Monday, April 30, 2012

పాలనలో మార్పు వస్తే సరిపోతుందా?


"రాష్ట్రం కొత్తగా ఏర్పాటు కావడం వల్ల ఒరిగే దేమీ లేదు. ఒక కొత్త ముఖ్యమంత్రి రావడం తప్ప. అప్పుడూ ఇలాగే అవినీతి వుంటుంది. అప్పుడూ ఇలాగే దోపిడీ వుంటుంది. కాబట్టి రాష్ట్రం ఏర్పాటు కోసం పోరాడడం కన్నా, అవినీతిని, దోపిడీని అంతం చేయడానికి పోరాడితే బాగుంటుంది."

ఒక వైపు తాము తెలంగాణా ఏర్పాటుకు అడ్డు కాదు అని చెబుతూనే, లోక్ సత్తా వంటి మధ్యేవాద పార్టీలు, సీపీయం వంటి సమైక్యవాద పార్టీలు ఇలాంటి విచిత్ర వాదనలు చేస్తుంటాయి.

పై మాటల్లో అవినీతి అనే పదం లోక్ సత్తాది, దోపిడీ అనే పదం మార్క్సిస్టు పార్టీది.

నిజంగా అవినీతి రాష్ట్రంలో అంతమైంది అనుకుందాం. మరి దాని ప్రభావం విధాన నిర్ణయాల్లో ఉంటుందా? ఒక ప్రాంతానికి అనుకూలంగా నిర్ణయాలు తీసుకునే పాలకులపై అవినీతి వ్యతిరేక చట్టం ఎలాంటి నిఘా ఉంచ గలుగుతుంది? ఒక ప్రాంతం యొక్క చరిత్రను, సంస్కృతిని నాశనం చేయాలనుకునే వారిని ఎలా నియంత్రించ గలుగుతుంది?

అవినీతి నిరోధక చట్టం ఒక ప్రాజెక్టు నిర్మాణంలో అవకతవకలను నియంత్రించ గలుగుతుందే తప్ప, అసలు ప్రాజెక్టు ఎక్కడ నిర్మించాలనే విషయం మీద ఎలాంటి ప్రభావం చూప గలుగుతుంది? పై ప్రశ్నలన్నింటికి ఒకటే జవాబు, 'లేదు' అని. 

మరి అలాంటప్పుడు అవినీతి పై పోరాటం అనవసరమా? లేదు, తప్పకుండా చేయవలసిన పోరాటమే. కాని అది దేశం మొత్తం కలిసి చేయవలసిన పోరాటం. అందులో తెలంగాణా కూడా తప్పక భాగస్వామ్యం కలిగి వుంటుంది. కాని ఆ పోరాటం వల్ల మాత్రమే తెలంగాణా సమస్యలు తీరవు. 

తెలంగాణా ప్రాంతానికి వున్న సమస్యలు అవినీతిపై పోరాటం కన్నా పెద్దవి. తెలంగాణా పోరాటం అంతటి అవినీతి వ్యతిరేక ఉద్యమం దేశమంతా వచ్చి వుంటే ఈ పాటికి అవినీతి అంతమై ఉండేది. కాని బలమైన ప్రజా ఉద్యమం నిరంతరం కొనసాగుతున్నా కూడా తెలంగాణా రావడంలో జాప్యం జరుగుతుంది. దాన్ని బట్టే అర్థం చేసుకోవచ్చు, తెలంగాణా వ్యతిరేక శక్తులు ఎంత బలంగా వున్నాయో! అవి అవినీతి వ్యతిరేక శక్తుల కంటే కూడా బలమైనవి!!

ఇక మార్క్సిస్టుల వాదన పరిశీలిద్దాం.

వీరి నిర్వచనం ప్రకారం ప్రజలు రెండు వర్గాలుగా వుంటాయి. ఒకటి దోచుకునే వర్గం. రెండు దోపిడీకి గురికాబడే వర్గం.  ఇది సర్వత్రా రుజువు కాబడిన సూత్రమే. అయితే ఏది దోపిడీ వర్గం అని నిర్వచించడమే వచ్చిన చిక్కు. కారల్ మార్క్సు ఆర్థిక శాస్త్రం రాసిన తర్వాత అనేక రకాల దోపిడీలు నిర్వచించ బడ్డాయి. వాటన్నిటినీ పరిగణన లోకి తీసుకో లేక పోవడం మార్క్సు తప్పు కాక పోవచ్చు. ఎందుకంటే ఆయన జీవితంలో అలాంటి దోపిడీ వైపరీత్యాలు చూసి ఉండలేక పోవచ్చు.

మనదేశంలో ఇప్పటికీ కులవివక్ష కొనసాగుతుంది. ఇది దోపిడీ కన్నా ఏమాత్రం తక్కువ విషయం కాదు. ఆర్ధిక, సాంఘిక సంబంధమైన హోదాతో సంబంధం లేకుండా తక్కువ కులాలవారు విచక్షణకు గురి కాబడుతున్నారు. ఈ విషయంలో మార్కిజం నిస్సహాయత బయట పడింది. కొండొకచో ఆయా మార్కిస్టు, మావోయిస్టు పార్టీలలోనే కులగజ్జి ప్రకంపనలు వెలుగు చూశాయి. గద్దర్ లాంటి వారు బహిరంగంగానే విమర్శలు చేసి బయటకు వచ్చారు.

అలాగే లింగ వివక్ష. దోపిడీ వర్గం, దోచుకోబడే వర్గం, ఉన్నత కులం, నిమ్న కులం వీటిలో దేనితో సంబంధం లేకుండా స్త్రీ అన్ని వర్గాల్లోనూ విచక్షణకూ, దోపిడీకీ గురికాబడుతుంది. ఈ సమస్యలకు మార్క్సిజంలో స్పష్టమైన సమాధానాలు దొరకలేదు కాబట్టే, ఆయా రకాలైన పోరాటాలు వేటికవే ప్రత్యేకంగా జరుగుతున్నాయి.   

అలాంటిదే ప్రాంతీయ దోపిడీ. ఇక్కడ జరుగుతున్నది ఒక ప్రాంతంపై ఏక మొత్తంగా వేరొక ప్రాంతం జరుపుతున్న దోపిడీ. అవి జల వనరులు కానీయండి, పుస్తకాలలో పాఠాలు కానీయండి, నిధులలో, ఉద్యోగాలలో వివక్ష కానీయండి. గత ఐదు దశాబ్దాలుగా జరిగిన వివక్ష ఇప్పటికే బట్టబయలైంది. ఒక వేళ కమ్యూనిజమే అధికారంలోకి వచ్చినా ఈ వివక్ష అంతమౌతుందన్న భారోసా ఎంతమాత్రం లేదు. (అసలు వివక్షనే గుర్తించలేని పార్టీలు, దాన్ని అంతం చేస్తాయంటే ఎలా నమ్మగలం?) 

ఈ రకమైన ప్రాంతీయ దోపిడీకి వ్యక్తులుగా ఎవరూ బాధ్యులు కాక పోవచ్చు. కాని దోపిడీకి గురి కాబడుతున్న ప్రాంతానికి తమ అస్తిత్వాన్ని, తమ జాతి సంస్కృతిని, చరిత్రను, నుడికారాన్ని కాపాడుకునే బాధ్యత, తమ తర్వాతి తరాలు అంతరించి పోకుండా కాపాడుకోవలసిన కర్తవ్యం వున్నాయి. అది ఈ ప్రాంతాన్ని ప్రత్యేక రాజ్య విభాగంగా గుర్తింప జేసుకోవడం వల్లనే అది సాధ్యం.

ప్రత్యేక రాష్ట్రం ఏర్పడడం వల్ల వెంటనే అవినీతి తొలగిపోదు. మిగతా వివక్షలు సమసి పోవు. వాటికోసం దేశంలోని ప్రజలందరితో కలిసి ఉద్యమాలు చేయవలసిందే. కాని, రాష్ట్రం ఏర్పడడం వల్ల మాత్రమే ప్రాంతీయ దోపిడీ సమసి పోతుంది. 

ప్రత్యేక రాష్ట్రం ఏర్పడితే ఈ గడ్డ పై ఏ చరిత్ర బోధించాలనే విషయం పొరుగువాడి నిర్ణయంపై ఆధార పడి వుండదు. ఈ గడ్డఫై పుట్టిన మహనీయుల విగ్రహాలు నెలకొల్పుకోవడానికి పొరుగువాడిని దేబిరించాల్సిన అగత్యం వుండదు. ఈ గడ్డపై తమకు హక్కుగా రావాల్సిన నియామకాల కోసం తరతరాలుగా నిరంతర విఫల పోరాటాలు చేయవలసిన అగత్యం వుండదు. అలాగే ఈ గడ్డపై జాలువారుతున్న జలాలను ఇక్కడ ఉపయోగించుకోవడం కోసం ఇంకొకడిని ప్రాధేయ పడుతూ విఫల యత్నాలు చేయవలసిన అవసరం అంతకంటే ఉండదు. అందుకే ఈ పోరాటం అత్యవసరం.

No comments:

Post a Comment