుకొన్నోల్లు మాత్రం వీళ్ళ కండ్లకు పార్టీ ద్రోహులు కారట! అయ్యన్ని పాతముచ్చట్లు అనుకున్నా, ఆంద్రబాబు తెలంగాణా ఏర్పాటుకు సపోర్టు చేస్తే పార్టీని ధిక్కరిస్తం అని ఇప్పుడు గూడ రోజుకో ప్రకటన చేసేవాళ్ళు కూడా వీళ్ళకు మంచోల్లేనట!

వీళ్ళది పేరుకు తెలంగాణా సమన్వయ కమిటీ. చేసేది మాత్రం ఆంద్రబాబు చెప్పుల మోత, బూట్ల నాకుడు. ఇటువంటి వాళ్లకు 'జై తెలంగాణా' అంటే అదొక తిట్టులెక్క అనిపిస్తే మాత్రం ఆశ్చర్యమేంది? రెండుకళ్ళ సిద్ధాంతం అంటె ఐనిస్టైన్ సాపేక్ష సిద్ధాంతం లెక్క అనిపిస్తె మాత్రం విచిత్రమేంది?   

ఆంద్ర పెత్తందార్లకు దాస్యం చేసుడు అలవాటు చేసుకున్న వీళ్ళకు అట్లా అనిపించక పోతేనే ఆశ్చర్య పడాలె మనం. అయితే వీళ్ళ దాస్య గుణాన్ని లజ్జ లేకుండా ప్రకటించుకుంటున్న పధ్ధతి, దాన్ని తెలంగాణా ప్రజలు ఇంకా సహిస్తరన్న వీళ్ళ అతి తెలివికి మాత్రం జోహార్లు చెప్పాలె! ఒకదిక్కు వాళ్ళ బూట్లు నాక్కుంట వీళ్ళు తెలంగాణా పోరాటం చేస్తమంటే ఈరోజు చిన్న తెలంగాణాల చిన్న పిల్లగాడు గూడ నమ్మే పరిస్థితి లేదు. పన్నెండు డిపాజిట్లు పొయ్యినా బుద్ధిరాని మనుషులకు రేపు 119 సీట్లల్ల డిపాజిట్లు గాయబైనా బుద్ధి వస్తదనే నమ్మకం లేదు.  

వీళ్ళను తెలంగాణా సమన్వయ కమిటీ అనుడు కన్నా ఆంద్రబాబును దేబిరిస్తూ సాగిలబడే కమిటీ అంటె సరిగ్గ ఉంటది.

Tuesday, May 24, 2011

నడుస్తున్న చరిత్ర vs ఊహాజనిత వాదన

సమైక్యాంధ్ర ఉద్యమం ఊహాజనితమైన వాదనల తోటి కూడుకొని ఉన్నది. వాల్లు ఎంతసేపూ విడిపోతే ఎదురయ్యే ఇబ్బందుల గురించి మాట్లాడుతరు. విడిపోతే నక్సలైట్లు ప్రబలి పోతరు. విడిపోతే మతతత్వం పెరుగుతది. విడిపోతే కేంద్రంల వీకయి పోతం. ఇట్లా ఉంటయి వాళ్ళ వాదనలు. ఇటువంటి వాదనలు నోటికొచ్చినట్టు మాట్లాడేవే తప్ప వీటికి పునాది అని ఏదీ ఉండదు.

ఇక ప్రత్యేక వాదులు చెప్పుతున్నది? ఇప్పటి వరకు సమైక్య రాష్ట్ర చరిత్రల జరిగిన అవక తవకల గురించి. ఆ అవక తవకలన్నీ ఒక ప్రాంతానికే అనుకూలంగా ఉండి, ఆ ప్రాంతానికే మేలు చేసిన వైనం గురించి. అది గిరగ్లానీ కమిటీ కానియ్యండి, శ్రీకృష్ణ కమిటీ కానియ్యండి మరోటి కానియ్యండి. ఇప్పటికే అనేక సార్లు తెలంగాణాకి జరిగిన మోసాల గురించి పూస గుచ్చినట్టు చెప్పినయి. 

అంతే కాదు, కలిసినప్పుడు చేసిన ఒప్పందాలు వమ్మయినయి. తెలంగాణా రీజనల్ డెవలప్ మెంట్ ఫోరం రద్దయింది. ఇట్లా చెప్పుకుంటా పోతే ఎన్నో.

కృష్ణమ్మ దయతలచి వందలాది కిలోమీటర్లు తెలంగాణలో పారినా, సమైక్య పాలకుల దయదప్పడం వల్ల చుక్క నీరు కూడా తెలంగాణాకు దక్కదు. అయితే ఆ నీటిమీద హక్కే లేని రాయలసీమకు మాత్రం పదులకొద్దీ ప్రాజెక్టులు వెలుస్తయి. అసలు జలాలకు మొండి చెయ్యి. మిగులు జలాలకు మాత్రం పెద్దపీట. అది మన సమైక్యాంధ్ర పాలకుల నీతి. 

పైనించి మీది మెట్ట ప్రాంతం, నీళ్ళు మీకు ఎక్కవు అని చెప్పే గారడీ మాటలు రడీగనే ఉంటయి. నీరు మెట్టనించి పల్లానికి పారుతున్నప్పుడు తెలంగాణా మొత్తం మెట్టగానే ఉంటే అసలు తెలంగాణా నించి నీరే పారోడ్డు గదా అని అడిగితే సమాధానం ఉండదు.

అయినా మా రాష్ట్రంల మానీళ్ళు ఎట్లా పారించుకోవాల్నో మాకు తెలుసు, మధ్యలో ఒకరి పెత్తనం మాకు అవసరం లేదు. ఒకరితోని చెప్పించుకోనే అవసరం అంతకన్నా లేదు.

ఇక నిధుల విషయానికి వస్తే తెలనగాన భూములు అమ్ముకొని సంపాదించిన నిధులు ఆంధ్రల ఖర్చు పెడతరు. బీబీనగర్ నిమ్సు కట్టేటందుకు నిధులు ఉండయి. అదే కడప రిమ్సుకు వనదలాది కోట్లు నడుల్లాగా ప్రవహిస్తయి.

తెలంగాణా యూనివర్సిటీకి ముష్టి మూడు కోట్లు కేటాయిస్తే, వేమన యూనివర్సిటీకి మూడొందల కోట్లు కేటాయించ బడుతయి. 
బాసర IIIT రేకుల షెడ్లలో నడిపితే ఇడుపులపాయలో IIIT కి ఆధునిక భవంతులు తయారైతయి. యాభై ఏండ్ల చరిత్ర వదిలేస్తే కండ్ల ముందు చరిత్ర ఈరకంగ కనపడుతుంటే తెలంగాణల ప్రతి ఒక్కడు చైతన్యవంతం అయిండు. ఇప్పుడు ఇంకా ఏమాత్రం గారడీ మాటలు చెప్పి మసి పూసి మారేడు కాయ చేస్తమంటే నమ్మే పరిస్తితిల లేడు. 

మేం చెప్తున్నది గతించిన, నడుస్తున్న చరిత్రల జరిగిన, జరుగుతున్న అన్యాయాల గురించి. మీరు చెప్పుతున్నది విడిపోతే జరుగుతాయన్న భయాల గురించి. మేం మాట్లాడుతున్నది జరిగిన వాస్తవాల గురించి. మీరు మాట్లాడేది ఊహాజనితమైన విషయాల గురించి. గత యాభై ఐదు సంవత్సరాల చరిత్ర చూసినంక సమైక్య రాష్ట్రం మనకు పోసగదని తేలి పొయ్యింది. దానికి సరయిన పరిష్కారం రాష్ట్ర విభజన మాత్రమే.

ఎనకటికి ఎవరో భారద్దేశానికి స్వాతంత్రం ఇస్తే ఎట్లా పరిపాలించు కుంటరని ఒకాయిన అడిగిండట. ఎట్లనో ఒక రీతిల పరిపాలించుకుంటనే ఉన్నాం. ఒకని కింద బతికిన దానికన్నా మంచిగానే ఉంటున్నాం. ఇప్పుడు గూడ రాష్ట్రం విడిపోతే భూమి బద్దలై పోదు. ఆకాశం విరిగి నేలమీద పడదు. మాకంటే మీరే ఎక్కువ అభివృద్ధి చెందుతరేమో... తెలివైనోల్లు గద! మేం గూడ మీ అంత కాకపోయినా మా వనరులు మేం సరిగ్గ ఉపయోగించు కుంటం. రాష్ట్రం విడిపోయినా దేశంల ఉన్న పది పదిహేను రాష్టాల కన్నా మన రెండు రాష్ట్రాలు పెద్దగనే ఉంటయి. ఆ రాష్ట్రాలు అన్నీ ఎట్లా నడుస్తున్నాయో మనయి గూడ అట్లానే నడుస్తాయి. పెద్దగ ఉండి ఇప్పుడు పెద్దయింది లేదు, అట్లనే చిన్నగ ఉంటె అప్పుడు మనకు తరిగి పొయ్యేది లేదు.            
  

Monday, May 23, 2011

యాదయ్య ఉత్తరం ఎందుకు కాలలేదు?

తాము సమైక్య వాదులమని చెప్పుకును కుంటా విశాలాంధ్ర మహాసభ అని పేరు పెట్టుకున్న ఒక బ్లాగులోని రాతలు ఒకసారి చూడున్రి.
"ఏదో కొంత మంది చనిపోయిన విద్యార్థుల దగ్గర ఆత్మహత్యా పత్రం పెట్టినంత మాత్రాన మా తెలంగాణా ఉద్యమాన్ని మీ ఆంధ్రోల్లు మమ్మల్ని అరాచక శక్తులతో పోల్చడం ఏమైనా బాగుందా?"
ఇట్లాంటివి ఆ పోస్టుల చాలానే ప్రేలాపనలున్నయి. అయ్యన్నీ ప్రస్తుతానికి వదిలేద్దాం. సదరు పెద్దమనిషి పోస్టు మీద వచ్చిన వ్యాఖ్యలకు జవాబిచ్చు కుంట చెప్పిన మాటలు కింద చూడున్రి.
"ఒక వ్యక్తి తన శరీరాన్ని నిప్పుతో తగుల పెట్టుకొంటే తొంభై శాతం శరీరం తగులబడింది కానీ అతనివద్ద ఉన్న ఆత్మహత్యా పత్రం తెల్ల కాగితంలా ఉంటే మీకు ఎలా ఉందోకానీ నాకు ఆ విధంగా కాగితం తగలబడకుండా ఉండే సాంకేతిక పరిజ్ఞానం తెలిస్తే మన శాస్త్రజ్ఞులకు తెలిపి పేటెంట్ తీసుకొందామను కొంటున్నాను." 
ఇయీ, సమైక్యవాదిని, మనం కలిసి ఉండాలే, మనం సహోదరులం అని చెప్పుకునే పెద్దమనిషి మాటలు.

సోదరుడు కాకపోయినా శత్రువనుకున్నా, యాదయ్య చావు చూసినోల్లకు గుండె చెరువైతది. అటువంటిది మన సమైక్య సోదరునికి ఆ ఆత్మహత్యల పెట్టుడు ఉత్తరాలు కనపడ్డాయి. పేటెంట్లు కనబడ్డయి. సాంకేతిక పరిజ్ఞానం కనపడ్డది. ఇటువంటి రాతలు రాస్తున్న మనిషి నిజానికి తెలంగాణా జనానికి మేలే చేస్తున్నడు. తెలంగాణా మొత్తం ఏకమై ఈపాటికే తీసుకున్న నిర్ణయాన్ని ఈ మనిషి తన రాతల తోటి మరింత బలపరుస్తున్నడు. ఇటువంటి వాళ్లతోటి మాకు పోసగదని నిరూపిస్తున్నడు.

అసలు ఆ ఉత్తరం ఎందుకు కాలలేదు? ఆ ఉత్తరం అతని దగ్గెర ఉంటె కదా కాలేతందుకు? అది ఆయన బ్యాగుల దొరికింది.

అతడు కాల్చుకున్న సమయంల తీసిన లైవ్ ఇక్కడ చూడున్రి.


నది రోడ్డుమీద అంతమంది జనంల, తెలంగాణా కోసం బయలెల్లిన ర్యాలీల, కాల్చుకుని చచ్చిన మనిషి కనపడడు, ఉత్తరం ఎందుకు కాలిపోలేదన్న ఆలోచన మాత్రం వస్తది.

సదరు వ్యాఖ్యలు రాసిన పెద్దమనిషికి బ్లాగు ముఖంగా కృతఙ్ఞతలు, మీ విషపు టాలోచనలు బయట పెట్టుకుంటున్నందుకు. మా సంకల్పం మరింత బలపడేటందుకు మీ వంతు కృషి చేస్తున్నందుకు!

రెండో ఎస్సార్సీ కావాలె -సమైక్యావాదులు

ఈ సమైక్య వాదులు చెప్పేవి అబద్ధాలని ఒకరు చెప్పుడు అవసరం లేదు. నిన్నొక మాట చెప్పి, అంతలనే నాలిక తిప్పే ఘనాపాటీలు మన సమైక్యవాదులు.

నిన్నటి దాంక రాష్ట్రాలు విడగొట్టవద్దు. దేశ సమైక్యత కీ భంగం కలుగుతడి (?) అన్నోళ్ళు,  ఇప్పుడు UP వొళ్ళు మూడు రాష్ట్రాలు చేసే టందుకు రెండో ఎస్సార్సీ అడిగితె, వెంటనే వీళ్ళు గూడ రెండో ఎస్సార్సీ పాత అందుకున్నరు. వీళ్ళకు రాష్ట్రమే విడిపోవుడు ఇష్టం లేనప్పుడు రెండో ఎస్సార్సీ, మూడో ఎస్సార్సీ అవసరం ఏమున్నది?

రెండో ఎస్సార్సీ అంటే ఇప్పుడు 18 రాష్ట్రాల డిమాండ్లు ముందుకు వస్తయని వీళ్ళకు దెల్వదా? తెలుసు. వీళ్ళ ఉద్దేశం ఒకటే. ఏదో ఒకటి చెప్పి మరింత గడువు తీసుకోవాలె. అప్పటికి ఏదో ఇంకో కుట్రకి ఉపాయం తట్టుద్ది. అంతే గని వాళ్ళు చెప్పే మాటలకు, పైకి వల్లిస్తున్న సిద్ధాంతాలకు పొంతన కుదుర్తదా, లేదా అన్న విషయం వాళ్లకు అవసరం లేదు.

ఇప్పటికే నలభై కోట్లు వృధా చేసి శ్రీకృష్ణ కమిటీ వేయించిన్రు. దానిమీద కేంద్రం ఏదో ఒక నిర్ణయం తీసుకుంటది అని తెలువంగానే ఎస్సార్సీ పాత అందుకున్నరు.   

నిజానికి వీళ్ళకు ఎస్సార్సీ తోటి పని లేదు, దేశ సమైక్యత తోటి పని లేదు. అట్లా అని ఆంధ్రా బడుగు జనాల మీద ప్రేమా లేదు. వీళ్ళ ఆలోచన అంతా ఒకటే. ఎట్లా హైదరాబాదుల కబ్జాలను కాపాడు కోవాలె. ఎట్లా పెద్ద పెద్ద కాంట్రాక్టులు ఫలానోల్లను అడ్డం పెట్టుకొని పట్టాలె. ఎట్లా మరిన్ని కబ్జాలు చెయ్యాలె. గియ్యే వీళ్ళకున్న ఆలోచనలు.
    

సమైక్యవాదులకు సగటు సీమాంధ్రుని ప్రశ్న

అయ్యలారా

మాకు ఒక్క రాష్ట్రం అయితే వచ్చే మేలు లేదు, రెండు రాష్ట్రాలు అయితే జరిగే కీడు లేదు. ఎన్ని రాష్ట్రాలైనా మా బతుకు మేం బతుక వలిసిందే. మా చావు మేం చావ వలిసిందే.

తెలంగాణాల దొంగ సర్టిఫికెట్ల తోటి ఉద్యోగాలు తెచ్చుకునే మీలాంటి పైరవీ కారులకు నష్టమేమో తెలవదు కాని, ముక్కు సూటిగ పొయ్యే మాలాంటి సామాన్యులకు వచ్చే నష్టమేమీ లేదు. 

తెలంగాణా వేరైనంత మాత్రాన గోదారికి, క్రిష్ణమ్మకు వాళ్ళేమన్న అడ్డుకట్ట లేస్తరా? వాళ్ళ నీళ్ళు వాళ్ళు వాడుకుంటారు. మన  నీళ్ళు మనం వాడుకోవాలే. అయినా మాదగ్గర భూములెక్కడున్నయి సారూ? ఉన్న భూములన్నీ మీరే బినామీ పేర్ల మీద వేల వేల ఎకరాలు రాసుకున్నరాయే. భూములు పంచుతానని వచ్చిన తెలంగాణా పంతులును కుర్చీ మీంచి గెంటివేసింది మీరు కాదా సారూ! 

మేము విడిపోయినా కూలో, ఉద్యోగమో చిల్లర వ్యాపారమో చేసుకోవాలె. కలిసున్నా అయ్యే చేసుకోవాలె. ఆ మాత్రం దానికి లోకం మునిగి పోతున్నదన్నట్టు  అరిచి గోల పెట్టుడెందుకు సారూ. 

తొమ్మిదో తారీకు అర్ధరాత్రి చిదంబరం ఏదో చెప్పినడట. పదోతారీకు నాకు సరిగా తెల్వకనె పాయె, నేనెక్కడా నుండి చెందాలిస్తిని? ఎక్కడ ఉన్నది ఉద్యమం చేస్తిని సారూ? ఏడ చూసినా పెద్ద పెద్ద కటౌట్లు, ప్లేకార్డులు, పోస్టరులు, డ్రామా డ్రెస్సులు, షామియానాలు, స్టేజీలు ఏడకెల్లి వచ్చినయి సారూ. తెలంగానోల్లకయితే చెప్పరు, కనీసం నాకయినా చెప్పండి సారూ.

మీరు ఉద్యమాలు చేసుకుంట ఆడోల్లు మొగోళ్ళు ముద్దులు పెట్టుకుంటా ఉంటే, నిమ్సుల గంతులేసుక ఉరుకుతా వుంటే శానా బాగా అనిపిచ్చింది సారూ. అట్లనే మా సమస్యలపై కూడా మీరు ఉద్యమాలు చేస్తే చూడాలని ఉంది సారూ!

నేను హైదరాబాదు ఏం జేసుకొను సారూ. ఆడికి పోవాలంటే చార్జీలకు కూడా డబ్బులు సాలవు. పొద్దు మాపు మీ దగ్గర చాకిరీనే సరిపోయే, అక్కడికి పోయి నేనేమి చేతు సారూ? ఆ రాజదానేదో ఇక్కడనే ఉంటే పుష్కరాని కొక్క పాలైనా వెళ్లి అసెంబ్లీ నో, హైకోర్టునో చూసి వస్తును కదా బాబూ.

మాటి మాటికి మీరు హైదరాబాదును డెవలప్ చేసినం అని చెప్తారు. హైదరాబాదు డెవలప్ అయితే నాకేం ఒరిగింది సారూ? అయినా హైదరాబాదులో బిజినేసులు చేసి మీరు డెవలప్ అయినరు దప్ప అక్కదోల్లకు మాత్రం మీరు చేసింది ఏమున్నది సారూ?

నా అక్క కొడుకు బెంగులూర్ల జాబు చేస్తుండు. నా చెల్లె కొడుకు చెన్నైలో ఉద్యోగం చేస్తుండు. ఇప్పుడు ఆ రెండు కూడా మనకు ఇవ్వమంటే ఇస్తరా సారూ. అయినా ప్రైవేటు ఉద్యోగం చేసే టందుకు ఏవూరైతే ఏంది సారూ? 

మీరు తెలంగాణా పోయినా ఫర్వాలేదు, హైదరాబాదు పోనియ్యమంటున్రు. మరి కరీంనగర్ల ఉన్న మా చుట్టాలేంగావాలే సారూ? తెలంగాణా ఊర్లల్ల ఉన్న 20 - 30 లక్షల మంది మనోళ్ళు ఏం గావాలె సారూ? మీ ప్రేమ హైదరాబాదు మీదనా ఆంధ్రా ప్రజల మీదనా? అర్థం కావడం లేదు సారూ!

మాటి మాటికి ఒకే జాతి, అన్నదమ్ములము అని అంటారు. మరి మీ అన్నదమ్ములంత కలిసే ఉంటున్నారా, విడిపోయి ఉంటున్నారా సారూ. మా యిండ్లలో నయితే విడిపోతేనే బాగుపడుతం సారూ. మీ పెద్దోల్ల ఇండ్ల సంగతి నాకు తెలవదు. ఏకరాల కొద్ది ఇండ్లు ఉంటాయట కదా? ఒక్కొక్క ఇంట్లో ఎంత మంది ఉంటారు సారూ? తెలువక అడుగుతున్నా, ఏమనుకోకండి!

Friday, May 20, 2011

విలువలుడిగిన విశ్వవిద్యాలయం

అక్కడ రాజ్యాంగం చదివిన తలలు మొద్దు బారినై
అక్కడ సజాతి దాయాదుల ఆకాంక్షలకు 
సజీవ సమాధులు నిర్మించ బడ్డాయ్
అక్కడ అన్యాయాలు న్యాయాలుగా బోధింపబడ్డాయ్ 

అక్కడ శవాలు పీక్కుతినే రాబందులు 
సమైక్యతా రాగాలు ఆలాపించారు 
అక్కడి అమాయకపు గొంతుకల ప్రశ్నలు 
నాలుక చివర్లోనే ఆగి పోయాయ్

అక్కడ రాత్రి పదకొండుకు విన్న సమాచారం
పొద్దున్న పదిగంటలకు కుట్రగా మారింది 
దురాక్రమణ వాదానికి కొత్త భాష్యం చెప్తూ 
సోదరప్రేమ లేపనాన్ని అందంగా పులిమింది 

అక్కడ వంచన శిల్పానికి బీజం మొలిచింది 
అక్కడ విశ్వవిద్యాలయానికి అర్థం మారింది
ధనస్వాముల పాదాలకు దాసోహం చెప్పింది 
డబ్బు సంచుల ఉద్యమం ధగ ధగ లాడింది

Thursday, May 19, 2011

మనది ఒకే జాతా? ఐతే?



రాముడు పుట్టక ముందు నుంచీ మనది ఒకే జాతి అని వాదించిన్రు. ఒక్కటి కాదు, మన ప్రాంతంల తెలింగ, కళింగ, ఆంధ్రక, కిష్కింధ, ద్రావిడ జాతులు ఉండేవని రుజువైంది.

మనది ఒకే రాజ్యంగా ఉందని వాదించిన్రు. రాష్ట్రం మొత్తం ఒకే రాజ్యంగా ఎప్పుడూ లేదని (ఆంధ్రప్రదేశ్ ఏర్పడ్డంక తప్ప) రుజువైంది.

ఒకే భాష అన్నరు. ఒక రాష్ట్రానికి ఒక భాష తప్ప ఒక భాషకు ఒక రాష్ట్రం ఉండుడు సాధ్యం కాదని తేట తెల్లం అయ్యింది.

ఇంకా ఏం జెప్తరు సమైక్యవాద పెద్దన్నలూ?

ఒక్క జాతైనా, ఒక్క భాషైనా, ఇదివరలో ఒక్క రాజ్యమైనా ఇప్పుడు రెండు రాష్ట్రాలుగ విడిపోతే లాభమే గాని నష్టం లేదు, కొంతమంది దోపిడీ దార్లకు తప్ప.

పీవీని ఓడించి మూలక్కూర్చోబెడితే మేం గెలిపించాం

ఆంధ్రోల్లు చెప్పే అబద్ధాల లిస్టులో ఇదొకటి. పీవీ నరసింహా రావును తెలంగాణా ప్రజలు ఓడించినరట! అప్పుడు ఆంధ్రా వాళ్ళు పూనుకొని తలా ఒక చెయ్యేసి గెలిపించినరట! నిజంగా ఎంత బాగుంది బై వినేటందుకు!

అసలు పీవీ రాజకీయ చరిత్ర ఒక సారి చూస్తె విషయం అర్థమైతది.

పీవీని 1957 నుండి 77 వరకు ఎమ్మెల్యేగా ఎన్నుకున్నది తెలంగాణాయే. 1977 నుండి 84 దాంక వరంగల్ నుండి ఎంపీగా గెలిచిండు. 1984 ఎన్నికల్ల మాత్రం ఎన్టీయార్ ప్రభంజనంల అందరు కాంగ్రెస్ నాయకుల్లాగానే పీవీ కూడ ఒడి పోయిండు. అయినా ఆ ఎన్నికల్ల మధ్యప్రదేశ్ లోని రాంటెక్ నుండి ఎంపీగ గెలిచిండు.

మరి గియ్యన్ని జరుగుతున్నప్పుడు సదరు ఆంధ్రా ప్రజలకు పీవీ లోని గొప్ప నాయకుడు కనపడలే. ఎవ్వరు కూడ తమ స్థానాలు వదులుకొని 'రావయ్యా పీవీ నిన్ను గెలిపిస్తం' అని చెప్పలే.

ఆ తర్వాత రాజీవ్ గాంధీ కూడ పీవీకి పెద్దగా ప్రాధాన్యం ఇయ్యలేదు. పీవీ క్రియాశీల రాజకీయాల్లోంచి దాదాపుగా రిటైర్ అయ్యిండు. 1991 పార్లమెంటు ఎన్నికల్ల పోటీ కూడ చెయ్యలేదు. ఆ టైముల ఆధ్రోల్లు ఎవ్వరు గూడ వచ్చి 'అయ్యా పీవీ! నువ్వు అప్పుడే రిటైర్ కావద్దు. నువ్వు చెయ్య వలసిన పని చాన ఉన్నది. మా దగ్గరి నుంచి గెలువు' అని చెప్పిన పాపాన పోలే.

కాని తర్వాతనే అసలు గమ్మతు జరిగింది. ఎన్నికల ప్రచారంల రాజీవ్ గాంధీ చనిపొయ్యిండు. కాంగ్రెస్ ఎన్నికల్ల పెద్ద పార్టీగ గెలిచింది గని పూర్తీ మెజారిటీ రాలే. గా మైనారిటీ ప్రభుత్వాన్ని నడిపే టందుకు కాంగ్రేసోల్లకు పీవీ తప్ప ఎవ్వరు దిక్కు లేకుంట పొయ్యింది. రాజకీయాలు మానుకున్న పీవీని తీసుకపోయ్యి ప్రధాన మంత్రి కుర్చీల కూసబెట్టిన్రు.

గట్ల ఎంపీ కాకుండనే పీవీ ప్రధాని అయ్యిండు. కాని ప్రధాని అయ్యినంక ఐదేండ్ల లోపల యాడినించన్న ఎంపీగ ఎన్నిక కావాలె. లేక పొతే ప్రధాని పదవి ఊడి పోతది.

గప్పుడు పీవీ దేశానికి ప్రధానమంత్రి, కాంగ్రెస్ పార్టీకి అధ్యక్షుడు. గాయిన చెప్పితే ఏ కాంగ్రెస్ ఎంపీ అయినా సీటు ఖాళీ చేసి ఇయ్యవలసిందే. గది మనం చూసిన, చూస్తున్న చరిత్ర. 

గప్పుడే మల్లొకసారి ఆంధ్రా తెలివి తేటలు బయట పడ్డై. పెద్ద పెద్ద కాంట్రాక్టులు పట్టాల్నంటే ప్రధానిని మంచి చేసుకోవాలె. ప్రధానికి ఏం అవసరం? ఎంపీగ గెలుసుడు అవసరం.

గప్పుడు నంద్యాల నుండి గంగుల ప్రతాపరెడ్డి రాజీనామా చేసిండు. గా ఎలక్షన్ల ఎన్టీ రామారావు ఎవ్వరినీ తెలుగుదేశం నుండి పోటీకి నిలబెట్ట లేదు. దాన్తోని పీవీ నాలుగు లక్షల మెజార్టీతో గెలిచిండు. 
       
దీంట్ల మన సమైక్య సోదరులకు సంకలు గుద్దుకునే విషయం ఏముందో వాళ్ళే చెప్పాలే. పవర్ లో ఉన్న పీవీ నంద్యాల నుంచి కాకపొతే నాగాలాండ్ నుంచైనా గెలిచే వాడే మన మన్మోహన్ లాగా!

పీవీని గెలిపిచ్చుడు సంగతేమో, గని ఉద్యమాలు చేసి ఆయినను రాష్ట్ర ముఖ్యమంత్రి గద్దె దింపింది మాత్రం ఆంధ్రా వాళ్ళే ననేది చరిత్ర చెప్పుతున్న సత్యం. ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పీవీ భూ సంస్కరణలు అమలు చేసిండు. తెలంగాణాలో అమలైన భూ సంస్కరణలు ఆంద్రాల గూడ చెయ్యడానికి పూనుకునుడే పీవీ చేసిన తప్పు. ఇది సహజంగనే ఆంధ్రా బూర్జువా భూస్వామ్య వాదులకు నచ్చలేదు. పైకి ముల్కీ నిబంధనల పేరు చెప్పినా, జై ఆంధ్రా ఉద్యమానికి అసలు కారణం మాత్రం  పీవీని గద్దె దించుడే. పీవీ తో ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయించుడు ఈ ఉద్యమ పరిష్కారాలలో ఒకటి.    

పీవీ దిగిపోవడం తోటి ముల్కీ ఏదో ఒక రూపంలా అట్లనే ఉన్నా, భూసంస్కరణలు మాత్రం పూర్తిగా ఆగిపోయినై.

సమైక్య రాష్ట్రం ఎవరి కోసం?

ఉద్యమ కారులల్ల రెండు రకాల వాళ్ళు ఉంటరు. ఒకటి, ఉద్యమం మీద కమిట్ మెంట్ ఉండి, ప్రతిక్షణం ఉద్యమం కోసం పాటు పడేటోల్లు. రెండు, ఉద్యమం తీవ్రతరమైనపుడు తమ రాజకీయలబ్ది కోసం ఆ మంటల చలి కాసుకునేటోల్లు. మన తెలంగాణా కాంగ్రెస్, తెలుగుదేశం నాయకులు ఈ రెండో కేటగిరీకి వస్తరు. ఉద్యమ ఉధృతి కనపడంగనే వీళ్ళు మాకన్న గొప్ప ఉద్యమకారులు లేరన్నట్టు మాట్లాడుతరు. అందరికన్న గట్టిగ అరుస్తరు. శవాల దగ్గర ప్రతిజ్ఞలు చేస్తరు.

జర ఉద్యమం చల్లబడ్డట్టు అనిపిచ్చిందా? ఇంక పత్తా ఉండరు. మన రాజకీయ నాయకులంత వ్యాపారస్తులే అనేది అందరికి తెలిసిన రహస్యమే. వీళ్ళకి ప్రతిదీ సప్లై, డిమాండు సూత్రం లెక్కనే కనిపిస్తది. ప్రజల్ల ఉద్యమానికి డిమాండు ఉంటె వీళ్ళు ఉద్యమాలు చేస్తున్నట్టు నటిస్తరు. ఆ విధంగా ప్రజలను ఆకట్టు కుంటందుకు ప్రయత్నం జేస్తరు.

గీ సూత్రాన్ని అనుసరించే జూపల్లి కృష్ణారావు పాదయాత్ర చెయ్య బట్టిండు. నాగం జనార్థన్ రెడ్డి పార్టీ జండాను కింద పారేసి ఉద్యమం జేస్త నంటున్నడు. ఇంక ఎరబెల్లి, ఇంక కొంత మంది తెలుగు దేశం జండాకు వేలాడు కుంటనే, రెండుకళ్ళ చంద్రబాబు కాళ్ళు మొక్కు కుంటనే తెలంగాణా ఉద్యమం చేస్తమంటున్నరు. 

దీన్ని బట్టి ఏం తెలుస్తున్నది? తెలంగాణా ఉద్యమం ఇప్పుడు బలంగా ఉన్నదనే కదా? ఇప్పుడు ప్రజల్ల తెలంగాణా రాష్ట్రం ఏర్పాటుకు డిమాండు ఉన్నది. అందుకనే ప్రజలను ఆకట్టుకోవాలె నంటే ఉద్యమాలు చేస్తున్నట్టు నటిచుడు తప్పదు ఎవరికైనా.

అయితే ఆంధ్రల మాత్రం ప్రజలల్ల సమైక్యతా గురించి ఎటువంటి డిమాండు లేదు. అటువంటి డిమాండు ఉంటే బొత్స సత్యనారాయణ, హర్ష కుమార్, దివాకర్ రెడ్డి లాంటోల్లు తెలంగాణాకు అనుకూలంగ మాట్లాడిన్రు. మిగిలిన నాయకులల్ల చాలా మంది గూడ అధిష్టానం చెప్పిన దానికి కట్టుబడి ఉంటం అని చెప్తున్నరు. దీన్ని బట్టి ఆంధ్ర ప్రజలల్ల తెలంగాణా కి వ్యతిరేకంగ ఎటువంటి డిమాండు లేదని అర్థమైతుంది.

ఐతే కొంతమంది పదవులను అడ్డం పెట్టుకొని తమ కబ్జా వ్యాపారాలు, అక్రమ లావాదేవీలు కొనసాగించే  నయా రాజకీయ బ్రోకర్లు మాత్రం తెలంగాణాను అడ్డుకునేటందుకు సర్వ శక్తులూ ఒడ్డుతున్నరు అనేది వాస్తవం. వీళ్ళ ప్రయోజనాలు సమైక్య రాష్ట్రం తోటి ముడివడి ఉన్నయి. 

రాష్ట్రం ఎంతపెద్దగ ఉంటె అంతపెద్ద కాంట్రాక్టులు వస్తయి. ఎంత పెద్ద కాంట్రాక్టులు వస్తే అంత ఎక్కువ పైసలు దండుకోవచ్చు. సీమాంధ్ర పక్షపాతంతో కూడి ఉన్న ప్రభుత్వాన్ని అడ్డం పెట్టుకొని ఇష్టమొచ్చినట్టు హైదరాబాదుల భూములను కబ్జా చెయ్యొచ్చు.

హైదరాబాదు తప్ప తెలంగాణాతో కలిసి ఉండుడు పైన ఎటువంటి మోజు లేదని వీళ్ళు ఇప్పటికే బయటపడి పోయిన్రు. వీళ్ళు ఇప్పటిదాంక చెప్పిన అన్నదమ్ములు, ఒక్క జాతి అనేటి కథలు తప్పని వీళ్ళే ఒప్పుకున్నరు. అయితే ఈ హైదరాబాదు పైన మోజు ఎవరికి?

ఆంధ్రాల ఉన్న సామాన్య పౌరునికి హైదరాబాదు మీద ఏమాత్రం మోజూ లేదు, హైదరాబాదు తోని పనిలేదు. ఇంక వాళ్లకు దగ్గెర్ల ఇంకొక రాజధాని ఉంటెనే మరింత సౌకర్యంగ ఉంటది. ఆ సంగతి ఆంధ్ర ప్రజలకు బాగనే తెలుసు. అందుకనే అక్కడి ప్రజలల్ల ఎటువంటి ఉద్యమం లేదు, పైసలిచ్చి ఉద్యమాలు నడిపించే రాజకీయ నాయకులల్ల దప్ప. అందుకనే సమైక్య గర్జన సభ జరిపితే 2000ల మంది కూడ రాలేదు.     

ఓ సీమాంధ్ర సోదరులారా, రాష్ట్రం విడిపోవుడు తప్పదు గాక తప్పదు. విడిపోయినంక మాత్రం ఈ రాజకీయ బ్రోకర్లు, భూబకాసురులు, లక్షల కోట్ల సామ్రాజ్యాలు కూడ పెట్టేటొల్లకు మళ్ళా పట్టంగట్టకండి. వీళ్ళకు మా, మీ తేడా లేదు. వీళ్ళకు అధికారం ఇస్తే మిమ్ములను సర్వనాశనం బట్టిస్తరు.

Tuesday, May 17, 2011

ఆజాద్ వద్ద సీమాంధ్ర నాయకుల డిమాండ్లు

ఆజాదు ఆంధ్ర నాయకుల తోని మీటింగు పెట్టిండు. ఆ మీటింగు ప్రారభించుకుంట ఎమ్మెల్యేల చెప్పుడు మొదలు పెట్టిండు. "నేను ఇంతకు ముందే తెలంగాణా నాయకులతోని మీటింగు పెట్టిన. గాళ్ళు మాత్రం సమైక్యాంధ్ర ఒద్దంటే ఒద్దని చెప్పుతున్నరు. తెలంగాణా విడగొట్టుడు తప్ప దేనికి గూడ ఒప్పుకోరట. మరి మీరేమంటరు?" అని అడిగిండు.

వెంటనే ఒకాయన లేచి అందుకున్నడు.

"అదెలా కుదురుతుందండీ? మాదంతా తెలుగుజాతి. మా జాతి సమైక్యత కోసం ప్రాణాలైనా అర్పిస్తాం. అంతే గాని ఆంధ్రులను చీల్చడానికి మాత్రం ఒప్పుకోం."

ఆజాదు అర్థంగాక అడిగిండు. "అదేంది? కాసేపు తెలుగంటవు. కాసేపు ఆంధ్రా అంటవు. నీది తెలుగుజాతా? ఆంధ్రా జాతా?"

"అయి రెండూ పర్యాయ పదాలేనండీ" ఇంకొకాయన సర్ది చెప్పిండు.

"అట్లనా! మరి జాతి సమైక్యత గురించి మీరే ఎందుకు బాధ పడుతున్నరు? ఆల్లెందుకు బాధ పడుతలేరు? ఇద్దరు అనుకుంటెనే గద సమైక్యత సాధ్యపడేది?" అడిగినడు ఆజాదు.

"వారు కూడా సమైక్యత కోరుకొనే మాతో కలిసేరు. అరవై ఏళ్ళు గడిచాక ఇప్పుడెందుకు వద్దనుకుంటున్నారో అర్థం కావడం లేదు."

"సరే, నాకర్థమయ్యింది లెండి." అన్నడు ఆజాదు. "కానీ మీరెంత చెప్పినా ఇంకా ఆంధ్రప్రదేశ్ కలిపి ఉంచుడు సాధ్యం కాదు. మొన్న జరిగిన ఎన్నికలల్ల మీరు జగన్ను అరికట్ట లేక పోయిన్రు. మీ ఆంధ్రాల పార్టీ మొత్తం జగన్ వైపు తిరుగుతదని సర్వేలు చెప్పుతున్నై. ఇంక తెలంగాణాల నన్న పార్టీ నిలబడాలె నంటె తెలంగాణా ఏర్పాటు తప్పనిసరిగా చెయ్యాలే. గదే విషయం మేడం మీకు చెప్పమన్నరు. రాష్ట్రం విడిపోతది. ఇప్పుడు చెప్పున్రి, కలిసుండుడు తప్ప ఇంకేమన్నా కండిషన్లు ఉన్నయా?"

"అలాగైతే హైదరాబాదు మాకిచ్చేయండి"

"డిల్లీ కూడా" ఇంకొకాయన అన్నడు.

"వార్నీ, డిల్లీ ఎందుకు?" ఆశ్చర్యం తోని అడిగిండు ఆజాదు.

"మరే, మా బాబాయి కొడుకు అక్కడో కిరాణా కొట్టెట్టి డిల్లీని డెవలప్పు చేసేడు. మరి డిల్లీని డెవలప్పు చేసింది మేమే కదా? మరలాంటప్పుడు డిల్లీ మాదే కదా?"

"మీ అసాధ్యం కూలా! కాసేపాగితే న్యూయార్కు కూడా మాదే ననే లాగున్నరే!" ఆశ్చర్య పోయిండు ఆజాదు.

"అంతే కాదు, ఇంకా ఉన్నాయ్ కండిషన్లు"

"అట్లనా, చెప్పుండ్రి నాయనా, విని తరిస్తా!"

"కృష్ణా, గోదావరి నీళ్ళు ఒక చుక్క కూడా తెలంగాణలో వాడ్డానికి వీల్లేదు. ఇప్పుడు ఎలా వాడుకుంటున్నామో, అప్పుడు కూడా మొత్తం నీళ్ళు మేమే వాడుకోవాలి."

"వీలైతే నదులకు ఆపక్కా, ఈపక్కా పక్కా గోడలు కట్టించాలి, తెలంగాణలో" వెనకనించి అరిచిండు ఇంకొకాయన.

"వార్నాయనో, ఇంత తెలివి తేటలున్న మిమ్ములను ఎట్ల భరించార్రా నాయనా వాల్లిన్ని రోజులూ?" ముక్కుమీద వేలేసుకుండు ఆజాదు. "ఇంతకు ముందే కదరా జాతి సమైక్యతా, తొక్కా తోలూ అన్నరు? సరే, ఇంకా జెప్పున్రి, విని రాసుకుంట".

"మరేం లేదండీ, మాకుర్రోల్లు అడిగితే కాదనకుండా తెలంగాణా లోకల్ కేండిడేట్ సర్టిఫికేట్ జారీ చేయాలి. దీనికోసం తెలంగాణా సెక్రెటేరియట్ లో ఒక సెల్ పెట్టాలి."

"అంతే కాదు, ఆంధ్రా కేండిడేట్లకు తెలంగాణా ఉద్యోగాల్లో 80 శాతం వాటా ఏర్పాటు చేయాలి. వింటున్నారా ఆజాద్ గారూ?"

ఇంకెక్కడి ఆజాద్! మూర్చొచ్చి పడిపొయ్యిండు.

Friday, May 6, 2011

సమైక్యవాదులూ, మీకో మంచి అవకాశం

పోలవరం ప్రాజెక్టుపై మొదటినుండి వివాదాలే నడుస్తున్నయి. అటు ఒరిస్సా ప్రభుత్వం, ఇటు పర్యావరణ వాదులు ఈ ప్రాజెక్టు ఒద్దంటే ఒద్దని మొత్తుకుంటున్నరు. అక్కడ నివసిస్తున్న లక్షలాది ఆదివాసీలు తమ భవిష్యత్తు గురించి దేవుని మీద భారం మోపిన్రు. అయినా వారి గోడు వినేదెవరు?

ఈ ప్రాజెక్టు కట్టితే ఎంత భూమి అదనంగా సాగవుద్దో, అంతకంటే ఎక్కువ భూమి మునిగి పోతదంటే అందరు ముక్కు మీద వేలేసుకుంటున్నరు. 

ఒకపక్క ప్రాజెక్టు కట్టి కాలవలు తొవ్వకుండా శ్రీరాం సాగర్ అట్లనే పెట్టిండ్రు. ఇంకో పక్క అనుమతులున్న ప్రాణహిత పక్కకు పెట్టినరు. ఏ అనుమతులు లేక, పైనుంచి పక్క రాష్ట్రాల కేసులతో నలుగుతన్న పోలవరం మీద మాత్రం ఎక్కడ లేని ప్రేమ జూపిస్తున్నరు. వేల కోట్ల రూపాయలు కుమ్మరిస్తున్నరు.     

ఈ పోలవరం ప్రాజెక్టు కట్టితే రెండు లక్షల ఎకరాల భూమి నీళ్ళల్ల మునిగి పోతది. రెండు లక్షలకు పైపెచ్చు ప్రజలు ఇండ్లు వాకిళ్ళు పోగొట్టు కుంటరు. ఇక లక్షలాది జంతువులు, మిలియన్లాది చెట్లు కనుమరుగైతయి. ఇంట భీభత్సం సృష్టించి ఈ ప్రాజెక్టు కట్టేది ఎందుకు, మూడో కారు నికరం జేసుకోనీకి.

ఎంత అన్యాయమో చూడున్రి. ఒకవైపు నీళ్ళు లేక, బోర్లు ఎండిపోయి రైతన్నలు ఆత్మహత్యలు చేసుకుంటున్నరు. ఒక్క కారుకు నీల్లోచ్చినా చాలురా దేవుడా అని మొత్తుకుంటున్నరు. ఇంకోపక్క రెండు కార్ల పంటకు నీల్లున్నా, మూడో కారు కూడా నికరంగా పందాలేనని చెప్పి మందిని ముంచే ఎవ్వారాలు చేస్తున్నరు. ఇది న్యాయమా, అన్యాయమా ఒక్కసారి ఆలోచించున్రి.

అదే ప్రాణహిత కట్టితే తెలంగాణా కరువుసీమల కనీసం ఒక కారుకు ప్రాజెక్టు నీళ్ళు వస్తయి. కరెంటు కష్టాలు, బోర్ల కష్టాలు తప్పుతయి. ఎత్తిపోతలకు కొంత కరెంటు కాలినా, బోర్ల మీద కరెంటు కర్చు తగ్గి, కరెంటు ఆదా అవుతది. రైతులు సిటీలకు వలసలు బొయ్యి కూలి పని చేసుకునుడు తప్పుతది.    

ఇప్పుడు తాజాగ కేంద్ర ప్రభుత్వం ఒక్క ప్రాజెక్టుకే సహాయం చేస్తం అంటుంది. అది ప్రాణహితో, పోలవరమో తేల్చి చెప్పమని మనలనే అడిగింది. 

సమైక్యవాదులారా, ఇప్పుడు చెప్పున్రి. మీరు ఏది కావాలంటరు? ప్రాణహిత చేవెల్ల కావాలంటరా? పక్కవాడు ఎట్లబోతే మాకేంది, మాకు పోలవరమే కావాలెనని మొండికేస్తరా? మీ సమైక్యవాదం ఎంత నికార్సైనదో దీన్ని బట్టి తెలుస్తది.

మీ సమైక్యవాదాన్ని నిరూపించుకోనీకి మీకొక మంచి అవకాశం వచ్చింది. మీ వీర సమైక్యవాద ఎంపీలు లగడపాటి, రాయపాటి, కావూరి తదితరులు మాకు పోలవరం వద్దు, ప్రాణహిత ఇవ్వండి అని కేంద్రానికి ఒక మెమొరాండం ఇయ్యన్రి.

మీ సమైక్యవాద ఎమ్మెల్యేలంత కలిసి పోలవరాన్ని ఆపి, ప్రాణహితకు కేంద్ర అనుమతి ఇయ్యమని అసెంబ్లీల తీర్మానం చేయించి కేంద్రానికి పంపున్రి. 

మీ సమైక్యవాద జేయేసీలేమన్న ఉంటె అయ్యన్ని కలిసి "పోలవరం వద్దు, ప్రాణహిత ముద్దు" అని ఉద్యమం జేయ్యున్రి. ముద్దుల ఉద్యమాలు మీకు కొత్తేం గాదుగా! గప్పుడు మీ మాటలు మేం నమ్మగలుగుతం. మీకు మీ ఉద్యమం నిజాయితీ మీద నమ్మకం ఉంటె అది నిరూపించు కుంటందుకు ఇదొక మంచి అవకాశం. 

ఇది జెప్పంగనే ఒకాయన "మేం గట్ల చేస్తే మీ ఉద్యమం మానేస్తామని గ్యారంటీ ఇస్తారా?" అని ఆడుగుడు మొదలు పెడ్తడు.  దానికి సమాధానం గూడ ఇప్పుడే చెప్త. 55 ఏండ్ల నుండి మీరు చేసిన పనుల తోని నమ్మకాన్ని పోగొట్టు కున్నరు. ఇప్పుడు న్యాయం దిక్కు మాట్లాడి మీ విశ్వాసనీయతని పెంచుకొండ్రి. మీరు నిజాయితీ పరులే అని తెలంగాణా ప్రజలు నమ్మితే ఉద్యమం దానంతట అదే పోతది.     

Wednesday, May 4, 2011

తెరాస ను ఎందుకు బలపరచాలి?

తెలంగాణా లోని ఇతర పార్టీల నాయకులకు తెలంగాణా సాధన పైగల చిత్తశుద్ధిని శంకించవలసిన అవసరం లేదు. కానీ ఇతర పార్టీలకు తెలంగాణా ఒక అంశమే కానీ అదే ప్రధానం కాదు. పైగా ఆయ పార్టీల అధినాయకత్వానికి ఒక పొలిటికల్  కంపల్స్హన్ వచ్చినప్పుడే గతంలో తెలంగాణా కు అనుకూలంగా నిర్ణయం తీసుకోవడం జరిగిందే కానీ స్వతహాగా వారికీ తెలంగాణా ఏర్పాటు పట్ల ఏమాత్రం చిత్తశుద్ధి లేదు. 

తెలుగుదేశం పార్టీనే తీసుకుంటే, 2009 ఎన్నికల ముందు వరకు సమైక్య నినాదం తో ఉన్న ఆ పార్టీ కేవలం కాంగ్రెస్ ను ఓడించడానికి, తెరాస తో పొత్తు పెట్టుకోవడానికే తెలంగాణా కు అనుకూల నిర్ణయం తీసుకుంది. 2009  డిసెంబర్ 9 ప్రకటన ముందువరకు తెలంగాణా విభజనకు అనుకూలమన్న వాళ్ళు డిసెంబర్ 23 ప్రకటనను వ్యతిరేకించక పోగా కొత్తగా  రెండు కళ్ళ సిద్ధాంతాన్ని ప్రవేశపెట్టారు. పార్టి వేదికపై పార్టీ అధికార విధానానికి వ్యతిరేకంగా ఆంధ్ర నాయకులు మాట్లాడుతుంటే ఎక్కడా అభ్యంతర పెట్టడం లేదు. 

కాంగ్రెస్ విషయానికొస్తే, 2004 లో ప్రజల్లో ఉన్న తెలంగాణ సెంటిమెంటు ను ఉపయోగించుని తెలుగు దేశం నుంచి అధికారం లాక్కోడానికి తెలంగాణ జపం చేసిన ఆ పార్టీ అధికారం లభించగానే తెలంగాణ అంశాన్ని పక్కన పెట్టింది. 2004 డిసెంబర్ 9 న  తప్పని పరిస్థితిలో తెలంగాణ ఏర్పాటు ప్రకటన చేసి మళ్లి డిసెంబర్ 23 కల్లా వెనక్కు తిసుకుంది. ప్రజల మనోభీస్తానికి అనులంగా, చిరకాలంగా ఉన్న డిమాండు ను పరిష్కరించే దిశగా ఆలోచించాల్సిన పార్టీ, ఆలోచించగలిగే అవకాశం కలిగి ఉన్న పార్టీ తమ తక్షణ రాజకీయ అవసరాలకోసం తెలంగాణా ప్రజల జీవితాలతో ఆడుకుంటూ వందలాది విద్యార్థుల, యువకుల మరణానికి కారనమవుతూంది.

తమతమ రాజకీయ అవసరాల కోసం తెలంగాణా అంశం పై రోజుకో వైఖరి తీసుకునే పార్టిలు రేప్పొద్దున ఇదే పొలిటికల్ కంపల్స్హన్ తో తెలంగాణా కు వ్యతిరేకంగా అధినాయకత్వాలు నిర్ణయం తీసుకుంటే అప్పుడు ఏమిటి పరిస్థితి? అప్పుడు  పార్టీల నుంచి బయటకు వచ్చే నిర్ణయం తీసుకున్నా అప్పటికే కాలాతీతం కాదా?

తెరాస పార్టీకి మరో ౩౦ సీట్లు ఉన్నట్లయితే ఇప్పుడీ పరిస్థితి ఉండేది కాదన్నది సుస్పష్టం. కనుక తెరాసను బలోపేతం చేయాలనే కెసిఆర్ నిర్ణయం లో ఏతప్పూ లేదు. 

కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీల తెలంగాణా నాయకులు కూడా ఈ విషయం గ్రహించి తమ తమ పార్టీల నుంచి బయటికి వచ్చి తెలంగాణా కోసం పోరాడాల్సిన అవసరం ఉంది.  వాళ్ళు తమ తమ పార్టీ లలో తెలంగాణా శాఖలు ఏర్పాటు చేసుకుని స్వతంత్రం గ పని చేయడం మంచిది లేదా ఒక ఉమ్మడి వేదిక పైకి వచ్చి పని చేయాలి. ఒకవేళ వారికి తెరాస పట్ల గాని, కెసిఆర్ పట్ల గాని ఎమన్నాఅభ్యంతరాలుంటే, తెలంగాణా రాష్త్రం ఏర్పడిన తరువాత మళ్లి ఎవరి గూటికి వాళ్ళు వెళ్లి పోవచ్చు. 

తెలంగాణా సాధన తప్ప మరే సమస్య ప్రస్తుత సమయం లో ముఖ్యం కాదనే ఆలోచనలో ప్రజలు ఉంటె ఈ నాయకులు మరో ప్రాంతం ఎన్నికల్లో తమ పార్టీ విజయం గురించి ఆలోచించడం సరైంది కాదు.

వీరంతా తక్షణమే ఒక సరైన నిర్ణయం తీసుకోవాలని ఆశిద్దాం.

సమైక్యం గురించి మాట్లాడే ఆంధ్రోల్లు దురాక్రమణ దారులే

1956 కెళ్ళి చూడ బడితిమి. ఒప్పందం ప్రకారం ఒక్కటిగ కలిస్తిమి. అది మొదలు మోసాల మీద మోసాలు జరుగుతనే ఉండే.

మొదటి దెబ్బ కలిసిన తెల్లారే ఉపముఖ్య మంత్రి పదవికి తెడ్డు జూపిండ్రు. నిన్నటిదాంక ఉపముఖ్యమంత్రి చేసినాయనకు కూడ ఉప ముఖ్యమంత్రి అంటే ఆరో వేలు లెక్క కనపడ్డది. కనీసం ఆ ఆరోవేలు కూడా ఇయ్య దరియ్యలేదు గాయనకు. 

రెండో దెబ్బ రీజనల్ డెవలప్మెంట్ బోర్డు పీకేసిండ్రు. ఇంక విచ్చల విడిగ ఇక్కడి భూములు కొనేటోనికి అడ్డే లేకుంట పొయ్యింది. 

మూడో దెబ్బ ముల్కీ రూల్సు పీకేసుడు. కోర్టుల ముల్కీ రూల్సు కేసుల తెలంగాణాకి అనుకూలంగా తీర్పు వస్తే దానికి వ్యతిరేకంగా ఒక ఉద్యమమే నడిపిండ్రు. ముల్కీ రూల్సుకి ఓర్వలేని వాళ్ళు ఏదో ఇక్కడ ఉద్దరిస్తున్నట్టు చెప్పుతారు. ఇక్కడి వనరులు మింగుడు దప్ప ఇంకోటి తెలువని వానికి సమైక్యంగ ఎన్ని రోజులు ఉంటె అంత మంచిగుంటది. అందుకనే సమైక్యతా రాగం.

ఇట్ల లెక్క పెట్టుకుంట పొతే ఎన్నో మోసాలు. కృష్ణా బేసిన్ నీళ్ళు పెన్నకు పంపుతరు. ఇక్కడి ప్రాజెక్టులు పాతికేండ్లు, యాభయ్యేండ్లు ఎనుకకు పోయినా సరే, ఇక్కడ నికర జలాలకు తికానా లేక పోయినా సరే, అక్కడ మాత్రం మిగులు జలాకకు రయ్యి, రయ్యి మనుకుంట ప్రాజెక్టులు పూర్తయితయి. 

హైదరాబాదు ఉద్యోగాలను ఫ్రీజోను కింద మారుద్దమని సూస్తరు. దొంగ సర్టిఫికెట్లు తెచ్చి ఇక్కడి ఉద్యోగాల్ల దూరుతరు. ఇయ్యన్ని ఎవరో పోరగాల్లు చెప్పే ఉత్తుత్త మాటలు గాడు, గిరగ్లానీ అనేటాయన పరిశోధించి చెప్పిన మాటలు.

ఇయ్యన్ని ఒక ఎత్తయితే అధికారాన్ని అడ్డం పెట్టుకొని ఇక్కడి భూములు, జాగలు కబ్జా చేస్తరు. ఆ కబ్జాలు చేసుడు కూడా అభివృద్ధే నని కతలు చెప్పుతరు.

ఈ దోపిడీలను ఆపే పేరుతోటి 610 జీవోలను తీసినా, జలయజ్ఞాలను చేస్తున్నమని చెప్పినా, అన్నీ గూడ వాళ్ళ మేళ్ళ కోసమే పెట్టుకుంటున్నరని ప్రతి ఒక్కరికి తెలిసి పొయ్యింది. మీ 610 జీవోలు తెలంగాణా వాళ్ళను ట్రాన్స్ఫర్ చెయ్యడానికి మాత్రమె పనికొస్తయి. మీ జలయజ్ఞాలు పోతిరెడ్డిపాడు, పోలవరం కట్టేతందుకే పనికొస్తయి. అంతే గని వీటితోని తెలంగానోల్లకు వీసమెత్తన్నలాభముండదని ఇప్పటికే చాలా సార్లు రుజువైంది.      

ఇన్ని సంవత్సరాల తర్వాత తెల్సిన దేంది? ఆంధ్రా దోపిడీ దారుల అక్రమాలు ఆగిపోవాలంటే తెలంగాణా రాష్ట్రం ఏర్పాటు తప్ప వేరే మార్గం కనపడుత లేదు. ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటయితే అన్ని అద్భుతాలు జరుగక పోవచ్చు. కనీసం పక్కోడు వచ్చి ఆక్రమిస్తుంటే కొమ్ము కాసే ప్రభుత్వం ఉండదు. (ఒక వేళ ఉన్త్తడి అనుకున్నా సమైక్య వాదులకు నష్టం లేదుగా?). ఇక్కడి నిధులు పక్క రాష్ట్రంల కరసు పెట్టే అవకాశం ఉండదు. ఇక్కడి నీళ్ళకు పక్క రాష్ట్రంల ప్రాజెక్టులు కట్టే పరిస్థితి ఉండదు. ఆ విధంగ రాష్ట్రం విడిపోతే కొన్ని చాలా సమస్యలకు ఆటోమేటిగ్గా పరిష్కారాలు దొరుకుతయి.  

మరి ఇన్ని నిజాలు చూసుకుంట ఇంకా సమైక్యంగా ఉండాలె, మీకిష్టం లేక పోయినా మీతోటే కలిసుంటాం అనేటోళ్ళను ఏమనాలె? దురాక్రమణ దారులంటే తప్పేంది? ఆంద్రాల ఉన్న సామాన్య ప్రజలు, ఇక్కడి కొచ్చి బతుకుతున్న సామాన్య ప్రజలమీద ఇక్కడి వాళ్లకు కోపం లేదు. కాని తెలంగాణా ప్రజల ఆకాంక్షలను పట్టించుకోక, సమైక్యాంధ్ర అని మాట్లాడే వారు ఎవరైనా సరే తెలంగాణా వ్యతిరేకులు, దురాక్రమణ శక్తుల అనుకూలురు అనే మేం అనుకుంటం.    
          

అమెరికాకు ఆ హక్కు ఎవరు ఇచ్చారు?


ఉగ్రవాదాన్ని కానీ, ఒసామా బిన్ లాడెన్ చేసిన పనులను కానీ ఎవ్వరు సమర్ధించరు. (నిజానికి ఈ వాక్యం ఇక్కడ అప్రస్తుతం) ఐనా అమెరికా కు పాకిస్తాన్ భూభాగం మీదనుంచి ఆ దేశం అనుమతి లేకుండా రహస్య సైనిక చర్యలు చేబట్టే హక్కు లేదు  

అమెరికాకు ఈవిధమైన చర్యలకు పూనుకునే అధికారమిచ్చే అంతర్జాతీయ చట్టాలు ఎమన్నా ఉన్నాయా? కేవలం అగ్రరాజ్యమనే అహంకారం, తన ఆర్ధిక మరియు ఆయుధ బలాన్ని చూపి అన్ని మానవీయ సూత్రాలను, అంతర్జాతీయ న్యాయ సూత్రాలను తుంగలో తొక్కి, యదేచ్చగా వ్యవహరించడం సరైంది కాదు.

అమెరికా చేసింది సరైనదే అయితే,ఇదే విధంగా ఉగ్రవాద చర్యలకు గురైన ప్రతి దేశం ఆయా  తివ్రవాదులు తల దాచుకున్న దేశాలలో ప్రతి చర్యలు చేపట్టవచ్చు కదా? పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాద పిడితురాలైన భారత దేశానికి పాకిస్తాన్ పై యుదానికి దిగే అధికారం ఉంటుంది. అదే విధంగా, బంగ్లాదేశ్ లోనుంచి భారత్ లో ప్రవేశిస్తున్న ఉగ్రవాదులను ఆపడానికి బంగ్లాదేశ్ పై సైనిక చర్యలకు దిగవచ్చు కదా?

నిజానికి  తనకు అవసరమైనప్పుడు ఉగ్రవాదాన్ని పెంచి పోషించి ఆయ ప్రభుత్వాలను పడగొట్టి తనకు అనుకూలమైన ప్రభుత్వాలను ఏర్పాటు చేసిన  చరిత్ర అమెరికాదే. తన అధికారానికి అడ్డంకి  అనుకున్నప్పుడు, తన సరఫరాలకు అంతరాయం ఏర్పడుతున్నదనుకున్నప్పుడు, కార్పోరేట్ ప్రయోజనాలకు అవసరమైనప్పుడు ఉగ్రవాద బూచిని చూపించి తన బలగాలను దించి ఆయా దేశాలలో లక్షల సంఖ్యలో ప్రాణ నష్టానికి, విధ్వంసానికి పాల్పడిన చరిత్ర అమెరికాదే. 

అసలైన తెర్రోరిస్ట్, ప్రపంచానికి నిజమైన శత్రువు అమెరికానే. ఈవిషయం లో సరైన చర్చ జరగక పోతే, ఇదే విధంగా గుడ్డిగా అమెరికా ను సపోర్ట్ చేసుకుంటూ పోయినట్టయితే ఈరోజు ఆఫ్ఘానిస్తాన్, ఇరాక్ లో పరిస్థితే రేపు ఇతర దేశాలకు రాదని చెప్పలేము. ఉగ్రవాదానికి నిజమైన పరిష్కారం దానికి దారి తీసిన సమస్యల పరిష్కారమే కానీ సామ్రాజ్యవాద దాడులు  కాదు.