బతుకమ్మ పండుగ ఘనంగా జరిగింది. తెలంగాణా ఉద్యమంలో బతుకమ్మ పండుగ మరువలేనిది. అది ప్రజల సాంస్కృతిక మూలాలను గుర్తుకు తెచ్చింది. బహుశా ఆ కారణం చేతనే కావచ్చు ప్రజలు పండుగ చేసుకోవడం కూడా అప్పటి ప్రభుత్వానికి నచ్చలేదు. అందుకని ట్యాంక్ బండ్ మీద బతుకమ్మ ఆడడానికి అప్పటి ప్రభుత్వం ఒప్పుకోలేదు. కోర్టుకు వెళ్లి మరీ పర్మిషన్ తీసుకోవలసి వచ్చింది ప్రతీసారి. స్వాతంత్ర్యోద్యమంలో ఉప్పు సత్యాగ్రహం, రాట్నం వడకడం భాగమైనట్టు తెలంగాణా ఉద్యమంలో బ్రతుకమ్మ ఆడడం కూడా భాగమైంది.
ఉద్యమ ఫలితంగా ఇప్పుడు రాష్ట్రం ఏర్పడింది. తెలంగాణా రాష్ట్రంలో బతుకమ్మ పండుగకు ప్రభుత్వ ప్రోత్సాహం బాగా ఉంటుందన్న విషయం ఊహించనిదేమీ కాదు. అనుకున్నట్టే కెసిఆర్ ప్రభుత్వం పది కోట్ల రూపాయలు కేటాయించి అద్భుతమైన రీతిలో బతుకమ్మ ఉత్సవాలు నిర్వహించింది. ముఖ్యంగా ట్యాంక్ బండ్, నెక్లెస్ రోడ్డులో నిర్వహించిన ఉత్సవాలు నభూతో అన్నట్టుగా ఉన్నాయి.
నాకు వీలు చిక్కక ట్యాంక్ బండ్ వెళ్ళలేదు. టీవీలో చూడడమే జరిగింది. అయితే నగర శివార్లలోని ఒక గ్రామపంచాయితీ లో బతుకమ్మ వేడుకలలో మా కుటుంబంతో సహా పాల్గొనడం జరిగింది. ఊళ్ళోని ప్రభుత్వ పాటశాల మైదానంలో పండుగ నిర్వహించారు. ప్రభుత్వం డబ్బులు మంజూరు చేయడం వల్ల ఇదివరకంటే ఏర్పాట్లు బాగున్నాయి. దగ్గరలో నీటి వసతి లేక పోవడం వల్ల ఆవరణ లోనే ఒక చిన్న జలాశయాన్ని నిర్మించారు. అందువల్ల స్త్రీలకు బతుకమ్మలను నిమజ్జనం చేసుకోవడం ఎంతో సౌకర్యవంతంగా మారింది. ఈ పధ్ధతి ప్రతి చోటా అమలు పరిస్తే బాగుంటుంది. చెరువులు, కుంటలు ఉన్న చోట వాటికి మెట్లు నిర్మిస్తే చాలు.
ఇక పొతే చిన్ననాడు మా వూరిలో చూసిన బతుకమ్మ పండుగకు దీనికి పోలికే లేదు. అప్పటిలా పాటలు పాడుకోవడం కనిపించ లేదు. 10000 వాట్ల లౌడ్ స్పీకర్లతో వచ్చే పాటల హోరులో పాటలు పాడుకుందా మనుకున్న వారికి కూడా వీలు కాకుండా వుంది. అంతకన్నా ఎవరి పాటలు వారినే పాడుకోనిస్తే బాగుంటుందేమో అనిపించింది. బతుకమ్మ ఆటలో భాగంగా పాటలు ప్రిపేర్ చేసుకుని వచ్చిన వారు కొంత నిరాశకు గురైనట్టు కనిపించారు. పాటలు పాడకుండా ఊరికే ఆడవలసి వచ్చినందుకు కొంత విసుగు చెందినట్టు వారి మాటల వల్ల తెలిసింది.
ఈ సందర్భంగా ఇంకో విషయం కూడా తప్పనిసరిగా చర్చించుకోవాలి. బతుకమ్మ పండుగ ఆవరణలో పెద్ద స్టేజీ నిర్మించి అన్ని పార్టీల రాజకీయ నాయకులు పరివేష్టించి, స్పీచులు దంచడం, బతుకమ్మలాటను వీక్షించడం... మైకులో రన్నింగ్ కామెంటరీలు, ఆడే మహిళలకు ఇబ్బంది కలిగించే విషయం. పండుగలో రాజకీయ జోక్యం పెరగడం వల్ల వచ్చిన సైడ్ ఎఫెక్ట్ అది. అలాగే వారిని సంతోష పరచడానికన్నట్టు తీన్ మార్ డ్యాన్సులు, తీన్ మార్ పాటలు పెద్ద సౌండ్ తో పెట్టడం కూడా బతుకమ్మ ఆడే స్త్రీలకూ అసౌకర్యాన్ని కలిగించాయి. ఇది చూస్తె మరోరకమైన రికార్డింగ్ డ్యాన్సుల సంస్కృతీ పెరిగి పోతుందేమోనన్నభయం కలిగింది. రాజకీయులు ఏర్పాట్లు మాత్రం చేసి పండుగకి దూరంగా ఉంటేనే మంచిది. ఈ అనుభవాలను దృష్టిలో పెట్టుకొని భవిష్యత్తులో పండుగ ఏర్పాట్లలో కొన్ని మార్పులు తీసుకొని రావాల్సిన అవసరం వుంది.
No comments:
Post a Comment