Monday, February 27, 2012

దొందూ దొందేనా?



తెలంగాణా ప్రజలను మోసం చేయడంలో ఎక్కువా, తక్కువా అని లేకుండా కాంగ్రేసు, తెలుగుదేశం ఇప్పటివరకూ సమాన భూమిక నిర్వర్తించాయి.

ఈ రెండింటిలో ఏది పెద్ద శత్రువు? అనే ప్రశ్న వచ్చినప్పుడు జవాబు చెప్పడం కొంత కష్టతరమే. మానిఫెస్టోలో తెలంగాణా అంశాన్ని పెట్టి ఎన్నికల తర్వాత చంద్రబాబు తెప్ప తగలేస్తే, ఇచ్చేదీ తెచ్చేదీ మేమే నని తెలంగాణా అంతటా ప్రచారం చేసుకొని, తెలంగాణాలో పోలింగు పూర్తయిన మరుక్షణమే తెలంగాణా ఏర్పడితే వీసా తీసుకుని వెళ్లాని వక్కాణించిన ప్రభుద్దుడు మరొకడు. ఈ రెండు పార్టీలు తమకు చేసిన మోసాలు మరిచిపోవడానికి తెలంగాణా ప్రజలకు ఇంకో శతాబ్దమైనా సరిపోదు.


ఈ నేపథ్యంలో ఈ రెండింటిలో తెలంగాణా ప్రజలకు ఎక్కువ శత్రువు ఎవరన్నది బేరీజు వేయడం కొంచెం కష్టమైన పనే. ఈ రెండు పార్టీలు కూడా తెలంగాణా ప్రజలను నమ్మించి మోసం చేశాయి. రెండు పార్టీలు కూడా తమ ఎన్నికల అవసరాల కోసం తెలంగాణా అంశాన్ని వాడుకున్నాయి. తెలంగాణా ప్రజల భావోద్వేగాలతో చెలగాటమాడాయి. ఇప్పుడు తెలంగాణా ప్రజల వంతు వచ్చింది.


తెలంగాణా ప్రజలకు సంబంధించి ఈ రెండు పార్టీలు, సమాన శత్రువులే. కాక పోతే ఈ రెండు పార్టీల విధానాల్లో గుణాత్మకమైన విలక్షణత వుంది.


జాతీయ పార్టీ అయిన కాంగ్రేసుకు తెలంగాణా ఇవ్వడంవల్ల జాతీయ స్థాయిలో పెద్దగా పోయే దేమీ లేదు. ఇన్నాళ్ళు సమస్యను ముదిర్చి పాకాన బెట్టిన తర్వాత, తిరిగి అదే సమస్యతో రాష్ట్రంలో అధికారం వోట్లు తెచ్చుకునే అవకాశం ఎటూ లేదు. ఆ విషయం ఆ పార్టీకి కూడా తెలుసు. ఇక రాష్ట్రం ఇస్తేనే 'చిన్నరాష్ట్రాలకు తాము అనుకూలం' అంటూ ఉత్తర ప్రదేశ్ వంటి రాష్ట్రాల్లో అది చేసుకుంటున్న ప్రచారాలకు ఊతం దొరుకుతుంది. కాక పోతే ఆంధ్రా నాయకుల వ్యతిరేకతే అది ఏ నిర్ణయాన్ని తీసుకోక పోవడానిక్ ముఖ్యకారణం.

జాతీయ అవసరాలకు పెద్ద పీట వేయాల్సిన అవసరం కనుక వస్తే, అది ఈ వినాయకుల అడ్డంకులను ఏమాత్రం ఖాతరు చేయదు. పైగా దాని పక్కలో బళ్ళెంలా BJP అధికారంలోకి వస్తే మేం తెలంగాణా ఇస్తాం అని ఇప్పటికే ప్రచారం మొదలు పెట్టింది. పార్టీ పరంగా జాతీయ దృక్కోణంలో చూస్తే ఆ పార్టీకి తెలంగాణాను అడ్డుకోవలసిన అవసరం అంతగా కనిపించదు.

కానీ తెలుగుదేశం పరిస్థితి దానికి పూర్తిగా భిన్నం. ఆ పార్టీ పుట్టినప్పటినుండి తెలంగాణా నుండి ఏ ఒక్క వ్యక్తిని కూడా పార్టీ అధ్యఖ పదవి గాని, ముఖ్యమంత్రి పదవిగాని వరించిన చరిత్ర లేదు. ఇంకో యాభయ్యేళ్ళ తర్వాత కూడా ఆ పదవులు తెలంగాణా ప్రాంతానికి చెందినా వ్యక్తులకు దక్కుతాయని ఊహించలేం. తెలంగాణా ప్రాంతం వారిని పాలితులు గాను, తమను తాము పాలకులు గాను భావించడం సహజ న్యాయమని భావించే పార్టీ అది.


ఆ పార్టీ మనుగడే రాష్ట్ర ఐక్యతతో ముడివడి వుంది. అటువంటి పార్టీ రాష్ట్రవిభజనను కలలో కూడా ఊహించ లేదు. విభజనను ఆపడానికి అది సాయశక్తులా ప్రయత్నాలు చేస్తుంది. అందుకోసం చివరి నెత్తుటిబొట్టు వరకూ పోరాడుతుంది. ఆ కారణంగానే తెలంగాణా ప్రజలు ఆ పార్టీ ఎడల అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం వుంది.


గత పన్నెండు ఉప ఎన్నికల్లో సంపూర్ణంగా డిపాజిట్లు కోల్పోయి, అచేతనమై పోయిన తెలుగుదేశం పార్టీ, తన తైనాతీ మీడియా సపోర్టుతో, ధన బలంతో తిరిగి తెలంగాణా మీద పట్టు సంపాదించాలని కలలు కంటుంది. సహజంగానే తెలంగాణా ప్రజల విచక్షణా శక్తిపై ఆ ఆపార్టీకి అమితమైన చులకన భావం. కానీ తెలంగాణా ప్రజలు ఆ పార్టీ నేత అనుకుంటున్నట్టు ఊహలకు అందనటువంటి రాజకీయ చైతన్యం గలవారు. ఈసారి ఎన్నికల్లో తిరిగి లేవకుండా నడ్డి విరుస్తారనడంలో ఏమాత్రం సందేహం అవసరం లేదు. 


Sunday, February 26, 2012

తెలుగుమోసం


మహాకూటమిలో చేరినందుకే
బాబుగారు ఓడిపోయారట!
నిజమే కావచ్చు
బాబు తెలంగాణా తెస్తాడని
మా జనం నమ్మలేదు
ఆయన మాటల గారడీ
ఆంధ్రోల్లకూ నచ్చలేదు
అందుకే ఓడాడేమో
అబద్ధాల బాబు

అంతగా తెలంగాణా వాదం లేదు కాబట్టి
అసెంబ్లీలో మాట్లాడనంటున్న బాబూ,
అదే నిజమనుకుంటే
ఆరు ఉప ఎన్నికల్లో
సమైక్యవాద నినాదంతో పోటీ చెయ్
కనీసం డిపాజిట్ కోసం ట్రై చెయ్
అప్పుడు తెలుస్తుంది
తెలంగాణా వాదమంటే ఏంటో

పొద్దున్న
పార్టీ ఆఫీసులో ఆంధ్రోల్ల పాదపూజ
మధ్యాహ్నం
ప్రెస్సులో తెలంగాణా వాదులపై అవాకులు
సాయంత్రం
ప్రజల ముందు తెలంగాణా వాదం
ఇదీ
తెలుగు తమ్ముళ్ళ దినచర్య!

Thursday, February 23, 2012

విచిత్రం


పేరులో మహాసభా
పేర్లకు పదిమందీ
కలిగిన ఓ గుంపు
చెప్పే విషయాలు
తప్పుడువైనా సరే
ఇష్టం లేకపోయినా
కోట్లాది మంది వినాలట
గొర్రెల్లా తలూపాలట!
అదే కోట్లాది మంది
ఒకే గొంతుతో
చెప్పే మాటలు మాత్రం
వారికి వినపడవట!
 
  

Wednesday, February 22, 2012

కృష్ణా నదీ జలాల మళ్లింపునకు మహా కుట్ర



కృష్ణా జలాలపై ఇది మరో కుట్ర కోణం! నదిపై వంతెన కట్టాలన్న ప్రజల ఆకాంక్షలో సైతం సీమాంధ్ర ప్రయోజనం చూసుకున్న పాలకుల దుర్నీతి! ఆ దుర్నీతి ఏ స్థాయిలో ఉందంటే.. బాబ్లీని మరిపిస్తూ.. శ్రీశైలం డ్యామ్ రిజర్వాయర్‌లో మరో డ్యామ్ కట్టాలనేంత! డ్యామ్‌లో మరో డ్యామ్ కట్టడం ఏమిటన్న ఓ ఆంధ్రాప్రాంత అధికారి.. దాన్ని ఓ మతిలేని ప్రతిపాదనగా పేర్కొంటూ కొట్టిపారేశారు! కానీ.. సీమాంధ్ర నేతలు అటు నుంచి నరుక్కొచ్చారు. కొత్త టీమ్ ఏర్పాటు చేసుకుని.. హైదరాబాద్ నుంచి ఆత్మకూర్ వరకూ రోడ్డు వేసి.. మధ్యలో నందికొట్కూరు వద్ద కృష్ణా నదిపై బ్రిడ్జ్ కమ్ వీయర్ కట్టాలని మరో ప్రతిపాదన తీసుకువచ్చారు. తద్వారా శ్రీశైలంలో నీళ్లు ఉన్నా లేకున్నా రాయలసీమకు మాత్రం ఎల్లప్పుడూ 50 టీఎంసీల నీటిని అందుబాటులో ఉంచుకునేలా పథకం వేశారు!


ఇప్పటికే పోతిడ్డిపాడు మొదలు.. అవుకు, గండికోట, చిత్రావతి, వెలిగోడు, బ్రహ్మంగారిమఠం, తెలుగుగంగ దాకా వందల టీఎంసీలు తరలించుకుపోతున్న సీమాంధ్ర పెద్దలు.. ఇప్పుడు మరో 50 టీఎంసీలకు గుట్టు చప్పుడు కాకుండా టెండర్ పెట్టారు. మత్తడి నిర్మాణం జరిగితే.. అంతకు మించిన స్థాయిలోనే నీళ్లు తరలించుకుపోయే అవకాశం లేకపోలేదన్నది తెలంగాణ జల నిపుణుల వాదన!

కృష్ణా నదీ జలాలను అక్రమంగా దారి మళ్లించేందుకు ప్రభుత్వంలోని పెద్దలు మహాకుట్రకు రంగం సిద్ధం చేశారు. ఈ ప్రతిపాదన బయటకు పొక్కకుండా గుట్టుచప్పుడు కాకుండా తెర వెనుక శక్తులు జాగ్రత్తలు తీసుకున్నాయి. శ్రీశైలం ప్రాజెక్టులోకి నీరు చేరకముందే వాటిని రాయలసీమకు తరలించడమే కుట్ర వెనుక ప్రధాన ఉద్దేశంగా కనిపిస్తోంది. పోతిడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ ద్వారా సమృద్ధిగా నీళ్లు తీసుకుంటున్నా, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌డ్డి హయాంలో ఈ కుట్రకు బీజం పడింది. 2007 జనవరి 1న సింగోటం లక్ష్మీనర్సింహ బ్రహ్మోత్సవాలకు వస్తూ పుట్టి మునిగిపోయిన ప్రమాదంలో 61 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటన నేపథ్యంలో అక్కడ ఒక వంతెన కట్టాలన్న డిమాండ్ ముందుకు వచ్చింది. దీన్ని అవకాశంగా తీసుకున్న సీమాంధ్ర పాలకులు.. వంతెన కాకుండా శ్రీశైలం డ్యామ్‌లో మరో డ్యామ్ కట్టాలని తొలి ప్రయత్నం చేశారు.

తద్వారా నదిపై రవాణా మార్గాన్ని ఏర్పాటు చేసినట్లు అవుతుంది.. పనిలోపనిగా నీటిని సీమాంధ్రకు తరలించుకుపోయేందుకూ వీలు కలుగుతుందని ఈ పథకం వేశారని విమర్శలున్నాయి. అయితే.. డ్యామ్‌లో మరో డ్యామ్ కట్టాలన్న తొలి ప్రయత్నాన్ని ఆంధ్ర ప్రాంతానికి చెందిన ఇంజినీర్ ఇన్ చీఫ్ ఒకరు మతిలేని ప్రతిపాదనగా కొట్టిపారేశారు. మొదటి ప్రతిపాదన గురించి తెలిసిన అధికారులందరినీ బదిలీ చేసి కొత్త టీమ్ ద్వారా కుట్రను సాకారం చేసేందుకు రాయలసీమ బడానేతలు పావులు కదిపారు. ఈ ఫైల్ ప్రస్తుతం ప్రభుత్వ ఆమోదం కోసం సిద్ధంగా ఉంది. దీనికి ఆమోదం లభిస్తే.. తెలంగాణ,కృష్ణా డెల్టా పంటలపై తీవ్ర ప్రభావం చూపనుంది. ఈ తతంగానికి సంబంధించిన ఆధారాలను ‘టీ న్యూస్’ సేకరించింది.

ఈ మహా కుట్ర పూర్వాపరాలను పరిశీలిస్తే...


అసలు కధకు బీజం...
శ్రీశైలం డ్యామ్‌లో మరో డ్యామ్ కట్టడం ద్వారా రాయలసీమకు 50 టీఎంసీల కృష్ణా జలాలను కేటాయించాలని అప్పటి ఆత్మకూర్ ఎమ్మెల్యే, ప్రస్తుత న్యాయ శాఖ మంత్రి ప్రతాప్‌డ్డి 15-12-200న అప్పటి సీఎం వైఎస్‌కు వినతి పత్రం ఇచ్చారు. శ్రీశైలం రిజర్వాయర్ ఫోర్‌షోర్ (డ్యామ్ వెనుక నీళ్లు నిల్వ ఉండే ప్రాంతం)లో మరో డ్యామ్ కట్టడం ద్వారా శ్రీశైలానికి వచ్చే కృష్ణా జలాలను ముందుగా రాయలసీమలోని జిల్లాలకు తరలించుకోవటం ఈ ప్రతిపాదన వెనుక అసలు రహస్యం. ఈ వినతి పత్రంపై సీఎం స్పెషల్ సెక్రటరీ నుంచి ఇరిగేషన్ కార్యదర్శి ఆదిత్యనాథ్‌దాస్‌కు 26-12-200న 124/0 నెంబర్‌తో ఒక లేఖ వచ్చింది. ఈ ప్రతిపాదనను పరిశీలించిన దాస్, తగిన సిఫారసులను ఈఎన్‌సీ ఇరిగేషన్ ద్వారా పంపాలని శ్రీశైలం చీఫ్ ఇంజినీర్‌కు 2-1-2009న మెమో పంపారు.

ఈలోగా సార్వత్రిక ఎన్నికలు రావడం, ప్రమాదంలో వైఎస్ చనిపోవడంతో ఫైల్ పెండింగ్‌లో పడింది. మళ్లీ పెద్దలు రంగంలోకి వచ్చి, ఫైల్‌పై ఆరా తీశారు. రిట్మైంట్‌కు దగ్గర్లో ఉన్న అప్పటి శ్రీశైలం చీఫ్ ఇంజినీర్ కొన్ని సిఫారసులు చేశారు. కృష్ణా నీటిలో ఆదా అయిన వాటిని ఈ డ్యామ్ ద్వారా ఉపయోగించుకోవచ్చని, పోతిడ్డిపాడు మీద ఆధారపడిన ప్రాజెక్టులన్నింటికీ ఉపయోగపడే పద్ధతిలో దీన్ని క్యారీ ఓవర్ రిజర్వాయర్‌గా వాడుకోవచ్చని పేర్కొంటూ 21-5-2011న ఈఎన్‌సీ ఇరిగేషన్‌కు లేఖ రాశారు. ఈ రికమండేషన్ చేసిన సదరు చీఫ్ ఇంజినీర్‌కు ఈఎన్‌సీగా పదోన్నతి లభించింది. ఈ ప్రతిపాదనను ఆంధ్ర ప్రాంతానికి చెందిన అప్పటి ఈఎన్‌సీ బీఎస్‌ఎన్ రెడ్డి గట్టిగా వ్యతిరేకిస్తూ ‘ఒక డ్యామ్‌లో ఇంకో డ్యామ్ కట్టడం ప్రపంచంలో ఎక్కడా లేదు. ఈ ప్రతిపాదన మతిలేని వారు (అన్‌మైండ్‌ఫుల్) చేసేది’ అని నోట్ రాసి దాస్‌కు 2-6-11నలేఖ రాశారు. ఇదే విషయాన్ని మంత్రి వ్యక్తిగత కార్యదర్శికి దాస్ అనఫీషియల్(యూవో)నోట్ రాశారు. అలా.. కృష్ణా జలాల అక్రమ తరలింపునకు తొలి యత్నం ఆగిపోయింది.

రెండో సారి బ్రిడ్జి లాంటి బ్యారేజీ ప్రతిపాదన
డ్యామ్‌లో డ్యామ్ కట్టడం అన్న విషయంలో వివాదం తలెత్తే అవకాశముందని భావించి ఈసారి హైదరాబాద్ టు ఆత్మకూర్ రోడ్డు నిర్మాణాన్ని తెర మీదకు తీసుకొచ్చారు. గతంలో జరిగిన పడవ ప్రమాదాన్ని ప్రస్తావించారు. దూరాభారం తగ్గిపోతుందని చెప్పారు. ఇక్కడే మళ్లీ ‘మహాకుట్ర’కు రంగం సిద్ధం చేశారు. హైదరాబాద్ నుంచి ఆత్మకూర్ వెళ్లాలంటే కర్నూలు జిల్లా నందికొట్కూరు వద్ద కృష్ణా నది పారుతూ ఉంటుంది. అక్కడ ‘సిద్ధేశ్వర్ వీయర్ కమ్ బ్రిడ్జి’ నిర్మించడానికి అవసరమైన డిటేయిల్ ప్రాజెక్టు రిపోర్టు పంపాలని కర్నూలు చీఫ్ ఇంజినీర్‌కు ప్రభుత్వం నుంచి 10-3-2011న లేఖ వెళ్లింది. సిద్ధేశ్వరం దగ్గర వీయర్ వల్ల కలిగే లాభాలను పేర్కొంటూ చీఫ్ ఇంజినీర్, ఈఎన్‌సీ కమిటీకి లేఖ రాశారు.

ఆయకట్టుకి నికర జలాలు ఇవ్వగలుగుతాం, తాగునీరు ఇవ్వచ్చు, శ్రీశైలం వరద నియంత్రణ సులభం అవుతుంది, కర్నూల్-మహబూబ్‌నగర్ మధ్య దూరం తగ్గుతుంది, బ్రిడ్జి వల్ల 50 టీఎంసీలు నిల్వ చేసుకోవచ్చు, ఇదంతా కేవలం రూ.300 కోట్లతో చేసుకోవచ్చు.. అని అందులో పేర్కొన్నారు. చీఫ్ రికమండేషన్స్‌ను పరిశీలించిన ఈఎన్‌సీ కమిటీ శ్రీశైలం అటువైపు నీటి నిల్వ సామర్ధ్యం పెద్దగా లేదని, గోరకల్లు, వెలిగోడు తప్ప మరో ప్రత్యామ్నాయం లేని కారణంగా ఈ ప్రాజెక్టు చేపట్టవచ్చని సిఫారసు చేస్తూ 3--11న తిరిగి చీఫ్ ఇంజినీర్‌కు పంపగా, ఆయన 3-9-11న ప్రభుత్వ కార్యదర్శికి నివేదించారు. ప్రస్తుతం ఈ ఫైల్ ప్రభుత్వ ఆమోదం కోసం సిద్ధం ఉంది. ఈ సిఫారసులు చేసిన కమిటీకి ఎంకే రహమాన్ (ఈఎన్‌సీ, పరిపాలన) చైర్మన్ కన్వీనర్ కాగా, పీఎస్‌ఆర్ సుబ్రహ్మణ్యం (ఈఎన్‌సీ, మీడియం ఇరిగేషన్), సీ మురళీధర్ (ఈఎన్‌సీ ఇరిగేషన్), కే జలందర్ (సీఈ కర్నూలు), ఎం సాంబమూర్తి (డైక్టర్ డబ్ల్యూఅండ్‌పీ) సభ్యులుగా సంతకాలు చేశారు.

మొదటి ప్రయత్నాన్ని ఆంధ్ర ప్రాంతానికి చెందిన ఈఎన్‌సీ అడ్డుకోగా, రెండో ప్రతిపాదనకు ఆమోదం తెలిపిన కమిటీలో మురళీధర్ తెలంగాణ ప్రాంత అధికారి కావడం గమనార్హం. ఈయన తెలంగాణకు చెందినప్పటికీ వ్యతిరేకించ కపోవడంపై అనుమానాలున్నాయి. సంతకం చేసిన మరో ఇద్దరు ఈఎన్‌సీలకు పదవీ విరమణ తర్వాత లబ్ధికి హామీ లభించి ఉండవచ్చనే అభివూపాయం అధికారుల్లో వ్యక్తం అవుతోంది.

అసలు రహస్యం...
సిద్ధేశ్వరం వద్ద బ్రిడ్జి పేరుతో వీయర్ (మత్తడి) ద్వారా సుమారు 50 టీఎంసీలను నిల్వ చేసుకోవచ్చు. శ్రీశైలంలోకి నీళ్లు వెళ్లే మార్గంలోనే (నందికొట్కూరు వద్ద కృష్ణా నది బాగా సన్నగా వెళుతుంది) ఈ వీయర్ నిర్మాణం జరిగితే ఇది నిండిన తర్వాత రిజర్వాయర్‌లోకి నీళ్లు వెళ్లాల్సి ఉంటుంది. శ్రీశైలానికి అటు వైపు కేవలం గోరకల్లు, వెలిగోడు రిజర్వాయర్లు మాత్రమే ఉన్నాయన్న విషయంలోను వాస్తవం లేదు. పోతిడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ నుంచి వెళ్లే శ్రీశైలం కుడి కాలువపై (ఆర్‌ఆర్‌బీసీ) గోరకల్లు (13.5 టీఎంసీ), అవుకు (5 టీఎంసీ), గండికోట (10 టీఎంసీ), చిత్రావతి (10 టీఎంసీ) ఉండగా, తెలుగుగంగ కాలువపై వెలిగోడు (17 టీఎంసీలు), బ్రహ్మంగారి మఠం (16.5 టీఎంసీలు), సోమశిల (7 టీఎంసీలు), కండలేరు (6 టీఎంసీలు) ఉన్నాయి. తెలుగుగంగ ద్వారా సుమారు 10 టీఎంసీలు, ఎస్‌ఆర్‌బీసీ ద్వారా మరో 50 టీఎంసీల వరకు అందుతున్నాయి.

ఇవన్నీ ఉండగా మళ్లీ మరో 50 టీఎంసీల పేరుతో కృష్ణా నదీ జలాలకు గండికొట్టే ప్రయత్నం జరుగుతోంది. పేరుకి పైకి 50 టీఎంసీలు అని చెబుతున్నా, వీయర్ నిర్మాణం పూర్తయితే ఇంకా ఎక్కువ నీళ్లు తరలిస్తారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. శ్రీశైలం ప్రాజెక్టులోకి నీళ్లు రాకముందే సిద్ధేశ్వరం వద్ద ఈ వీయర్ కమ్ బ్రిడ్జి, మరోవైపు పోతిడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ ద్వారా రాయలసీమకు నీళ్లు వెళ్లిన తర్వాత తెలంగాణ, కృష్ణా డెల్టాలకు సాగునీరు అందుతుందన్నమాట. పోతిడ్డిపాడుతో సంబంధం లేకుండా సంవత్సరం పొడవునా ఈ వీయర్‌లో 50 టీఎంసీల నీరు అందుబాటులో ఉంటుంది. ఈ ప్రతిపాదనను గతంలో కార్యదర్శిగా ఉన్న దాస్ (తెలంగాణ), ఈఎన్‌సీ బీఎస్‌ఎన్ రెడ్డి (ఆంధ్రా) వ్యతిరేకించగా, వారి స్థానంలో రాయలసీమ వ్యక్తిని కార్యదర్శిగా నియమించుకుని ప్రభుత్వం రెండో ప్రతిపాదనను ముందుకు నడిపించిందన్న విమర్శలు ఉన్నాయి.


పోతిడ్డిపాడు కథ...
చెన్నైకి కృష్ణా జలాలను పంపే ఉద్దేశంతో పోతిడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ నిర్మాణం జరిగింది. ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాలు 5 టీఎంసీల చొప్పున మొత్తం 15 టీఎంసీలు దానం చేశాయి. కానీ దీని మధ్యలో పెద్ద పెద్ద రిజర్వాయర్లు వెలిశాయి. సీఎంలుగా పని చేసిన సీమ నాయకులు ఎవరికి తోచిన రీతిలో వారు తమకు అనుకూలంగా మార్చేసుకున్నారు. కోట్ల విజయభాస్కర్‌డ్డి సీఎంగా ఉన్నప్పుడు కేంద్ర జల సంఘం నుంచి మరో 19 టీఎంసీల అనుమతి తెచ్చుకున్నారు. పోతిడ్డిపాడు మొత్తం సామర్థ్యం 11,500 క్యూసెక్కులుగా ఉండగా, వైఎస్ అధికారంలోకి వచ్చిన మూడు నెలల్లో 44,000 క్యూసెక్కులకు పెంచారు. ఇందుకోసం అంతకు ముందున్న 4స్లూయిస్‌లకు (డ్యామ్ నుంచి నీళ్లు వచ్చేందుకు) అదనంగా మరో పది స్లూయిస్‌లు నిర్మించారు.

దీనితో మొత్తం 14 స్లూయిస్‌లు అయ్యాయి. ఒక్కో స్లూయిస్ నుంచి 3.5వేల క్యూసెక్కుల నీళ్లు వెళతాయని పైకి చెప్పినప్పటికీ, కనీసం 5వేల క్యూసెక్కులు వెళుతున్నాయని అధికారులు స్పష్టం చేస్తున్నారు. 14 స్లూయిస్‌ల ద్వారా 70,000 క్యూసెక్కులు విడుదల అవుతున్నాయి. పైకి మాత్రం 44,000లకు మాత్రమే పెంచామని ప్రభుత్వం సమర్థించుకుంది. పోతిడ్డిపాడుకు నీళ్లు వెళ్లాలంటే శ్రీశైలం ప్రాజెక్టులో నీటిమట్టం 41 అడుగులకు చేరాలి. అయితే వైఎస్ వచ్చిన తర్వాత మినిమం డ్రా డౌన్ లెవల్‌ను 54కి పెంచుతూ ప్రత్యేక జీవో జారీ చేశారు.

తీరని దాహార్తి....

  • పోతిడ్డిపాడు నుంచి బనకచర్ల వరకు లైనింగ్ చేస్తే కాల్వ సామర్ధ్యం పెరుగుతుంది. అప్పుడు 1,30,000 క్యూసెక్కులు వెళ్లే ఆస్కారం ఉంది. రోజూ 11 టీఎంసీలు కాలువ ద్వారా పంపినా 30 వరద రోజుల్లో 330 టీఎంసీలు పంపొచ్చని లెక్కలు చెబుతున్నాయి. శ్రీశైలం వరదలప్పుడు ఇది నిరూపితమైందని అధికారులంటున్నారు. 
  • ఒక టీఎంసీ సామర్ధ్యంతో వెలిగొండ ప్రాజెక్టు పేరు చెప్పి శ్రీశైలం నుంచి 1 కిలోమీటర్లు టన్నల్ ద్వారా నీళ్లు తీసుకెళ్లాల్సి ఉంది. కానీ రిజర్వాయర్ సామర్థ్యం మాత్రం 45 టీఎంసీలతో జరుగుతుండడం విశేషం.
  • మరో వైపు పోతిడ్డిపాడుకి ముందే హంద్రీనీవా ఎత్తిపోతల పథకానికి 40 టీఎంసీలు కేటాయించుకున్నారు. 
  • పోతిడ్డిపాడు వద్ద హైడల్ పవర్ స్టేషన్ ఉంది. దానికి కేటాయించిన 5 వేల క్యూసెక్కులను అవుట్‌పుట్ ద్వారా ఆర్‌ఆర్‌బీసీకి వదులుతున్నారు.

Tuesday, February 21, 2012

BJP, TRSకి ప్రత్యామ్నాయం కాబోతుందా?



తెలంగాణలో మళ్ళీ ఉపఎన్నికల వేడి మొదలైంది. యధా ప్రకారంగా టక్కు టమార విద్యలు ఉపయోగిస్తూ రాజకీయ పార్టీలు అప్పుడే మాటల యుద్ధాలు మొదలు పెట్టాయి. ఇచ్చేదీ తెచ్చేదీ మేమేనంటూ ఒక పార్టీ మరోసారి తెలంగాణా ప్రజలను మోసం చేయాలని చూస్తుంది. సమైక్య వాది కాళ్ళ ముందు సాగిలబడ్డా సరే, మాకన్నా నిఖార్సైన తెలంగాణా వాదులు లేరంటూ మరో పార్టీ ఊదరగొట్టడం మొదలు పెట్టింది.

ఎన్నికల సమయంలో కుహనా తెలంగాణా వాదాన్ని చెప్పే సమైక్యవాద పార్టీలు, ప్రజలు వారిని నమ్మి వోట్లు వేసిన తర్వాత మాత్రం "చూసారా, తెలంగాణా వాదం వుంటే మేమెందుకు గెలుస్తాం?" అన్నట్టు మాట్లాడుతాయి. అయితే ఇటువంటి మాటలు విని విని చెవులు తూట్లు పడిన తెలంగాణా వాదులు వీరి మోసాలను ఇంకే మాత్రం సహించే ధోరణిలో లేరు. అందుకే ఈ రెండు పార్టీలు తమ మాటలను ప్రజలను నమ్మే స్థాయిని ఏనాడో కోల్పోయాయి. ఇవి తెలంగాణాలో గెలవడం అటుంచి డిపాజిట్లు వచ్చినందుకు సంతోషించే పరిస్థితికి దిగజారాయి. 

లోలోన సమైక్యవాదులకు దాసోహం చేస్తూ, పైకి తెలంగాణా వాదం చెప్పే పార్టీల సంగతి అలా వుంటే, గట్టిగా తెలంగాణా వాదం వినిపించే TRS, BJP ల పధ్ధతి మరోలా వుంది.

రాజీనామాలు చేసిన స్థానాలు పోగా TRS మహబూబ్ నగర్లో అభ్యర్థిని నిలబెట్టడం నిజంగా ఒంటెత్తు పోకడే. అది BJPకి నచ్చనట్టుంది. పైగా కిషన్ రెడ్డి పోరుయాత్ర విజయవంతంగా జరిగిన ఊపులో ఉందేమో, తాను కూడా అభ్యర్థులను రంగంలోకి దించాలని ఆలోచిస్తున్నట్టు వార్తలొస్తున్నాయి.

ఈ వార్తలు తెలంగాణా వాదులను నిజంగా కలవర పరచేవే. ఎందుకంటే తెలంగాణా ఎన్నికల ఫలితాలు వచ్చినప్పుడల్లా వాటి ఫలితాలకు, తెలంగాణా వాదానికి ముడిపెట్టడం గత దశాబ్ద కాలంగా జరుగుతూ వస్తుంది. కుహనా తెలంగాణావాద పార్టీల బండారం బయటపడ్డ నేపథ్యంలో, ఇప్పుడు తెలంగాణావాద పార్టీలే తమలో తాము పోటీపడి, వోట్లు చీలిపోయి, వ్యతిరేక ఫలితాలు వస్తే పరిస్థితి ఏమిటన్న ప్రశ్నే ఆ కలవరానికి మూలం.

BJP, TRSకి ప్రత్యామ్నాయం కాబోతుందా అనేది కూడా మరో ప్రశ్న. ఎందుకంటే BJP పార్టీ కూడా TRS అంత బలంగానే తన వాదాన్ని వినిపిస్తోంది. పైగా జాతీయ పార్టీ. అవకాశవాద కాంగ్రెస్ పార్టీతో పోలిస్తే ఎప్పటికైనా తెలంగాణా ఏర్పాటు చేయగల సత్తా ఆ పార్టీకే ఉందన్న విషయం సర్వత్రా వున్న అభిప్రాయం. 

మరి అలాంటప్పుడు ప్రాంతీయ పార్టీ అయినటువంటి TRS కన్నా జాతీయపార్టీ అయిన BJP తెలంగాణా వాదానికి ఎక్కువ బలం చేకూర్చే పార్టీగా కనిపిస్తుంది. కాని తరచి చూసినప్పుడు, BJP ని నమ్మడం అంత సబబు కాదేమో అనిపిస్తుంది. ఎందుకంటే...
  • రాష్ట్రంలో ఆ పార్టీ నాయకులకు తెలంగాణా పై ఎంత నిబద్ధత వున్నా, జాతీయస్థాయిలో ఆ పార్టీకి అధికారంలో వుండడం మాత్రమే ప్రాధాన్యం తప్ప తెలంగాణా కాదు.  
  • రేపు ఆపార్టీ ఏ చంద్రబాబో, జగన్ మోహన్ రెడ్డిదో సహకారం తీసుకొని తెలంగాణా వాదాన్ని మరోసారి తుంగలో  తొక్కదని చెప్పే పరిస్థితి లేదు.
  • అటువంటి పరిస్థితుల్లో ఇప్పుడు అధికారంలో వున్న తెలంగాణా కాంగ్రేసు నాయకుల్లానే, తీరా గెలిచిన తర్వాత ఇక్కడి BJP నాయకుల మాటలు కూడా అరణ్య రోదనే కావచ్చు.
ఈ పరిస్థితుల దృష్ట్యా, మంచికో చెడుకో తెలంగాణా ప్రజలు TRS పార్టీని మాత్రమే సమర్ధించ వలసిన అవసరం వుంది.  అప్పుడు మాత్రమే తెలంగాణా ప్రజలకు తమదంటూ ఒక ఐడెంటిటీ వుంటుంది. ఇప్పటికే రాజకీయాలతో అనేక ధక్కామొక్కీలు తిన్న తెలంగాణా ప్రజలు ఆ మాత్రం ఆలోచించగల పరిణతి వుంది.
   
   

Sunday, February 19, 2012

విభజనపై సీమాంధ్రుల వ్యతిరేకత ఏమేరకు?


తెలంగాణా ఏర్పాటుపై ప్రతిష్టంభన ఏర్పడడానికి రెండు ముఖ్య కారణాలు కనిపిస్తున్నాయి. మొదటిది తెలంగాణా ప్రాంతాన్ని వలస ప్రాంతంగా చేసుకొని నిరాఘాటంగా గడిచిన అర్థ శతాబ్ద కాలంగా దోచుకుంటున్న దోపిడీ శక్తులకు ఈ విభజన అస్సలు నచ్చక పోవడం.

రాజశేఖర్ రెడ్డి, చంద్రబాబు లాంటి కుహనా రాజకీయ వేత్తలు తెలంగాణాను సమర్థిస్తూ ఎన్ని మాయమాటలు చెప్పినా అసలు విభజన జరగనే జరగదని గట్టిగా విశ్వసించిన ఈ శక్తులకు డిసెంబరు తొమ్మిదిన వచ్చిన చిదంబరం ప్రకటన ఆశనిపాతమైంది.

అయితే అప్పటికే సీమాంధ్ర లోని ప్రజలు విభజనకు దాదాపుగా సిద్ధపడ్డారు. కాంగ్రేసు, తెలుగుదేశం వంటి పెద్ద పార్టీలు తెలంగాణను బహింరంగంగా సమర్థించినా, చిరంజీవి సామాజిక తెలంగాణా అంటూ విధాన నిర్ణయాన్ని ప్రకటించినా వారికి ఆ ప్రాంతం నుండి పెద్ద ఎత్తున వోట్లు పడడమే అందుకు నిదర్శనం.

అంతే కాదు, చంద్రబాబు తెలంగాణా ఏర్పాటుకు సంబంధించి నిర్ణయం తీసుకునే ముందు రెండున్నరేళ్ళ పాటు సీమాంధ్ర మొత్తం వార్డు మెంబరు స్థాయిలో చర్చలు జరిపామని వారే చెప్పుకున్నారు. ప్రజల్లో వ్యతిరేకత ఉన్నట్టయితే 2009 వ సంవత్సరంలో చంద్రబాబు తెలంగాణా అనుకూల నిర్ణయాన్ని, ఏదో తెలంగాణా ప్రజల కన్నీళ్లను తుడవడానికి తీసుకునే వాడని అనుకోలేం. కాబట్టి ఆ నిర్ణయాన్ని తీసుకునే ముందు సీమాంధ్రకు చెందిన ప్రజల్లో ఎలాంటి వ్యతిరేకత లేదన్న విషయం వారు తప్పక పరిగణన లోకి తీసుకొనే వుంటారు.

ఈ నేపథ్యంలో డిసెంబరు 2009 న హటాత్తుగా తెలంగాణా ఏర్పాటుపై కేంద్ర ప్రభుత్వ ప్రకటన రావడం వలసవాద వ్యాపారులు భరించలేక పోయారు. ప్రజలు అప్పటికే సంసిద్ధులై వున్నారు కాబట్టి తమకు నచ్చని విషయాన్ని బహిరంగంగా చెపితే ప్రజలు నిజం గ్రహించి తమ ముఖాల మీదే ఉమ్ముతారు కాబట్టి 'సమైక్యత' అనే అందమైన అబద్ధాన్ని ప్రజల ముందుకు తీసుకు వచ్చారు.

రాత్రికి రాత్రే డబ్బులు డబ్బులు జలపాతంలా ప్రవహించాయి. ముందుగా ముఖ్య ప్రతిపక్ష నాయకుణ్ణి దార్లోకి తెచ్చుకున్నారు. అతని నేతృత్వంలో చక్రం గిరగిరా తిరిగింది. రెండు రోజుల క్రితం అసెంబ్లీలో బిల్లు పెట్టండి, సంర్తిస్తాం అని చెప్పిన మనిషి, అర్థరాత్రి నిర్ణయమేమిటి అని అడిగే పరిస్థితి వచ్చింది. దేశానికి స్వాతంత్ర్యం కూడా అర్థరాత్రే వచ్చిన వైనం గుర్తిస్తే ఆ నాయకుని ప్రకటన ఎంత విడ్డూరమో అర్థం కాక మానదు.

ఇక పావులు చక చకా కదిలాయి. ఒక ప్రముఖ కాంగ్రెస్ నాయకుడు ఏకంగా పదిహేను నిమిషాల భావోద్వేగాలను రెచ్చగొట్టే తరహా ప్రకటన భారీ హంగులతో నిర్మించాడు. ప్రతీ అరగంట కోక సారి ఈ ప్రకటన అన్ని చానేల్లలోనూ ప్రదర్శించ బడింది. ఏదో జరిగిపోతుంది, రాష్ట్రం మధ్యన అడ్డుగోడలేర్పడుతున్నాయి, ఇటువాళ్ళు అటు వెళ్ళడానికి వీల్లేదు లాంటి అపోహలు ఒక ప్రాంతం వారిలో కల్పించ దానికి ఈ ప్రకటనలు ఉద్దేశించ బడ్డాయి. తమ ప్రయత్నంతో తెలంగాణా ప్రాంతాన్ని ఏమాత్రం ప్రభావితం చేయలేక పోయినా కోస్తా, రాయలసీమ ప్రాంతాల ప్రజల్లో కొంతమందిని మాత్రం ప్రభావితం చేయ గలిగారు.

ఇక రెండో కారణం విషయానికి వస్తే, అది ప్రజల అవగాహనా రాహిత్యం. తెలంగాణా ప్రాంత ప్రజలు చేస్తున్న పోరాటం తమ అస్తిత్వం కోసం చేస్తున్న పోరాటంగా కాక అది ఆంధ్రా ప్రాంతం ప్రజలకు వ్యతిరేకంగా చేస్తున్న పోరాటంగా ఆ ప్రాంతం యువజనం భావించడం.

ఇలాంటి భావన కలగడానికి ముఖ్య కారణం మన విద్యావిధానం. చరిత్ర పై, సామాజిక శాస్త్రం పై ప్రజల అవగాహనా రాహిత్యం. విద్యావిధాన నిర్ణయాలు ప్రభుత్వం చేతుల్లోంచి శ్రీచైతన్య, నారాయణ లాంటి పెట్టుబడుదారుల చేతుల్లోకి వెళ్లినందువల్ల కలిగే దుష్పరిణామం.

వీరికి గనుక చరిత్ర పై అవగాహన వుండివుంటే మనం  చేసిన మహత్తర స్వాతంత్ర్య పోరాటం బ్రిటన్ ప్రజలపై వ్యతిరేక పోరాటం కాదనే కనీస అవగాహన ఉండేది. బ్రిటీష్ వారు మానని దోచుకుంటున్నారని మనం ప్రచారం చేస్తున్న తరుణంలో బ్రిటన్లో బిచ్చగాళ్ళు కూడా ఉండే వారని అర్థమయ్యేది. ఒక వేల దోచుకునేది బ్రిటీష్ ప్రజలే అయితే అక్కడ పేదవాళ్ళు, బిచ్చగాళ్ళు వుండడం ఎలా సాధ్యం?

చరిత్రపై అవగాహనా రాహిత్యం వల్ల సీమాధ్ర ప్రాంతంలోని కొంతమేర జనం వలసశక్తులు చేస్తున్న వాదనకు తలొగ్గడం జరిగింది. తమ ధన బలంతో, తద్వారా చేసిన విష ప్రచారం వల్ల కొంతమంది యువజనులను కూడగట్టి ప్రదర్శనలు. విధ్వంసాలను సృష్టించ గలిగారు. వీటిని తమ ప్రచార సాధనాలతో భూతద్దంలో చూపించి కేంద్ర ప్రభుత్వంలో భయాందోళనలను సృష్టించ గలిగారు.
 
Image Curtesy: GIDEE TELANGANA CARTOON BOOK

Saturday, February 18, 2012

అంత మోజెందుకో?



అడుగు బయట పెడితే
హిందీ, ఉర్దూ ఇంగ్లీషు తప్ప
తెలుగు వినబడని స్థితి
అమలాపురం నుంచి
అప్పుడే వచ్చిన వ్యక్తి
దుబాసీ లేకుండా
అడుక్కూడా కదపలేని పరిస్థితి

తెలుగు భాషా తీవ్రవాది కూడా 
కుస్తీలు పడుతూ
వచ్చీ రాని ఉర్దూలో
మాట్లాడాల్సిన దుస్థితి
భాషా ప్రయుక్త రాష్ట్రం
తెలుగు భాష
దానికొక రాష్ట్రం
అంటూ
డబ్బా వాయిస్తూ
తిరిగే వారికి

హైదరాబాదు నగరం పై
అంత మోజెందుకో?

గుర్తొస్తున్నాయి

దక్షిణ పాకిస్థానం
అన్నపుడు 
నా భాష గుర్తుకు రాలేదు
                             
న్యాయస్థానం 
ముల్కీ నిబంధనలు
సమర్థిస్తే 
నా జాతి గుర్తుకు రాలేదు 

నా నెల
బీటలువారి 
పోతిరెడ్డి పాడై
నీరు వెళ్లిపోతుంటే 
నా బంధుత్వం గుర్తుకు రాలేదు 

రాజోలి బండ 
తూములు 
బద్దలు గొట్టినప్పుడు 
ఐకమత్యం గుర్తుకు రాలేదు 

నేడు 
నాదారి 
నేను చూసుకుంటానంటే
ఇప్పుడు గుర్తొస్తున్నాయా?

Thursday, February 16, 2012

ఎవడు వాడు?



రాష్ట్రాలను
దేశాలను
వీలైతే ప్రపంచాన్నీ
ఏర్పాటు చేసే అధికారం
తనకు మాత్రమే ఉందని భ్రమించే వాడు

రాష్ట్ర సమగ్రత
దేశ సమగ్రత
ప్రపంచ సమగ్రత కూడా...
కాపాడే బాధ్యత
నేత్తినేసు కుంటున్నానని అపోహ పడేవాడు

నీరు మాత్రమే కాదు
ఫాక్టరీలూ ఉద్యోగాలూ
బొగ్గూ కరెంటూ
కేటాయింపులూ  కళాశాలలూ
అన్నీ పల్లానికే ప్రవహించాలని అనుకునే వాడు

అడవులు జంతువులూ
గనులూ జనులూ
పారే నేలకన్నా
ఎక్కువ నేల మునిగిపోయినా
తనకు మాత్రం మూడో కారు పండితే చాలనే వాడు

భాషను గేలి చేస్తూ
సంస్కృతిని కించ పరుస్తూ
లోలోన ఆసహ్యించు కుంటూ
పైకి కృతకపు నవ్వులు పులుముకుని
ఆంధ్రులం మనమంతా, అన్నదమ్ములం అనేవాడు

కృష్ణా డెల్టా కోసం సాగర్ ఖాళీ!




  • ఏడేళ్లలో ఇదే మొదటి సారి
  • 516. అడుగుల వద్ద నీటిమట్టం
  • ఆంధ్ర ప్రాంతానికి రబీ కోసం భారీగా నీటి తరలింపు
  • ఎడమ, కుడి కాల్వల ద్వారా ఆంధ్రకు పారుతున్న సాగర్ నీరు
  • అడుగంటుతున్న భూగర్బ జలాలు
  • తరుముతున్న తాగునీటి ఎద్దడి
  • చెరువులు నింపాలన్న ఉత్తర్వులు బేఖాతరు చేసిన అధికారులు
  • పట్టించుకోని జిల్లా మంత్రులు

సరిగ్గా ఏడేళ్ల క్రితం నాగార్జున సాగర్‌లో నీటి మట్టం 556.10 అడుగులు! ఇప్పుడు సాగర్‌లో నీటి మట్టం 516.0 అడుగులు! రమారమి 40 అడుగుల తేడా! సాగర్‌లో నీటి మట్టం ఏడేళ్లలో ఎన్నడూ లేనంత తక్కువ స్థాయికి ఎందుకు పడిపోయింది? నాగార్జున సాగర్ ఎందుకు ఖాళీ అయిపోయింది? ఈ నీళ్లన్నీ ఎటుపోయాయి? ఖమ్మం, నల్లగొండ జిల్లాల సాగు, తాగునీటి అవసరాలను ఫణంగా పెట్టి ఏ దారి పట్టాయి? మా నీళ్లు మాకేనంటూ ఏళ్ల తరబడి పోరాటాలు సాగుతున్నా.. ఆ హక్కు ప్రత్యేక తెలంగాణ రాష్ట్రంలోనే సిద్ధిస్తుందని నమ్ముతున్న లక్షలాది రైతులు ఆందోళన బాట పడుతున్నా.. తెలంగాణ రాష్ట్ర సాధనకు మలి దశ ఉద్యమం ఉవ్వెత్తున సాగుతున్నా.. మళ్లీ అవే ప్రశ్నలు! నీరు ఆంధ్ర ప్రాంతానికి పారును! మళ్లీ అదే సిద్ధాంతం! అవును.. కృష్ణా డెల్టాలో రబీ పంట కోసం చెరువులు నింపేందుకు సాగర్ నీళ్లు తరలిపోయాయి! కాదు.. కాదు.. తరలించుకుపోయారు! సీమాంధ్ర ప్రయోజనాల పరిరక్షణ కోసం యథేచ్ఛగా జరుగుతున్న తెలంగాణ జల దోపిడీలో ఇది మరో అంకం!

(టీ న్యూస్ ప్రతినిధి-నల్లగొండ) నాగార్జున సాగర్ ఖాళీ అయిపోయింది. ఏడేళ్లలో ఎన్నడూ లేనంత తక్కువ స్థాయికి నీటి మట్టం దిగజారిపోయింది. కృష్ణా డెల్టాలో రబీ పంట కోసం చెరువులు నింపేందుకు సాగర్ జలాలు తరలిపోయాయి. తెలంగాణలోని నల్లగొండ, ఖమ్మం జిల్లాలను ఎండబెట్టి, ఎడమ కాల్వ ద్వారా రబీ పంటకు మూడవ జోన్ పరిధిలోని ఆంధ్ర ప్రాంతానికి, కుడి కాల్వ పరిధిలోని గుంటూరు, ప్రకాశం జిల్లాలకు సాగునీరు తరలించుకుపోతున్నారు. నల్లగొండ జిల్లా గొంతెండుతున్నా కనీసం గుక్కెడు నీరు ఇవ్వని ప్రభుత్వం.. ఆంధ్ర ప్రాంతానికి రబీ పంట పేరుతో భారీగా చెరువులను నింపిపెడుతోంది. జిల్లాకు చెందిన మంత్రులు, ఎమ్మెల్యేలు కళ్ల మందు జరుగుతున్న అన్యాయాన్ని కనీసం అడగలేని దౌర్భాగ్య స్థితిలో ఉన్నారు.

అసలే కరువు, అపై భారీగా భూగర్భ జలాలు పడిపోయాయి. వచ్చే వేసవిలో తాగునీటి ఎద్దడిని నివారించేందుకు చెరువులను నింపాలని కోరినా ఇంత వరకు చర్యలు తీసుకోలేదు. కానీ.. గత ఏడేళ్లలో ఎన్నడూ లేనివిధంగా సాగర్ రిజర్వాయర్‌లో నీరును నిల్వ చేయకుండా రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా ఆంధ్ర ప్రాంతానికి నీరును తరలించుకుపోయింది. సాగర్ ఎడమ, కుడి కాల్వల ద్వారా రబీ పంటకు ఆంధ్ర ప్రాంతానికి భారీగా నీరు తీసుకెళ్లుతున్నారు. కుడి, ఎడమ కాల్వల ద్వారా మూడవ జోన్ (కృష్ణా, పశ్చిమగోదావరి) జిల్లాలకు రబీ పంటకు ఫిబ్రవరి 29వ తేదీ వరకు నీరు విడుదల చేయాలని ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఖరీఫ్‌లో తీవ్ర కరువు కారణంగా తెలంగాణలో పంటలు పూర్తిగా నష్టపోయాయి. భూగర్భ జలాలు 14 మీటర్ల లోతుకు పడిపోయాయి. వచ్చే వేసవిని దృష్టిలో పెట్టుకొని జిల్లాలోని ఎలిమినేటి మాధవడ్డి ప్రాజెక్టు (ఎమ్మార్పీ) పరిధిలోని 94 చెరువులను నింపాలని గత నెల 19వ తేదీన జరిగిన డీఆర్‌సీ సమావేశం ఏకక్షిగీవంగా తీర్మానించింది.

ఫిబ్రవరి 7 నుంచి ఎమ్మార్పీ పరిధిలోని చెరువులను నింపాలని ఉత్తర్వులు జారీ అయినా ఇరిగేషన్ అధికారులు ఇంత వరకు చర్యలు చేపట్టలేదు. ప్రస్తుతం సాగర్ రిజర్వాయర్‌లో నీటి మట్టం 516.0 మాత్రమే ఉంది. ఎమ్మార్పీ పంపులు నడవాలంటే సాగర్ రిజర్వాయర్ నీటి మట్టం 510 అడుగులకు తక్కువ కాకుండా ఉండాలి. ఎడమ, కుడి కాల్వల ద్వారా భారీ ఎత్తున కృష్ణా నీటిని తరలించకపోతుండటంతో ఎమ్మార్పీ పంపులకు నీళ్లు అందే అవకాశాలు మృగ్యమవుతున్నాయని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నాగార్జున రిజర్వాయర్‌లో నీరు ఉన్నా, పాలకులు మాత్రం నల్లగొండ జిల్లాలో పరిధిలోని మొదటి జోన్‌కు నీరు విడుదల చేసేందుకు ఒప్పుకోలేదు. రైతులు భారీ ఎత్తున అందోళనలు, మంత్రులకు వినతిపవూతాలు, కలెక్టరేట్ దిగ్బంధం వంటి అనేక కార్యక్షికమాలు చేపట్టినా ప్రభుత్వం తెలంగాణ రైతాంగంపై వివక్ష చూపిందన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

మూడవ జోన్‌కు రబీ పంటకు నీరు తరలించేందుకు ఫిబ్రవరి 29వ తేదీ వరకు అనుమతి ఇచ్చారు. దీంతో కేవలం వ్యవసాయ పంటలకు కోసమే కాకుండా తాగునీటి అవసరాల కోసం కూడా భారీ వినియోగించుకుంటున్నారు. జిల్లా పరిధిలోని చెరువులను నింపేందుకు అటు అధికారులు, ఇటు ఇద్దరు మంత్రులు, ఎమ్మెల్యేలు దృష్టి సారించకపోవడంపై రైతులు విచారం వ్యక్తం చేస్తున్నారు. సాగర్ జలాశయంలో క్రమేణా నీటి పరిమాణం తగ్గుతుండడంతో గురువారం 516 అడుగులు (143 టీఎంసీలు)కు చేరింది. అందులో నుంచి ఎడమ కాలువకు 7431 క్యూసెక్కులు, కుడి కాలువకు 245 క్యూసెక్కులతో కలిపి 15676 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు.

ఎడమ కాలువ ద్వారా నల్లగొండ జిల్లాలో ప్రధానంగా మూడు రిజర్వాయర్లు, 135 చెరువులను నింపాల్సి ఉంది. పెద్దదేవులపల్లి రిజర్వాయర్ 0.4 టీఎంసీలు, పొనుగోడు రిజర్వాయర్ 0.4 టీఎంసీలు, ఉదయ సముద్రం రిజర్వాయర్ 1.5 టీఎంసీలతో పాటు 135 చెరువులను నింపేందుకు సుమారుగా 4 టీఎంసీల నీరు అవసరముంది. ఎలిమినేటి మాధవడ్డి ప్రాజెక్టు పరిధిలోని చెరువులను ఫిబ్రవరి 7వ తేదీ నుంచి నింపాలని అదేశాలు అందినా ఇంత వరకు ఇరిగేషన్ అధికారులు ఎలాంటి చర్యలు చేపట్టలేదు.

Curtesy: Namasthe Telangana

Wednesday, February 15, 2012

కుళ్ళ బొడిచైనా సమైక్యత నేర్పిద్దాం



తెలుగు మాట్లాడే వారంతా
ఒకే రాష్ట్రంలో ఉండాలి
దీనికన్నా ముందు వారంతా
ఒకే దేశంలో వుండాలి
ప్రపంచ తెలుగు జాతి పౌరులారా
పొలోమని రాష్ట్రానికి తరలిరండి
తెలుగు జాతి గౌరవం నిలబెడదాం
తెలుగు జాతి ఒక్కటే నని చాటుదాం
మనకు ఒక్కటే దేశం
మనకు ఒక్కటే రాష్ట్రం
మనకు ఒక్కటే జిల్లా
మనకు ఒక్కటే మండలం
మనకు ఒక్కటే గ్రామం
అన్నీ ఒక్కటే వుండాలి
ఒకటికన్నా ఎక్కువగా వుంటే
మనకు అరిష్టం
ఒకటికన్నా ఎక్కువుంటే
సమగ్రతకే నష్టం
కాదని ఎవడన్నా అన్నాడో
వాణ్ణి వెలేద్దాం
వేర్పాటువాదిగా ముద్దరేద్దాం
వీలైతే తాలిబాన్ అందాం
అయినా కూడా వాణ్ణి పంపించొద్దు
వాడికి ఊళ్లోనే కోదండం వేద్దాం
కుళ్ళ బొడిచైనా సమైక్యత నేర్పిద్దాం


Monday, February 13, 2012

పరకాలా! హాస్యానికైనా హద్దుండాలి


విశాలాంధ్ర మహాసభ సభ్యుల్లో ఎక్కువమంది నైజాం ప్రాంతానికి చెందినవారున్నారు. తెలంగాణ ప్రజల్లో రాష్ట్రం సమైక్యంగా ఉండాలని కోరుకుంటున్నవారు ఎక్కువ మంది ఉన్నారు.
పరకాల ప్రభాకర్



అన్ని పార్టీలూ బయటకు గెంటేస్తే ఏదో పొట్ట కూటికోసం తిప్పలు పడితే ఫరవాలేదు. కాని మరీ ఇలా అలవోకగా అబద్ధాలు గుప్పిస్తుంటే ఎలా పరకాలా? తమరి మాటలు కనీసం సమైక్య వాదులైనా నమ్మొద్దూ?

తెలంగాణలో సమైక్యవాదులు ఎక్కువగా ఉన్నారా? అయితే తమరికింకేం బాధ? సమైక్యవాదులే ఎక్కువగా వున్నప్పుడు వారికేం కావాలో వారు చూసుకో లేరా? వారిని ఉద్ధరించడానికి తమరేమైనా మెస్సయ్య అవతారం ఎత్తారా? మరి ఎక్కువమంది వారే ఉన్నప్పుడు తమరికి వాదం వినిపించుకోవడానికి తెలంగాణా వాదులు వెసులుబాటు కల్పించాల్సిన అవసరం ఎందుకో? అసలు ఎక్కువమంది వారే వున్నప్పుడు తమరు ప్రత్యేకంగా వాదం వినిపించాల్సిన అవసరం ఏమిటి? అవకాశం ఇస్తే వారి మనసులు మారుస్తానని ప్రకటనలు గుప్పించడ మేమిటి? 

ఇక పోతే తమరి కూటమిలో ఎక్కువమంది తెలంగాణా ( సారీ, నైజాం, మీకు తెలంగాణా పదం అంతే చిరాకు కదా) వారే ఉన్నారా? మరి తమ మీటింగుల్లో కనపడరేమి సామీ? సరే, ఉన్నారనుకుందాం. ఎప్పుడు ఎక్కడ చూసినా ఓ డజను పేర్ల కన్నా తమ గుంపు కనపడదు. ఆ డజను గుంపులో తెలంగాణా వారే ఎక్కువగా వుంటే, మరి ఆంధ్రాకి సంబంధించిన వారు ఆ మాత్రం కూడా లేనట్టేనా? మరీ ఇలాంటి చవక డవలాగులు చెప్పి ఉన్న పరువు తీసుకుంటే ఎలా ప్రభాకర్ జీ!

చెప్పడానికి నిజాలేమీ లేనప్పుడు అబద్ధాలే చెప్పి పబ్బం గడుపుకోవాలంటారా! సరే కానీండి.   


Sunday, February 12, 2012

చంద్రబాబూ, జర చూసుకొని పో


చంద్రబాబూ! తెలంగాణా ఉద్యమంపై ఎంత అక్కసు వున్నా ఎన్నడూ నేరుగా దాడి చేయ సాహసించని మీరు, తెలంగాణా వాదాన్ని దెబ్బ తీయడానికి తెలంగాణా వాదులపై దాడులు చేయడానికి ఏ చిన్న అవకాశాన్నైనా వదులుకోవు. అందులో భాగమే KCR పై ఆరోపణలు. ఒక రాజకీయ నాయకునిగా చూసినప్పుడు నీకు KCR కి పెద్దగా తేడా లేక పోవచ్చు. కాని KCR తెలంగాణా ఉద్యమంలో ఉన్నంత వరకు తెలంగాణా ప్రజలు ఆయన్ను సపోర్టు చేసి తీరతారు. తెలంగాణా ఉద్యమంపై కుట్రలు చేస్తున్నంత వరకూ తమరిని, తమరి పార్టీని అధఃపాతాళానికీ తొక్కుతూనే వుంటారు.

KCR ఎక్కడ పుట్టాడని ఆయన తమరి సందేహం. ఎక్కడ పుడితే ఏమిటి చంద్రబాబూ? ఒక వేళ ఆయన కోస్తాలోనే పుట్టినా తెలంగాణా సాధన కోసం పాటు పడకూడదా? "నా ప్రాంతం వాడు, నాకులం వాడు" అనే ఆలోచనలు నీలాంటి పచ్చకామెర్ల రోగికి ఉంటే ఉండవచ్చు. అంతే గానీ తెలంగాణా ప్రజలు మనిషి ఏ ప్రాంతం వాడు అని కాదు, వారి అభిప్రాయాలు ఎటువంటివి అని మాత్రమే చూస్తారని తెలుసుకో.

ఇక పోతే KCR కుటుంబ పాలన గురించి మీ రెండో ఆరోపణ. KCR వారసులు ఉద్యమంలో క్రియాశీలక పాత్రను పోషిస్తున్నారు. ఆ క్రమం లో పదవులు పొందితే పొందవచ్చు. అది తప్పో రైటో కాసేపు పక్కకు పెడితే మహానాడులో ఏ పాత్రా లేని తమ పుత్రరత్నం భారీ కటౌట్లు ఎందుకు పెట్టించినట్టు స్వామీ? దానిమీద అలిగే కదా జూనియర్, హరికృష్ణ తమరికి దూరం జరిగింది? అంతెందుకు? మరి తమరెక్కడి నుండి ఊడి పడ్డారో? NTR వారసుల వరసలో కాదా?     

KCR కి మంత్రి పదవి ఇచ్చుంటే TRS పార్టీయే పెట్టేవాడు కాదని, తెలుగుదేశం లోనే ఉండేవాడని తమరి మరో ఆరోపణ. నిజమే కావచ్చు. మరి మంత్రి పదవి ఎందుకివ్వలేదో తమరు? ఆయన పార్టీలో తమకన్నా సీనియర్ కాదా? తమకన్నా ఎక్కువ రాజకీయ చతురత, వాగ్ధాటి ఉన్న నాయకుడనేగా మీరు అణగదొక్కాలని చూసింది? తమ పార్టీలో నాయకులంటే తమరి చెప్పుకింద తేళ్ళ లాగా, మన్ను తిన్న పాముల్లాగా పడి వుండాలి. తమరు కీ ఇస్తే బొమ్మల్లాగా ఆడాలి. అలా కాక పోతే తమరు సాహించరన్న విషయం జగమెరిగిన సత్యం కాదా? అలాంటప్పుడు KCR పార్టీని వదిలి వెళ్లిపోవడంలో వింతేముంది?

KCR సంగతి పక్కకు పెడితే, అసలు మీ మామగారు తెలుగుదేశం పార్టీ పెట్టక పోయున్నట్టైతే తమరెక్కడ ఉండేవారు స్వామీ? హస్తం నీడలో సోనియా జపం చేస్తూ తరించే వారు కాదా? NTR పార్టీ పెట్టినా అధికారం లేనంత  వరకూ అధికారంలో వున్న కాంగ్రేసునే పట్టుకొని వేళ్ళాడుతూ, మామ పైనే సవాళ్లు విసరలేదా? NTR అధికారం లోకి రాగానే అంగలార్చుకుంటూ వచ్చి, అల్లుడి హోదా అడ్డం పెట్టుకుని తెలుగుదేశం పార్టీలో ప్రవేశించి, ఆనక పార్టీ  చక్రం అంది పుచ్చుకున్న చరిత్ర తమది కాదా? చివరకి ఆదరించిన మామనే వెన్నుపోటు పొడిచిన తమ ఘనచరిత్ర మరచి పోయారా?        

ఆరేడువేల పోలీసు బలగాలను, మరో పదివేల మంది కిరాయి గూండాలను వెంటేసుకెళ్ళి తెలంగాణలో జనం లేని మీటింగొకటి పెట్టి, ఆ వాపును బలుపని భావిస్తున్నారేమో! KCR ని మాత్రమె కాదు, తెలంగాణా కోసం పాటు పడుతున్న ఏ నాయకుణ్ణి తిట్టినా తెలంగాణా ప్రజలు సహించరు. సమస్య పై ధైర్యంగా నిర్ణయం చెప్పే దమ్ములేని తమరు, తెలంగాణా వాదులను కించ పరచడం ద్వారా ఉద్యమాన్ని దెబ్బ తీయాలని చూస్తే, నిజం తెలుసుకోలేని వారు కాదు ప్రజలు.
   
   

Saturday, February 11, 2012

ఒక అబద్ధం, వందమంది గోబెల్స్



చాలా కాలం క్రితం- 2003లో అనుకుంటాను- ఒక ప్రముఖ జర్నలిస్టు యథాలాపంగా ఒక గొప్ప సూత్రం చెప్పారు. అది చాలా గొప్ప సూత్రమని తెలంగాణ ఉద్యమ సందర్భంగా నాకు మరింత బాగా అర్థం అయింది. అది తెలంగాణ రాష్ట్ర సాధన, కులాలు, అధికారాలపై చర్చ జరుగుతున్న సందర్భం. ఆయన చెప్పిన విషయం ఆయన మాటల్లోనే ‘‘తెలంగాణ వాళ్లు ప్రత్యేక రాష్ట్రాన్ని, సొంత రాజకీయ అస్తిత్వాన్ని సంపాదించుకోలేదు. సంపాదించుకున్నా నిలబెట్టుకోలేదు. తెలంగాణ వాళ్లు ఇంకా అమాయకత్వాన్ని అధిగమించి ఎదగలేదు. తెలంగాణ వాళ్లు అధికారంలోకి వచ్చినా మూన్నాళ్లకే వాళ్లకు తాటాకులు కట్టి గద్దె దింపేయగల శక్తులు వారికంటే బలంగా ఉన్నాయి. వాళ్లను ఎదుర్కొనే సాధనాలేవీ తెలంగాణ వారి వద్ద లేవు’’ అని ఆయన అన్నారు. ‘‘ఏమిటా సాధనాలు? ఎందుకిలా జరుగుతోంది?’’.

‘‘వేదకాలం, ఇతిహాసకాలం, చరిత్ర, చివరకు ఆధునికాంధ్రప్రదేశ్ నేర్పిన పాఠం నీకు అర్థం అవుతుందా? సమాజంపై అధికారాన్ని, ఆధిపత్యాన్ని శాశ్వతం చేసుకోవడానికి, దానిని జస్టిఫై చేసుకోవడానికి అక్షరం అన్నది ఒక బలమైన ఆయుధం. ఆ ఆయుధాన్ని సమర్థంగా ఉపయోగించుకున్నవాళ్లే నాటినుంచి నేటి వరకు సమాజంపై నిరాటంకంగా పెత్తనం కొనసాగించగలుగుతున్నారు. మా విషయమే తీసుకోండి. వేదాలు, ఉపనిషత్తులు, మంత్రం, తంత్రం రాసుకున్నాం. మాకు మేము అతీంద్రియ శక్తులను, అలౌకిక శక్తులను ఆపాదించుకున్నాం. ఈ ప్రపంచమంతా మంత్రభూతమైందని, ఆ మంత్రం తెలిసినవాళ్లం మేమేనని, ఇక్కడ శాంతిగా బతకాలన్నా, దర్పంగా రాజ్యాలు ఏలాలన్నా మమ్మల్ని ప్రసన్నం చేసుకోవాలన్న స్పృహను సమాజం నిండా వ్యాప్తి చేశాం.

మేము కేవలం అక్షరాన్ని, మంత్రాన్ని నమ్ముకున్నాం. చక్రవర్తులయినా మాకు సాష్టాంగపడవలసిందే. దేశాధినేతలయినా మా ఆశీర్వాదం పొందాల్సిందే. అది మా గొప్పతనం కాదు. మా అక్షరం గొప్పతనం. మేము సృష్టించుకున్న సాహిత్యం గొప్పతనం వేల సంవత్సరాలయినా ఆ అక్షరాల మహిమ తగ్గలేదు చూశావా?’’.
‘‘రాజులయినా అంతే. ఇతిహాసం చూడండి. చరివూతను చూడండి. మంచి రాజులుగా, స్వర్ణయుగకర్తలుగా, సాహితీ వల్లభులుగా చరిత్రలో మిగిలిపోయినదెవరు? ఒక్కసారి గుర్తు చేసుకోండి. రుషి, పండిత, కవి, గాయకులను చేరదీసి సాంస్కృతిక పోషణ చేసిన వారు, తమ పాలనకు సమర్థనగా అపారమైన సాహిత్యాన్ని సృష్టించుకున్నవారు, స్వయంగా అక్షరాలతో సహవాసం చేసినవారు మాత్రమే చరిత్రలో యుగపురుషులుగా మనకు ఇవ్వాళ మిగిలిపోయారు. వారిని గురించి మాత్రమే బాగా చదువుకుంటాం. గొప్పగా చెప్పుకుంటాం. వారిని గురించి మాత్రమే ఇతిహాసం లేక చారిత్రక కథలు, గాధలు, ఆధారాలు తరతరాలకు అందుతూ వచ్చాయి.

ఇన్ని వేల సంవత్సరాల్లో ఈ దేశాన్ని ఎంతమంది రాజులు, చక్రవర్తులు పరిపాలించి ఉంటారు? కానీ మహాభారత, రామాయణ పురుషుల సార్వకాలీనత, భోజరాజు గొప్పతనం, చంద్రగుప్తుని స్వర్ణయుగం, కష్ణదేవరాయల భువనవిజయం... ఇలా కొంతమంది గురించి మాత్రమే మనం ఎక్కువగా మాట్లాడుకుంటాం... ఎందుకు? మళ్లీ అక్షరమే కారణం. వారు సృష్టించుకున్న సాంస్కృతిక ప్రతిష్ఠ, సమర్థన, స్థానం(కల్చరల్ ఫేసు, జస్టిఫికేషన్ అండ్ స్పేసే) కారణం. ఆధునిక యుగంలో సీమాంధ్ర రాజకీయ నాయకత్వం, పారిక్షిశామిక నాయకత్వం, అందునా సీమాంధ్రకు చెందిన ఒక ప్రధాన సామాజిక వర్గం అటువంటి సాంస్కృతిక, సాహిత్య ఫేసు, స్పేసు సృష్టించుకుంది. ఆ ఫేసు, స్పేసుకోసం పుట్టినవే సీమాంధ్ర పత్రికలు, చానెళ్లు. తమకు అనుకూలంగా ఉన్నవారి పరిపాలనను జస్టిఫై చేసుకోవడానికి, తమకు నచ్చని వారిని ఎగతాళి చేసి ఎండగట్టడానికి ఈ పత్రికలు ఆది నుంచీ కృషి చేస్తూనే ఉన్నాయి.

మహాకవి శ్రీశ్రీ అన్నట్టు ఈ పత్రికలు తలుచుకుంటే ‘అనకొండలను, గోలకొండలను దాచగలవు. గోరంతలను కొండంతలు చేయగలవు’. ఒక కులాధిపత్యాన్ని, ఒక ప్రాంతాధిపత్యాన్ని, ఒక నేత ఆధిపత్యాన్ని కాపాడడానికి ఈ మీడియా ఎటువంటి కుట్రలు చేయగలదో ఈ మూడు దశాబ్దాల అనుభవం చాలు. అవినీతి పరుడిని ధర్మరాజుగా చూపగలవు. నీతిమంతుడికి తాటాకులు కట్టి మంట పెట్టగలవు. జలగం వెంగళరావును మహానుభావునిగా చిత్రించి నాలుగేళ్లు ఊరేగించిన పత్రిక, మర్రి చెన్నాడ్డిని ఏడాది తిరగకుండానే చెన్నాడ్డి చందాలడ్డి అని ముద్రవేసి సాగనంపేందుకు దోహదం చేయగలదు. నాదెండ్ల భాస్కర్‌రావును వెన్నుపోటుదారుగా చిత్రించి, ప్రజాస్వామ్య ఉద్యమం నడిపిన ఆ రెండు పత్రికలు, 1995 లో అదే పనిచేసిన నారా చంద్రబాబునాయుడిని ప్రజాస్వామ్య పరిరక్షకునిగా కీర్తించి నిలబెట్టగలవు.

తిమ్మిని బమ్మి చేయడం, బమ్మిని తిమ్మి చేయడం అనాదిగా నడుస్తూనే ఉంది. ఆ పత్రికలు నంది అంటే నంది, పంది అంటే పంది. వాళ్లు రాసిందే చరిత్ర. వాళ్లు ఇచ్చేదే కాండక్ట్ సర్టిఫికెట్. తెలంగాణవాళ్ల దగ్గర ఒక పత్రిక లేదు. ఒక చానెల్ లేదు. మీరు ఏం చేయగలరు? మీ ఉద్యమాన్ని ఎలా కాపాడుకోగలరు? మీ మీద జరిగే దాడిని ఎలా తిప్పికొట్టగలరు? తెలంగాణలో బలమైన సాహితీ సృజన ఉంది. కానీ తెలంగాణ రాజకీయాలు, ఉద్యమాలు, అస్తిత్వ పోరాటాల ప్రతినిధిగా ఒక బలమైన సాంస్కృతిక మీడియం ఏది?’’. ఇదంతా ఆయన ఆందోళనతో చెప్పిన విషయ మే. తరచి చూస్తే ఆయన చెప్పింది అక్షరాలా నిజమని తెలిసిపోతుంది. అనేకసార్లు రుజువయింది.

ఎనిమిదేళ్లు గడచిపోయాయి. తెలంగాణకు ఇప్పుడొక పత్రిక వచ్చింది. ఒక చానెల్ వచ్చింది. మరికొన్ని చానెల్‌లు కూడా తెలంగాణవాదాన్ని నిజాయితీగా రిపోర్టు చేస్తున్నాయి. ఈ పరిణామాన్ని సీమాంధ్ర నాయకత్వం, వారి ఆధిపత్యంలోని టీడీపీ, కాంగ్రెస్‌లు జీర్ణించుకోలేకపోతున్నాయి. తెలంగాణ ఉద్యమానికి వ్యతిరేకంగా, నమస్తే తెలంగాణ పత్రికకు వ్యతిరేకంగా కుట్రలు చేస్తున్నాయి. నమస్తే తెలంగాణను నైతికంగా దెబ్బతీయడానికి వీళ్లు చేయని ప్రయత్నం లేదు. ప్రత్యర్థిని దెబ్బతీయడానికి వీరు మొదటి నుంచీ అనుసరించే విధానం ఒక్కటే. ఇప్పుడూ అదే పద్ధతి అనుసరిస్తున్నారు. నిజాయితీగా యుద్ధం చేయడం చంద్రబాబు జాతకంలో లేదు. ఎదురొడ్డి పోరాడ్డం ఆయన నైజానికి విరుద్ధం.

కుట్రలు, కుతంత్రాలు ఆయనకు బాగా అచ్చొచ్చిన మార్గం. ఆయన కుట్ర ఎలా ఉంటుందంటే ‘ప్రత్యర్థిని దెబ్బతీయడానికి ఒక అబద్ధాన్ని సృష్టించు, వంద మంది గోబెల్స్‌ను తయారు చెయ్యి. ఆ ముఠాతో అదే అబద్ధాన్ని పదేపదే మాట్లాడించు. ఆ అబద్ధ ప్రచారకులు కూడా వీలైతే బడుగు బలహీనవర్గాలకు చెందిన వారయితే మంచిది. నోటిగదరోడయితే ఇంకా మంచిది. పత్రికలు, చానెళ్లలో ఆ అబద్ధానికి కొండంత ప్రచారం వచ్చేట్టు చూడు. ప్రత్యర్థి ఒక నేత కావచ్చు, ఒక ఉద్యమం కావచ్చు. మరో పత్రిక కావచ్చు’. నాడు ఎన్‌టిఆర్ విషయంలో అయినా సరే, నేడు కేసీఆర్ విషయంలో అయి నా సరే.

ఎవరి పోలవరం? ఎవరి టెండర్? టెండర్లు ఎలా వేస్తారు? డబ్బులు ఎప్పుడు వస్తాయి? తెలంగాణ ఉద్యమానికి, నమస్తే తెలంగాణ కు, పోలవరానికి ఏమిటి సంబంధం? కానీ సీమాంధ్ర నాయకత్వం, సీమాంధ్ర మీడియా లక్ష్యం ఉద్యమాన్ని, ఉద్యమకారుల నైతిక స్తైర్యాన్ని, నమస్తే తెలంగాణ నైతిక బలాన్ని దెబ్బతీయడం. అస్తిత్వం కోసం పోరాడుతున్న ఒక ప్రాంత ప్రజలపై సాగిస్తున్న అనైతిక యుద్ధంలో గెలవడమే తెలుగుదేశం, దాని అనుబంధ మీడియాకు ముఖ్యం. సత్యాసత్యాలు, నిజానిజాలు, ఉచ్ఛనీచాలు తర్వాత సంగతి. తడిగుడ్డలతో గొంతులుకోయడంలో వీళ్లు దిట్టలు. తెలంగాణ ఉద్యమం అదృష్టం-పోలవరం టెండర్ రద్దయి ఈ అబద్ధాల ముఠా నిజస్వరూపాన్ని బట్టబయలు చేసింది. కానీ ఒక అబద్ధాన్ని ఇంత నీచంగా మార్కెట్ చేయగలిగిన చంద్రబాబును ప్రజలు ఇంకా ఎందుకు నమ్మాలి? ‘స్యూ’ కంపెనీకి నమస్తే తెలంగాణకు ఏ విధంగానూ సంబంధం లేదు.

అది కృష్ణా జిల్లాకు చెందిన స్వర్గీయ వల్లూరిపల్లి నాగేశ్వర్‌రావు అనే పెద్దాయన ఎప్పుడో ఏర్పాటు చేసిన కంపెనీ. అందులో నమస్తే తెలంగాణ చైర్మన్‌కు ఉన్నది మూడు శాతం వాటా. కాంట్రాక్టర్లు, కార్పొరేట్లు, పవర్ బ్రోకర్‌ల సిండికేట్ అయిన టీడీపీకి కంపెనీల గురించి, ప్రాజెక్టుల గురించి, టెండర్ల గురించి, ఆదాయాల గురించి తెలిసినంతగా మరెవరికీ తెలిసే అవకాశం లేదు. సీక్రెట్ కొటేషన్ ద్వారా టెండర్లు పిలవడం అంటేనే, అది తెరిచే దాకా ఎవరికి వస్తుందో తెలియదు. తెరిచిన వెంటనే ప్రభుత్వం ఆమోదించి, అప్పగించాలనీ లేదు. అప్పగించినా డబ్బులు వెంటనే రావు. ఇన్ని విషయాలు తెలిసీ, తెలంగాణ ఉద్యమాన్ని, సకల జనుల సమ్మెను వేలకోట్ల రూపాయలకు అమ్మేశారని, నమస్తే తెలంగాణ పోలవరం డబ్బులతో నడుస్తోందని మోత్కుపల్లి, ఎర్రబెల్లి వంటి వారు వాగడం, సీమాంధ్ర మీడియా వాటిని ప్రముఖంగా ప్రచురించడం-ఇవన్నీ అమాయకంగా జరిగేవి కాదు.

ఒక ప్రాంతం, ఒక కులం, కొందరు నేతలు మీడియాను అడ్డం పెట్టుకుని తెలంగాణకు వ్యతిరేకంగా సాగిస్తున్న అధర్మ, అనైతిక, కుట్రపూరిత యుద్ధంలో భాగం ఈ ప్రచారం. అయితే తెలంగాణ ఒకప్పటి అమాయకత్వంలో ఇప్పు డు లేదు. చంద్రబాబు ఎప్పుడు ఏ జూదం ఎందుకు ఆడతాడో, ఏ కీలుబొమ్మకు ఎప్పుడు కీ ఇస్తాడో, మోత్కుపల్లి, ఎర్రబెల్లి వంటి బొమ్మలు ఎందుకు మాట్లాడతాయో ఇప్పుడు తెలంగాణవాదులు తేలికగానే అర్థం చేసుకుంటున్నారు. తెలంగాణకు ఇప్పుడు అనేక ఆయుధాలు ఉన్నాయి. ఒకనాడు ఆ జర్నలిస్టు ఆశించినట్టు తెలంగాణకు ఇప్పుడు సాంస్కృతిక ఫేసూ, స్పేసూ ఆవిర్భవించాయి. కుట్రలను పసిగట్టగల నేర్పు ఇప్పుడు తెలంగాణ ప్రజలకు ఉంది. ఆలస్యం అయితే కావచ్చు, కానీ అంతిమ విజేత తెలంగాణ ఉద్యమమే.

Friday, February 10, 2012

జైలు అధికారి, ఖైదీలు



బక్కోడు: సార్, మీరు లేనిది చూసి వీడు నన్ను విరగ్గొడుతున్నాడు సార్. దయ చేసి నన్ను వేరే లాకప్ కి మార్చండి సార్. వీడి దగ్గర నేను బతక లేను.

బలిసినోడు: కాదు సార్, వీడు అబద్ధాలాడు తున్నాడు.  మీరు లేనిది చూసి వీడే నన్ను విరగ్గొడుతున్నాడు. వీడి వల్ల నాకే ఎక్కువ నష్టం సార్.

అధికారి: అవునా? అయితే ఇద్దరినీ చెరో సెల్ లో వేస్తాను.

బక్కోడు: ఆ పని చేయండి సార్, పుణ్యం వుంటుంది.

బలిసినోడు: అలా ఎలా కుదురుతుంది సార్? కొట్టాడని ఆరోపిస్తే లాకప్ మార్చాలని ఏ రూల్ వుంది చెప్పండి? అదీ గాక నేను కొడుతున్నానని వీడు ఆరోపణ చేశాడు కాబట్టి, దానివల్ల నా ఆత్మ గౌరవం దెబ్బతింది కాబట్టి... నేను కొట్టడం లేదని వీడు ఒప్పుకునేంత వరకు వీణ్ణి వేరే సెల్ లో వేయడానికి నేను ఒప్పుకోను.

అధికారి: నువ్వేంట్రా ఒప్పుకునేది? కావాలంటే వెంటనే మార్చేయ గలను. కాని ఇప్పుడు మటుకు మీ తగవు తీర్చడానికే ప్రయత్నిస్తున్నాను.

(బలిసినోన్ని చూస్తూ) అసలు నువ్వు కూడా ఆరోపించావుగా వాడే నిన్ను కొడుతున్నాడని? మరి వాడు నిన్ను కొడుతున్నప్పుడు నీకు వేరుగా ఉంటేనే సౌకర్యంగా వుంటుంది కదా? ఎందుకు ఒప్పుకోవు?

బలిసినోడు: సార్, వీడు నా సాటి ఖైదీ. ఇంతసేపు కలిసి ఉన్నాక ఇప్పుడు విడిపోదామంటే కుదరదు. కొట్టుకోవడం తిట్టుకోవడం ఖైదీల మధ్య మామూలుగా జరిగేదే. అంతమాత్రం చేత విడిపోతానంటే ఎలా? దెబ్బలు తింటూ కూడా నేను కలిసి వుండడం లేదా? వాడు ఎందుకు విడిపోతాననాలి?

అదంతా ఎందుకు? నేను వాణ్ని కొట్టలేదని ఒప్పుకోమనండి... అప్పుడు ఆలోచిస్తాను.

బక్కోడు: ఓరి బలిసినోడా! నువ్వు కొట్టలేదని నేను ఒప్పుకోవాలా? అలా ఒప్పుకుంటే ఏమంటావు? కొట్టనప్పుడు విడిగా ఉంచడ మెందుకు అని ప్రశ్నించవూ? సమైక్య తెలివితేటలు బాగానే వంట బట్టించుకున్నావు.

బలిసినోడు: సార్, మీరు వీడి వాదన పట్టించు కోవద్దు. జైల్లోకి తీసుకొచ్చినప్పుడు మీరే గదా అడిగారు... ఇద్దరూ  ఒకే సెల్లో ఉంటారా అని? అప్పుడు వీడూ ఒప్పుకున్నాడుగా... అప్పుడు సమైక్యతకు ఒప్పుకొని ఇప్పుడు విడిపోతానంటే ఎలా?

బక్కోడు:  అప్పుడేదో తోడుదొంగవని కలిసుందామన్న మాట నిజమే. అంతమాత్రాన నా ప్రాణాలకు ఆపద వస్తున్నా కూడా కలిసే ఉండాలా?

అయినా నా భద్రత ఎక్కడుందో నిర్ణయించు కోవడం నా హక్కు. ఆ విషయమే అధికారిని అడుగుతున్నాను. మధ్యలో నీకేం సంబంధం?

బలిసినోడు:  అన్యాయానికి గురయ్యానని నువ్వు చేస్తున్న వాదన పూర్తిగా అసమంజసమైనది. నేను లావుగా వుండి ఒకవైపు నీకు రక్షణ కల్పిస్తుంటే, నువ్వు విడిపోతాననడమే అసలు అన్యాయం. నీ పక్కన నేను వుండడం వాళ్ళ నీకు లాభమే గాని నష్టం వుండదు.

అధికారి: వార్నీ! ఇప్పుడే కదరా, వాడే నిన్ను కొడుతున్నాడని ఆరోపించావు. అంతలోనే మాట మార్పా? నీది నాలుకా తాటిమట్టా?

బలిసినోడు:  మీరు ఎన్నయినా చెప్పండి సార్. ఈ విభజనకు నేనొప్పుకోను. ఇప్పుడు వీడి ఆరోపణల కారణంగా మా ఇద్దరినీ విభజిస్తారు. రేపు ఇంకో సెల్లో వేరే ఖైదీ కూడా ఇదే ఆరోపణ చేస్తాడు. వారినీ విభజిస్తే ఎల్లుండి మరో ఖైదీ. ఇలా ఎంతమందిని విభజించ గలరు? ఇది అన్యాయం, జైలు సమగ్రత దృష్ట్యా దీన్ని నేను తీవ్రంగా ఖండిస్తున్నాను.

అధికారి: (ఆలోచనలో పడ్డాడు) నిజమే రోయ్. ఇది నేను ఆలోచించ లేదు.

బలిసినోడు:  (ఉత్సాహంతో) చూసారా సార్! ఇందులో ఎంత మతలబు వుందో? విడదీయడమంటే అంత సులభ మనుకున్నారా సార్?

అధికారి: ఒరే! వేరే ఖైదీల గురించి నీకెందుకురా? నువ్వేమైనా ఖైదీలందరి గురించి ఆలోచించే స్పార్టకస్ వా? జైల్లన్నిటి గురించి ఆలోచించే డీజీపీవా? ఖైదీవి ఖైదీలా వుండు. ఇంత సేపు విచారించిన తర్వాత కూడా ఎవడు ఎవన్ని కొట్టాడో తెలుసుకోలేనంత ఎదవననుకున్నావా నేను? సరే, నిన్ను తీసుకెళ్ళి ఆ సిక్స్-పాక్ తమిళన్ సెల్లో వేస్తా. సమైక్యంగా వుంటావా?

బలిసినోడు:  బాబోయ్, అక్కడొద్దు సార్. వాడు రోజుకు మూడు పూటలు ఖైమా చేసి మరీ నన్ను చంపుకు తింటాడు.

అధికారి:  వాడైతే వద్దా? ఈ బక్కోడైతే నీకు ముద్దా? నేనేమైనా కేంద్ర ప్రభుత్వాన్ననుకున్నవురా నువ్వు -చెప్పిందల్లా వినడానికి? ఇరగదీస్తా నేమనుకున్నావో!


Thursday, February 9, 2012

గుడ్డు మీది ఈకలు


కోడిగుడ్డులో బలవర్ధకమైన పోషక పదార్థాలున్నాయి, నిజమే. పిల్లలకు రోజూ ఒక కోడిగుడ్డు పెడితే బలంగా ఎదుగుతారన్నదీ నిజమే. అంతమాత్రాన కోడిగుడ్డు మీద ఈకలు పీకాలని చూస్తే...

అవును మరి! తెలంగాణా కోడిగుడ్లను చూస్తే ప్రతీ వాడికీ ఈకలు పీకాలని అనిపిస్తుంది మరి! 

అసలు విషయానికి వస్తే... 

జగన్ మోహన్ రెడ్డి పర్యటనలో కొంతమంది కోడిగుడ్లు విసిరారట. ఆ కోడిగుడ్లు ఆయన తుడుచుకొని వెళ్లి పోయాడట. మరింకేంటి అంటారా! అదేనండీ, ఆ గుడ్లను తిండి లేని పిలగాండ్లకు పెడితే ఎంత బలంగా తయారవుతారో కొంతమంది సోదాహరణంగా వివరించడం మొదలు పెట్టారు.

అవును మరి! ఓ సినిమాకు వ్యతిరేకంగా విజయవాడలో వర్మగారి మీద గుడ్లు పడితే వీరికి కనపడదు. కడపలో రైతులు రోడ్లమీద టమాటాలు కుమ్మరిస్తే కనపడదు. కాని, ఎవడైనా తెలంగాణా వాడు ఒక సమైక్యవాద నాయకుని మీద కోడిగుడ్డు వేస్తే మాత్రం... ఆరోగ్య సూత్రాలూ, పోషక పదార్థాల విలువలూ, తిండి లేని దౌర్భాగ్యుల వివరాలూ గుర్తొస్తాయి.

తెలంగాణలో నైనా, ఆంధ్రాలో నైనా, ఆ మాటకొస్తే ప్రపంచంలో ఏ ప్రాంతంలో నైనా రాజకీయ నాయకుని పైన కోడిగుడ్డో, కాలి బూటో ఎందుకు విసురుతారు? వారికి డబ్బులు ఎక్కువయ్యా? కానే కాదు. కడుపు మండి! ఆ కడుపుమంట వల్ల వచ్చిన కసితో. ఏ రాయో విసరకుండా కోడిగుడ్డు విసరడం, అలా విసిరినందుకు లాఠీ దెబ్బలు తినడం, ఆపైన కేసుల్లో ఇరుక్కోవడం అంటే అది ఒక శాంతియుతమైన ప్రజాస్వామ్య బద్ధమైన నిరసన రూపం కాబట్టే.

వీళ్ళు విసిరే ఒకటి రెండు కోడిగుడ్లతో ఎంతమంది తెలంగాణా పిల్లగాండ్ల కడుపులు నింపుతారో కూడా చెపితే బాగుండేది. ఈ సమెక్కుడు వాదుల మాటలు ఎట్లా ఉంటాయంటే, సహాయ నిరాకరణోద్యమంలో గాంధీ తగుల బెట్టించిన బట్టలకు కూడా ఖరీదు లెక్కించే బాపతు గాళ్ళు వీళ్ళు. వీళ్ళ దృష్టిలో తెలంగాణా వాడు ఏది చేసినా తప్పే, అదే పని ఆంధ్రా వాడు చేస్తే ఆత్మగౌరవం, మట్టీ మశానం.

ఇలాంటి పిచ్చోళ్ళ నీతులు మనకవసరమా?

Saturday, February 4, 2012

తెలంగాణ ద్రోహులపై చార్జిషీట్


తెలంగాణ కోసం జరిగిన ఆత్మహత్యలన్నీ హత్యలే. నిజమే. కానీ హంతకులెవరు? 2009 డిసెంబరు 9 తర్వాతనే ఆత్మహత్యలు ఎందుకు మొదలయ్యాయి? యువకాశల నవపేశల సుమగీతావరణంలో హోరెత్తాల్సిన యువకెరటాలు అగ్నికీలల్లో దూకి కాలిపోవలసిన అగత్యం ఎందుకు వచ్చింది? తెలంగాణ యువకుల హృదయాలను ఛిద్రం చేసిన శక్తులేవి? తెలంగాణ స్వప్నాన్ని భగ్నం చేసిన ధూర్తులు ఎవరు? తెలంగాణ ఇస్తమని మాటతప్పిన మారీచులు ఎవరు? వచ్చిన తెలంగాణకు అడ్డంపడిన సైంధవు లెవరు? తెలంగాణ శ్రేణులు ఏకోన్ముఖంగా ఉద్యమిస్తుంటే సీమాంధ్ర నేతల గులాములుగా ఉద్యమంపైకి విషం చిమ్మి, ఉన్మాద ప్రేలాపనలతో గందరగోళం సృష్టించిన ఇంటిదొంగలు ఎవరు? తెలంగాణ ఉద్యమానికి వ్యతిరేకంగా వికృత కథనాలను, అబద్ధాల పంచాంగాలనూ ప్రచురించి పిల్ల ల మనసును గాయపరిచిన పత్రికలు, చానెళ్లు ఏవి? తెలంగాణలో 700 మందిని బలి తీసుకున్నవారిపై, తెలంగాణకు అడ్డం పడిన వారిపై, తెలంగా ణ ఉద్యమంలో గందరగోళం సృష్టించాలనుకుంటున్న వారిపై చార్జిషీటు దాఖలు చేయాల్సివస్తే, అది ఎలా ఉంటుంది? నిందితుల జాబితా ఎలా ఉంటుంది? మొదటి ముద్దాయి ఎవరు? చివరి ముద్దాయి ఎవరు? అభియోగాలు ఏమిటి?

అభియోగాలు ఏవి?
  1. రాష్ట్రంలో ఏర్పడిన రాజకీయ ఏకాభిప్రాయం ప్రాతిపదికగా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియను ప్రారంభిస్తున్నట్టు ప్రకటించి, ఆ మరుసటి రోజే మాట తప్పి, తెలంగాణ ప్రజలకు తీరని ద్రోహం తలపెట్టడం.
  2. తెలంగాణపై అటు కేంద్రం, ఇటు రాష్ట్రంలోని కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీలు మాటతప్పి తెలంగాణ యువకులను నిరాశా నిస్పృహలకు గురిచేసి, వారిని ఆత్మహత్యలకు పురికొల్ప డం. 700 మందికి పైగా యువకుల ఆత్మహత్యలు, కాదు హత్యలకు కారణం కావడం.
  3. 2009 డిసెంబరు 9కి ముందు వరకు తెలంగాణకు అనుకూలంగా మాట్లాడిన సీమాంద్రుల నాయకత్వంలోని పార్టీ లు రాత్రికిరాత్రి మాటమార్చి రాజీనామాల డ్రామాతో ప్రజాస్వామిక ప్రక్రియకు భంగం కలిగించడం.
  4. ఎన్నికల మ్యానిఫెస్టోల్లో, శాసనసభ వేదికల్లో, పార్లమెంటులో ఇచ్చిన హామీలను వమ్ము చేసి కాంగ్రెస్, టీడీపీలు ప్రజాస్వామ్య ద్రోహానికి, రాజ్యాంగ ద్రోహానికి పాల్పడడం.
  5. సీమాంధ్ర రాజకీయ పార్టీలు, నాయకుల ప్రయోజనాలకు అనుకూలంగా, తెలంగాణకు వ్యతిరేకంగా తెలంగాణ ఉద్యమ శ్రేణుల్లోనే గందరగోళం సృష్టించేందుకు కుట్రలు చేయడం.
  6. సీమాంధ్ర మీడియా-కొన్ని పత్రికలను, చానెళ్లను అడ్డంపెట్టుకుని తెలంగాణకు వ్యతిరేకంగా, ఉద్యమకారులకు వ్యతిరేకంగా తప్పుడు ప్రచారాలు చేసి, తెలంగాణ ప్రజల మనోభావాలను దెబ్బతీయడం.
  7. ప్రపంచ చరిత్రలోనే అత్యంత ప్రజాస్వామ్యయుతంగా జరిగిన 42 రోజు ల సకల జనుల సమ్మెను, తెలంగాణ నలుమూలలా , అన్ని వర్గాల ప్రజ ల్లో వెలు ప్రజానిరసనను గుర్తించడానికి నిరాకరించడం.
  8. తెలంగాణకు శాపంగా మారిన తెలంగాణ కాంగ్రెస్, తెలుగుదేశం నేతల రాజకీయ బానిస బుద్ధి. సీమాంధ్ర రాజకీయ నాయకులు, మీడియా ఇన్ని కుట్రలు చేస్తున్నా తెలంగాణ నేతలు ఇంకా వారి సంకల్లోనే కూర్చు ని ఉద్యమంపైకి రాళ్లు విసరడం ద్వారా తెలంగాణ ప్రజలను తీవ్ర క్షోభ కు గురిచేయడం.
  9. తెలంగాణ ప్రజల అస్తిత్వ కాంక్షలను, ఉద్యమ దీక్షను సవాలు చేస్తూ తెలంగాణపైకి సీమాంధ్ర నాయకుల రాజకీయ దండయాత్రలను ప్రోత్సహించడం.
  10. ప్రజాస్వామికంగా జరుగుతున్న ఉద్యమాన్ని అణచివేయడానికి నిరంకుశ అణచివేత విధానాలను అమలు చేయడం. వేలాది మంది విద్యార్థులు, యువకులపై అసంఖ్యాకంగా కేసులు నమోదు చేసి, జైళ్లపాలు చేయడం.
  11. ఆంధ్రలో కల్తీసారా తాగి మరణించినవారి కుటుంబాలను పరామర్శించిన చంద్రబాబు, ఇతర సీమాంధ్ర నేతలు తెలంగాణలో ప్రత్యేక రాష్ట్ర కాంక్ష భగ్నమై మరణించినవారి కుటుంబాల్లో ఒక్కరిని కూడా పరామర్శించక పోవడం.

అభియోగాలను రుజువు చేసే సాక్ష్యాధారాలు
  1. కాంగ్రెస్, తెలుగుదేశం, పీఆర్పీ మ్యానిఫెస్టోలు, రాష్ట్రపతి ప్రసంగాలు, సోనియాగాంధీ ప్రసంగం.
  2. అసెంబ్లీలో, పార్లమెంటులో ఆ పార్టీల నేతలు చేసిన ప్రసంగాలు.
  3. రాజీనామా డ్రామాలకు సంబంధించిన అసెంబ్లీ రికార్డులు.
  4. 2009 డిసెంబరుకు 9కి ముందు తర్వాత చంద్రబాబు, చిరంజీవి, రోశయ్య, ఇతర నేతలు తెలంగాణపై చేసిన ప్రకటనల పత్రిక క్లిప్పింగులు, విడియో క్లిప్పింగులు.
  5. యువకుల ఆత్మహత్యల వార్తల పత్రిక క్లిప్పింగులు, విడియో ఫుటేజ్‌లు.
  6. ఆత్మహత్యలు చేసుకున్న యువకుల మరణవాంగ్మూలాలు, వారు రాసిన లేఖలు.
  7. మృతుల తల్లిదండ్రుల వాంగ్మూలం.
  8. 2009 డిసెంబరు 9, ఆతర్వాత చిదంబరం చేసిన ప్రకటనల విడియో క్లిప్పింగులు.
  9. విద్యార్థులపై, ఉద్యమకారులపై పెట్టిన కేసులు, నిర్బంధాల రికార్డులు.
ముద్దాయి ఎవరు?

మొదటి ముద్దాయి- కేంద్ర ప్రభుత్వం: 
2004లో తొలి యుపిఎ ప్రభుత్వం ఏర్పడినప్పుడే కనీస ఉమ్మడి కార్యక్రమంలోనూ, రాష్ట్రపతి ప్రసంగంలోనూ తగిన సమయంలో తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటుచేస్తామని హామీ ఇచ్చింది. కాన్సెన్సస్(విస్తృతాంగీకారం) కుదిరితే తెలంగాణ ఏర్పాటుకు సిద్ధమేనని చెబుతూ వచ్చింది. తొలి యుపిఎ పాలన సమయంలోనే ప్రధాన ప్రతిపక్షమైన బిజెపితో సహా దేశంలోని 30 రాజకీయ పక్షాలు తెలంగాణకు అనుకూలంగా లేఖలు ఇచ్చాయి. విస్తృతాంగీకారం అప్పుడే వచ్చింది. కానీ యుపిఎ కావాలనే తెలంగాణ ప్రజలను వంచిస్తూ వచ్చింది.

డిసెంబరు 2009లో రాష్ట్రంలో మళ్లీ కేసీఆర్ దీక్షతో ఉద్యమం ఉధృతమైన నేపథ్యంలో అన్ని రాజకీయ పక్షాలు అఖిలపక్ష సమావేశంలో తెలంగాణ ఏర్పాటుకు విస్తృతాంగీకారం తెలియజేశాయి. పార్లమెంటులో, శాసనసభలో అన్ని పార్టీలూ తెలంగాణ ఏర్పాటు చేయాలని డిమాండు చేశాయి. తదనుగుణంగా డిసెంబరు 9న కేంద్రం తెలంగాణ ఏర్పాటు ప్రక్రియను ప్రారంభిస్తున్నట్టు ప్రకటించింది. కానీ రాష్ట్రంలోని సీమాంధ్ర నాయకులు రాజీనామాల డ్రామా ఆడడంతో కేంద్రం కూడా ప్లేటు ఫిరాయించింది. ఒకసారి విస్తృతాంగీకారం ఏర్పడిన తర్వాత, కేంద్రం ఒక రాజకీయ ప్రక్రియను ప్రకటించిన తర్వాత దానిని తిరగదోడడం నమ్మకద్రోహం, ప్రజాస్వామ్యానికి విఘాతం, రాజ్యాంగస్ఫూర్తికి విరుద్ధం. కేంద్రంలోని యుపిఎ ప్రభుత్వం విశ్వాసఘాతుకానికి పాల్పడింది. ఇందుకు ఆ ప్రభుత్వం తెలంగాణ ప్రజల దండనకు అన్ని విధాలా అర్హమైంది.

రెండవ ముద్దాయి-కాంగ్రేస్:
తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియను ప్రారంభిస్తున్నామని కేంద్ర హోంమంత్రి చిదంబరం ప్రకటించారు. ఈ ప్రకటన చేయడానికి ముందు సోనియాగాంధీ, మన్‌మోహన్‌సింగ్‌ల సారథ్యంలో కాంగ్రెస్ అత్యున్నతస్థాయి కోర్ కమిటీ పలుమార్లు సమావేశమై చర్చించింది. కేంద్రం సూచన మేరకే అప్పటి ముఖ్యమంత్రి రోశయ్య అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేసి తెలంగాణ ఏర్పాటుపై కాంగ్రెస్‌తోపాటు తెలుగుదేశం, పీఆర్పీ, సిపిఐ, బిజె పి, టీఆస్ అంగీకారాన్ని తీసుకుని కేంద్రానికి పంపారు. ఆ తీర్మానం ప్రాతిపదికగానే హోంమంత్రి చిదంబరం ప్రకటన చేశారు.

అంటే కాంగ్రెస్ తెలంగాణ ఏర్పాటుకు సిద్ధపడే ఇవన్నీ చేసింది. ఇన్ని జరిగిన తర్వాత మళ్లీ రాజకీయ పక్షాల అభిప్రాయాలు కావాలని మొదలు పెట్టడమంటే తెలంగాణ ప్రజలను వంచించడమే, దగా చేయడమే. మరికొంతకాలం కాలయాపన చేసే కుతంవూతమే. సీమాంధ్ర రాజకీయ నాయకుల ఒత్తిళ్లకు తలొగ్గి ప్రజాస్వామిక ప్రక్రియను వమ్ము చేయడమే. ఒక సమస్యపై విస్తృతాంగీకారాన్ని ఒకసారి సాధిస్తే చాలదా? ఎన్నిసార్లు విస్తృతాంగీకారం కావాలి? ఎన్నేళ్లు ఈ నాటకాలు కొనసాగిస్తారు? కాంగ్రెస్ సీమాంధ్ర నాయకత్వం కనుసన్నల్లోనే తెలంగాణ ప్రజలను హింసిస్తున్నది. వేధిస్తున్నది. కాంగ్రెస్ కుట్రల కారణంగానే తెలంగాణ యువకులు నిరాశా నిస్పృహలతో ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. తెలంగాణ గర్భశోకానికి ప్రధాన కారణం కాంగ్రెసే. తెలంగాణ ప్రజలు విధించే శిక్షలకు కాంగ్రెస్ నాయకత్వం అన్ని విధాలా అర్హమైంది.

మూడవ ముద్దాయి-తెలుగుదేశం:
నిజానికి పీఆర్పీ రావడంతోనే తెలుగుదేశం పతనం మొదలైంది. ఒకప్పు డు అసెంబ్లీలో ‘తెలంగాణ’ పదాన్ని నిషేధించిన తెలుగుదేశం పార్టీ 200 వచ్చేసరికి తెలంగాణ నినాదాన్ని ఎత్తుకుంటే తప్ప బతకలేని పరిస్థితి. తెలంగాణలో ప్రత్యేక రాష్ట్ర నినాదాన్ని అందుకుని పార్టీని బతికించుకుంటే, ఆంధ్రాలో ఆదరువుతో బతికేయవచ్చని టీడీపీ భావించింది. అందుకే తెలంగాణపై ఎర్రన్నాయుడు అధ్యక్షతన ఒక కమిటీ వేసి, విస్తృతంగా సంప్రదింపులు జరిపి, ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటుకు మద్దతుగా తీర్మానం చేసింది. తీర్మానం ప్రతినిధి ఎర్రన్నాయుడు ప్రణబ్‌ముఖర్జీ కమిటీకి కూడా అందజేశారు.

ఇవేవీ రహస్యంగా జరగలేదు. కమిటీల ఏర్పాటు, సంప్రదింపులు, తీర్మానం చేయడం, ప్రణబ్ కమిటీకి అందజేయడం అన్నీ పత్రికల్లో విస్తృతంగా వచ్చా యి. అప్పుడెప్పుడూ సీమాంధ్ర తెలుగుదేశం నాయకులకు సమైక్యాంధ్ర గుర్తుకు రాలేదు. అప్పుడెప్పుడూ అభ్యంతరాలు చెప్పలేదు. చివరకు 2009 డిసెంబరు 7, 9 తేదీల్లో తెలంగాణపై తీర్మానం పెట్టాలని కూడా టీడీపీ సవాలు చేసింది. అశోకగజపతి రాజు నాయకత్వంలోని టీడీపీ ప్రతినిధి బృందం అఖిలపక్షం సమావేశానికి హాజరై ప్రత్యేక రాష్ట్ర తీర్మానానికి మద్దతు తెలిపింది. కానీ చిదంబరం ప్రకటన వచ్చిన మరుక్షణమే చంద్రబాబు ప్లేటు ఫిరాయించారు. సడన్‌గా రెండు కళ్ల సిద్ధాంతం అంటూ కతలు మొదలు పెట్టారు. ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటుకు వ్యతిరేకంగా సీమాం ధ్ర నాయకులతో రాజీనామాలు చేయించారు. ప్రజాస్వామ్యంలో, రాజకీయాల్లో చేయకూడని విశ్వాసఘాతుకానికి, విద్రోహానికి పాల్పడ్డారు. మాట మార్చి, నీతి తప్పి, తెలంగాణ ప్రజల హృదయాల్లో కనీవినీ ఎరుగని సంక్షోభానికి కారకులైన టీడీపీ నాయకత్వం అన్ని రకాల శిక్షలకూ అర్హమైందే.

నాలుగువ ముద్దాయి-తెలంగాణ నేతలు:
ఉద్యమంలో తెలంగాణ కాంగ్రెస్, టీడీపీ నేతలది అడుగడుగునా విద్రోహపాత్రే. తెలంగాణ కాంగ్రెస్ ఎంపీలు కొంత తెగువ ప్రదర్శించినా, వారు కూడా చివరికి దాగుడు మూతల్లోకే జారిపోయారు. టీడీపీ నేతలైతే తెలంగాణ పాలిట బ్రూటస్‌లుగా మారారు. నలభైండు రోజుల సకల జనుల సమ్మె తెలంగాణ చరివూతలో వీరోచితమైన ఉద్యమం. ఉద్యమం తీవ్రంగా నడుస్తున్న కాలంలో కాంగ్రెస్ మంత్రులు, ఎమ్మెల్యేలు, టీడీపీ ఎమ్మెల్యేలు మరోసారి రాజీనామాచేసి రాజకీయ సంక్షోభం సృష్టించి ఉంటే ఈ పాటికి తెలంగాణ సమస్య పరిష్కారమై ఉండేది. తెలంగాణకు ఈ గుండెకోత కొంతయినా తప్పి ఉండేది. ఈ ఆత్మహత్యలు నిలిచిపోయేవి. బయటివారి విద్రోహం కంటే ఇంటిదొంగల చేతగానితనం, రాజకీయ నంగనాచితనం తెలంగాణ ప్రజలను బాగా కలచివేస్తోంది. సొంత రాజకీయ అస్తిత్వంలేని ఈ వానపాములను ఎన్నుకున్నందుకు తెలంగాణ ప్రజలు కుమిలిపోతున్నారు. అవకాశం వచ్చినప్పుడు వీరిని శిక్షంచడానికి వెనుకాడరు.

ఐదవ ముద్దాయి-సీమాంధ్ర మీడియా:
తెలంగాణకు వ్యతిరేకంగా ఒంటికాలుపై లేచే చానెళ్లు, పత్రికలు కొన్ని ఉన్నాయి. ‘తోడేళ్లు, గుంటనక్కలు, పిచ్చి కుక్కలు, గుడ్ల గూబలు మానవరూపం ఎత్తి తెలంగాణలోనే సంచరిస్తున్నాయి. ఇక్కడి ఉద్యమకారులపైకే ఎగబడుతున్నాయి’ అని ఒక సందర్భంలో ఒక కవి అన్నారు. ఈ తోడేళ్లను, గుంటనక్కలను కెమెరాల ముందు కూర్చోబెట్టి తెలంగాణవాదంపై విద్వేషాన్ని, విషాన్ని, ఉన్మాదాన్ని కక్కిస్తున్నాయి ఈ చానెళ్లు, పత్రికలు. తెలంగాణ ఉద్యమానికి వ్యతిరేకంగా, తెలంగాణ ద్రోహులకు అనుకూలంగా అసత్య, అర్ధసత్య, కాల్పనిక కథనాలను వండివార్చి, తెలంగాణ యువతను నిరాశా నిస్పృహల్లోకి నెట్టి, వారిని ఆత్మహత్యలకు పురికొల్పి వినోదిస్తున్న పత్రికలు, చానెళ్లు కూడా తెలంగాణ ప్రజల శిక్షల నుంచి తప్పించుకోలేవు.

తీర్పు
తీర్పు ప్రజలకు తెలుసు. ఇప్పుడు తెలంగాణ ప్రజ మరోసారి మోసపోవడానికి సిద్ధంగా లేదు. సీమాంధ్ర పార్టీలు, మీడియా చేసే కుట్రలను ప్రజలు ఇప్పుడు తేలికగానే పసిగట్టగలుగుతున్నారు. ఎప్పుడు ఎటువంటి తీర్పు ఇవ్వాలో ప్రజలు రిజర్వు చేసుకునే ఉంటారు.

- కట్టా శేఖర్ రెడ్డి


Thursday, February 2, 2012

కుంటాలపై కుట్రలు


తెలంగాణ నయాగరా కుంటాల జలపాతంపై పెద్దల కన్నుపడింది. జలపాతాన్ని పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేస్తారనుకుంటే పొరపాటే. పాలకులు దాని అందాలను కనుమరుగు చేసి అక్కడ ఉన్న అపారమైన ఖనిఖ సంపదను దోచుకోవడానికి రాజీపవర్ ప్రాజె క్టు వారు రెండు దశాబ్దాలుగా తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నా రు. దీనికి ప్రజా ప్రతినిధుల అండదండలు ఉన్నాయనడంలో అతిశయోక్తి లేదు. దక్షిణ భారతదేశంలోనే ఎత్తెన జలపాతంగా పేరొందిన ఈ జలపాతం సహజసిద్ధంగా ఏర్పడింది. ఎంతో పురాతనమైనది కూడా. ఈ జలపాతా న్ని సందర్శించడానికి రాష్ట్ర నలుమూలనుంచే కాకుండా పొరుగు రాష్ట్రాల నుంచి వేలాదిమంది పర్యాటకులు వస్తుంటారు. ఇలాంటి చారిత్రాత్మక స్థలాన్ని అభివృద్ధి పేరిట విధ్వంసం చేయడానికి పాలకులు పూనుకొంటున్నారు. కుంటాల జలపాతంపై విద్యుత్ ఉత్పాదన కేంద్రం నిర్మించి దాన్ని కొల్లగొట్టడానికి చకచకా ఫైళ్ళు కదులుతున్నాయి. కేవలం ఆరు మెగావాట్ల విద్యుత్తు ఉత్పత్తి కోసం ఇక్కడ ఉన్న సంపదను దోచుకోవడానికి రాజీపవర్ ప్రాజెక్టు పేరుతో కుట్రపన్నుతున్నారు.

ఈ ప్రాంతంలోని గ్రానైట్ మిగతా ఖనిజ సంపదపై కన్నువేసిన పెట్టుబడిదారులు 1991లోనే హైడల్ పవర్ ప్రాజెక్టు ఏర్పాటు కోసం ప్రభుత్వానికి దరఖాస్తు చేసుకున్నారు.

ప్రతిపాదనలు వచ్చిందే తడవుగా అటవీ, రెవెన్యూ ట్రాన్స్‌కో, చిన్న నీటిపారుదల శాఖ ఐటిడిఏ, డిఆర్‌డిఏ, నెడ్‌క్యాప్ తదితర శాఖ అధికారులను ప్రభుత్వం హైడల్ ప్రాజెక్టు సంబంధించిన సమాచారం ఇవ్వాలని ఆదేశించింది. హైడల్ ప్రాజెక్టు ఎన్‌ఓసీ చకచకా జారీ చేసి పాలకులకు తెలంగాణ పట్ల ఉన్న వివక్షను చాటుకున్నా రు. కానీ అటవీశాఖ అభ్యంతరాలు తెలిపింది. దీనితో ఈ ప్రాజెక్టు ఆగిపోయింది. ఈ విషయాన్ని తెలుసుకొన్న గిరిజనులు తమ ఆరాధ్యదైవమైన సోమేశ్వర ఆలయం అదేవిధంగా అందాల జలపాతం కనుమరుగవుతుందని, ఒక చారిత్రాత్మక ప్రదేశాన్ని కోల్పోతామని పవర్ ప్లాంటు నిర్మాణానికి వ్యతిరేకంగా ఉద్యమాన్ని ప్రారంభించారు.

కుంటాల జలపాత పరిరక్షణ సమితి చేస్తున్న ఈ ఉద్యమానికి సంఘీభావంగా కుంటాల బచావో సమితి, కొమురంభీం ఆశయసాధన సమితి, తుడుందెబ్బ, ఆదివాసీ వికాస్ పరిషత్ తదితర ప్రజా సంఘాలు పోరాటం చేస్తుండగా వీటికి తోడు టీఆర్‌ఎస్, బీజేపీ, సీపీఐ, సీపీఎం, న్యూడెమోక్రసీ పార్టీలు ఉద్యమానికి మద్దతు ఇస్తున్నాయి. దీనికి తెలంగాణ పొలిటికల్ జేఏసీ కూడా అండగా నిలిచింది. విరసం నేత వరవరరావు, విద్యావంతుల వేదిక రాష్ట్ర అధ్యక్షులు మల్లేపల్లి లక్ష్మయ్య, ఉపాధ్యక్షులు శ్రీధర్‌దేశ్‌పాండే, ప్రధాన కార్యదర్శి పిట్టల రవీందర్ తదితరులు ఇప్పటికే కుంటాల జలపాతాన్ని సందర్శించారు. కుంటాల జలపాతాన్ని పరిరక్షించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

ఇటీవల నిర్మల్‌లో వేలాది మంది విద్యార్థులు పవర్‌ప్లాంటుకు వ్యతిరేకంగా భారీ ర్యాలీలు నిర్వహించారు. గిరిజన సంఘాలు తెలంగాణ ప్రజావూఫంట్ చైర్మన్ అధ్యక్షులు గద్దర్, విమలక్క, వేదకుమార్ హైదరాబాద్‌లో అరణ్య భవన్‌ను ముట్టడించారు.

ఆదిలాబాద్ కలెక్టరేట్‌ను వేలాది మంది గిరిజనులు దిగ్బంధించారు. ఈ క్రమంలో ప్రొఫెసర్ సూరేపల్లి సుజాత, సామాజికవేత్తలు ఈ ప్రాంతాన్ని సందర్శించి ప్రభుత్వం నిర్మించ తలపెట్టిన హైడల్ పవర్ ప్రాజెక్టును నిర్మాణాన్ని నిలిపివేయాలని కుంటాల జలపాతాన్ని పరిరక్షించాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారు. గిరిజనులు పవిత్ర స్థలంగా భావించే కుంటాల జలపాతం వద్ద జల్, జంగల్, జమీన్ కోసం పోరాడి అసువులు బాసిన కొమురం భీం విగ్రహాన్ని ఆవిష్కరించి అక్టోబర్ 16న కుంటాల జలపాతం వద్ద కొమురం భీం వర్ధంతిని ఘనంగా జరిపారు. కుంటాల జలపాతాన్ని నాశనం చేసే హైడల్ పవర్ ప్రాజెక్టు ఎట్టి పరిస్థితుల్లో నిర్మాణం జరగకుండా పోరాడుతామని కొమురం భీం సాక్షిగా ప్రతిన బూనారు.తెలంగాణ ప్రాంతంలో జరుగుతున్న వనరుల దోపిడీని అడ్డుకోవడానికి ఈ ప్రాంత ప్రజా ప్రతినిధులు ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలి. సీమాంధ్ర పాలకుల కుటిల యత్నాలను అడ్డుకోవాలి.

-పరశురామ్ సోలంకి
కుంటాల జలపాత పరిరక్షణ సమితి