Tuesday, July 22, 2014

స్థానికత వివాదం

తెలంగాణా ప్రభుత్వం మీద ఏ విధంగా దండయాత్ర చేద్దామా అని మధన పడుతున్న సీమాంధ్ర నాయకులకు, మీడియాకు ఆ ప్రభుత్వం కొత్తగా ప్రవేశ పెట్టిన విద్యార్థుల ప్రవేశ రుసుము సహాయ పథకం (FAST) ఊతమిచ్చింది.

ముఖ్యంగా ఆర్ధిక సహాయానికి 1956ను కొలబద్ద చేయడంతో సీమాంధ్ర మీడియా అగ్గికి ఆజ్యం పోసినట్టయింది. అలా కాక ఇప్పుడున్న స్కీమునే అమలు చేస్తే 39000 సీమాంధ్ర విద్యార్థులకు తెలంగాణలో ఉచిత చెల్లింపులు జరపాలి. ఉమ్మడి రాజధాని కావడం వలన కొన్ని వేలమంది ఉద్యోగులు తెలంగాణాలో నివసిస్తూ ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వంలో పని చేస్తున్నారు. వారి పిల్లలకి తెలంగాణా ప్రభుత్వం ఎలా ఫీజులు చెల్లిస్తుంది?

అలాగే గత ఎన్నికల్లో సుమారు ఐదు లక్షలమంది ఇటు తెలంగాణలో, అటు సీమంధ్రలో కూడా వోటు వేశారని వార్తలు వచ్చాయి. ఏపీలో పౌరసత్వం కొనసాగిస్తున్న వారికి తెలంగాణలో ఫీజు పథకం లబ్ది చేకూర్చడం ఎంతవరకు సబబు?

తెలంగాణా ప్రభుత్వానికి ఉదారంగా విద్యాదానం చేసే ఆర్థిక వెసులుబాటు గాని, అవసరం గాని లేవు. ఇది దగా పడ్డ తెలంగాణాని పునర్నిర్మించాల్సిన సమయం. రాష్ట్రానికి చెందిన ప్రతి పైసా అందుకోసం మాత్రమే వినియోగించాలి తప్ప దానధర్మాలకు కాదు.

ఇంత చెప్పినప్పటికీ, నాక్కూడా ఎందుకో 1956వ సంవత్సరాన్ని స్తానికతకు కొలబద్దగా తీసుకోవడం హేతుబద్ధంగా కనిపించడం లేదు. తన పథకాల లబ్దిదారులను నిర్వచించుకునే పూర్తి హక్కు తెలంగాణా ప్రభుత్వానికి ఉన్నప్పటికీ, 1956ని కొలబద్ద చేయడం వల్ల కొంతమంది నిజాయితీగా తెలంగాణాలో స్థిరపడ్డ బీదవారికి నష్టం చేకూరే విధంగా వుంది.

దానికన్నా పధకాన్ని "TELANGANA CITIZENS' CHILDREN EDUCATION ASSISTANCE" గా మార్చి తండ్రి స్థానికతను బట్టి ఆర్ధిక సహాయం చేస్తే బాగుంటుందని KCR గారికి నా సూచన.

No comments:

Post a Comment