Tuesday, August 9, 2011

సమైక్యవాదమా నియంతృత్వమా?




తెలంగాణ, ఆంధ్ర రాష్ట్రాల ఏర్పాటు కోసం ఉద్యమించడానికి విజయవాడలో సమావేశమైన లబ్ద ప్రతిష్టులైన మేధావులు, ఉద్యమకారులపై సమైక్యవాద గూండాలు దాడి చేయడం, పోలీసులు వేధించడం రాష్ట్రంలో నెలకొని ఉన్న దారుణ అణచివేతకు నిదర్శనం. ఆంధ్ర పెట్టుబడిదారీవర్గం అధికార మదంతో రాష్ట్రంలో భావ వ్యక్తీకరణ, సమావేశ హక్కులను కాలరాస్తున్నది. ఒకవైపు రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ ఉద్యమకారులను అరెస్టు చేస్తూ బోగస్ కేసులు బనాయిస్తూ హింసిస్తున్నది.

మరోవైపు ఆంధ్రలో భూస్వామ్య పెత్తందారీవర్గం, ఫ్యాక్షనిస్టులు చట్టాన్ని చేతిలోకి తీసుకుని పోలీసుల సహకారంతో గూండాలతో దాడులు సాగిస్తున్నారు. రాష్ట్రంలో భిన్న రూపాల అణచివేత తప్ప చట్టబద్ధ పాలన అనేదే కనిపించడం లేదు. తరతరాలుగా బలహీనవర్గాలపై దాష్టీకం సాగిస్తున్న కోస్తా, రాయలసీమ పెత్తందారీవర్గాలు తమకు ప్రతిఘటన ఎదురవుతున్నప్పుడల్లా కారంచేడు, చుండూరు వంటి ఊచకోతలకు పాల్పడుతున్నాయి. మనుషులను ముక్కలుగా నరికే మీరు రాష్ట్రాన్ని ముక్కలు చేయవద్దంటారేమిటంటూ ప్రశ్నిస్తున్న ఆంధ్ర అట్టడుగు వర్గాల గొంతు బయటి ప్రపంచానికి వినపడకుండా అడ్డుకుంటున్నాయి. వారి విభజనోద్యమాన్ని మొగ్గలోనే తుంచేయాలని సిగ్గుఎగ్గు లేకుండా దాడులకు దిగుతున్నాయి.

తెలంగాణ, ఆంధ్ర రాష్ట్రాల ఏర్పాటును కోరుతున్న రాజకీయ, ఉద్యమ సంస్థలకు చెందిన కొందరు ప్రముఖులు ఆదివారం విజయవాడలోని ఒక కల్యాణ మండపంలో సమావేశమయ్యారు. ఇదొక బహిరంగ సభ కాదు. ఉద్యమాన్ని ఎట్లా ప్రజల్లోకి తీసుకుపోవాలనేది చర్చించడానికి తెలంగాణ, ఆంధ్ర రాష్ట్రాల సాధన సమితి పేర ఏర్పాటయిన అంతంరంగిక సమావేశం. పోలీసులు దీనిని జరగనీయకుండా అడ్డుకోవడంతో ఈ పెద్దమనుషులు తమ సమావేశాన్ని మరో చోటికి మార్చుకున్నారు. వివిధ ఉద్యమాలతో, రాజకీయ భావాలతో ముడిపడి ఉన్న మేధావులు హాజరైన ఈ సమావేశాన్ని సజావుగా జరిపించవలసిన బాధ్యత పోలీసులది. కానీ సమైక్యవాద గూండాలు వచ్చి ఈ సభలో విధ్వంసం సృష్టించారు.

పైగా తమకు తామే కలియబడి ఘర్షణ సాగుతున్న నాటకాన్ని ఆవిష్కరించారు. అబద్ధాల ప్రచారానికి అలవాటుపడిన ఆంధ్ర మీడియా ఈ ఉదంతానికి రంగులద్ది ప్రసారం చేసింది. ఆంధ్ర సినిమాల్లో మాదిరిగానే ఆలస్యంగా రంగ ప్రవేశం చేసిన పోలీసులు సమావేశానికి వచ్చిన ప్రముఖులను అరెస్టు చేసి పోలీసు స్టేషన్లకు తిప్పారు.

రాష్ట్రాలు ఎంత చిన్నగా ఉంటే బలహీనవర్గాలు అంత సులభంగా అధికారాన్ని చేజిక్కించుకోగలవు. అందువల్ల తెలంగాణ ఉద్యమానికి మద్దతుగా కోస్తా, రాయలసీమల్లోని ఎస్సీలు,బీసీలు, ఎస్టీలు, మైనారిటీలు ఉద్యమిస్తున్నారు. కవులు, రచయితలతో పాటు భిన్నరంగాలకు చెందిన అభ్యుదయ వాదులు ఈ ఉద్యమాన్ని బలోపేతం చేయడానికి యత్నిస్తున్నారు. మరోవైపు తెలంగాణ ఉద్యమానికి వ్యతిరేకంగా ‘సమైక్యత’ పేరుతో కోస్తా, రాయలసీమ ప్రజలను రెచ్చగొట్టాలన్న ఆంధ్ర పెట్టుబడిదారీవర్గం కుటిల యత్నాలు ఇప్పటి వరకు సాగలేదు. దీంతో కిరాయి గూండాలతో బోగస్ ఉద్యమాన్ని నడిపిస్తున్నాయి. ఈ పరిస్థితుల్లో ఆంధ్ర రాష్ట్ర ఉద్యమం మొదలయితే ప్రజల నుంచి భారీ స్పందన వస్తుందని ఆంధ్ర ఆధిపత్యశక్తులు గజగజలాడుతున్నాయి.

ఉద్యమకారులపై దౌర్జన్యానికి ఒడిగడుతున్నాయి. వీరి చేతిలో కీలుబొమ్మలైన పోలీసులు కూడా ఎక్కడ సమావేశాలు జరపబోయినా అడ్డుకుంటున్నారు. ఆంధ్ర పెట్టుబడిదారుల విషపుపుత్రికలైన పత్రికలు, టీవీ చానెళ్ళు తెలంగాణలో సాగుతున్న మహోద్యమాన్ని గురించి ఆంధ్ర ప్రజలకు తెలియనివ్వకుండా అబద్ధాలు ప్రచారం చేస్తున్నాయి. పత్రికలు తెలంగాణ ప్రాంతంలో అనివార్యంగా కొన్ని ఉద్యమవార్తలు ఇచ్చినప్పటికీ ఆంధ్ర ప్రాంతంలో ప్రచురించడం లేదు.

తెలంగాణ, ఆంధ్ర ప్రజా సంఘాల జేఏసీ గత నెల విజయవాడలో సభ జరుపుదామనుకుంటే పోలీసులు అనుమతి ఇవ్వలేదు. నగరంలోని ఎనిమిది ప్రధాన సమావేశ మందిరాలను లగడపాటి ముందే బుక్ చేసుకుని ప్రజాసంఘాలను ఇబ్బంది పెట్టారు. ఆంధ్ర విశ్వవిద్యాలయంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ విద్యార్ధులు తెలంగాణకు మద్దతుగా ఊరేగింపు తీస్తే వారిపై దాడి జరిగింది. ఒంగోలులో, గుంటూరు, అనంతపురం, కర్నూలు తదితర పట్టణాలలో ఆంధ్ర రాష్ట్ర ఏర్పాటు కోసం, తెలంగాణ ఉద్యమానికి మద్దతుగా తలపెట్టిన అనేక సమావేశాలపై దాడులు జరిగాయి.

ఒక టీవీ చానెల్ ఏర్పాటు చేసిన చర్చావేదికలో దళితులను మాట్లాడనీయకుండా దౌర్జన్యం చేస్తూ అడ్డుకోవడాన్ని రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు చూసి నివ్వెర పోయారు. విజయవాడలో బీజేపీ వారు కూడా సభ జరుపుకోలేక పోయారంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. కర్నూలులో అనేక సార్లు దాడులు జరిగినా దళితులు తెలంగాణకు మద్దతుగా శ్రీకృష్ణ కమిటీ నివేదికను దగ్ధం చేశారు. అన్ని జిల్లాల్లో అట్టడుగువర్గాల ప్రజలు అభ్యుదయ శక్తుల తోడ్పాటుతో తెగించి చర్చలు సాగిస్తుండడంతో ఆంధ్ర రాష్ట్ర ఉద్యమాన్ని ఇక ఎంతో కాలం అణచివేయడం సాధ్యం కాదు.

ఆంధ్ర పెట్టుబడిదారీవర్గం పీడ వదిలించుకోవడం తెలంగాణ జనానికి ఎంత అవసరమో, ఆంధ్ర ప్రజానీకానికి కూడా అంత అవసరం. తెలంగాణ ప్రజలు జరుపుతున్న ఉద్యమం ఆంధ్ర పెట్టుబడిదారీశక్తుల నుంచి విముక్తి కోసమే తప్ప ఆంధ్ర ప్రజానీకానికి వ్యతిరేకంగా కాదు. ఈ విషయాన్ని ఉద్యమకారులు అనేకసార్లు స్పష్టం చేశారు. ఆంధ్ర రాష్ట్ర ఉద్యమకారులు కూడా తెలంగాణ జనంతో చేయి కలుపడం మంచి పరిణామం. తెలంగాణ, ఆంధ్ర ప్రజలు కలిసికట్టుగా సమన్వయంతో ఉద్యమిస్తే ఇరువురినీ పట్టి పీడిస్తున్న శని వదిలిపోతుంది.

3 comments:

  1. ఒక్క విషయం సోదరా...
    సమైక్యాంధ్రకు మద్ధతుగా సభలు,సమావేశాల్ని తెలంగాణా ప్రాంతంలోగానీ, హైదరాబాదులోగానీ నిర్వహించుకునే వీలు ఇక్కడి నేతలు, విద్యార్థి జేఏసీలు కల్పిస్తున్నారా? మీ ప్రవర్తనకు తగ్గట్టే అక్కడ ప్రవర్తన కూడా.. అంటే చర్యకు ప్రతిచర్య అన్నమాట.

    ReplyDelete
  2. తెలంగాణాలో ఇప్పటివరకు ఎవ్వరూ సమైక్యాంధ్ర సభ నిర్వహించలేదు. ఎందుకంటే ఇక్కడ సమైక్యవాదం లేదు కాబట్టి. ఆ విషయం సీమాంధ్రులు, సీమాంధ్ర చానెళ్ళు కూడా ఒప్పుకునేదే.

    ఇక్కడ గమనించాల్సింది దాడి కాదు, సీమాంధ్రులలో వున్న ప్రత్యేక రాష్ట్ర ఆకాంక్ష, దాని కొంతమంది బలవంతంగా అణగదొక్కుతున్న విధానం.

    ReplyDelete
  3. >>>అంటే చర్యకు ప్రతిచర్య అన్నమాట.

    బాగుంది. మీవారి సభలను మీరే అడ్డుకోవడం ప్రతిచర్యా?

    ReplyDelete