Wednesday, August 17, 2011

విఫల భగీరథుడు!

- 75 బోర్లు వేసిన రైతు
- ఎనిమిదేళ్లుగా అప్రకటిత క్రాప్ హాలిడే
- నాటి అప్పులకు నేటికీ వడ్డీలు కట్టాల్సిన పరిస్థితి
- ఇది బోర్ల రాంరెడ్డి వ్యవసాయ గాథ


నీళ్లు పారించాల్సిన సర్కారు మోసం చేసింది. భూమాత కనికరించలేదు. 32 ఎకరాల భూమి ఉంటే.. ఆ భూమిని తడిపేందుకు ఆ రైతు పెట్టిన ఖర్చు అక్షరాలా ముప్పై లక్షల రూపాయలు. బైరెడ్డి రాంరెడ్డి అంటే ఎంతమందికి తెలుసో కానీ.. బోర్ల రాంరెడ్డి అంటే మాత్రం ఆయనే మదిలో మెదులుతారు. ఆయన దుఃఖం కళ్ల ముందు కదలాడుతుంది.


75 బోర్లు వేసి విఫల భగీరథుడిగా మిగిలిపోయిన నల్లగొండ మండలం ముషంపల్లి గ్రామానికి చెందిన బోర్ల రాంరెడ్డి దీన వ్యవసాయ గాథే ఈ కథనం. అది 1995. ఎండకాలం. అప్పటికే వేసిన 20బోర్లలో ఒకటి, రెండు మినహాయిస్తే మిగిలినవన్నీ వట్టిపోయాయి. ఏడెకరాల పొలం నెర్రెలు బారింది. 25ఎకరాల బత్తాయి తోట ఎండుముఖం పట్టింది. దీంతో ఏం చేయాలో రాంరెడ్డికి పాలుపోలేదు. పుట్టగతి ఉన్న కాడల్లా అప్పు తెచ్చి బోర్లు వేశాడు. వచ్చే కొద్దిపాటి నీటికితోడు, ఇంటిల్లిపాది ట్యాంకర్లతో నీరు తెచ్చి కొద్దో గొప్పో పంటలను కాపాడుకున్నారు.

2003 వరకు ఇదే దుస్థితి. ఈ ఎనిమిదేళ్లు ఆ రైతు పంటలను కాపాడుకోవడానికి లక్షల రూపాయల అప్పు చేసి 50బోర్లు వేశాడు. అయినా పూర్తి స్థాయిలో నీరందకపోవడంతో 25ఎకరాలకు క్రాప్ హాలిడే ప్రకటించాడు. నాడు చేసిన అప్పులకు ఇప్పటికీ వడ్డీ కడుతూనే ఉన్నాడు.

ఈ ఎనిమిదేళ్లు తన జీవితంలో చీకటి రోజులుగా, నిద్రలేని రాత్రులుగా మిగిలిపోయాయని బోర్ల రాంరెడ్డి చెబుతున్నాడు. ఇప్పటివరకూ మొత్తం 75 బోర్లు వేసి జిల్లాలో అత్యధికంగా బోర్లు వేసిన రైతుగా నిలిచిపోయాడు.

నీరు సరిపోకపోవడంతో ఈ ఎనిమిదేళ్లూ తనకు తానే క్రాప్ హాలిడే ప్రకటించుకున్నాడు. మొత్తం 75బోర్లలో నేటికి 8బోర్లు అంతంత మాత్రమే పని చేస్తున్నాయి. రాంరెడ్డి తన భార్య పద్మతో కలిసి పొలం పని చేస్తున్నాడు. 1995నుంచి నేటి వరకు అప్పులు తప్పితే ఆస్తులు సంపాదించలేదని రాంరెడ్డి వాపోయారు.

1 comment:

  1. #బైరెడ్డి రాంరెడ్డి - బోర్ల రాంరెడ్డి

    hmm..Very pathetic situation!

    ReplyDelete