Saturday, December 1, 2012

ప్రజాసమస్యలు పట్టని పాదయాత్రలు



ఇది పాదయాత్రల సీజన్. ప్రతి నాయకుడు, నాయకురాళ్ళు అనుకునేవాళ్ళు యాత్ర లు చేపడుతూనే ఉన్నారు. ఆ మొన్న ఆదిలాబాద్ జిల్లా లింగాపూర్ గ్రామం నుంచి ఒక ట్రైబల్ జాదవ్ విలాస్ నాయక్ యువ నాయకుడు జోడేఘాట్ దగ్గర నుంచి బతికుండి తెలంగాణ కోసం పోరాడాలి, బలిదానాలు సరికాదని ఆత్మహత్యలకు వ్యతిరేకం గా తెలంగాణ జిల్లాల్లో పాదయాత్ర చేస్తున్నానని చెప్పినప్పుడు ఆశ్చర్యపోవాల్సివచ్చింది. ఆయన గురించి ఎవరూ రాయరు. రాసినా ఎవరు చదవరు. ఆయన వెనుక ఒక పార్టీ కాని, అతని తండ్రి, అన్న, మామ ఎవరూ కూడా అతి పెద్ద పదవులు అనుభవించిన వారుకాదు. వారి గురించి అక్కడా ఇక్కడా రెండు ముక్కలు జిల్లా పేజీల్లోనో వేస్తే తప్పా తెలిసే అవకా శం లేదు. నల్గొండ జిల్లా తిరుమలగిరిలో ఒక ప్రభుత్వ టీచర్, ఎరుకల కులస్థుడు, సురపరశురాం తెలంగాణ వచ్చేదాకా పండుగలు చేసుకోవద్దనిపతి పండుగకి భార్య, కుమారునితో ఊరి చౌరస్తాలో దీక్ష చేస్తున్నడు. ఆయన గురించి ఎంతమందికి తెలుసు? కొంతమంది జిల్లా వారికి మాత్రమే తెలిసి ఉండవచ్చు.

ఇదే పరిస్థితి కాలువగట్టు మల్లన్న ఆధ్వర్యంలో సామాజిక తెలంగాణ బస్సు యాత్రకు అడుగడుగునా పోలీసువారు అడ్డుకున్నారు. నిజామాబాద్‌లో అరెస్ట్ చేశారు. అలాగే ముస్లిం సమస్యలపై అనేక సదస్సులు జరుగుతాయి. అవికూడా వార్తల్లోకి ఎక్కవు. ఇంకావిద్యార్థులు తెలంగాణ మంట ప్రజల గుం డెల్లో చల్లారకుండా ఉండడానికి బస్సుయాత్రో, పాదయాత్రో చేస్తుంటారు. అవి పెద్ద వార్తలు కావు. పోలవరం ప్రాజెక్టుకు వ్యతిరేకంగా ఒక రోజు జలదీక్ష చేస్తే ఎన్ని పత్రికలు ప్రచురించాయి? కానీ షర్మిలా, చంద్రబాబు పాదయాత్రలు పతాక శీర్షిక వార్తలు అవుతుంటాయి. పవర్ యాత్రలా మజాకా! తెలంగాణ వాళ్ళయితే లెక్క వేరేవిధంగా ఉంటది. 

రాష్ట్ర సాధన కోసం ఈ ప్రాంత ప్రజలు చేయని పోరాటం లేదు. ఆఖరికి ప్రాణాలు తీసుకున్నారు. ఏఒక్క నాయకుడైనా స్పందించక పోతారా అని అన్ని ప్రయత్నాలు చేశారు. ఏలిన వారు నేను కాదు వాళ్ళు, వాళ్ళు కాదు వీళ్ళు అని కుప్పిగంతులు వేస్తున్నారు. ఇప్పుడు జరిగే యాత్రలను చూస్తుంటే ఓటు రాజకీయాల కోసం వాళ్లు పడుతున్న పాట్లు చూస్తుంటే వీళ్లనేనా మనం నాయకులుగా ఎన్నుకున్నది అనిపిస్తుంది. తండ్రి పోయాడని జగన్‌మోహన్ రెడ్డి ఓదార్పు యాత్ర చేసి, వారి తండ్రి విగ్రహాలు ప్రతిష్టించారు. ఇప్పుడు అవినీతి ఆరోపణలతో అరెస్టై జైలులో ఉన్నాడు. దీంతో జగన్ మార్క్ రాజకీయాలు ఆకాశం నుంచి ఒక్కసారి కిందికి దిగి వచ్చినట్టుగా తెలుస్తుంది. ఆ తరువాత జగన్ తల్లి విజయమ్మతో యాత్రలు చేయించారు. జగన్ అనుకున్న పాచికలు పార తెలుసుకున్నారు వారి వెనుక ఉన్న వందిమాగధులు. వెంటనే మరో పాత్రను ప్రవేశపెట్టారు.వారి పేరు షర్మిల. ’జగనన్న కోసమే నేను, అన్న కోసమే నా యాత్ర’ (పదవి కోసమే మా కుటుంబ పాట్లు అని చదువుకోవాలి) మనం. దాని పేరు ‘మరో మహాప్రస్థానం’.

యాత్ర మొదలైంది తండ్రి సమాధి ఇడుపులపాయ నుంచి. అక్కడి నుంచే సెంటిమెంట్, ఎమోషన్ పూర్తిగా దట్టించి ప్రజలను తన యాత్రకి సిద్ధం చేశారు. జగనన్న కోసం యాత్ర చేపట్టిన చెల్లిని చూసి కరిగిపోయిన జనం కన్నీరు మున్నీరు అవుతున్నారు. రాయలసీమ యాసలో షర్మిల తెలంగాణ గడ్డ మీద మాట్లాడుతుంటే ఎంతమంది ప్రజలకు అర్థమవుతున్నదో వారే చెప్పాలి.

మీడియా ప్రచారం చూస్తుంటే చాలా వరకు వివిధ పార్టీలకు అనుగుణంగా పని చేస్తున్నాయి. కానీ ప్రజల సమస్యలను ఎప్పుడైనా పట్టించుకున్నాయా? మూడేళ్లుగా ప్రాణాల కు తెగించి పోరాడుతున్న తెలంగాణ సమస్యను పక్కనపెట్టి మళ్లీ ఎన్నికల సమర శంఖాన్ని పూరిస్తున్నై. హర్యానాలో రెండు నెలల కిందట 20 మంది దళిత మహిళలపై రేప్‌లు, గాంగ్ రేప్‌లు జరిగాయి. ఒక తండ్రి, ఒక అమ్మాయి ఆత్మహత్యలు చేసుకున్నరు. ఒక రాష్ట్రంలో ఒక కులం మహిళలపైనే ఎందుకు జరుగుతున్నాయి అన్నది వార్త కాదు. ఎన్నోసార్లు దళిత మహిళలు సర్పంచ్‌గా ఉన్నందుకు బట్టలూడదీసి, పరేడ్ చేయించి నానా హింసలు పెట్టిన సంఘటనలు కోకొల్లలు, ఈమహిళలు దొరసానులు కారు, వారి వార్తలు ఎవరూ రాయరు, కనీసం పట్టించుకోరు. రాజకీయాలు అంటే ప్రజలు, ప్రజా సమస్యలు, ప్రజాస్వామ్యం అని ఎవరైనా పొరపడి ఉంటే ఇప్పుడు జరుగుతున్న దేశ, రాష్ట్ర రాజకీయాలను చూసి మీఅవగాహనను మార్చుకొని పుస్తకాలలో కూడా మార్పులు తేవడానికి ప్రయత్నించగలరు. ఇవి రాచరికాలు. అగ్రకుల కుటుంబ రాజకీయాలు, వారసత్వ, పదవి పోరాటాలు అని చదువుకోవాలి.

చంద్రబాబు నాయుడు ‘వస్తున్నా మీకోసం’ అంటూ పాదయాత్ర చేస్తున్నారు. తొమ్మిదేళ్లు ముఖ్యమంత్రిగా ఏకఛత్రాధిపత్యంగా ఆంధ్రప్రదేశ్‌ని సైబర్‌ప్రదేశ్‌గా మార్చారు. ఇపుడు ఎటూ తేల్చుకోలేక, ఏ నిర్ణయం తీసుకోలేక అడకత్తెరలో పోక చెక్క మాదిరిగా సతమతమవుతున్నారు. వీరి వెనుక ఉన్న తెలంగాణ తెలుగుదేశం వారికి ఇక ప్రైవేట్ సైన్యం తప్ప మరొక దిక్కులేదు. ఈసారి ఎలాగైనా పదవి చేపట్టాలని వారు పాదయాత్ర మొదలుపెట్టారు. వారు పదవి కోసం పడే పాట్లు చూస్తుంటే జనాలకు కడుపు తరుక్కుపోతున్నది. ఈ పాదయాత్రల వల్ల ఒరిగేది ఏమిటో కాస్త చదువు రాని అమాయకులకి చెబితే బాగుంటుంది. గతంలో చంద్రబాబు నాయుడి యాత్రలో రాయలసీమ గూండాలతో వచ్చి కనపడ్డ ఉద్యమకారులపైన దాడులు చేయించారు.అదేవిధంగా విజయమ్మ సిరిసిల్ల యాత్రలో ఉద్యమకారురాలు రహీమున్నిసాపై జరిపిన దౌర్జన్యకాండ ప్రజలందరూ ప్రత్యక్షంగా చూశారు. తమకంటూ సొంత రక్షణ లేకుండా సీమాంధ్ర నేతపూరైనా తెలంగాణలో యాత్ర చేసే ధైర్యముందా అని ఇక్కడి ప్రజలు సవాలు విసురుతున్నారు.

కోదండరాం చంద్రబాబు నువ్వెట్ల వస్తావో చూస్తామని ఒక సవాల్ విసిరిన్రు. అనుకున్నట్లుగానే అడ్డుపడ్డరు. తెలంగాణపై చంద్రబాబు స్పష్టమైన వైఖరి చెప్పమని తెలంగాణ సంఘాలు, ప్రజలు అమాయకంగా అడుగుతుంటారు. ఎక్కడైనా జామచెట్టుకి మామిడి కాయలు కాస్తాయా? ఈ ఆంధ్రా లాబీ రాజకీయాలు తెలంగాణ తెస్తాయా? తెలంగాణ అన్న పదం వినపడకుండా ఎన్టీఆర్ కాలం నుంచి తెలుగుదేశం ఎన్ని కుట్రలు పన్నింది? ఎన్ని చట్టాలు పకడ్బందీగా చేసింది? అవన్ని ప్రజలు మర్చిపోయారా? 1972 జై ఆంధ్ర ఉద్యమంలో బాబు గారు విద్యార్థి నాయకుడు, ముల్కీరూల్స్‌ని నిర్వీర్యం చేయడానికి అవతరించిన ఉద్యమానికి నాయకత్వం వహించిన వ్యక్తి.

మామను వెన్నుపోటు పొడిచినట్టు సొంత పార్టీ నేతలే చెప్పుకున్నారు. ఆతరువాత వచ్చిన రాజశేఖర్‌డ్డి కేంద్రాన్ని తన గుప్పి ట్లో పట్టుకొని ప్రత్యేకఆర్థిక మండళ్లు కొడుక్కి, బొగ్గునిక్షేపాలు అల్లుడికి ఆస్తిగా కట్నంగా రాసి ఇచ్చారు. ఉద్యమకారుల గొంతుల్ని నొక్కలేదా? ఇవన్నీ మరిచిపోయి మనం మీరు తెలంగాణకు అనుకూలమా కాదా చెప్పండి అనడం విడ్డూరంగాఉంది. ఇన్ని చావులు, ఇన్ని ఉద్యమరూపాలు చూసి కదలని వారు ఇప్పుడు కదిలితే దాని అర్థం ఏమిటి? ఎవరికి కావాలి వీరి సానుభూతి? ఇంతకి తెలంగాణకు అనుకూలమని చెప్పి సాధించేది ఏమిటి? పోయిన ప్రాణాలు తిరిగి ఇస్తారా? పోయిన ఉద్యోగాలు, భూములు, వనరులు వస్తాయా?

కాంగ్రెస్‌లోని కొంతమంది కొత్త వేషంగట్టి తెలంగాణ కోసం పార్లమెంట్ ముందు నినాదాలిస్తున్నారు. సోనియాగాంధీ ఇంకా కరుణిస్త లేరు. కొందరు ఎంపీలు పార్లమెంట్ గుమ్మం లో భిక్షాందేహి అంటే తెలంగాణ వచ్చును. నోట్ దిస్ పాయింట్ మై డియర్ యంగ్ ఫ్రెండ్స్. మీరు అనవసరంగా మీ ప్రాణాలని అర్పించకండ్రి మీ కాల్మొక్తం. కాంగ్రెస్ అనగానే ఒక జాతి, ఒక కులం అనుకునేరు. పార్టీల్లో ఆంధ్రా, తెలంగాణ, రాయలసీమ నాయకులు వేరయా! ఎంపీలు ఢిల్లీలో ఉండు ను మరి ఎమ్మెల్యేలు, మంత్రులు ఎప్పుడు జగన్ పార్టీలో దూకుదామా అని లెక్కలు వేసుకోనును, బహు ముచ్చటగా దొరికినంతా దోచుకొని మళ్లీ ఎన్నికలకు సిద్ధమగును. ఎవరేం మాట్లాడుతున్నారో అర్థం కాదు. ఛలోక్తులు! ఇవి ఇక్కడ తెలంగాణ పాలి‘ట్రిక్స్’!

ఆ మధ్య కాంగ్రెస్‌వారు ఫ్లోరైడ్ బాధితుల కోసం ఒక యాత్ర చేపట్టి 200 కోట్ల దానం ప్రకటించారు. ఇంతవరకు దాని చడీచప్పుడు లేదు, ఈ మధ్య కాలంలో తెలంగాణ నెటిజెన్స్ ఫోరం యువత ఫ్లోరైడ్ సమస్యపై ఇందిరాపార్క్ వద్ద ఒకరోజు దీక్ష చేపట్టింది. అప్పుడు మేము ఇక్కడి రాజకీయ పార్టీలకు, పెద్ద పెద్ద సంఘాలకు ఒక సవాల్ విసిరాము. మా జీతభత్యాలతోని, మా యవ్వన జీవితాన్ని తెలంగాణకు, ఇక్కడి సమస్యలకు కేటాయిస్తున్నాం మీరు ఏం చేస్తున్నారని? ఇన్నేళ్లుగా పదవులు అనుభవిస్తూ కేంద్ర, రాష్ట్ర మంత్రి పదవుల ను చేపట్టిన నాయకుల దగ్గరి నుంచి నల్గొండ జిల్లాలో ఉన్న నాయకులు ఆ ప్రాంతానికి చేసింది ఏమిటి? ఈ రాజకీయ స్వార్థ యాత్రలపై, తెలంగాణ ప్రజలు ధిక్కారగళాన్ని వినిపిస్తున్నారు. మీ యాత్రల వల్ల ప్రజలకు జరిగే లాభం ఏమీ లేదు. నిజంగా మీరు సమస్యలపై యాత్రలు చేస్తుంటే.. ఇక్క డ జరుగుతున్న ప్రకృతి విధ్వంసంపై, ప్రజల జీవితాలతోని ఆడుకుంటున్న ప్రభుత్వ విధానాలపై మాట్లాడండి. లక్షింపేట, బాక్సైట్, పోలవరం, సెజ్‌లు, పోర్టుల వంటి సమస్యలపై మాట్లాడండి, పోరాటం చేయం డి. ప్రజలకు న్యాయం అందించండి. మేము తెలంగాణకు అడ్డంకాదు అంటూనే ఈ సమస్యను చాకచక్యంగా పక్కన పెడుతున్న తీరును ప్రజలు నిశితంగా గమనిస్తున్నారు. మీ వెంట వచ్చేవాళ్లంతా మీకు ఓట్లు వేస్తారని భ్రమపడవద్దు. ఇవ్వాళ తెలంగాణలో జిల్లాకు ఒక సమస్యతో సతమతమవుతున్నది. దాని మీద నోర్లు విప్పండి. ఓపెన్‌కాస్ట్, గ్రానైట్ మైనింగ్‌ల తవ్వకాలపై మీ వైఖరి చెప్పండి. నీటిని, భూమిని పేదలకు పంచి, వనరుల రక్షణ బాధ్యత పేదలకు ఇస్తామని చెప్పే దమ్ము, ధైర్యం ఎవరికైనా ఉందా? ఒకవేళ ఉంటే ఇన్ని పాదయావూతల అవసరాలు రాక పోవచ్చు.

-సుజాత సూరేపల్లి
తెలంగాణ రచయితల వేదిక రాష్ట్ర ప్రధాన కార్యదర్శి
Re-published from Namasthe Telangana

No comments:

Post a Comment