కాంగ్రెస్ తెలంగాణా ఇవ్వదని తేట తెల్లమైన ఈ సమయంలో 2014 లోపల తెలంగాణా వచ్చే అవకాశాలు సన్నగిల్లినట్టే. ఈలోపు ఏదన్నా జరిగి ప్రభుత్వాలు కూలిపోయి మధ్యంతర ఎన్నికలు జరిగి కొత్త ప్రభుత్వం వస్తే తప్ప తిరిగి తెలంగాణా ఏర్పాటు వైపు అడుగులు పడే అవకాశం లేదు. ఈ పరిస్థితుల్లో తెలంగాణా ఉద్యమం దిశ ఎటువైపు ఉండాలి?
ఇక ఎన్నికల్లోపు తెలంగాణా రాదనీ ఊరుకుందామా? సీమాంధ్ర మీడియా విజృంభిస్తుంది. ఉద్యమమే లేదు, అంతా చల్లబడి పోయింది అని ఊదర గొడుతుంది. చెవిటి వాడి ముందు శంఖమూదినట్టు ప్రజల ఆకాంక్షలను పట్టించుకోని ప్రభుత్వం ముందు ఎన్ని ఉద్యమాలు చేస్తే మాత్రం ఏం లాభం? అనే ప్రశ్న వస్తుంది.
ఉద్యమం పేరుతో బందులు, స్కూళ్ళు, కాలేజీల మూసివేత, రవాణా ఇబ్బందులు మొదలైన వాటితో ప్రజలు విసిగి పోయే అవకాశం వుంది. సకల జనుల సమ్మెతో సహా ఇప్పటివరకు జరిగిన అన్ని ఉద్యమాలలో తెలంగాణా ప్రజలే బాధలు పడుతున్నారు తప్ప సీమాంధ్ర దోపిడీ దారులపై ఎలాంటి ప్రభావం పడడం లేదు. ఇక ప్రభుత్వమేమో అత్యాధునిక ఆయుధాలను సమకూర్చుకొని తెలంగాణా ప్రజలు, విద్యార్థులు చేసే ఉద్యమాలను అత్యంత నీచమైన అప్రజాస్వామికమైన పద్ధతుల్లో అణచి వేస్తుంది.
ఇంతటి ఉద్యమం వేడిలోనూ పోలీసు రిక్రూట్ మెంటు, గవర్నమెంటు స్కూళ్ళ అప్ గ్రేడేషన్, హంద్రీ నీవా, పోలవరం మొదలైన రూపాల్లో తెలంగాణపై దోపిడీ యధేచ్చగా సాగుతూనే వుంది. దోపిడీ శక్తులు తెలంగాణా ప్రజలు చేసే ప్రజాస్వామిక ఉద్యమాలను చాలా తేలికగా తీసుకుంటున్నాయి. తమ పోలీసు బలగాలతో ఉద్యమాలను అణచి వేస్తూ, తాము ఎలాగైనా బరితెగించ గలమని, ఏమైనా చేయగలమన్న భరోసాను కలిగి ఉన్నాయి. దోపిదీలో భాగం దొరుకుతుంది కాబట్టి కేంద్ర ప్రభుత్వం కూడా అటువంటి దోపిడీ శక్తులకే వత్తాసు పలుకుతుంది.
ఇటువంటి పరిస్థితులలో తెలంగాణా ఉద్యమం తన దిశను మార్చుకోన వలసిన అవసరం ఉంది. ప్రజాస్వామిక పద్ధతులను వీడకుండానే ఉద్యమ విధానాలలో కొద్ది పాటి మార్పు చేసుకోవడం వల్ల మంచి ఫలితాలను పొందవచ్చు. డిల్లీలో జరిగిన అన్నా హజారే, రేప్ కేసు ఉద్యమాలను కూడా అధ్యయనం చేయాలి.
మీడియాకు ఇష్టం ఉన్నా లేకపోయినా అది ఉద్యమ వార్తలు ప్రచారం ప్రచారం చేయవలసిన అనివార్య పరిస్థితులను కల్పించాలి. ఉద్యమ కార్యాచరణను రూపొందించడంలో దీన్ని దృష్టిలో పెట్టుకోవాలి.
ఉద్యమం వల్ల తెలంగాణా, ఆంద్ర ప్రజలకు కాక, సీమాంధ్ర దోపిడీ శక్తులకు, సమైక్య వాదులకు, నాన్పుడు ధోరణితో కాలం వెళ్ళదీస్తున్న రాజకీయులకు ఎక్కువ నష్టం కలిగించేవిగా ఉండాలి. ఆ నష్టం భౌతిక మైనదే కావలసిన అవసరం లేదు.
సీమాంధ్ర దోపిడీ, అక్రమాల గురించి ప్రతి రొజూ ప్రచారం జరుగుతున్నా, వాటిని ఎదుర్కునే ప్రయత్నాలు ఎక్కువగా జరగడం లేదు. ఉదాహరణకు సాగర్ నీళ్ళు, పోతిరెడ్డి పాడు జలాల తరలింపు. రాజోలి బండ, రిక్రూట్ మెంట్లు, నిధుల మళ్లింపు మొదలైనవి. తెలంగాణా ఉద్యమంలో భాగంగా వీటిపై కూడా ఉద్యమించాలి. తమ దోపిడీకి అడ్డంకులు వస్తున్నాయని భావించినప్పుడు దోపిడీ దారుడు కూడా భద్రమైన ప్రదేశాలు (సీమాంధ్ర) వెతుక్కోవడానికి ప్రయత్నిస్తాడు.
ఉద్యమాల సంఖ్య తగ్గించి, ఉద్యమ కార్యాచరణను ప్రకటించే ముందే, దాని స్వరూప స్వభావాలను, ఫలితాలను, శత్రువుకు కలిగించే నష్టాలను గురించి సమగ్రమైన విశ్లేషణ చేసుకోవాలి.
తెలంగాణా కనుచూపు మేరలో కనిపించని ప్రస్తుత పరిస్థితులలో ఉద్యమ కార్యాచరణపై పునఃపరిశీలన జరుపుకోవడం అత్యవసరం.