ఆ విషయం చెపుతూ వారొక దృష్టాంతాన్ని సెలవిచ్చారు. రోగికి చికిత్స చేసే విషయంలో కేవలం డాక్టర్లు మాత్రమే చర్చించాలి, ఇతరులు కనీసం ఆ వైపుకు కూడా రాకూడదు అని. మరి డాక్టర్లంటే కేవలం స్పెషలిస్ట్ లేనా, ఇతరులు కూడానా అన్న విషయం వారు వాకృచ్చ లేదు. సరే, వారూ వీరూ కూడా అనుకుందాం. ఈ విషయం బోధించారంటే వారొక పెద్ద వైద్య నిపుణులు కూడా అయి వుండాలి!
నేను వైద్యుడిని కాదు. కనీసం వైద్య సహాయకుడిని కూడా కాదు. కాకపొతే పేషెంటుగా బోలెడంత అనుభవం ఉన్న వాడినే. ఆ అనుభవంతో నేను తెలుసుకున్న విషయాలు ప్రస్తావిస్తాను. వైద్య చికిత్సకు రకరకాల మార్గాలుంటాయి. ఆ విషయం వారే చెప్పారు. చికిత్స కేవలం డాక్టర్లే చెయ్యరు, ఫిజియోలు, నర్సులు కూడా అందులో భాగస్వాములే. వాటికి సంబంధించిన ఏయే సౌకర్యాలు ఆస్పత్రిలో ఉన్నాయో చెప్పగలిగేది వారే. అలాగే డయాగ్నొస్టిక్స్ విషయం సరేసరి. ఇక పొతే అందించ వలసిన పరిశుభ్రత, ఉంచ వలసిన ప్రదేశం, ఇవ్వవలసిన ఆహారం... ఇల్లా అన్నీ పరిగణనలోనికి తీసుకొవలసిన అంశాలే. వీటన్నిటికి మించి వైద్యానికి కర్చు ఎంత అవుతుంది? అది పేషెంటు కుటుంబానికి అందుబాటులో ఉందా లేదా అన్న విషయం కేవలం కుటుంబ సభ్యులు మాత్రమే నిర్ణయించ గలిగే విషయం. ఇవన్నీ వదిలేసి కేవలం నిపుణులే చర్చించుకుని అలవికాని పద్ధతిని ప్రిస్క్రైబ్ చేస్తే ఎలా వుంటుంది?
ఇక భాష విషయం లోకి వద్దాం. భాషను భాషావేత్తలు తయారు చెయ్యలేదు, చేసింది ప్రజలే. కాకపొతే భాషావేత్తలు వాటికి నియమ నిబంధనలు సృష్టించి ఉండవచ్చు. అంత మాత్రాన భాషావేత్తలు అలవికాని కొన్ని నియమాలు పెట్టి జనం మీదకి వదిలేసి, "మేం ఈ నిబంధనలు పెట్టాం, కాబట్టి చచ్చినట్టు ఫాలో చెయ్యండి" అంటే ఎలా వుంటుంది? ఎవరు ఏ నిబంధనలు పెట్టినా చివరకు పాటించ వలసినది ప్రజలే కదా! ప్రజలకు తాము ఏమి కోరుకుంటున్నారో, తాము వాడే భాష ఎలా వుండాలో కూడా చెప్పుకునే హక్కు లేదా? భాష ఏ విధంగా వుంటే అది మరింత ప్రజల్లోకి వెళ్లి వృద్ధి చెందగలుగుతుందనే విషయం ప్రజలకన్నా ఎక్కువగా ఎవరికి తెలుస్తుంది? 'నీవు నిష్ణాతుడివి కాకుంటే చర్చించడానికి కూడా పనికిరావు' అన్నది ఏవిధమైన న్యాయం?
తెలుగులో పదాలు తయారు చేసుకునే వెసులుబాటు లేదు కాబట్టి సంస్కృతం పైనే ఆధార పడదామా? లేక తెలుగులో కూడా అలాంటి వెసులుబాటు ఏర్పాటు చేసుకుందామా? అటువంటి వెసులుబాటు చేసుకోవడానికి వీలేలేదని తీర్పు చెప్పేవారు ఏవిధమైన సాధికారతతో చెప్తున్నారు? ప్రస్తుత భాషలో కొత్త పదాలు తయారు చేసే సుళువు లేదని ఒప్పుకుంటూనే, దిగుమతి చేసుకున్న సంస్కృత పదాలు ఎబ్బెట్టుగా ఉన్నాయంటూనే, అటువంటి సుళువు కోసం తెలుగుభాషలో ప్రయత్నం కూడా చేయకూడదని శాసించడం ఏమిటో? ప్రయత్నమంటూ చేయకుండానే అసలు వీలే కాదని ఎలా తీర్మానం చేయగలరు?
బ్రాహ్మి లిపిలోని పత్రాలను పరిశోధించాలంటే బ్రాహ్మి లిపి కూడా నేర్చుకోవాలి కాని ఆ అక్షరాలను కూడా తెలుగులో చేరుస్తామంటే ఎలా వుంటుంది? అలాగే కొన్ని లుప్తమైన అక్షరాలు పాతకాలం తెలుగులో ఉంటే ఉండొచ్చు కాక, ఇప్పటి అవసరాలకు పనికి రాకపోయినా అందరికీ వాటిని ఒకటో క్లాసు నుండే నేర్పాల్సిన అవసరం ఏమిటి? పలకడానికి అలవికాని అక్షరాలను మొదటినుండి ఉన్నాయి కాబట్టి కొనసాగించాల్సిన అవసరం ఏమిటి? ఎన్ని సార్లు పలికినా వాటి మధ్య తేడా కనపడని అక్షరాలను రెండింటికి బదులు ఒకటే వాడితే వచ్చె నష్టమేమిటి?
ప్రజల్లోనుండి భాష పుడుతుంది. కాని భాషావేత్తల వల్ల దానికి నియమాలు ఏర్పడతాయి. ఆ నియమాలకు వీలైనంత సార్వజనీనత ఉండేలా జాగ్రత్త తీసుకుంటారు భాషావేత్తలు. లేకపోతె అది మరొక మృతభాషగా మారే ప్రమాదం వుంటుంది. ప్రజలు కాక పండితులే రాసిన వ్యాకరణాన్ని ప్రజల అవసరాలకోసం అదే పండితులు మరింత సరళతరం చేసి రాయడం ఎందుకు సాధ్యం కాదు? అదే సమయంలో కొత్త పదాలు తయారు చేయడానికి సంస్కృత భాషలో, లేదా ఆంగ్ల భాషలో ఉన్న వెసులు బాట్లను పరిశీలించి, తగు మార్పులను తెలుగులొ కూడా ఎందుకు చేయలేక పోతున్నాం? తమిళం, ఆంగ్లం ఇంకా అనేక భాషలు తమ పదాలు తామే చేసుకుంటున్నప్పుడు, మన భాషలు ఆ శక్తి లేదని ఒప్పుకుని మనం పక్కకు తప్పుకోవాలా?
ఇటువంటి ధోరణి అవలంబించే వేల సంవత్సరాలపాటు మన దేశంలో భాషను, సారస్వతాన్ని తొంబై శాతం ప్రజలకు అందకుండా విజయవంతంగా అడ్డుకోవడం జరిగింది. దాని ఫలితంగానే అనేక విషయాల్లో పాశ్చాత్యుల కన్నా మనం వెనుకపడి పోవడమూ జరిగింది. ప్రజాస్వామ్యం వచ్చి అరవై ఏళ్లైనా ఇప్పటికీ కొందరు ఇంకా అటువంటి భావజాలాన్నే ప్రదర్శించడం శోచనీయమైన విషయం.