తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేయాలంటూ ఏళ్ల తరబడి సాగుతున్న ఉద్య మం మరో మలుపు తిరిగింది. ఒకవైపు తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు కె. చంద్రశేఖరరావు ఢిల్లీలో నెలరోజులపాటు బైటాయించి తనదైన శైలిలో లాబీయింగ్ చేయడం, మరోవైపు, ఐక్య కార్యాచరణ సమితి ఆధ్వర్యంలో సాగరహారం చోటుచేసుకోవడం ఆ మలుపులో కీలక ఘట్టాలు. తెలంగాణ రాష్ట్రం కావాలని ఉద్యమిస్తున్న, లాబీయింగ్ జరుపుతున్న నేతల మాటేమో కానీ, ప్రజల మాట మాత్రం ఒకటే! వారికి కావలసిందల్లా తమ రాష్ట్రం తమకు కావాలి అంతే! ఈ నేపథ్యంలోనే లాబీయింగైనా, సాగరహారమైనా విశ్లేషించుకోవాలి.
ఐతే, సాగరహారానికి ఎదురైన అడ్డంకులు ఇన్నీ అన్నీ కావు. ప్రజా సంఘాలను, రాజకీయ పార్టీలను,వ్యక్తులను, ఉద్యమకారులను కలుపుకుపోవడానికి ఐకాస నాయకులు చేసిన కృషి అభినందనీయం. నిర్వహణ మరో వారం రోజులుందనగా ప్రభు త్వం రకరకాల పద్ధతులతో తనదైన శైలిలో మోకాలడ్డడం ప్రారంభించింది. అంతర్జాతీయ స్థాయి జీవ వైవిధ్య సదస్సు ఆరంభానికి, వినాయక నిమజ్జనానికి మధ్యన, సెప్టెంబర్ 30న తలపెట్టిన సాగరహారాన్ని వాయిదా వేసుకొమ్మని ప్రభుత్వం ఒత్తిడి తెచ్చింది. హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ దెబ్బతింటుందన్న ప్రచారాన్నీ లేవదీసింది. శాంతి-భద్రతల సమస్య తలెత్తవచ్చన్న అనుమానాన్నీ బయట పెట్టింది. మార్చ్‌ను వాయిదా వేసుకోవాలని ఐకాస నాయకులకు నచ్చచెప్పే బాధ్యతను తెలంగాణ ప్రాంత మంత్రుల పై పెట్టాడు ముఖ్యమంత్రి. ససేమిరా అన్న ఐకాస నాయకులు సాగరహారం నిర్వహణకే కట్టుబడి ఉన్నారు. పోలీస్ కమిషనర్‌ను, ఇతర పోలీసు ఉన్నతాధికారులను కలిసి మార్చ్ నిర్వహణకు అనుమతి కోసం ప్రయత్నం చేశారు. అనుమతి ఇవ్వడానికి నిరాకరించిన పోలీసు పెద్దలు, తమదైన శైలిలో ఒక అనుమానాన్ని కూడా బయటపెట్టారు. నగరంలోని సీమాంధ్రుల ఆస్తులపై దాడి జరిగే ప్రమాదం ఉన్నదని చెప్పుకొచ్చారు.మరోవైపు తెలంగాణ మంత్రులను తెర పైకి తెచ్చారు ఐకాస నాయకులు. అనుమతి ఇప్పించే బాధ్యతను వారికి అప్పజెప్పారు.
ఏదేమైతేనేం....మంత్రుల కృషి ఫలించింది. పోలీసు అధికారులు సాగర హారానికి అనుమతి ఇచ్చారు. అది షరతులతో కూడిన అనుమతి. కాని.. చివరకు జరిగిందేమిటి? ఆంధ్రప్రదేశ్ చరివూతలో కనీవినీ ఎరుగని రీతిలో పోలీసుల అరాచకం చోటు చేసుకున్నది. నిర్బంధకాండ రాజ్యమేలింది.
ఎక్కడికక్కడ బారికేడ్లు, చెక్‌పోస్టులు వెలిశాయి. ఉస్మానియా విశ్వవిద్యాలయ ప్రాంగణంలో యుద్ధకాండ చోటుచేసుకున్నది. సాగరహారం జరిగే చోటుకు ర్యాలీగా వెళ్లకూడదన్న ఆంక్షలు విధించిన పోలీసులు, ఎక్కడివారిని అక్కడే నిలిపివేశారు. ఒక్కరొక్కరే సాగరహారం నిర్వహించే స్థలానికి చేరుకోవాలన్న అసంబద్ధ నిబంధనను విధించి దారుణంగా ప్రవర్తించారు. మార్చ్ జరపాల్సిన స్థలాన్ని జలియన్ వాలాబాగ్ చేశారు. అన్ని వైపుల నుంచీ అక్కడకు చేరే మార్గాలను మూసేశారు. ఐనప్పటికీ, పోలీసు కంచెలను ఛేదించుకుం టూ, బారికేడ్లను అధిగమించుకుంటూ వేలసంఖ్యలో తెలంగాణవాదులు, ఉద్యమకారులు సాగర తీరానికి చేరుకున్నారు. లక్షలాది మంది సమక్షంలో మార్చ్ విజయవంతంగా నిర్వహించబడింది. చివరకు పోలీసుల భాష్పవాయువు ప్రయోగం, లాఠీ చార్జ్ సాగరహార స్థలానికి కూడా చేరుకునే దాకా పరిస్థితి వచ్చింది. నేతల ఉపన్యాసాల అనంతరం, రాత్రిపొద్దుపోయిన తర్వాత మార్చ్ ముగిసినట్లు నిర్వాహకులు ప్రకటించారు.
మొత్తం మీద ఐకాస నాయకుల పరంగా శాంతియుతంగాను, పోలీసులపరంగా అశాంతియుతంగాను సాగరహారం సమాప్తమైంది. బహుశా ప్రపంచ చరిత్రలోనే అత్యంత శాంతియుతంగా నిర్వహించిన మార్చ్ లాగా చరిత్ర పుటల్లోకి ఎక్కింది. సాగర హారం పిలుపు ఇచ్చినప్పటి నుంచి ఆరోజున ఏదో జరగబోతోందన్న ఆశ చాలామంది తెలంగాణవాదులలో మొలకెత్తింది. తెలంగాణకు సంబంధించి ఏదో ఒక ప్రకటన మార్చ్ మొదపూట్టకముందే వెలువడుతుందన్న ఆశ కలిగింది. కానీ ఇవేవీ జరగలేదు. చివరకు లక్షలాది మంది ఉద్యమకారులు పీవీ ఘాట్ వద్ద గుమికూడినప్పటికీ ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగలేదు. ఏదో ఒక ప్రకటన ప్రభుత్వం నుంచి వెలువడేంత వరకు అక్కడ నుంచి కదిలేది లేదని ఐకాస అధ్యక్షుడు కోదండరాం ప్రకటించారు. కానీ ఎడతెగకుండా కురిసిన భారీ వర్షం, భాష్పవాయు ప్రయోగాలు, లాఠీచార్జీలో వందలాదిగా గాయపడిన ఉద్యమకారుల పరిస్థితి కారణంగా..వ్యూహం మార్చుకున్న ఐకాస నాయకులు అర్ధరాత్రి సమయానికి మార్చ్‌ను నిలుపుదల చేస్తున్నట్లు ప్రకటించారు.
కథ సుఖాంతమయ్యేటప్పటికి నిర్వాహకులతో సహా, పోలీసు వర్గాల వారు కూడా ఊపిరి పీల్చుకున్నారు. వాస్తవానికి ప్రభుత్వ అనుమతే లభించకపోయినట్లయితే, పరిస్థితి మరోవిధంగా వుండే అవకాశాలుండేవి. కేంద్ర హోంమంత్రి సుశీల్ కుమార్ షిండే చెప్పినట్లు మార్చ్ ప్రశాంతంగానే ముగిసిందనాలి. పోలీసులు తెలంగాణ వాదుల మీద కనబర్చిన అతి ఉత్సాహం మాత్రం తీవ్ర విమర్శలకు దారితీసింది.
హైదరాబాద్‌లో పరిస్థితి ఇలా వుంటే అక్కడ ఢిల్లీలో వున్న చంద్రశేఖరరావు కాలికి బలపం కట్టుకుని తన లాబీయింగ్ కొనసాగించాడు. పార్లమెంటరీ ప్రజాస్వామ్యం లో లాబీయింగ్ చేయడం, ప్రభుత్వంపై ఒత్తిడులు తేవడం సహజం. అదే పని చంద్రశేఖరరావు చేస్తే తప్పేంటి? వాస్తవానికి చంద్రశేఖరరావు, తెలంగాణ రాష్ట్ర సమితిని ప్రారంభించినప్పటి నుంచీ లాబీయింగ్ చేస్తూనే వున్నారు.
ఒకవైపు పన్నెండేళ్లు ఉద్యమాన్ని మొక్కవోని ధైర్యంతో నడుపుతూనే, మరోవైపు తనదైన శైలిలో ఢిల్లీ స్థాయిలో రకరకాల పద్ధతుల్లో లాబీయింగ్ చేసుకుంటూ వస్తున్నారు. జాతీయస్థాయిలోని అత్యధిక రాజకీయ పార్టీల మద్దతును రాష్ట్ర ఏర్పాటుకు అనుకూలంగా కూడగట్టగలిగారు.ఆ మాటకొస్తే భారతీయ జనతాపార్టీ కాని, భారత కమ్యూనిస్ట్‌పార్టీ కాని ఈ రోజున పూర్తిస్థాయిలో తెలంగాణ ఉద్యమంలో దూకిందంటే అది కేసీఆర్ లాబీయింగే అనాలి. తెలంగాణ ఏర్పాటుకు అనుకూలంగా మార్చాలన్న ఉద్దేశంతోనే 2004లో కాంగ్రెస్ పార్టీతోను, 2009లో టీడీపీ తోను ఎన్నికల ఒప్పందం కుదుర్చుకున్నారు. ఈ రోజున కాంగ్రెస్ తెలంగాణ ఎంపీలు కాని, టీడీపీ తెలంగాణ ఎమ్మెల్యే లు కాని తెలంగాణకు అనుకూలంగా ఉద్యమిస్తున్నారంటే అది కేసీఆర్ పన్నిన ఎత్తుగడల ఫలితంగానే అనాలి. ఆ లాబీయింగ్‌లో భాగంగానే ఆయన వయలార్ రవిని, ఆజాద్ ను, ఆస్కార్ ఫెర్నాండెజ్‌ను కలిసి ఉండాలి.
ఈ నేపథ్యంలో ఒక్కసారి గతం నెమరేసుకుంటే.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఆవిర్భవించిన నాడే తెలంగాణ రాష్ట్ర నినాదానికి శ్రీకారం చుట్టబడిందనాలి. ఉమ్మడి రాష్ట్రంలోనే తెలుగు వారందరికీ న్యాయం జరుగుతుందని (ఆనాడు) కొందరు భావిస్తే, తమను, తమ ప్రాంత ప్రజలను తెలంగాణేతరులు దోపిడీకి గురిచేస్తారని, తమ సాంస్కృతిక, భాషా విలువలను ఇతర ప్రాంతాల తెలుగువారు ఎద్దేవా చేస్తారని, తెలంగాణ కావాలని కోరుకున్న పలువురు(ఆనాడే) అభిప్రాయపడ్డారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఏర్పాటు జరిగి ఐదు దశాబ్దాలు గడిచినా, తెలంగాణ ప్రాంతవాసులందరికి విడిపోయి, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు జరిగి, ఏ ప్రాంతం వాళ్లు ఆ ప్రాంతంలోనే వుంటూ, అన్నదమ్ముల్లాగా మెలిగితే మంచిదన్న భావన మటుకు బలంగా నాటుకు పోయింది. నాటి నుంచి నేటికీ తరాలు మారినా రెండో తరం-మూడో తరం వారూ, ఒక వంశపారంపర్య నినాదం లాగా రాష్ట్ర ఏర్పాటు జరిగి తీరాలని కోరుకుంటున్నారంటే, పాలకవర్గాలు ఆ నినాదానికున్న ఆదరణను సరిగ్గా అంచనా వేయడం లేదనే అనాలి.
రాష్ట్రం కావాలని కేవలం భావించడం మాత్రమే కాకుండా, దాన్ని సాధించడం కోసం రకరకాల మార్గాలను ఎంచుకోవడం ఆరంభమయింది 1956 నుంచే. కొన్ని ప్రత్యేకమైన రాయితీలను తెలంగాణ ప్రాంతం వారికి మాత్రమే చట్టరీత్యా కలిగించ డం ద్వారా, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు నినాదాన్ని, పాలక పక్షం విజయవంతంగా పక్కదారి పట్టించగలిగింది. పెద్దమనుషుల ఒప్పందమనీ, ఫజల్‌అలీ సంఘం నివేదికనీ, ముల్కీ నిబంధనలనీ రకరకాల మార్గాల ద్వారా తెలంగాణ కోరుకునే వారిలో కొన్ని ఆశలు రేకెత్తించి, కొన్నేళ్లు ఉద్యమాన్ని బలహీనపరచగలిగింది (కాంగ్రెస్) ప్రభుత్వం. తెలంగాణ ప్రాంతానికి వలస వచ్చిన కొందరు తెలంగాణేతరులు పరోక్ష దోపిడీ విధానాన్ని ప్రత్యక్ష దోపిడీ విధానంగా మార్చడం మొదలయిందో,అప్పుడే దోపిడీకి గురవుతున్న తెలంగాణ ప్రజలలో దోపిడీకి ఎదురు తిరగాలన్న కాంక్ష బలీయం కావడం మొదలయింది. క్రమేపీ ఉద్యమరూపంగా మార్పు చెందింది. మర్రి చెన్నాడ్డి నాయకత్వంలో తెలంగాణ ప్రజా సమితి పేరుతో బ్రహ్మాండమైన తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఉద్యమాన్ని నడిపాయి. నాడు ఉవ్వెత్తున లేచిన ఉద్యమం మోసంతో అణచబడింది. నాయకులు మోసం చేస్తున్నా, తాము మోసగించబడుతున్నా, అధికసంఖ్యాక ప్రజల్లో తెలంగాణ రాష్ట్రం కావాలన్న కోరిక, సాధించి తీరాలన్న పట్టుదల మాత్రం పెరిగిందే కాని తగ్గలేదు. కాకపోతే సరైన సమయం కోసం ఎదురుచూశారు.
కె. చంద్రశేఖరరావు టీఆర్‌ఎస్‌ను స్థాపించడంతో, తెలంగాణ కావాలని కోరుకుంటున్న వారిలో మళ్లీ ఆశలు చిగురించాయి. కేసీఆర్ ఉద్యమాన్ని వ్యూహాత్మకంగా, అహింసా మార్గంలో, మేధావులను కలుపుకునిపోతూ, యావత్ భారతదేశంలోని భిన్న దృక్పథాల రాజకీయ పార్టీల నాయకులతో సత్సంబంధాలను నెలకొల్పుకుం టూ, ఒక రకంగా ఏకాభివూపాయాన్ని సమకూర్చు కొనడంలో, మునుపెన్నడూ ఎవరూ సాధించని విజయాన్ని సాధించారు. 2004 ఎన్నికల్లో పకడ్బందీ వ్యూహంతో కాంగ్రె స్ పార్టీతో పొత్తు కుదుర్చుకుని, ఇటు శాసనసభలోనూ,అటు పార్లమెంటులోనూ బలమైన శక్తిగా కేసీఆర్ ఎదిగారు. టీఆర్‌ఎస్‌కు జాతీయస్థాయిలో గుర్తింపు తేగలిగారు. కేంద్రంలో సోనియా దృష్టిని ఆకర్షించి, ఆమెకు సన్నిహితుడై, మంత్రివర్గంలో కీలకమైన పదవిని పొంది, ఢిల్లీ స్థాయిలో తెలంగాణ రాష్ట్ర సాధనకు మార్గం సుగమం చేశారు. అవసరమైనప్పుడు సోనియాకు ఎదురు తిరిగి తనంటే ఏంటో నిరూపించి చూపాడు. తన సత్తా చూపడానికి ఎన్నిసార్లు అయినా పదవికి అలవోకగా రాజీనామా చేసి, మళ్లీ ఎన్నికల్లో విజయం సాధించి తనకు తానే సాటి అని చెప్పకనే చెప్పాడు. బహుశా ఈ నేపథ్యంలో ఒకవైపు కేసీఆర్ లాబీయింగ్, మరోవైపు ఐకాస లాంటి ప్రజా సంఘాల ప్రత్యక్ష ఉద్యమాలు రాష్ట్ర సాధనకు దోహదపడతాయని భావించవచ్చు. వేరీజ్ తెలంగాణ అనే వారికి ఇదే సమాధానం! హియర్ ఈజ్ తెలంగాణ!
-వనం జ్వాలా నరసింహారావు