Tuesday, August 9, 2011

సమైక్యవాదం కాదు యధాతథవాదం

తెలంగాణా రాష్ట్రం కోరే వారు వేర్పాటు వాదులుగా, కలిపి ఉంచాలని కోరుకునే వారు సమైక్య వాదులుగా ప్రస్తుతం రాష్ట్రంలో చలామణీ అవుతున్నారు. చివరికి తెలంగాణావాదులు కూడా ఇవే పదాలు కాస్త అటూ ఇటూగా అంటే, వేర్పాటువాదులం కాదు, విభజనవాదులమనో మరోటో చెప్పుతున్నారు.

నిజానికి తెలంగాణా వాదులు ప్రత్యేక రాష్ట్రాన్ని కోరుతున్నారు. ప్రాంతాలుగా విడిపోయి మనుషులుగా కలిసి వుందామంటున్నారు. కాని దానికి విరుద్ధంగా సమైక్యవాదులు ఒక ప్రాంతం మొత్తంగా మీతో కుంపటి వద్దు మేం విడిపోతాం అని స్పష్టంగా చెప్తున్నా సరే మీకు ఇష్టం వున్నా, లేక పోయినా సరే, సమైక్యంగా వుండి తీరుతాం, ఉండేలా చేస్తాం అంటున్నారు. ఇది నియంతృత్వ ధోరణి తప్ప మరోటి కాదు. వీరికి కావలసింది రాష్ట్రాన్నికలిపి ఉంచడం తప్ప మనుషులను కలిపి వుంచడం కానే కాదు. మనుషులు విడిపోయినా సరే రాష్ట్రాన్నికలిపి ఉంచవలసిన అవసరం వారికెందుకో తెలుసుకోవడానికి పెద్దగా ఆలోచించవలసిన అవసరం లేదు.

తానూ దోపిడీకి వంచనకు గురవుతున్నట్టు భావించినప్పుడు ఏ మనిషైనా ఎదురు తిరగడం మొదలు పెడతాడు. అలా ఒక జాతికి జాతి భావించడం మొదలు పెడితే పాలనా వ్యవస్థ మార్పుకోసం ఒక ఉద్యమం మొదలౌతుంది. ఇప్పుడున్న ఆంధ్రప్రదేశ్ పరిపాలనా వ్యవస్థ మీద పూర్తిగా నమ్మకం పోయింది కాబట్టే తెలంగాణా ప్రజలు మార్పుకోసం ఉద్యమించడం మొదలు పెట్టారు. వారు ఆ మార్పు ప్రత్యేక రాష్ట్రంవల్ల సాధ్యపడుతుందని భావిస్తున్నారు.

వివక్షకు, దోపీడీకి గురయ్యే వాడెప్పుడూ మార్పు కోరుతాడు. అలాగే దోపిడీ చేసేవాడు యధాతథ పరిస్థితిని కోరుతాడు. ఈజిప్టు, లిబియాలలో ఉద్యమాలు జరిగింది మార్పు కోసమే. ఇప్పుడు లండన్ అతలాకుతలం అవుతున్నది కూడా మార్పు కోసమే. వ్యవస్థమీద నమ్మకం సన్నగిల్లినపుడు ప్రజలు రోడ్డెక్కుతారు. అది తెలంగాణా అయినా, ఈజిప్టయినా లేక ప్రజాస్వామ్య దేశాలకే తాతలాంటి ఇంగ్లాండైనా సరే.

మరి మార్పును అడ్డుకునేది ఎవరు? మరెవరో కాదు ఇప్పుడున్నపరిస్థితి వల్ల లబ్ది పొందుతున్న వారు. ఇప్పుడున్నవ్యవస్థ వల్ల అసహజమైన లబ్ది పొందుతున్నారు కాబట్టి వారికి సహజంగానే దీన్ని మార్చడం ఇష్టం వుండదు. కాని చరిత్ర తెలిసిన వారికి ఒక విషయం సుపరిచితం, అదే, మార్పు అనివార్యమని.

2 comments:

  1. నా ఉద్దేశంలో తెలంగాణా వాళ్ళే సమైక్యవాదులు. ఎందుకంటే వాళ్ళు ఇరుప్రాంతాలవారి మధ్య మానసిక సమైక్యతను కోరుతున్నారు. సీమాంధ్రులే వేర్పాటువాదులు. ఎందుకంటే వాళ్ళు మనుషులను విడగొడుతున్నారు.

    ReplyDelete