Tuesday, December 11, 2012

అవ్వా, బువ్వా రెండూ దక్కవు


తెలంగాణా అంశం దిల్లీలో ఊపందుకున్న ప్రతిసారీ ల్యాంకో హిల్సులో ఫ్లాట్లమ్ముకునే వ్యక్తికి గుండె దడ పెరుగుడు మొదలైతడి.  ఏ హోం మంత్రో, ప్రధాన నేతో, తెలంగాణా పై ఒక విధాన ప్రకటన చేయంగనే ఫ్లాట్ల రేటు తగ్గుతదేమోనని గాయినకు ఎక్కడ లేని భయమైతది. హుటాహుటిన ఫ్లైట్లల్ల సూటు కేసులు మారుతై. ఏం జరుగ లేదన్నట్టు ఒక డిల్లీ గులాం తొండి మాటలు మాట్లాడుడు శురూ జేస్తడు.

మూడేండ్ల నుండి ఇదే కథ నడుస్తుంది. తెలంగాణా పోరాట శక్తుల పట్టుదలో, తె.కాంగ్రెస్  ఎంపీల బెట్టుదలో, మొన్న FDI ల పుణ్యమా అని అఖిల పక్ష సమావేశం ఏర్పాటుకు హోమ్ మంత్రి ద్వారా ప్రకటన వచ్చింది. అంతలోనే దాన్ని నీరు గార్చుడు మొదలైంది. గులాం గులాంగిరీ, ముఖ్యమంత్రి వాయిదా అభ్యర్ధన, హోం మంత్రి ఎంతమందయినా రావచ్చు... అనుకుంట ప్రకటనల శర పరంపర మొదలైంది.

ఈ మాత్రం దానికే స్వర్గాన్ని భూమ్మీదకు దించినట్టు ఉబ్బి తబ్బిబ్బవుతున్న తెలంగాణా కాంగ్రెస్ ఏమ్పీల్లారా, గత ఎనిమిదేళ్లుగా అణుశక్తి బిల్లు, అవిశ్వాస తీర్మానం, లోకపాల్ లాంటి అవకాశాలను సద్వినియోగ పరచుకొంటే, ఈపాటికి తెలంగాణా వచ్చేసుండేది.

కనీసం ఇప్పటికైనా మీరు బెట్టు దిగకుండా సక్రమంగా అఖిలపక్షం జరిగేటట్టు చూడండి. ఇప్పటికే షిండే సమావేశానికి ఒక్కరైనా రావచ్చు, ఎందరైనా రావచ్చు అని మొండి మాటలు మాట్లాడుతున్నడు. పార్టీకి ఒకరు మాత్రమె వచ్చి ఒకే అభిప్రాయం ఇచ్చేటట్టు మీరు జాగ్రత్త పడకుంటే, జనానికి మీ మీద ఉన్న కాస్త నమ్మకం కూడా సడలుద్ది. అధిష్టానం ఆడే డ్రామాల మీ పాత్ర ఉన్నదా, లేదా అనేది మాకు అనవసరం. మీ నిష్క్రియాపరత్వం చూస్తున్న వాళ్లకు మీరు కూడా పాత్రధారులే నాన్న నమ్మకం కలుగక మానదు.

అట్లా జరుగొద్దనుకుంటే, మీ చిత్తశుద్ధి ప్రజలకు నిరూపించాల్నంటే, మీరు తీసుకున్న మార్గంలో ధైర్యంగా ముందుకు నడవడమే మీకున్న మార్గం. మధ్యలో వదిలేస్తిరా, మీకు అవ్వా, బువ్వా రెండూ దక్కవు.  

No comments:

Post a Comment