Monday, August 29, 2011

తెలుగు సినిమాకు పాతరేశాను

పోయిన్నెల రంగం చూశాను
పోయినవారం కాంచన చూశాను
నిన్నఉరుమి చూశాను
రేపు ప్రేమఖైదీ చూడబోతున్నాను
మొత్తానికి తెలుగు సినిమాకు పాతరేశాను
ఎందుకంటే...
నాకు వాటిలో 
తెలుగుదనం కనబడలేదు కనుక!

Wednesday, August 17, 2011

విఫల భగీరథుడు!

- 75 బోర్లు వేసిన రైతు
- ఎనిమిదేళ్లుగా అప్రకటిత క్రాప్ హాలిడే
- నాటి అప్పులకు నేటికీ వడ్డీలు కట్టాల్సిన పరిస్థితి
- ఇది బోర్ల రాంరెడ్డి వ్యవసాయ గాథ


నీళ్లు పారించాల్సిన సర్కారు మోసం చేసింది. భూమాత కనికరించలేదు. 32 ఎకరాల భూమి ఉంటే.. ఆ భూమిని తడిపేందుకు ఆ రైతు పెట్టిన ఖర్చు అక్షరాలా ముప్పై లక్షల రూపాయలు. బైరెడ్డి రాంరెడ్డి అంటే ఎంతమందికి తెలుసో కానీ.. బోర్ల రాంరెడ్డి అంటే మాత్రం ఆయనే మదిలో మెదులుతారు. ఆయన దుఃఖం కళ్ల ముందు కదలాడుతుంది.


75 బోర్లు వేసి విఫల భగీరథుడిగా మిగిలిపోయిన నల్లగొండ మండలం ముషంపల్లి గ్రామానికి చెందిన బోర్ల రాంరెడ్డి దీన వ్యవసాయ గాథే ఈ కథనం. అది 1995. ఎండకాలం. అప్పటికే వేసిన 20బోర్లలో ఒకటి, రెండు మినహాయిస్తే మిగిలినవన్నీ వట్టిపోయాయి. ఏడెకరాల పొలం నెర్రెలు బారింది. 25ఎకరాల బత్తాయి తోట ఎండుముఖం పట్టింది. దీంతో ఏం చేయాలో రాంరెడ్డికి పాలుపోలేదు. పుట్టగతి ఉన్న కాడల్లా అప్పు తెచ్చి బోర్లు వేశాడు. వచ్చే కొద్దిపాటి నీటికితోడు, ఇంటిల్లిపాది ట్యాంకర్లతో నీరు తెచ్చి కొద్దో గొప్పో పంటలను కాపాడుకున్నారు.

2003 వరకు ఇదే దుస్థితి. ఈ ఎనిమిదేళ్లు ఆ రైతు పంటలను కాపాడుకోవడానికి లక్షల రూపాయల అప్పు చేసి 50బోర్లు వేశాడు. అయినా పూర్తి స్థాయిలో నీరందకపోవడంతో 25ఎకరాలకు క్రాప్ హాలిడే ప్రకటించాడు. నాడు చేసిన అప్పులకు ఇప్పటికీ వడ్డీ కడుతూనే ఉన్నాడు.

ఈ ఎనిమిదేళ్లు తన జీవితంలో చీకటి రోజులుగా, నిద్రలేని రాత్రులుగా మిగిలిపోయాయని బోర్ల రాంరెడ్డి చెబుతున్నాడు. ఇప్పటివరకూ మొత్తం 75 బోర్లు వేసి జిల్లాలో అత్యధికంగా బోర్లు వేసిన రైతుగా నిలిచిపోయాడు.

నీరు సరిపోకపోవడంతో ఈ ఎనిమిదేళ్లూ తనకు తానే క్రాప్ హాలిడే ప్రకటించుకున్నాడు. మొత్తం 75బోర్లలో నేటికి 8బోర్లు అంతంత మాత్రమే పని చేస్తున్నాయి. రాంరెడ్డి తన భార్య పద్మతో కలిసి పొలం పని చేస్తున్నాడు. 1995నుంచి నేటి వరకు అప్పులు తప్పితే ఆస్తులు సంపాదించలేదని రాంరెడ్డి వాపోయారు.

Tuesday, August 16, 2011

CNN-IBN & CNBC-TV18 సర్వే -- ఒక పరిశీలన

హిందూలో CNN-IBN & CNBC-TV18 సర్వే రిజల్ట్స్ లో కొంత భాగాన్ని తెలంగాణా ఏర్పాటుకు సంబంధించినవిగా ప్రచురించారు. అవి పట్టుకుని సమైక్యవాద బ్లాగర్లు, కొన్ని సమెక్కుడు మిధ్యమాలు  తెలంగాణా ప్రజల అభిప్రాయం విభజనకు వ్యతిరేకంగా వుంది అనే భావం వచ్చేలా ప్రచారం మొదలు పెట్టారు.  

వాస్తవానికి హిందూ ఏమి ప్రచురించింది అని వెదికితే మన విషాంధ్ర బ్లాగులో ఇది దొరికింది.

ఎడమ వైపు వున్న ప్రశ్నను పట్టుకుని వీరంతా రాష్ట్ర విభజన కేవలం యాభై శాతం మందే కోరుతున్నారు అని చెప్తున్నారు. దాన్ని బట్టి పట్టిక కింద రాసి వున్న ప్రశ్న ఎవరూ చదవడం లేదనుకోవాల్సి వస్తుంది. ఆ ప్రశ్న ఏమిటి?

People have different opinions on the issue of separate Telangana state. Some peple say that Andhra Pradesh should be bifurcated into Andhra Pradesh and Telangana.  While some say that the State should be Andhra, Telangana and Rayalaseema. Others say that the Andhra Pradesh should continue as united State. What is your opinion on the issue?

ఈ ప్రశ్నే ఒక గందరగోళంగా వుంటే దానికి వారు ప్రకటించిన ఫలితాలు మరింత గందరగోళంగా, తప్పుదోవ పట్టించేవిగా వున్నాయి.

రెండు రాష్ట్రాలుగా విడిపోవాలని చెప్పినవారు (తెలంగాణాలో): 50%
మూడు రాష్ట్రాలుగా విడిపోవాలని చెప్పినవారు (రాయలసీమలో): 1%
కలిసి వుండాలని చెప్పినవారు (కోస్తాలో): 90%

పై ఫలితాలను చూస్తేనే తెలుస్తుంది అవి ఎంత అసంపూర్తిగా వున్నాయో! ఉదాహరణకు తెలంగాణాలో మూడురాష్ట్రాలుగా విడిపోవాలని ఎంత మంది చెప్పారు? మూడు రాష్ట్రాలుగా విడిపోవడమంటే తెలంగాణావాదం కాదా? ఆ వివరాలు లేవు. పోనీ కలిసే వుందామని ఎంత మంది చెప్పారు? అదీ లేదు. ఏమీ చెప్పకుండా ఎంత మంది వున్నారు? అది కూడా ఇవ్వలేదు. ఇలాంటి వివరాలు పట్టుకొని సర్వే ఫలితాలంటూ గగ్గోలు పెట్టడం మొదలు పెట్టడం ఎంతవరకు కరెక్టు?

మరి ఫలితాలను ఇలా అసంపూర్తిగా ప్రచురించడం, అదీ హిందూలో, చాలా అసహజంగా కనిపిస్తుంది.

బొమ్మలో ఎడమవైపు వున్న ప్రశ్న, తెలంగాణా వారు చెప్పినా సమాధానాలు ఇలా వున్నాయి:

1. రాష్ట్రం రెండుగా విడిపోవాలి: 50% మంది అవునన్నారు.
2. రాష్ట్రం మూడూగా విడిపోవాలి: వివరాలు ఇవ్వలేదు.
3. రాష్ట్రం మొత్తం కలిసి వుండాలి: వివరాలు ఇవ్వలేదు.

2, 3 వివరాలు ఇవ్వకుండా,  ఫలితాల గురించి చర్చించలేము.

ఇక కుడివైపునున్న ప్రశ్న, తెలంగాణా వారి సమాధానాలు:

యధాతధంగా వుంచాలి: 13 + 5 = 18%
విడదీయాలి: 48 + 4 + 1 + 2 = 55%
అసలు శ్రీకృష్ణ కమిటీ ఏమిటో తెలియదు అని 27% మంది చెప్పారు.

ఈ తెలియని 27% మందిని తీసివేస్తే విభజించాలని చెప్పిన 55% మంది మొత్తం సమాధానాలు చెప్పిన వారిలో 75% అవుతారు. ఇది నాలుగింట మూడొంతుల మెజారిటీ. విడిపోవడానికి ఆంధ్రావారి ఇష్టాయిష్టాలతో పని వుండదని గ్రహించండి, అది 90% అయినా వంద అయినా.

చివరగా ఆ సర్వేలో చెప్పిందేమంటే, "తెలంగాణాలో విడిపోదామనేవారి సంఖ్య పెరిగింది. కాని ఆంధ్రాలో కలిసుందామనుకునే వారి సంఖ్య చాలా ఎక్కువగా వుంది" అని.

రెండువైపులా కోరిక వుంటేనే కలిసుండడం సాధ్యపడుతుంది. ఏ ఒక్క పక్షంలో అది లేక పొయినా విభజన అనివార్యం అని సర్వత్రా ఎరిగిన సూత్రం. కాని మన సమైక్యవాదులు సహజ సూత్రాలకు అతీతులు కదా మరి!


Friday, August 12, 2011

అవసరం



మా నాయన గారికి క్యాటరాక్టు ఆపరేషన్ చేయించాను. ఆ తర్వాత చూపులొ తేడా వస్తుంది కాబట్టి అద్దాలు మార్పించుకోవాలి. కాని ఎన్నిసార్లు అద్దాలు మార్పించడానికి వెళ్దామన్నా ఒకటే తంతు.

"బాపూ, దావఖానకు పోదాం, అద్దాలు మార్పించుకోవాలెగద!"

"ఎందుకుర? నడుస్తుందిగద నడువనియ్య రాదు!"

"ఆపరేషన్లన్ని చేసుకున్నంక అద్దాలకు వెనుకకు పోవుడెందుకు? ఒక్క పూట దావఖానకు వస్తివంటే, పాయింటు చూసుకున్నంక అద్దాలు నేనే పట్టుక వస్త."

"ఆ! యెందుకు? ఇప్పుడు నడుస్తనే వుంది గద. లేకపోతెమాయె తియ్యి."

"మరి చూపు కనబడుతుందా బాపు?"

"టీవీ మంచిగనే కనబడుతుంది. కింది అక్షరాలు కూడ తెలుస్తున్నయి. గా పేపరే, చదువక పోతె యేంది? అన్ని టీవీలనే వస్తున్నయి గద! అవసరమైతె చూద్దాంలే"

ఇలా కొంతకాలం గడిచింది. ఎప్పుడూ నేను అద్దాల గురించి అడుగుడు, ఆయన వాయిదా వేసుడు మామూలుగా జరుగ సాగింది. కొన్నాళ్ళకు నేను అడగడమే మానివేశాను.

ఒక రోజు హటాత్తుగా బాపే అడిగిండు. "అద్దాలకు పోదామంటివి గదర!"

"ఆ, పోదాం"

"ఇప్పుడు పోదామా?"

"ఈ టైముల డాక్టరుండడు. రేప్పొద్దున పోదాం"

"సరే" ముఖంలో కొంచెం నిరాశ కనిపించింది.

నాకు ఆశ్చర్యమేసింది. ఇన్నాళ్ళు బయటికి రావడానికే నిరాకరించిన మనిషి ఈరోజు తనంత తానే అడిగాడేమిటా అని!

అప్పుడు చూశాను. చేతిలో కనపడింది... నమస్తే తెలంగాణా!

చిత్తూరుకేనా సీఎం..?!


చిత్తూరుకేనా సీఎం..?!

నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి రాష్ట్రానికి ముఖ్యమంత్రా...? లేక ఆయన సొంత జిల్లా చిత్తూరుకా...? ఇంకా చెప్పాలంటే ఆయన సొంతూరు కలికిరికా..? ఇటీవల ఆయన తీసుకుంటున్న నిర్ణయాలు ఈ అనుమానాలను రేకెత్తిస్తున్నాయి. ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత... చిత్తూరు జిల్లా కోసం ఆయన తీసుకున్న కొన్ని కీలక నిర్ణయాలు ఏమిటో చూద్దాం. తొలుత కలికిరి ప్రభుత్వ జూనియర్ కళాశాలకు తన తండ్రి నల్లారి అమర్ నాథ్ రెడ్డి పేరును ఖరారు చేస్తూ జీవో జారీ చేశారు.

అప్పటి నుంచే ఆయన తన సొంత జిల్లా, నియోజకవర్గంపై అమితమైన ప్రేమ చూపడం మొదలైందన్న విమర్శలు ఉన్నాయి. బడ్జెట్ లో కూడా తన నియోజకవర్గమైన పీలేరు అభివృద్ధి కోసమంటూ 50కోట్ల రూపాయలను అధికారికంగా కేటాయించుకున్నారు. గతంలో ఏ ముఖ్యమంత్రి కూడా బడ్జెట్ లో తన సొంత నియోజకవర్గం కోసం అంటూ నిధులను ప్రత్యేకంగా కేటాయించుకోలేదు. ఈ ఘనతను కూడా నల్లారి కిరణ్ కుమార్ రెడ్డికే దక్కించుకున్నారు.

ఇక చిత్తూరు జిల్లాలో మామిడి పండించే రైతులకు ప్రత్యేక పథకం కింద 60కోట్లను కేటాయించాలంటూ కేంద్రానికి ఇటీవలే ప్రతిపాదనలు పంపారు. దీన్ని కేంద్రం గనుక అంగీకరిస్తే చిత్తూరు జిల్లా రైతాంగానికి సుమారు 200కోట్ల రూపాయల వరకు ప్రయోజనం చేకూరనుంది. ఇక పాడి పరిశ్రమలో కూడా చిత్తూరు జిల్లా రైతులనే ఆదర్శంగా తీసుకోవాలని ఉన్నత స్థాయి సమీక్ష సమావేశంలో కూడా చెప్పడం విశేషం.

ఎన్నో ఏళ్ల కృషి తర్వాత మన రాష్ట్రానికి మొన్నటికి మొన్న మంజూరైన సైనిక్ స్కూల్ ను కూడా తన సొంత నియోజవకర్గానికే పంపడం తాజా ఉదాహరణ. అంతేనా ఇంకా ఉన్నాయి. ముఖ్యమంత్రిగా పీఠమెక్కాక చిత్తూరు జిల్లా మున్సిపాలిటీలను కార్పొరేషన్ల స్థాయికి పెంచారు. రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా ఏ పైలట్ ప్రాజెక్టును ప్రారంభించినా ఆ జాబితాలో చిత్తూరు జిల్లా పేరు తప్పని సరిగా ఉండాల్సిందే. ఇంకో ముఖ్యమైన విషయం ఏమిటంటే నేషనల్ అడ్వయిజరీ కౌన్సిల్ లో రెండు కొత్త పోస్టులను చేర్చారు.

అందులో ఛైర్మన్ గా ముఖ్యమంత్రి, వైస్ ఛైర్మన్ గా ఆర్ అండ్ బీ మంత్రి వ్యవహరించేలా నిర్ణయం తీసుకున్నారు. ఇందులో ఒకరు చిత్తూరు జిల్లాకు చెందిన వారు కాగా, మరొకరు శ్రీకాకుళం జిల్లావాసి. ఇలా చెప్పుకుంటూ పోతే ఇంకా ఎన్నో కీలక నిర్ణయాలు ఆయన ఆశ్రిత పక్షపాతినికి నిదర్శనంగా కనబడుతాయన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.

ముఖ్యమంత్రిగా రాష్ట్ర ప్రయోజనాలకంటే చిత్తూరు జిల్లా అందులో మరీ ముఖ్యంగా తన సొంత నియోజకవర్గ ప్రయోజనాలకే పెద్ద పీట వేస్తున్నారనడానికి ఇవన్నీ ఉదాహరణలు మాత్రమేనన్న విమర్శలు లేకపోలేదు.


Curtesy: HMTV

ఇదివరలో రాజశేఖర్ రెడ్డి హైదరాబాదులో భూములు తెగనమ్మి డబ్బులను కడపకు, ఇడుపులపాయకు, తన సొంత ఇంటికి తరలించాడు. ఇప్పుడు కిరణ్ కుమార్ రెడ్డి వచ్చీ రాగానే తన ప్రతాపం చూపిస్తున్నాడు. తెలంగాణా వాదులు తమ వాదం వినిపించడానికి గత చరిత్రలు తవ్వి తీసే పని లేకుండా, ప్రస్తుత నాయకులే రోజూ లైవ్ సినిమా చూపిస్తున్నారు. ఇలాంటివన్నీ చేస్తూ కూడా ఇంకా సమైక్యవాదంతో  జనాన్ని నమ్మించాలని అనుకోవడం వీరికే చెల్లింది.

రాష్ట్ర ఎమ్మెల్యేలలో సీమాంధ్రులు అధికం కాబట్టి ఎప్పుడూ ఏదో ఒక జిల్లానుంచి సీమాంధ్రుడే ముఖ్యమంత్రి అవుతాడు. తనప్రాంతాన్ని, తనజిల్లాని మాత్రమే అభివృద్ధి చేసుకుంటాడు. ఒకవేళ ఎప్పుడో ఒకసారి తెలంగాణా వాడు ఏ అధిష్టానం దయతలిస్తెనో ముఖ్యమంత్రి అయినా కూడా వాడు తమకు కీలుబొమ్మగా వుంటే తప్ప సంవత్సరం కూడా సీమాంధ్రులు వాణ్ని కుర్చీలో కూచోనివ్వరు. కాబట్టి సమైక్య రాష్ట్రంలో తెలంగాణాకి భవిష్యత్తు లేదు.

Thursday, August 11, 2011

సీమాంధ్ర నాయకుల మాయాజాలం

తెలుగు జాతీ, సమైక్యతా అంటూ ఇన్నాళ్ళూ రాగాలు తీసిన సీమాంధ్ర నాయకులు హైదరాబాదు పై తమకున్న అత్యాశ నగ్నంగా బయటపడ్డ తర్వాత, ఇక అలాంటి మాటలవల్ల ఎలాంటి ఉపయోగం లేదని గ్రహించారు. అందుకే ఆజాద్ వద్ద చిత్ర విచిత్రమైన అబద్ధాల మాటల గారడీకి తెరలేపారు.

హైదరాబాదులో అరవై లక్షల మంది సీమాంధ్రులు ఉన్నారట!

మొన్నటి జనాభా లెక్కల ప్రకారం హైదరాబాదు జనాభా ఉన్నదే నలభై లక్షల మంది. సరే శివారు ప్రాంతాల జనాభా కలుపుకున్నారనుకున్నా, అరవై లక్షలమంది మీరే వుంటే మరి తెలంగాణా వారు ఏమైనట్టు? తెలంగాణా వారు కాక, మిగిలిన సిక్కులు, మరాఠీలు, మార్వాడీలు, సిందీలు, లోదీలు, మొదలైన వారంతా ఏమైనట్టు? సరే మీరు చెప్పిందే నిజం అనుకుందాం. 

మరి అరవై సంవత్సరాలు కాకుండానే అరవై లక్షల మంది వచ్చి ఇక్కడి వారిని తరిమేసి తిష్ట వేసిన వారిని దురాక్రమణ దారులంటే తప్పేమిటి? ఇలాగే ఉండనిస్తే రేపు వందశాతం కారని భరోసా ఏమిటి? వీరి లెక్కల్లోని నిజానిజాలు కాస్త పక్కకు పెడితే, ఉద్దేశాలు మాత్రం స్పష్టంగానే అర్థమౌతున్నాయి. ఇక్కడ వున్నా స్థానికులను వందశాతం నయాన్నో, భయాన్నో, ప్రభుత్వ సెజ్జుల పేరుమీదనో బయటికి పంపి వంద శాతం హైదరాబాదును కబ్జా చేసేదే ఆ ఉద్దేశం.

తెలంగాణా రాష్ట్రం ఏర్పాటు చేస్తే దేశం ముక్కలవుతుందట! 500 రాష్ట్రాలు ఏర్పడతాయట!

స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత ఇప్పటిదాకా ఎన్నో రాష్ట్రాలు ఏర్పడ్డాయి. మరి అవన్నీ ఏర్పడ్డప్పుడు లేనిది తెలంగాణా
ఏర్పడితేనే దేశం ఎందుకు ముక్కలౌతుందో వారే చెప్పాలి. ఒక రాష్ట్రం వేరుపడితేనే దేశం ముక్కలైతే మరి మద్రాసు నుండి వీరి ముక్క ఊడలాక్కున్నప్పుడు ఆ తెలివిడి ఏమైందో?

అసలు తెలంగాణా రాష్ట్రం అనగానే వీరికి దేశ సమైక్యత గుర్తుకు రావడం మరో విచిత్రం. దేశమ్మీద అంత ప్రేమ ఒలకబోసేవారు మరి చత్తీస్గడ్, జార్ఖండ్, ఉత్తరాంచల్ రాష్ట్రాలు ఏర్పడ్డప్పుడు ఎక్కడ నిద్రబోయారో, అప్పుడు దేశ సమైక్యత ఎందుకు గుర్తుకు రాలేదో అర్థం కాని విషయం.

అసలు దేశ సమైక్యత ఎలా సిద్ధిస్తుంది. అసలు మన దేశ ఏర్పాటే భిన్నత్వంలో ఏకత్వానికి నిదర్శనం. విడివిడిగా వుండి ఒకే భారతజాతి అనే భావం కలిగివుందామా? లేక ఒకే రాష్ట్రంగా వుండి రోజూ కొట్టుకుంటూ, మాది తెలుగుజాతి అంటూ భారతజాతిని ధిక్కరిద్దామా?

రాళ్ళు రప్పలు వున్న హైదరాబాదుని వీల్లోచ్చి అభివృద్ధి చేశారట.

రాళ్ళు రాప్పలే వుంటే వీళ్ళు హైదరాబాదుకు అసలు వచ్చే వారే కాదని ఈరోజు రాష్ట్రంలో చిన్న పిల్లవాడిని అడిగినా చెపుతాడు. కర్నూలులో టెంట్లలో ఆంద్ర రాష్ట్రాన్ని నడపలేక, భవనాలు కట్టుకోవడానికి డబ్బుల్లేక, అప్పటికే సౌభాగ్యవంటంగా వెలుగుతున్న హైదరాబాదుపై కన్నేసి కాదా విశాలాంధ్రకోసం అర్రులు చాచింది? రాష్ట్రం ఏర్పడ్డాక ఒక్క హైటెక్ సిటీ భవనం తప్ప అదనంగా చేసిన నిర్మాణం ఏమిటో అర్థం కాదు. దానికి బదులుగా అనేక ఓడరేవులు ఆంధ్రా ప్రాంతంలో నిర్మాణం కావడం వాస్తవం కాదా? ఇక రోడ్లు, వంతెనలంటారా, తెలంగాణా మొత్తం ఎండబెట్టి ఆమాత్రం చేయలేరా?

రాష్ట్రం ఏర్పడ్డప్పటినుండి తెలంగాణా, ఆంద్రాల నుండి వచ్చిన రెవెన్యూ ఎంత? ఖర్చు ఎంతో చెప్పమని శ్రీకృష్ణ కమిటీ అడిగినా కూడా చెప్పలేక పోయారు. చెప్పితే అసలు భండారం బయటపడుతుంది కాబట్టి ఆ లెక్కలు ఎప్పటికీ బయటికి రావు. మరి ఏం ముఖం పెట్టుకొని హైదరాబాదును అభివృద్ధి చేశామంటారో అర్థం కాదు!


Wednesday, August 10, 2011

తెలంగాణాకు ఏ మేలు జరిగినా సహించరు


చూసారుగా. ముల్కీ నిబంధలను సమర్ధిస్తూ సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పుకు వ్యతిరేకంగా 'జై ఆంధ్ర' ఉద్యమాన్ని సృష్టించారు. ఏళ్ళ తరబడి అక్రమ ఉద్యోగాలు సంపాదించి ఇక్కడ తిష్ట వేయవచ్చు. ఇక్కడే రిటైర్ మెంటు కావచ్చు. కాని ఏదో ఒక్క నిర్ణయం తెలంగాణాకి అనుకూలంగా వస్తే మాత్రం భరించలేరు.


ఇప్పుడు హైదరాబాదుకు చెందిన పోలీసు ఉద్యోగాలు ఆరోజోనుకి కాకుండా రాష్ట్రం మొత్తానికి దాఖలు పరిచే 14F వంతు. ఇంకా 14F పూర్తిగా రద్దు కానే లేదు, అక్కడ మాత్రం ఉద్యమాలు మొదలై పోయాయి. రాష్ట్రంలో అన్ని పార్టీలు  ఈ విషయంపై ఏకీభవించి శాసన సభలో ఏకగ్రీవ తీర్మానం చేసి కేంద్రానికి పంపిన విషయంపై వీరిచ్చే గౌరవం ఇది. ఇక ఈ సమైక్య రాష్ట్రంలో తెలంగాణా హక్కులు పరిరక్షించ బడతాయనుకోవడం ఎండమావిని చూసి కుండలో నీరు పారబోయడం లాంటిదే.

వీరి పధ్ధతి చూస్తే రాష్ట్రం విభజించడానికి ఆజాద్ పెద్దగా కష్టపడ వలసిన అవసరం లేదేమోనని అనిపిస్తుంది. తెలంగాణాకి ఓ పెద్ద ప్యాకేజీ, తెలంగాణలో ఓ రెండు నీటిపారుదల ప్రాజెక్టులను జాతీయ ప్రాజెక్టులుగా గుర్తించడం లాంటి తెలంగాణాకు మేలు చేసే నాలుగైదు విషయాలను ప్రకటించారంటే చాలు, ఆటోమేటిగ్గా తిరిగి 'జై ఆంధ్రా' ఉద్యమం ఊపందుకుంటుంది. రాష్ట్ర విభజన సులభం అవుతుంది.

Tuesday, August 9, 2011

సమైక్యవాదమా నియంతృత్వమా?




తెలంగాణ, ఆంధ్ర రాష్ట్రాల ఏర్పాటు కోసం ఉద్యమించడానికి విజయవాడలో సమావేశమైన లబ్ద ప్రతిష్టులైన మేధావులు, ఉద్యమకారులపై సమైక్యవాద గూండాలు దాడి చేయడం, పోలీసులు వేధించడం రాష్ట్రంలో నెలకొని ఉన్న దారుణ అణచివేతకు నిదర్శనం. ఆంధ్ర పెట్టుబడిదారీవర్గం అధికార మదంతో రాష్ట్రంలో భావ వ్యక్తీకరణ, సమావేశ హక్కులను కాలరాస్తున్నది. ఒకవైపు రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ ఉద్యమకారులను అరెస్టు చేస్తూ బోగస్ కేసులు బనాయిస్తూ హింసిస్తున్నది.

మరోవైపు ఆంధ్రలో భూస్వామ్య పెత్తందారీవర్గం, ఫ్యాక్షనిస్టులు చట్టాన్ని చేతిలోకి తీసుకుని పోలీసుల సహకారంతో గూండాలతో దాడులు సాగిస్తున్నారు. రాష్ట్రంలో భిన్న రూపాల అణచివేత తప్ప చట్టబద్ధ పాలన అనేదే కనిపించడం లేదు. తరతరాలుగా బలహీనవర్గాలపై దాష్టీకం సాగిస్తున్న కోస్తా, రాయలసీమ పెత్తందారీవర్గాలు తమకు ప్రతిఘటన ఎదురవుతున్నప్పుడల్లా కారంచేడు, చుండూరు వంటి ఊచకోతలకు పాల్పడుతున్నాయి. మనుషులను ముక్కలుగా నరికే మీరు రాష్ట్రాన్ని ముక్కలు చేయవద్దంటారేమిటంటూ ప్రశ్నిస్తున్న ఆంధ్ర అట్టడుగు వర్గాల గొంతు బయటి ప్రపంచానికి వినపడకుండా అడ్డుకుంటున్నాయి. వారి విభజనోద్యమాన్ని మొగ్గలోనే తుంచేయాలని సిగ్గుఎగ్గు లేకుండా దాడులకు దిగుతున్నాయి.

తెలంగాణ, ఆంధ్ర రాష్ట్రాల ఏర్పాటును కోరుతున్న రాజకీయ, ఉద్యమ సంస్థలకు చెందిన కొందరు ప్రముఖులు ఆదివారం విజయవాడలోని ఒక కల్యాణ మండపంలో సమావేశమయ్యారు. ఇదొక బహిరంగ సభ కాదు. ఉద్యమాన్ని ఎట్లా ప్రజల్లోకి తీసుకుపోవాలనేది చర్చించడానికి తెలంగాణ, ఆంధ్ర రాష్ట్రాల సాధన సమితి పేర ఏర్పాటయిన అంతంరంగిక సమావేశం. పోలీసులు దీనిని జరగనీయకుండా అడ్డుకోవడంతో ఈ పెద్దమనుషులు తమ సమావేశాన్ని మరో చోటికి మార్చుకున్నారు. వివిధ ఉద్యమాలతో, రాజకీయ భావాలతో ముడిపడి ఉన్న మేధావులు హాజరైన ఈ సమావేశాన్ని సజావుగా జరిపించవలసిన బాధ్యత పోలీసులది. కానీ సమైక్యవాద గూండాలు వచ్చి ఈ సభలో విధ్వంసం సృష్టించారు.

పైగా తమకు తామే కలియబడి ఘర్షణ సాగుతున్న నాటకాన్ని ఆవిష్కరించారు. అబద్ధాల ప్రచారానికి అలవాటుపడిన ఆంధ్ర మీడియా ఈ ఉదంతానికి రంగులద్ది ప్రసారం చేసింది. ఆంధ్ర సినిమాల్లో మాదిరిగానే ఆలస్యంగా రంగ ప్రవేశం చేసిన పోలీసులు సమావేశానికి వచ్చిన ప్రముఖులను అరెస్టు చేసి పోలీసు స్టేషన్లకు తిప్పారు.

రాష్ట్రాలు ఎంత చిన్నగా ఉంటే బలహీనవర్గాలు అంత సులభంగా అధికారాన్ని చేజిక్కించుకోగలవు. అందువల్ల తెలంగాణ ఉద్యమానికి మద్దతుగా కోస్తా, రాయలసీమల్లోని ఎస్సీలు,బీసీలు, ఎస్టీలు, మైనారిటీలు ఉద్యమిస్తున్నారు. కవులు, రచయితలతో పాటు భిన్నరంగాలకు చెందిన అభ్యుదయ వాదులు ఈ ఉద్యమాన్ని బలోపేతం చేయడానికి యత్నిస్తున్నారు. మరోవైపు తెలంగాణ ఉద్యమానికి వ్యతిరేకంగా ‘సమైక్యత’ పేరుతో కోస్తా, రాయలసీమ ప్రజలను రెచ్చగొట్టాలన్న ఆంధ్ర పెట్టుబడిదారీవర్గం కుటిల యత్నాలు ఇప్పటి వరకు సాగలేదు. దీంతో కిరాయి గూండాలతో బోగస్ ఉద్యమాన్ని నడిపిస్తున్నాయి. ఈ పరిస్థితుల్లో ఆంధ్ర రాష్ట్ర ఉద్యమం మొదలయితే ప్రజల నుంచి భారీ స్పందన వస్తుందని ఆంధ్ర ఆధిపత్యశక్తులు గజగజలాడుతున్నాయి.

ఉద్యమకారులపై దౌర్జన్యానికి ఒడిగడుతున్నాయి. వీరి చేతిలో కీలుబొమ్మలైన పోలీసులు కూడా ఎక్కడ సమావేశాలు జరపబోయినా అడ్డుకుంటున్నారు. ఆంధ్ర పెట్టుబడిదారుల విషపుపుత్రికలైన పత్రికలు, టీవీ చానెళ్ళు తెలంగాణలో సాగుతున్న మహోద్యమాన్ని గురించి ఆంధ్ర ప్రజలకు తెలియనివ్వకుండా అబద్ధాలు ప్రచారం చేస్తున్నాయి. పత్రికలు తెలంగాణ ప్రాంతంలో అనివార్యంగా కొన్ని ఉద్యమవార్తలు ఇచ్చినప్పటికీ ఆంధ్ర ప్రాంతంలో ప్రచురించడం లేదు.

తెలంగాణ, ఆంధ్ర ప్రజా సంఘాల జేఏసీ గత నెల విజయవాడలో సభ జరుపుదామనుకుంటే పోలీసులు అనుమతి ఇవ్వలేదు. నగరంలోని ఎనిమిది ప్రధాన సమావేశ మందిరాలను లగడపాటి ముందే బుక్ చేసుకుని ప్రజాసంఘాలను ఇబ్బంది పెట్టారు. ఆంధ్ర విశ్వవిద్యాలయంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ విద్యార్ధులు తెలంగాణకు మద్దతుగా ఊరేగింపు తీస్తే వారిపై దాడి జరిగింది. ఒంగోలులో, గుంటూరు, అనంతపురం, కర్నూలు తదితర పట్టణాలలో ఆంధ్ర రాష్ట్ర ఏర్పాటు కోసం, తెలంగాణ ఉద్యమానికి మద్దతుగా తలపెట్టిన అనేక సమావేశాలపై దాడులు జరిగాయి.

ఒక టీవీ చానెల్ ఏర్పాటు చేసిన చర్చావేదికలో దళితులను మాట్లాడనీయకుండా దౌర్జన్యం చేస్తూ అడ్డుకోవడాన్ని రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు చూసి నివ్వెర పోయారు. విజయవాడలో బీజేపీ వారు కూడా సభ జరుపుకోలేక పోయారంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. కర్నూలులో అనేక సార్లు దాడులు జరిగినా దళితులు తెలంగాణకు మద్దతుగా శ్రీకృష్ణ కమిటీ నివేదికను దగ్ధం చేశారు. అన్ని జిల్లాల్లో అట్టడుగువర్గాల ప్రజలు అభ్యుదయ శక్తుల తోడ్పాటుతో తెగించి చర్చలు సాగిస్తుండడంతో ఆంధ్ర రాష్ట్ర ఉద్యమాన్ని ఇక ఎంతో కాలం అణచివేయడం సాధ్యం కాదు.

ఆంధ్ర పెట్టుబడిదారీవర్గం పీడ వదిలించుకోవడం తెలంగాణ జనానికి ఎంత అవసరమో, ఆంధ్ర ప్రజానీకానికి కూడా అంత అవసరం. తెలంగాణ ప్రజలు జరుపుతున్న ఉద్యమం ఆంధ్ర పెట్టుబడిదారీశక్తుల నుంచి విముక్తి కోసమే తప్ప ఆంధ్ర ప్రజానీకానికి వ్యతిరేకంగా కాదు. ఈ విషయాన్ని ఉద్యమకారులు అనేకసార్లు స్పష్టం చేశారు. ఆంధ్ర రాష్ట్ర ఉద్యమకారులు కూడా తెలంగాణ జనంతో చేయి కలుపడం మంచి పరిణామం. తెలంగాణ, ఆంధ్ర ప్రజలు కలిసికట్టుగా సమన్వయంతో ఉద్యమిస్తే ఇరువురినీ పట్టి పీడిస్తున్న శని వదిలిపోతుంది.

సమైక్యవాదం కాదు యధాతథవాదం

తెలంగాణా రాష్ట్రం కోరే వారు వేర్పాటు వాదులుగా, కలిపి ఉంచాలని కోరుకునే వారు సమైక్య వాదులుగా ప్రస్తుతం రాష్ట్రంలో చలామణీ అవుతున్నారు. చివరికి తెలంగాణావాదులు కూడా ఇవే పదాలు కాస్త అటూ ఇటూగా అంటే, వేర్పాటువాదులం కాదు, విభజనవాదులమనో మరోటో చెప్పుతున్నారు.

నిజానికి తెలంగాణా వాదులు ప్రత్యేక రాష్ట్రాన్ని కోరుతున్నారు. ప్రాంతాలుగా విడిపోయి మనుషులుగా కలిసి వుందామంటున్నారు. కాని దానికి విరుద్ధంగా సమైక్యవాదులు ఒక ప్రాంతం మొత్తంగా మీతో కుంపటి వద్దు మేం విడిపోతాం అని స్పష్టంగా చెప్తున్నా సరే మీకు ఇష్టం వున్నా, లేక పోయినా సరే, సమైక్యంగా వుండి తీరుతాం, ఉండేలా చేస్తాం అంటున్నారు. ఇది నియంతృత్వ ధోరణి తప్ప మరోటి కాదు. వీరికి కావలసింది రాష్ట్రాన్నికలిపి ఉంచడం తప్ప మనుషులను కలిపి వుంచడం కానే కాదు. మనుషులు విడిపోయినా సరే రాష్ట్రాన్నికలిపి ఉంచవలసిన అవసరం వారికెందుకో తెలుసుకోవడానికి పెద్దగా ఆలోచించవలసిన అవసరం లేదు.

తానూ దోపిడీకి వంచనకు గురవుతున్నట్టు భావించినప్పుడు ఏ మనిషైనా ఎదురు తిరగడం మొదలు పెడతాడు. అలా ఒక జాతికి జాతి భావించడం మొదలు పెడితే పాలనా వ్యవస్థ మార్పుకోసం ఒక ఉద్యమం మొదలౌతుంది. ఇప్పుడున్న ఆంధ్రప్రదేశ్ పరిపాలనా వ్యవస్థ మీద పూర్తిగా నమ్మకం పోయింది కాబట్టే తెలంగాణా ప్రజలు మార్పుకోసం ఉద్యమించడం మొదలు పెట్టారు. వారు ఆ మార్పు ప్రత్యేక రాష్ట్రంవల్ల సాధ్యపడుతుందని భావిస్తున్నారు.

వివక్షకు, దోపీడీకి గురయ్యే వాడెప్పుడూ మార్పు కోరుతాడు. అలాగే దోపిడీ చేసేవాడు యధాతథ పరిస్థితిని కోరుతాడు. ఈజిప్టు, లిబియాలలో ఉద్యమాలు జరిగింది మార్పు కోసమే. ఇప్పుడు లండన్ అతలాకుతలం అవుతున్నది కూడా మార్పు కోసమే. వ్యవస్థమీద నమ్మకం సన్నగిల్లినపుడు ప్రజలు రోడ్డెక్కుతారు. అది తెలంగాణా అయినా, ఈజిప్టయినా లేక ప్రజాస్వామ్య దేశాలకే తాతలాంటి ఇంగ్లాండైనా సరే.

మరి మార్పును అడ్డుకునేది ఎవరు? మరెవరో కాదు ఇప్పుడున్నపరిస్థితి వల్ల లబ్ది పొందుతున్న వారు. ఇప్పుడున్నవ్యవస్థ వల్ల అసహజమైన లబ్ది పొందుతున్నారు కాబట్టి వారికి సహజంగానే దీన్ని మార్చడం ఇష్టం వుండదు. కాని చరిత్ర తెలిసిన వారికి ఒక విషయం సుపరిచితం, అదే, మార్పు అనివార్యమని.

Friday, August 5, 2011

ఆడలేక మద్దెల ఓడన్నట్టు...

ఆడలేక మద్దెల ఓడన్నట్టుంది మన చిదంబరం పరిస్థితి. అన్ని పార్టీలు ఏకాభిప్రాయం సాధించాలని ఒక ఉచిత సలహా పారేసిండు పార్టీల మీదికి. వాళ్ళ కాంగ్రెస్ పార్టీల కూడా ఏకాభిప్రాయం లేదని ఒప్పుకున్నడనుకోండి. అంది వేరే విషయం.

అసలు కాంగ్రెస్ పార్టీల ఏకాభిప్రాయం లేకపోవుడు చేతనే ఈ సమస్యంత వచ్చింది. కాంగ్రెస్ పార్టీల ఏకాభిప్రాయం వుంటే చిదంబరం చర్చలకు పార్టీకి ఇద్దరు చొప్పున పిలిచేటోడే కాదు. కాంగ్రెస్ పార్టీకి ఇబ్బంది కలుగాకుంట ఇద్దరినీ పిలిస్తే అది తెలుగుదేశం పార్టీ సక్కగ ఉపయోగించుకొని గోడమీది పిల్లి అవతార మెత్తింది. చంద్రబాబు రెండుకళ్ళ బాబుగా మారిండు.

అందుకని చిదంబరం ముందు తమ పార్టీ వాళ్ళను ఒక నిర్ణయానికి రమ్మని చెప్పితే బాగుంటది. కాంగ్రెస్ పార్టీ ఏకాభిప్రాయానికి వస్తే మిగతా పార్టీల అభిప్రాయాలు చెప్పించుడు కష్టంగాదు. పార్టీకి ఒక్కరిని, అదీ రాష్ట్ర స్థాయి అధ్యక్షులను పిలిస్తే, కచ్చితంగా ఒకే అభిప్రాయం వస్తది. ఏ పార్టీ రంగు ఏందో ప్రజలకు తెలుస్తది. దాగుడు మూతలు బందైతై.

అధికారాన్ని అడ్డం పెట్టుకొని ధనార్జనే ధ్యేయంగా వున్న కాంగ్రెస్ పార్టీకి యీ విషయం మీద ఒక పాలసీ అంటూ ఉన్నదా అనేది కోటి వరహాల ప్రశ్న. లేదు అనేది అందరికీ తెలిసిన జవాబు. ఏరోటి దగ్గర ఆపాట పాడడమే ఆ పార్టీకి తెలిసిన ఒకే ఒక విద్య.

ఇప్పుడు రాష్ట్రంలో, కేంద్రంలో అధికారంలో వున్నది కాంగ్రెస్ పార్టీయే. ఆ పార్టీని పూర్తిగా ఇరుకున పెడితేనే కాని 2014 లోపు తెలంగాణా ఏర్పాటు సాధ్యం కాదు.  కాబట్టి ఇప్పుడు 2014 కన్నా ముందుగా తెలంగాణా సాధించుకోవడానికి కాంగ్రెస్ పార్టీని తీవ్ర వత్తిడికి గురి చేయడం తప్ప వేరే మార్గం లేదు. తెలంగాణా సాధించక పొతే తమకు పుట్టగతులుండవని, ఇంకా ప్రజలను మోసగించలేమని ఇక్కడి ప్రజాప్రతినిధులకు స్పష్టం కావలసిన అవసరం వుంది.

కేంద్రంల బల్బు వెలుగాలెనంటే ఇక్కడ కాంగ్రెస్ నాయకులను నొక్కడం తప్ప మరో మార్గం లేదు.


రెచ్చగొడుతుంది ఎవరు?

మాట మాట్లాడితే సమైక్య వాదులు చెప్పేది ఏమంటే 'కొంతమంది నిరుద్యోగ నాయకులు తెలంగాణా ప్రజలని రెచ్చగొడుతున్నారు' అని.

అసలు రెచ్చగొట్టేది ఎవరు? తెలంగాణాకు ప్రతి విషయంలోనూ మొండి చేయి చూపించే పాలకులు కాదా?

ఆంధ్రాలో సమైక్యవాదులు ఎన్ని ప్రదర్శనలు నిర్వహించినా, కొండొకచో విధ్వంసాన్నే సృష్టించినా అక్కడ పోలీసనే వాడే కనపడడు. అదే తెలంగాణలో విద్యార్థులు ఒక ప్రదర్శన నిర్వహిస్తే దాన్ని లాఠీలతో మంద బలాన్ని పంపించి అణచి వేస్తారు. ఇది రెచ్చగొట్టుడు కిందికి రాదా? రెచ్చి పోయిన ప్రజల కోపం ఎలాంటి పరిణామాలకైనా రూపు దాల్చవచ్చు. కాని దాదాపు అన్ని సార్లు తెలంగాణా ప్రజలు ఏంటో వివేకంతో, సహనంతో పోలీసు ఆకృత్యాలను  సహిస్తున్నారు.

2004 లో కాంగ్రెస్, 2009 లో తెలుగుదేశం రెండూ తెలంగాణా రాష్ట్రానికి మద్దతు పలికాయి. కాని తర్వాతి కాలంలో వాటి మోసపూరిత విధానాలు రెచ్చగొట్టడం కాదా? తెలంగాణా ప్రజలకు ఏమైనా చెప్పొచ్చు, తర్వాత ఎలాగైనా మాట మార్చొచ్చు అన్న నాయకుల కుత్సిత బుద్ధులు చూసిన తర్వాత కూడా రెచ్చి పోక పోతే ఇక తెలంగాణా ప్రజలు ఒక జాతిగా మనగలగడమే అనుమానాస్పదంగా మారుతుంది.

సరే అవన్నీ వదిలేద్దాం. గత సంవత్సరం మార్చిలో అసెంబ్లీలో అన్ని పార్టీలూ ఏకగ్రీవంగా 14F తొలగించాలని తీర్మానం చేసాయి. కాని జరిగిందేమిటి? అప్పటి నుండి ఏ ముఖ్యమంత్రి తీర్మానం అమలుకు చిత్తశుద్ధితో కృషి చేసిన దాఖలాలు కనిపించవు. కాని దాని స్పూర్తికి విరుద్ధంగా పోలీసు పరీక్షలు నిర్వహించడానికి మాత్రం ఆఘమేఘాల మీద నిర్ణయాలు జరుగుతాయి. సగటు తెలంగాణా పౌరుడిలో ఉద్యమ స్పూర్తిని ఇలాంటి చర్యలు మరింత రెచ్చగొట్టక  మానుతాయా?

అగ్నికి ఆజ్యం పోసినట్టు చిదంబరం 14F పై అసెంబ్లీలో మరొక తీర్మానం చేసి పంపండని చెప్పడం చూస్తుంటే తెలంగాణా ప్రజలంటే వీరికి ఎంత చులకనో చెప్పడానికి ఈ ఒక్క సంఘటన చాలు. ఇదివరకు తీర్మానం చేసిన అసెంబ్లీ ఇంకా చేతనావస్థలో ఉండగానే అదే విషయంపై మరొక తీర్మానం కోరడమంటే, ఇది ఒక్క చిదంబరం బుర్రలోంచి వచ్చింది కాదని సులభంగానే అర్థమౌతుంది. దీని వెనుక బలమైన ఆంధ్రా లాబీలున్న సంగతి ఊహకందే విషయమే.

ఇలా చెప్పుకుంటూ పొతే రాష్ట్రం ఏర్పడ్డ తెల్లారే పెద్దమనుషుల ఒప్పందాన్ని తుంగలో తొక్కింది మొదలుగా ఈనాటి వరకు తెలంగాణా ప్రజలను రెచ్చగొట్టిన వైనాలు లెక్కలకు అందవు. ఒక జాతిని మొత్తంగా అన్యాయాలకు గురి చేస్తూ, అవమాన పరుస్తూ రెచ్చగొడుతున్నా కూడా ఇప్పటివరకూ తెలంగాణా ప్రజలు ప్రశాంతంగానే ఉన్నారు. తమను తాము ఆహుతి చేసుకున్నారు తప్ప చీమకు కూడా అపకారం తలపెట్టలేదు.

కాని ఏజాతైనా కలకాలం అణగి మణగి ఉండలేదు. ఆ సమయం ఇప్పుడు తెలంగాణా ప్రజలకు వచ్చింది. తమకు జరిగిన జరుగుతున్న అన్యాలపై ఉవ్వెత్తున ఎగుస్తున్న ప్రజావేశం ఇప్పటికీ అదుపులోనే వుంది. ఇప్పటికైనా ప్రభుత్వాలు ప్రజల ఆకాంక్షలను మన్నించి మసలుకోక పొతే జరగబోయే పరిణామాలు మాత్రం రాష్ట్రానికి, దేశానికి ఏమాత్రం క్షేమకరం కావు.  

Monday, August 1, 2011

గిరీశం పరిష్కారాలు

‘వడ్డించేవాడు మనవాడయితే కడపంక్తిని కూర్చున్నా అన్నీ సమకూరుతాయ’న్నట్టుగా అకారాది క్రమంలో రాష్ట్రం పేరు ఆఖరుస్థానంలో ఉన్నంత మాత్రాన రాష్ట్రా ల ఉనికీ, ఉసురూ, సగటు బతుకూ చెడిపోదుగదా!... ఆంధ్రప్రదేశ్ అనే దుష్టసమాస భూయిష్టమైన పేరుకు బదులు యావత్తు తెలుగుదేశానికి (మూడు ప్రాంతా లు ముప్పేటగా) తెలంగాణం(లేదా తెలంగాణ) అనే పేరును స్థిరపరుస్తూ రాజ్యాం గ సవరణకు ఉద్యమించడం తెలుగుజాతి సమైక్యతకు అత్యవసరం.
-సీనియర్ జర్నలిస్టు ఎబికె ప్రసాద్

అమెరికా సామ్రాజ్యవాదంపై పోరాటమెందుకూ?
అమెరికాకు భారతదేశమనో, చైనా అనో పేరుపెడితే పోలా!
ప్రపంచబ్యాంకుపై అంతగా విరుచుకుపడడం ఎందుకూ?
దానికే 'ఆంధ్రా బ్యాంకు' అని నామకరణం చేయడం బెటర్ కదా!
కార్యకారణ సంబంధాలపై చర్చ ఎందుకు?
కార్యాలన్నీ కారణాలే అని సరిపెట్టుకుంటే మంచిదేమో!
వర్గశత్రు నిర్మూలన పోరాటాపూందుకూ?
పెట్టుబడిదారులకూ ‘కార్మికుల’ని టైటిల్ తగిలిస్తే ఫినిష్!


ఎడిటర్లు గిరీశాలయితే పరిష్కారాలన్నీ ఇలాగే ఉంటాయి.

ఆంధ్రప్రదేశ్‌కు తెలంగాణం అని పెడితే అన్ని సమస్యలు పరిష్కారం అవుతాయట. ఇదేమైనా కొత్త విషయమా? విలీనం సమయంలో రాష్ట్రానికి పెట్టాలనుకున్న పేరు తెలంగాణ-ఆంధ్ర అని. పార్లమెంటు పరిశీలనకు వచ్చిన బిల్లులో కూడా ఆ పేరే ఉంది. కానీ తెలంగాణ అస్తిత్వాన్ని ఆ రూపంలోనూ గుర్తించడానికి నిరాకరించిన ఆంధ్రా ఎస్టాబ్లిష్‌మెంటు అప్పుడే దానిని మార్పించి, ఆంధ్రప్రదేశ్‌ అనే పేరు పెట్టుకుంది. ఐదున్నర దశాబ్దాల పీడన తర్వాత ఇప్పుడు కేవలం పేరు మార్చితే సరిపోతుందని ఈ మార్క్సిస్టు ఘనాపాఠి తీర్పు ఇస్తున్నారు.

ఎంత విడ్డూరమంటే పేరులో ఏమీ ఉండదని, అక్షరక్రమంలో ఎక్కడ ఉన్నా ఉసురూ, ఉనికీ, సగటు జీవనానికి వచ్చే నష్టమేదీ లేదని ఆయనే రాశారు. ‘వడ్డించేవాడు మనవాడయితే కడపంక్తిలో కూర్చున్నా అన్నీ సమకూరుతాయి’ అని కూడా ఆయన సెలవిచ్చారు. ఎబికె ప్రసాద్ ఎంత స్మార్టో! పేరు మార్పు జరిగినా ఏమీ ఒరగదని ఆయనే చెబుతారు. పేరు మార్చితే తెలంగాణ సమస్య పరిష్కారం అవుతుందనీ ఆయనే అంటారు. వడ్డించేవాడు మారకుండా, అంటే ఆంధ్ర ఆధిపత్యం మారకుండా, తెలంగాణ సమస్య పరిష్కారం కావాలన్నమాట. ఇది యథాతథవాదం. దోపిడీని శాశ్వతం చేసుకోవాలన్న తాపత్రయం. తెలంగాణ కష్టాలు, కన్నీ ళ్లు, బలిదానాలు ఇవేవీ పరిష్కారం కావాల్సిన అవసరం లేదు ఈ మతి తప్పిన గతితార్కిక మేధావికి.

రాజీనామాలు చేసినంత మాత్రాన రాష్ట్రాలు ఇచ్చేస్తారా? అలాగైతే కృష్ణా జిల్లా నేతలందరితో రాజీనామాలు చేయిస్తా. ఆ జిల్లాను ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పాటు చేస్తారా?
-ఏలూరు ఎంపి కావూరి సాంబశివరావు

బుకాయింపులతో భూములేలవచ్చునని సామెత. కావూరివారు ఇంతకాలం చేస్తున్నది ఇదే. తెలంగాణపై తమ ఏలుబడిని కొనసాగించడానికి ఇక మిగిలిన ఏకైక అస్త్రం- బుకాయించి బతకడం, దబాయించి చెలాయించడం. ఏ వాదం లేనివాడే వితండవాదం చేస్తాడు. ఏ తర్కమూ చేతగానివాడే కుతర్కానికి దిగుతాడు. సమైక్యాంధ్ర మోయడానికి కావూరి వారికి ఇంకేదారీ మిగల్లేదు- అడ్డగోలు మాటలు, అహంకార ప్రదర్శనలు తప్ప. తెలంగాణవాదానికి చరిత్ర ఉంది. పోరాటవారసత్వం ఉంది. త్యాగాల భూమిక ఉంది. ఒక్క సీపీఎం తప్ప అన్ని రాజకీయ పార్టీలు ఈ వాదాన్ని అంగీకరించిన రికార్డూ ఉంది. వీటన్నింటినీ అవమానించాలన్న జాతిదురహంకార దృష్టితో కావూరివారు మాట్లాడుతున్నారు.

రాజీనామాలు చేస్తే కృష్ణా జిల్లాను రాష్ట్రం చేస్తారా? అని ఈ పెద్ద మనిషి అడుగుతున్నారు. సీమాంధ్ర నాయకులు ఆది నుంచి పరాన్న జీవులే. నాడు బెజవాడను రాజధానిని కాకుండా అడ్డుకున్న మరుగుజ్జులు కృష్ణా జిల్లా నాయకులే. అటువంటి నాయకులకు కృష్ణా జిల్లా కోసం రాజీనామాలు చేసే దమ్ము ఉందా? అంత ఉబలాటంగా ఉంటే రాజీనామాలు చేయండి! జిల్లాకో రాష్ట్రం ఏర్పాటు చేసుకోండి. బంగాళాఖాతంలో కలవండి. కానీ తెలంగాణకు అడ్డుపడితే మిమ్మల్ని చరిత్ర క్షమించవచ్చు, కానీ తెలంగాణ క్షమించదు.

ఆంధ్ర ప్రాంతంవారి మోచేతి నీళ్లు తాగి మేము బతకలేం. తెలంగాణ ఏర్పాటు చేస్తే రాయలసీమ కూడా ఏర్పాటు చేయాలి.
-రాష్ట్ర మంత్రి టీజీ వెంకటేష్

నేతిబీరలో నెయ్యి ఎంతో సమైక్యతలో ఐక్యత అంత. ఆంధ్రావారి పట్ల రాయలసీమ వారికే నమ్మకం లేనప్పుడు తెలంగాణవారికి ఎందుకు నమ్మకం ఉంటుం ది? ఇక్కడ విడిపోతే అక్కడ కలసి ఉండరట. తెలంగాణను కొల్లగొట్టడానికి మాత్రం కలిసి కట్టుగా పోరాడతారన్నమాట. తాము దోచుకోవడానికి దాచుకోవడానికి అవకాశం ఉన్నంత కాలమే సమైక్యత లేకపోతే అక్కరలేదు.

రాష్ట్రంలో ఒక్క శాతం ఓట్లు కూడా లేని బిజెపి రాష్ట్ర విభజనపై మాట్లాడడం ఏమిటి?
-కాంగ్రెస్ ఎంపీ లగడపాటి రాజగోపాల్

అబద్ధాల ఘనాపాఠి లగడపాటి రాజగోపాల్ తొంభైతొమ్మిదో అబద్ధం ఇది. బీజేపీకి ఒక్క శాతం కూడా ఓట్లు లేవట. 2009 లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీకి రాష్ట్రంలో వచ్చిన ఓట్లు 4 శాతం. ఆ పార్టీ జాతీయ పార్టీ. దేశవ్యాప్తంగా 20 శాతానికిపైగా ఓట్లు కలిగిన పార్టీ. రాజగోపాల్ ఒక టుమ్రీ. రాజగోపాల్‌కు వచ్చిన ఓట్ల శాతం రాష్ట్రం మొత్తం మీద చూస్తే ఒక్క శాతమే. కానీ రాష్ట్ర విభజనపై ఈయనగారు వాగినట్టుగా ఎవరయినా వాగుతున్నారా? ఈయనగారు ఒక్క శాతమే ఓట్లు ఉన్న ఎంఐఎం అభి్రప్రాయానికి మాత్రం విలువ ఇవ్వాలంటారు. చిన్న రాష్ట్రాలకు ఆర్‌ఎస్‌ఎస్ వ్యతిరేకమని ఆ సంస్థ సర్‌సంఘ్‌చాలక్ చెప్పినట్టు ఇంకో అబద్ధాన్ని కూడా ఎలాంటి జంకూ గొంకూ లేకుండా చెప్పారు రాజగోపాల్. ఈ వార్త కూడా సీమాంధ్ర మీడియా సృష్టే. ఈ వార్త పచ్చి అబద్ధమని ఆర్‌ఎస్‌ఎస్ అధికార ప్రతినిధి రాంమాధవ్ అప్పట్లోనే ఖండించారు. బధిరాంధకారంలో మగ్గుతున్నవాడికి, అహంకారంతో కళ్లు మూసుకున్నవాడికి సత్యం తలకెక్కదు.

మన దేశంలో కొందరికి డబ్బు పిచ్చి పట్టుకుంది. వేల కోట్ల రూపాయలు దోచుకుని రాశులు పోసుకుంటున్నారు. వందల గదులతో ప్యాలెస్‌లు కట్టుకుంటున్నారు. వాటిని ఏం చేసుకుంటారు? కట్టుకుపోతారా?
-రాందేవ్ బాబాతో కలిసి మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు

యోగి యోగిని కలిస్తే విలువ. యోగి భోగిని కలిస్తే నగుబాటు. రాందేవ్ బాబా అన్నాహజారేతో చేతులు కలిపితే అందరూ సంతోషించారు. అవినీతికి వ్యతిరేకంగా వీరిపోరాటానికి నైతికంగా మద్దతు ప్రకటించారు. అదే రాందేవ్ బాబా చంద్రబాబునాయుడును కలిసి అవినీతి వ్యతిరేక పోరాటం గురించి మాట్లాడినప్పుడు చాలా మంది నవ్వుకున్నారు. ఎందుకంటే అవినీతి విషయంలో చంద్రబాబుకు ఉన్న విశ్వసనీయత అటువంటిది. చంద్రబాబునాయుడు పాలిష్డ్ అవినీతికి పునాదులు వేశారు. రాజశేఖర్‌డ్డి దానిని కొత్త పుంతలు తొక్కించడమే కాదు, పరాకాష్ఠకు తీసుకెళ్లారు. కొందరు ఆస్తులు కూడ బెడతారు. మరికొందరు ప్యాలెస్‌లు కడతారు. అవినీతి ఒకటే, స్టైలే వేరు. అందుకే రాందేవ్ బాబా తప్పులో కాలేసి, అవినీతి వ్యతిరేక పోరాటం గాలి తీసేశారు. కొన్ని విషయాలపై కొందరిని కలవకపోతే మంచిది. కొందరిని కలిస్తే మంచిది. బాబా ఆ తేడాను పాటించలేదు.

- కట్టా శేఖర్‌రెడ్డి