Tuesday, May 24, 2011

నడుస్తున్న చరిత్ర vs ఊహాజనిత వాదన

సమైక్యాంధ్ర ఉద్యమం ఊహాజనితమైన వాదనల తోటి కూడుకొని ఉన్నది. వాల్లు ఎంతసేపూ విడిపోతే ఎదురయ్యే ఇబ్బందుల గురించి మాట్లాడుతరు. విడిపోతే నక్సలైట్లు ప్రబలి పోతరు. విడిపోతే మతతత్వం పెరుగుతది. విడిపోతే కేంద్రంల వీకయి పోతం. ఇట్లా ఉంటయి వాళ్ళ వాదనలు. ఇటువంటి వాదనలు నోటికొచ్చినట్టు మాట్లాడేవే తప్ప వీటికి పునాది అని ఏదీ ఉండదు.

ఇక ప్రత్యేక వాదులు చెప్పుతున్నది? ఇప్పటి వరకు సమైక్య రాష్ట్ర చరిత్రల జరిగిన అవక తవకల గురించి. ఆ అవక తవకలన్నీ ఒక ప్రాంతానికే అనుకూలంగా ఉండి, ఆ ప్రాంతానికే మేలు చేసిన వైనం గురించి. అది గిరగ్లానీ కమిటీ కానియ్యండి, శ్రీకృష్ణ కమిటీ కానియ్యండి మరోటి కానియ్యండి. ఇప్పటికే అనేక సార్లు తెలంగాణాకి జరిగిన మోసాల గురించి పూస గుచ్చినట్టు చెప్పినయి. 

అంతే కాదు, కలిసినప్పుడు చేసిన ఒప్పందాలు వమ్మయినయి. తెలంగాణా రీజనల్ డెవలప్ మెంట్ ఫోరం రద్దయింది. ఇట్లా చెప్పుకుంటా పోతే ఎన్నో.

కృష్ణమ్మ దయతలచి వందలాది కిలోమీటర్లు తెలంగాణలో పారినా, సమైక్య పాలకుల దయదప్పడం వల్ల చుక్క నీరు కూడా తెలంగాణాకు దక్కదు. అయితే ఆ నీటిమీద హక్కే లేని రాయలసీమకు మాత్రం పదులకొద్దీ ప్రాజెక్టులు వెలుస్తయి. అసలు జలాలకు మొండి చెయ్యి. మిగులు జలాలకు మాత్రం పెద్దపీట. అది మన సమైక్యాంధ్ర పాలకుల నీతి. 

పైనించి మీది మెట్ట ప్రాంతం, నీళ్ళు మీకు ఎక్కవు అని చెప్పే గారడీ మాటలు రడీగనే ఉంటయి. నీరు మెట్టనించి పల్లానికి పారుతున్నప్పుడు తెలంగాణా మొత్తం మెట్టగానే ఉంటే అసలు తెలంగాణా నించి నీరే పారోడ్డు గదా అని అడిగితే సమాధానం ఉండదు.

అయినా మా రాష్ట్రంల మానీళ్ళు ఎట్లా పారించుకోవాల్నో మాకు తెలుసు, మధ్యలో ఒకరి పెత్తనం మాకు అవసరం లేదు. ఒకరితోని చెప్పించుకోనే అవసరం అంతకన్నా లేదు.

ఇక నిధుల విషయానికి వస్తే తెలనగాన భూములు అమ్ముకొని సంపాదించిన నిధులు ఆంధ్రల ఖర్చు పెడతరు. బీబీనగర్ నిమ్సు కట్టేటందుకు నిధులు ఉండయి. అదే కడప రిమ్సుకు వనదలాది కోట్లు నడుల్లాగా ప్రవహిస్తయి.

తెలంగాణా యూనివర్సిటీకి ముష్టి మూడు కోట్లు కేటాయిస్తే, వేమన యూనివర్సిటీకి మూడొందల కోట్లు కేటాయించ బడుతయి. 
బాసర IIIT రేకుల షెడ్లలో నడిపితే ఇడుపులపాయలో IIIT కి ఆధునిక భవంతులు తయారైతయి. యాభై ఏండ్ల చరిత్ర వదిలేస్తే కండ్ల ముందు చరిత్ర ఈరకంగ కనపడుతుంటే తెలంగాణల ప్రతి ఒక్కడు చైతన్యవంతం అయిండు. ఇప్పుడు ఇంకా ఏమాత్రం గారడీ మాటలు చెప్పి మసి పూసి మారేడు కాయ చేస్తమంటే నమ్మే పరిస్తితిల లేడు. 

మేం చెప్తున్నది గతించిన, నడుస్తున్న చరిత్రల జరిగిన, జరుగుతున్న అన్యాయాల గురించి. మీరు చెప్పుతున్నది విడిపోతే జరుగుతాయన్న భయాల గురించి. మేం మాట్లాడుతున్నది జరిగిన వాస్తవాల గురించి. మీరు మాట్లాడేది ఊహాజనితమైన విషయాల గురించి. గత యాభై ఐదు సంవత్సరాల చరిత్ర చూసినంక సమైక్య రాష్ట్రం మనకు పోసగదని తేలి పొయ్యింది. దానికి సరయిన పరిష్కారం రాష్ట్ర విభజన మాత్రమే.

ఎనకటికి ఎవరో భారద్దేశానికి స్వాతంత్రం ఇస్తే ఎట్లా పరిపాలించు కుంటరని ఒకాయిన అడిగిండట. ఎట్లనో ఒక రీతిల పరిపాలించుకుంటనే ఉన్నాం. ఒకని కింద బతికిన దానికన్నా మంచిగానే ఉంటున్నాం. ఇప్పుడు గూడ రాష్ట్రం విడిపోతే భూమి బద్దలై పోదు. ఆకాశం విరిగి నేలమీద పడదు. మాకంటే మీరే ఎక్కువ అభివృద్ధి చెందుతరేమో... తెలివైనోల్లు గద! మేం గూడ మీ అంత కాకపోయినా మా వనరులు మేం సరిగ్గ ఉపయోగించు కుంటం. రాష్ట్రం విడిపోయినా దేశంల ఉన్న పది పదిహేను రాష్టాల కన్నా మన రెండు రాష్ట్రాలు పెద్దగనే ఉంటయి. ఆ రాష్ట్రాలు అన్నీ ఎట్లా నడుస్తున్నాయో మనయి గూడ అట్లానే నడుస్తాయి. పెద్దగ ఉండి ఇప్పుడు పెద్దయింది లేదు, అట్లనే చిన్నగ ఉంటె అప్పుడు మనకు తరిగి పొయ్యేది లేదు.            
  

No comments:

Post a Comment