Friday, November 11, 2011

దోపిడీదారులమని అన్నారు కాబట్టి...



మమ్మల్ని దోపిడీదారులు అన్నారు కాబట్టి తెలంగాణా వదలం. 
మమ్మల్ని జాగో భాగో అన్నారు కాబట్టి తెలంగాణా వదలం.

ఇవీ కొంతమంది సమైక్యవాదులు చెప్పే మాటలు.  వీరు అంతర్గత అర్థం వచ్చేలానో, లేక బహిరంగంగానేనో క్రింది విధంగా వాదన చేస్తారు.

అసలు రాష్ట్రం అంటూ విడిపోతే మా ఆంధ్రా వారికే లాభం. మేం బాగా కష్టపడి (మేమేలాగూ కష్టపడే వాళ్లమేగా) మా రాష్ట్రాన్ని దేశంలోనే, కాకపోతే ప్రపంచంలోనే గొప్ప రాష్ట్రంగా తయారు చేస్తాం. అయినా కూడా మేం విడిపోవాలనుకోవడం లేదు. ఎందుకంటారా! మిమ్మల్ని (తెలంగాణా ప్రజల్ని) ఇబ్బంది పెట్టడానికి. ఎందుకంటే మీరు మమ్మల్ని దుర్భాషలాడారుగా! అందుకని మేం మిమ్మల్ని వదలం. మీరు అరిచి గిజుకున్నా సరే మేం ఇక్కడే వుండి మీకు కావలసినంత అపకారం చేస్తుంటాం. దానివల్ల మాక్కూడా అపకారం జరిగినా సరే. (మరి ప్రపంచంలో గొప్ప రాష్ట్రం కావలసిన ప్రాంతం అలా కాకుండా పోతుందంటే అపకారం జరుగుతున్నట్టేగా). అయినా సరే, మాకు జరిగే అపకారమైనా మాకు సమ్మతమే కానీ మీకు మాత్రం ఉపకారం జరగడానికి వీల్లేదు. ఎందుకంటే మీరు మమ్మల్ని తిట్టారుగా!

ఇదీ వరస.

దీంట్లో రెండుమూడు అంశాలున్నాయి.

ఒకటి, తెలంగాణా వారు సీమాంధ్ర వారిని తిట్టడం.
రెండు, సీమాంధ్ర రాష్ట్రం విడిపోతే దేశంలోకెళ్ళానో, ప్రపంచంలోకెళ్ళానో గొప్ప రాష్ట్రంగా వర్ధిల్లడం.
మూడు, తెలంగాణా వారు తిట్టారు కాబట్టి వారిని ఇబ్బందులకు గురి చేయడానికి సమైక్యంగా వుండడం.

ఇప్పుడు సమస్య విషయం పూర్తిగా దేనికదిగా విడిపోయింది గదా! ఇప్పుడు ఇది ఎంత చెత్త వాదనో వేరే చెప్పవలసిన అవసరం లేకుండానే చదువరులు అర్థం చేసుకోగలరు. కాకపోతే ఇలాంటి వాదనలు కొంత మంది లబ్దప్రతిష్టులైన బ్లాగర్లు  కూడా చేయడమే ఆశ్చర్యకరమైన విషయం.

దీన్ని మరింత విశ్లేషిద్దాం.

వారి అభియోగం తెలంగాణా వారు సీమాంధ్రులని తిట్టారని. దీనిలో ఎంతవరకు వాస్తవం వుంది? తెలంగాణా వారంతా కట్టగట్టుకుని  సీమాంధ్రులని తిట్టడం సాధ్యమేనా? కొందరు తిడితే అందరినీ బాధ్యులను చేయడం ఎంతవరకూ సబబు? ఆ తిట్టినా కొందరు కూడా తాము తిట్టింది కొందరు సీమాంధ్రకు కొందరిని మాత్రమే అని పదే పదే వివరణ ఇచ్చారు కూడా. ఇక్కడ కొందరిని ఉద్దేశించి అన్న మాటలు అందరికీ అన్వయించుకొని బాధపడడం (నిజంగా పడ్డట్టయితే) ఒక ఎత్తైతే, ఆ తిట్లకు తెలంగాణా ప్రజలంతా కారకులే అన్నట్టు మాట్లాడడం ఒక ఎత్తు.

నిజానికి తెలంగాణాలోని ప్రతీ ఊర్లోనూ కనీసం ఒక్కటైనా ఆంధ్రా వారికి చెందినా కుటుంబం వుంటుంది. వారంతా కలిసి మెలిసే వుంటున్నారు. గత పది సంవత్సరాలనుంచీ ఉద్యమం ఉధృతంగా సాగుతున్నా వీరి మధ్య ఎక్కడా ఒక్క చిన్న గొడవైనా జరిగినట్టు కనీసం ఆంధ్రా పక్షపాత మీడియా కూడా చూపించలేక పోయింది.

సరే, తిట్టారే అనుకుందాం. మరి మనం స్వాతంత్ర్య పోరాటం చేస్తున్నప్పుడు కూడా బ్రిటిష్ వారిని దోపిడీ దారులని తిట్టామే! దానర్థం బ్రిటన్ లో వున్నా ప్రతీ సామాన్య పౌరుడూ దోపిడీ దొంగేనా? కాదుగదా? ఉదాహరణకు క్రింది పద్యం చూడండి.

భరత ఖండంబు చక్కని పాడి యావు
హిందువులు లేగదూడలై ఏడ్చుచుండ 
తెల్లవారను గడుసరి గొల్లవారు 
పితుకుచున్నారు మూతులు బిగియ గట్టి. 

     -చిలకమర్తి లక్ష్మీనరసింహం పంతులు

దీని అర్థం ఏమిటి? మొత్తం తెల్లవారంతా దొంగలేనా? బ్రిటన్ మన దేశాన్ని పాలించినప్పుడు కూడా అక్కడ బీద బ్రిటిష్ ప్రజలు ఉండేవారు. బిచ్చగాళ్ళు కూడా ఉండే వాళ్ళు. మరి మన సొమ్ము దోపిడీ చేసి వాళ్ళు బిచ్చగాళ్ళుగా వున్నారా? కాదనేగా అర్థం. అంటే పై పద్యం దోపిడీ దార్లను ఉద్దేశించి రాసిందే కాని మొత్తం బ్రిటిష్ వారిని ఉద్దేశించి రాసింది కాదు. కాకపోతే అలా రాసిన ప్రతీచోటా disclaimers ఇవ్వాలంటే ఎలా?

కానీ బ్రిటిష్ ప్రజలు అలా అనుకోలేదు. వారు సరిగ్గానే అర్థం చేసుకున్నారు. ఎంతో మంది గాంధీజీకి శిష్యులుగా కూడా వున్నారు. అంతే కాదు, భారతదేశానికి స్వాతంత్ర్యం ఇచ్చేటప్పుడు వారు స్వాగతించారే కానీ ఎదురు చెప్పలేదు.

మరి మన సోదరులు అలా అనుకోవడం లేదంటే వారికి ఇవన్నీ తెలియడం లేదనుకోవాలా? ఎంతమాత్రం కాదు. వారికి ఇవన్నీ తెలుసు. అంతేకాదు తెలంగాణాపై ప్రాంతీయ దోపిడీ ఎలా జరుగుతుందో కూడా తెలుసు. కళ్ళముందే తూములు పగులగొట్టి నీళ్ళు దండుకోవడాలూ, శ్రీశైలం ఎడమ కాలువ ఎండగట్టి, కుడివైపు కాలువల కదంబాలు చేపట్టడాలూ, చేవెళ్ల-ప్రాణహిత పక్కకు నెట్టి పోలవరం ఆఘమేఘాల మీద కట్టడాలూ లాంటి విషయాలు రోజూ కనపడుతుంటే తెలియకుండా ఎలా వుంటాయి? తెలంగాణా భూములను పందేరం పెట్టి ఎకాఎకి లక్షల కోట్లు మూతలు కట్టుకున్న వారిని ఎలా విస్మరించగలరు?

గుర్తించారు కాబట్టే చాలామంది సహృదయులైన ఆధ్రులు తెలంగాణా ఉద్యమానికి స్వచ్చందంగా మద్దతు పలుకుతున్నారు. మరికొంత మంది తటస్థంగా వుంటున్నారు. కాని కొంతమంది మాత్రం పైన చెప్పుకున్నట్టుగా మాటల యుద్ధం చేస్తుంటారు.ఎందుకంటే ఈ వ్యవస్థ ఇలాగే కొనసాగడం వారికి ఇష్టం. విడిపోతే వారు అభివృద్ధి చెందినా సరే, విడిపోకుండా వుండి ప్రాంతీయ దోపిడీవ్యవస్థ ఇలా నిరాటంకంగా కొనసాగడమే వారికి ఇష్టం. మరి దోపిడీవ్యవస్థను బలపరిచే వారు కూడా దోపిడీదారులు కాకుండా ఇంకేమౌతారు?

ఇక మిగతా అంశాల గురించి చర్చించడం అవసరమా?

7 comments:

  1. Hi srikanth,
    I really appreciate your patience to explain andhra people but i know this is
    చెవిటి వాడి ముందు శంకం ఉదినట్లె.

    ReplyDelete
  2. "వారి అభియోగం తెలంగాణా వారు సీమాంధ్రులని తిట్టారని. దీనిలో ఎంతవరకు వాస్తవం వుంది? తెలంగాణా వారంతా కట్టగట్టుకుని సీమాంధ్రులని తిట్టడం సాధ్యమేనా? కొందరు తిడితే అందరినీ బాధ్యులను చేయడం ఎంతవరకూ సబబు? ఆ తిట్టినా కొందరు కూడా తాము తిట్టింది కొందరు సీమాంధ్రకు కొందరిని మాత్రమే అని పదే పదే వివరణ ఇచ్చారు కూడా. ఇక్కడ కొందరిని ఉద్దేశించి అన్న మాటలు అందరికీ అన్వయించుకొని బాధపడడం (నిజంగా పడ్డట్టయితే) ఒక ఎత్తైతే, ఆ తిట్లకు తెలంగాణా ప్రజలంతా కారకులే అన్నట్టు మాట్లాడడం ఒక ఎత్తు."

    పై పేరా లో తిట్టుని దోపిడీ తోను, తెలంగాణాని సీమాంధ్ర తోను భర్తీ చేసి చూద్దాం, ఎలా ఉంటుందో?

    వారి అభియోగం సీమాంధ్ర వారు తెలంగాణా వారిని దోచుకున్నారని. దీనిలో ఎంతవరకు వాస్తవం వుంది? సీమాంధ్ర వారంతా కట్టగట్టుకుని తెలంగాణా వారిని దోచుకోవడం సాధ్యమేనా? కొందరు దోచుకుంటే అందరినీ బాధ్యులను చేయడం ఎంతవరకూ సబబు? ఆ దోచుకున్న కొందరు కూడా తాము దోచుకోనేది అందరిని, కొందరిని మాత్రమే కాదు, అని పదే పదే తెలియచెప్పుతున్నారు కూడా . ఇక్కడ కొందరే చేసిన దోపిడిని అందరికీ అన్వయించుకొని బాధపడడం (నిజంగా దోపిడీ జరిగినట్టయితే) ఒక ఎత్తైతే, ఆ దోపిడీకి సీమాంధ్ర ప్రజలంతా కారకులే అన్నట్టు మాట్లాడడం ఒక ఎత్తు.

    ReplyDelete
  3. @Edge

    మీరు వ్రాసినదాంట్లో మీకే డొల్లతనం కనిపించడం లేదూ?

    మరోసారి చూడండి.

    >>>ఆ దోచుకున్న కొందరు కూడా తాము దోచుకోనేది అందరిని, కొందరిని మాత్రమే కాదు, అని పదే పదే తెలియచెప్పుతున్నారు కూడా

    అందరినీ దోచుకుంటున్నారు కాబట్టి మేం సంతోషించి ఊరుకోవాలన్న మాట. భలేవారండీ!

    శ్రీరాంసాగర్ ఏండగట్టీ శ్రీషైలం కుడికాలువ తవ్వుకోవడమూ. ఏడమ కాలువ కూడా తవ్వుతామని చెప్పి ఏండగట్టడమూ. వున్న రాజోలిబండ తూములు కూడా పగలగొట్టడమూ. పగలగొట్టాక సదరు ప్రభుత్వం పగలగొట్టీనవాని మీద చర్యలు తర్వాత, అసలు వాటిని పునరుద్ధరించే ప్రౌఅత్నం కూడా చెయ్యక పోవడమూ. ప్రాణహిత పక్కకు పెట్టి పోలవరం కొసం పాకులాడ్డమూ. APPSC లో 80 మారుకు పరీక్షలో వచ్చిన వారికి మౌఖికలో 20 మార్కులు వేయడమూ, 50 మార్కులొచ్చిన అస్మదీయులకు మౌఖికలో 80 మార్కులేయడమూ. ఇక్కడ భూములమ్మి డబ్బులు ఆంఢ్రాకి తరలించడమూ. ఇలా చెప్పుకుంటే ఎన్నో. అవన్నీ అందరినీ దోచుకోవడం కిందికే వస్తాయా?

    ReplyDelete
  4. నా మిత్రుడు ఒకడు నన్ను అన్నడు " మీ వాళ్ళు మస్తుగా తాగుతరు , పండుతరు" అని .. నేను అసలు తాగను ,అయినా నాకు పిచ్చి కోపం వచ్చింది . ఇది తాగే వాళ్లనే బయ్యా అన్నడు .. అయినా నాకు కోపం పోలేదు .. మీరు పైన చెప్పినది కూడా వాళ్ళకి అటువంటి కోపమే .. బ్రిటిష్ వాళ్ళని తిట్టినప్పుడు .. మామూలు బ్రిటిష్ వాడికి కూడా కోపం వచ్చి ఉంటది .. మనకు తెలియదు కదా ..

    ReplyDelete
  5. హే చారీ తెలంగాణా ఎలాగూ రాదు. ఎందుకు ఇలా అనవసరం గా మీ టైం వేస్ట్ చేసుకుంటారు? మీ మీద ఒట్టు తెలంగాణా రాదంటే రాదు.

    ReplyDelete
  6. @Anonymous Nov 11, 2011 11:48 PM

    >>>మామూలు బ్రిటిష్ వాడికి కూడా కోపం వచ్చి ఉంటది .. మనకు తెలియదు కదా ..

    ఇది మరోసారి చదవండి.

    కానీ బ్రిటిష్ ప్రజలు అలా అనుకోలేదు. వారు సరిగ్గానే అర్థం చేసుకున్నారు. ఎంతో మంది గాంధీజీకి శిష్యులుగా కూడా వున్నారు. అంతే కాదు, భారతదేశానికి స్వాతంత్ర్యం ఇచ్చేటప్పుడు వారు స్వాగతించారే కానీ ఎదురు చెప్పలేదు.

    బ్రిటిష్ ప్రజలు ఇండియాకు స్వాతంత్ర్యం రాకుండా ఉద్యమాలు నడిపినట్టు ఎక్కడైనా ఆధారాలున్నాయా?

    ReplyDelete
  7. తెలంగాణ వాల్లు అన్న మాటలు బాగా గుర్తుంటయి కని, PD Act కింద case పెడితె ఒక్క అసమవాది గూడా కిక్కురు మనడు

    ReplyDelete