Wednesday, January 29, 2014

వీళ్ళా, మన నాయకులు?

తెలంగాణా ఏర్పాటు ముహూర్తం దగ్గర పడుతున్న కొద్దీ ఆంధ్రా నాయకుల కుయుక్తులు, కపట నాటకాలు బయట పడుతున్నాయి.

వీరికి ప్రజాస్వామ్యమన్నా, రాజ్యాంగమన్నా ఏమాత్రం గౌరవం లేదు. ఇన్నాళ్ళు రాష్ట్ర ప్రభుత్వాన్ని, అసెంబ్లీని తమ మంద బలంతో చెప్పుచేతల్లో ఉంచుకున్నట్టు, ఇప్పుడు కేంద్రాన్ని, రాష్ట్రపతిని కూడా ప్రభావితం చేయడానికి సాహసిస్తున్నారు.

కాని వీరి తాటాకు చప్పుళ్ళకు తెలంగాణా వాదులు భయపడవలసిన అవసరం లేదు.  వీరి పశుబలం కేవలం ఆంధ్రపదేశ్ సరిహద్దులకు మాత్రమే పరిమితమైనది. అవి దాటినా తర్వాత వీరేం చేయబోయిన పరమ మూర్ఖ శిఖామణులుగా ముద్ర వేయించుకోవడం తప్ప ఇంకోటి చేతగాదు వీరికి!

నాడు పార్లమెంటులో నాలుగు ముక్కలు మాట్లాడడానికి కూడా చేతగాక ఈడిగిల పడ్డారు. చంద్రబాబు డిల్లీలో దీక్షకు దిగి జాతీయ మీడియా సాక్షిగా పరువు బజారు కీడ్చుకున్నాడు. ఇప్పుడు కిరణ్ కుమార్ తన తెలివితక్కువ తనంతో డ్రాఫ్టు బిల్లని, తిప్పి పంపాలని వచ్చీ రాని తెలుగులో జనానికి వినోదం పంచుతూ తన అఙ్ఞానాన్ని ప్రకటించు కుంటున్నాడు.

కేంద్ర ప్రభుత్వానికి చెందిన ఈ బిల్లుపై కేవలం అభిప్రాయాలు మాత్రమే చెప్పమని, అంతకన్నా ఎక్కువగా ఏమీ చేయవద్దని సాక్షాత్తూ రాష్ట్రపతి గారినుండి ఆదేశాలు వచ్చినా, అంశాల వారీగా ఓటింగు పెట్టాలని కాసేపు, తప్పుల తడక అంటూ కాసేపు, సమయం సరిపోదు, పెంచాలని కాసేపు చెపుతూ వొస్తున్న ఈ ముఖ్యమంత్రి ... చివరకు ఆ పాచికలేమీ పారక పోయేసరికి తిప్పి పంపాలని నోటీసు ఇచ్చాడట!

శనివారం నాడు అసెంబ్లీలో తిప్పి పంపానని చంద్రబాబు చెప్పడం, ఆ వెనువెంటనే ముఖ్యమంత్రి నోటీసు ఇవ్వగలగడం చూస్తుంటే వీరు తెలంగాణా కు వ్యతిరేకంగా ఏవిధంగా కుమ్మక్కు రాజకీయాలు నడపగలరొ ప్రజలు అర్థం చేసుకోవాలి. తెలంగాణా కాంగ్రెస్ నాయకులు ఈ విషయంలో ముఖ్యమంత్రిని బాగానే తూర్పార బట్టారు. కాని తెలంగాణా తెలుగుదేశం వారు మాత్రం చంద్రబాబుని ఇంకా వెనకేసుకు రావడం చూస్తుంటే వారికి తెలంగాణా ఏర్పాటుపై ఏమాత్రం నిజాయితీ లేదని, తెలంగాణాకు అనుకూలంగా చెప్తున్నా వారి మాటలు కేవలం ఉత్తుత్తివేనని, అంతా నటనేనని స్పష్టంగా అర్థమవుతంది. 

రాజ్యాంగం పై, రాజ్యాంగ సంస్థల పై ఏమాత్రం గౌరవం లేని, కేంద్ర రాష్ట్ర అధికారాలపై ఏమాత్రం అవగాహన లేని వీరి పనులను చూస్తూ... ఛీ, వీళ్ళా మమ్ములను ఇన్నాళ్ళు పరిపాలించిన నాయకులు, అని తెలంగాణా ప్రజలు సిగ్గుతో తలవంచుకుంటున్నారు. మీరు ఇన్నాళ్ళు వెలగబెట్టింది చాలు, ఇక నైనా మాది మేము చూసుకుంటాం, దయచేయండి అంటున్నారు.

No comments:

Post a Comment