Saturday, January 4, 2014

దోపిడీ యావ తప్ప చర్చించే చేవ ఏది?

ఛీ... మాంధ్ర నాయకుల్లారా!!!

మీకు ప్రజాస్వామ్యం మీద నమ్మకం లేదు. రాజ్యాంగం పై విశ్వాసం లేదు. రాష్ట్రపతి మీద గౌరవం లేదు.

అసెంబ్లీకి తెలంగాణా బిల్లు వస్తే దానిమీద చర్చించి అందులో లోపాలు వెలికి తీసే దమ్ము లేదు.  అవునులే మంద బలం పోగేసుకొని ఇన్నాళ్ళు తేరగా తెలంగాణా మీద పది మెక్కి తినడం తప్ప మీకు ఇంకేమి తెలుసు గనక?

ఆ మందబలంతోనే ఇబ్బడి ముబ్బడిగా మీ వైపు ప్రాజెక్టులు కట్టు కుంటిరి.  వాటి మీద పండిన పంటలతో కోట్లకు పడగ లెత్తితిరి. ఆ డబ్బులతో తెలంగాణా భూములను స్వాహా చేస్తిరి. అవే డబ్బులతో అవినీతి చేసి తెలంగాణా ఉద్యోగాలను, కాలేజీ సీట్లను, అన్ని రకాల అవకాశాలను కొల్లగొడితిరి.

అందుకే  తేరగా తినమరిగిన మీకు తేనెపట్టులా వున్న తెలంగాణా ఇప్పుడు విడిపోతుంది అనేసరికి ఎక్కడ లేని దుఃఖం రాబట్టింది! మెదడు పని చేయడం మాని వేసింది!! తలా తోకా లేని పిచ్చి వాగుడు మొదలైంది.

మీకు మెజారిటీ వుంది కాబట్టి అది ప్రజాస్వామ్యమా? మైనారిటీ ప్రజల ఆకాంక్ష ప్రజాస్వామ్యం కాదా? మరి మీకన్నా మెజారిటీ గా వున్న తమిళ ప్రజలు నాడు కూడదంటే ఎందుకు విడిపోయి వచ్చారు? రాజ్యాంగం లో వున్నఆ  ఆర్టికల్-3 పెట్టిన భిక్ష వల్ల కాదా? ఇప్పుడు అదే ఆర్టికల్-3 పనికిరానిదైందా?

విభజనకు ఒప్పుకొని, వాగ్దానాలు చేసి, తెలంగాణా ప్రజల ఓట్లు కాజేసిన మీరు, అదే ప్రజలు గత పదేళ్లుగా విభజన తీర్మానం చేయమని కోరినా మోసపూరితంగా మొండి చెయ్యి చూపిన మీకు, ఇప్పుడు సమైక్య తీర్మానం కావలసి వచ్చిందా? మందబలం మీకే ఉందిగా? మరి ఆ సమైక్య తీర్మానం అప్పుడే  ఎందుకు చేయలేదు? మీ మోసాలు బయట పడతాయనే గదా? మీకు ఓట్లు, సీట్లు రావనే గదా?

ముఖ్యమంత్రి మీ వాడే. స్పీకరు మీవాడే! రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు, ప్రధాన ప్రతిపక్ష నాయకుడు మీవాడే! అయినా తృప్తి లేదు! ఏదో ఊడబొడిచేస్తాడేమోననే అనుమానంతో శాసన సభా వ్యవహారాల మంత్రిని కూడా తప్పించి రాజ్యాంగం మీద ఆవగింజంత అయినా విశ్వాసం లేని కరడు గట్టిన సమైక్యవాదిని ఆ స్థానంలో ప్రతిష్టించు కున్నారు! అయినా కూడా అసెంబ్లీలో చర్చించే ధైర్యం రావడం లేదు!!

మాట మాట్లాడితే బిల్లు తప్పుల తడక అంటరు. బిల్లులో తప్పులేమిటో చెప్పమనే గదా మిమ్మల్ని చర్చకు పిలిచింది?

అవునులే! దోపిడీ సొమ్ము తినడం తప్ప మరోటి తెలియని మీరు ఏమి చర్చించ గలరు? ఏమి సూచనలు చేయ గలరు?

విభజన తర్వాత కూడా దోపిడీలు యధేచ్చగా చేసుకోనిమ్మని అడగగలరా?

తెలంగాణా భూములను ఎండబెట్టి అర్హత లేని ప్రాంతాలకు అదనపు జలాలిమ్మని అడగగలరా?

తెలంగాణా ప్రాంతపు ఉద్యోగాలు కూడా మేమే చేస్తామని అడగగలరా?

తెలంగాణా కాలీజీల్లో కూడా మేమే చదువులు వెలగ బెడతామని చెప్పగలరా?

విభజన తర్వాత కూడా యధేచ్చగా (తెలంగాణా ప్రాంతంలో) ఫాక్షనిజం, కబ్జాలు చేసుకోవడానికి అనుమతి అడగ్గలరా?

ఇవన్నీ అడిగితే ప్రపంచం మొత్తం మీద మీ పరువు పోతుంది. అవి తప్ప మీరు అడగలిగిన విషయాలూ, బిల్లులో మార్పు చెయ్యదగిన సూచనలూ ఇంకేమీ మీ మనస్సులకు తట్టవు మరి!

అందుకే మీరు సభలో చర్చించ లేరు! సజావుగా చర్చకు రాలేని మీరు చేయగలిగిన ఒకే ఒక పని... దుశ్శాసనున్ని తలపించే విధమైన కౄర వికటాట్టహాసాలు.... ద్రౌపదీ వస్త్రాపహరణాన్ని తలపించే విధమైన బిల్లు కాగితాల చింపివేత!

మీ వికృత విన్యాసాల వల్ల సాధించ గలిగింది ఏమీ లేదు! జనవరి 23 తర్వాత బిల్లు దానంత అదే మాంత్రికుడి చెరలోని రామచిలక వలె విముక్తి చెంద బోతోంది! ఆ తర్వాత మీరు చేయగలిగింది శూన్యం. కాని ఆ లోపు సజావుగా చర్చ జరిపి సీమాంధ్ర ప్రజల న్యాయమైన కోర్కెలు వెల్లడించే చారిత్రిక అవకాశాన్నికోల్పోవడం, ఆ ప్రాంత ప్రజలు మీవంటి భక్షకులను ఎన్నుకున్నందుకు చేసుకున్న స్వయంకృతాపరాధం!!

ధర్మో రక్షతి రక్షితః 

No comments:

Post a Comment