Monday, August 29, 2011

తెలుగు సినిమాకు పాతరేశాను

పోయిన్నెల రంగం చూశాను
పోయినవారం కాంచన చూశాను
నిన్నఉరుమి చూశాను
రేపు ప్రేమఖైదీ చూడబోతున్నాను
మొత్తానికి తెలుగు సినిమాకు పాతరేశాను
ఎందుకంటే...
నాకు వాటిలో 
తెలుగుదనం కనబడలేదు కనుక!

Wednesday, August 17, 2011

విఫల భగీరథుడు!

- 75 బోర్లు వేసిన రైతు
- ఎనిమిదేళ్లుగా అప్రకటిత క్రాప్ హాలిడే
- నాటి అప్పులకు నేటికీ వడ్డీలు కట్టాల్సిన పరిస్థితి
- ఇది బోర్ల రాంరెడ్డి వ్యవసాయ గాథ


నీళ్లు పారించాల్సిన సర్కారు మోసం చేసింది. భూమాత కనికరించలేదు. 32 ఎకరాల భూమి ఉంటే.. ఆ భూమిని తడిపేందుకు ఆ రైతు పెట్టిన ఖర్చు అక్షరాలా ముప్పై లక్షల రూపాయలు. బైరెడ్డి రాంరెడ్డి అంటే ఎంతమందికి తెలుసో కానీ.. బోర్ల రాంరెడ్డి అంటే మాత్రం ఆయనే మదిలో మెదులుతారు. ఆయన దుఃఖం కళ్ల ముందు కదలాడుతుంది.


75 బోర్లు వేసి విఫల భగీరథుడిగా మిగిలిపోయిన నల్లగొండ మండలం ముషంపల్లి గ్రామానికి చెందిన బోర్ల రాంరెడ్డి దీన వ్యవసాయ గాథే ఈ కథనం. అది 1995. ఎండకాలం. అప్పటికే వేసిన 20బోర్లలో ఒకటి, రెండు మినహాయిస్తే మిగిలినవన్నీ వట్టిపోయాయి. ఏడెకరాల పొలం నెర్రెలు బారింది. 25ఎకరాల బత్తాయి తోట ఎండుముఖం పట్టింది. దీంతో ఏం చేయాలో రాంరెడ్డికి పాలుపోలేదు. పుట్టగతి ఉన్న కాడల్లా అప్పు తెచ్చి బోర్లు వేశాడు. వచ్చే కొద్దిపాటి నీటికితోడు, ఇంటిల్లిపాది ట్యాంకర్లతో నీరు తెచ్చి కొద్దో గొప్పో పంటలను కాపాడుకున్నారు.

2003 వరకు ఇదే దుస్థితి. ఈ ఎనిమిదేళ్లు ఆ రైతు పంటలను కాపాడుకోవడానికి లక్షల రూపాయల అప్పు చేసి 50బోర్లు వేశాడు. అయినా పూర్తి స్థాయిలో నీరందకపోవడంతో 25ఎకరాలకు క్రాప్ హాలిడే ప్రకటించాడు. నాడు చేసిన అప్పులకు ఇప్పటికీ వడ్డీ కడుతూనే ఉన్నాడు.

ఈ ఎనిమిదేళ్లు తన జీవితంలో చీకటి రోజులుగా, నిద్రలేని రాత్రులుగా మిగిలిపోయాయని బోర్ల రాంరెడ్డి చెబుతున్నాడు. ఇప్పటివరకూ మొత్తం 75 బోర్లు వేసి జిల్లాలో అత్యధికంగా బోర్లు వేసిన రైతుగా నిలిచిపోయాడు.

నీరు సరిపోకపోవడంతో ఈ ఎనిమిదేళ్లూ తనకు తానే క్రాప్ హాలిడే ప్రకటించుకున్నాడు. మొత్తం 75బోర్లలో నేటికి 8బోర్లు అంతంత మాత్రమే పని చేస్తున్నాయి. రాంరెడ్డి తన భార్య పద్మతో కలిసి పొలం పని చేస్తున్నాడు. 1995నుంచి నేటి వరకు అప్పులు తప్పితే ఆస్తులు సంపాదించలేదని రాంరెడ్డి వాపోయారు.

Tuesday, August 16, 2011

CNN-IBN & CNBC-TV18 సర్వే -- ఒక పరిశీలన

హిందూలో CNN-IBN & CNBC-TV18 సర్వే రిజల్ట్స్ లో కొంత భాగాన్ని తెలంగాణా ఏర్పాటుకు సంబంధించినవిగా ప్రచురించారు. అవి పట్టుకుని సమైక్యవాద బ్లాగర్లు, కొన్ని సమెక్కుడు మిధ్యమాలు  తెలంగాణా ప్రజల అభిప్రాయం విభజనకు వ్యతిరేకంగా వుంది అనే భావం వచ్చేలా ప్రచారం మొదలు పెట్టారు.  

వాస్తవానికి హిందూ ఏమి ప్రచురించింది అని వెదికితే మన విషాంధ్ర బ్లాగులో ఇది దొరికింది.

ఎడమ వైపు వున్న ప్రశ్నను పట్టుకుని వీరంతా రాష్ట్ర విభజన కేవలం యాభై శాతం మందే కోరుతున్నారు అని చెప్తున్నారు. దాన్ని బట్టి పట్టిక కింద రాసి వున్న ప్రశ్న ఎవరూ చదవడం లేదనుకోవాల్సి వస్తుంది. ఆ ప్రశ్న ఏమిటి?

People have different opinions on the issue of separate Telangana state. Some peple say that Andhra Pradesh should be bifurcated into Andhra Pradesh and Telangana.  While some say that the State should be Andhra, Telangana and Rayalaseema. Others say that the Andhra Pradesh should continue as united State. What is your opinion on the issue?

ఈ ప్రశ్నే ఒక గందరగోళంగా వుంటే దానికి వారు ప్రకటించిన ఫలితాలు మరింత గందరగోళంగా, తప్పుదోవ పట్టించేవిగా వున్నాయి.

రెండు రాష్ట్రాలుగా విడిపోవాలని చెప్పినవారు (తెలంగాణాలో): 50%
మూడు రాష్ట్రాలుగా విడిపోవాలని చెప్పినవారు (రాయలసీమలో): 1%
కలిసి వుండాలని చెప్పినవారు (కోస్తాలో): 90%

పై ఫలితాలను చూస్తేనే తెలుస్తుంది అవి ఎంత అసంపూర్తిగా వున్నాయో! ఉదాహరణకు తెలంగాణాలో మూడురాష్ట్రాలుగా విడిపోవాలని ఎంత మంది చెప్పారు? మూడు రాష్ట్రాలుగా విడిపోవడమంటే తెలంగాణావాదం కాదా? ఆ వివరాలు లేవు. పోనీ కలిసే వుందామని ఎంత మంది చెప్పారు? అదీ లేదు. ఏమీ చెప్పకుండా ఎంత మంది వున్నారు? అది కూడా ఇవ్వలేదు. ఇలాంటి వివరాలు పట్టుకొని సర్వే ఫలితాలంటూ గగ్గోలు పెట్టడం మొదలు పెట్టడం ఎంతవరకు కరెక్టు?

మరి ఫలితాలను ఇలా అసంపూర్తిగా ప్రచురించడం, అదీ హిందూలో, చాలా అసహజంగా కనిపిస్తుంది.

బొమ్మలో ఎడమవైపు వున్న ప్రశ్న, తెలంగాణా వారు చెప్పినా సమాధానాలు ఇలా వున్నాయి:

1. రాష్ట్రం రెండుగా విడిపోవాలి: 50% మంది అవునన్నారు.
2. రాష్ట్రం మూడూగా విడిపోవాలి: వివరాలు ఇవ్వలేదు.
3. రాష్ట్రం మొత్తం కలిసి వుండాలి: వివరాలు ఇవ్వలేదు.

2, 3 వివరాలు ఇవ్వకుండా,  ఫలితాల గురించి చర్చించలేము.

ఇక కుడివైపునున్న ప్రశ్న, తెలంగాణా వారి సమాధానాలు:

యధాతధంగా వుంచాలి: 13 + 5 = 18%
విడదీయాలి: 48 + 4 + 1 + 2 = 55%
అసలు శ్రీకృష్ణ కమిటీ ఏమిటో తెలియదు అని 27% మంది చెప్పారు.

ఈ తెలియని 27% మందిని తీసివేస్తే విభజించాలని చెప్పిన 55% మంది మొత్తం సమాధానాలు చెప్పిన వారిలో 75% అవుతారు. ఇది నాలుగింట మూడొంతుల మెజారిటీ. విడిపోవడానికి ఆంధ్రావారి ఇష్టాయిష్టాలతో పని వుండదని గ్రహించండి, అది 90% అయినా వంద అయినా.

చివరగా ఆ సర్వేలో చెప్పిందేమంటే, "తెలంగాణాలో విడిపోదామనేవారి సంఖ్య పెరిగింది. కాని ఆంధ్రాలో కలిసుందామనుకునే వారి సంఖ్య చాలా ఎక్కువగా వుంది" అని.

రెండువైపులా కోరిక వుంటేనే కలిసుండడం సాధ్యపడుతుంది. ఏ ఒక్క పక్షంలో అది లేక పొయినా విభజన అనివార్యం అని సర్వత్రా ఎరిగిన సూత్రం. కాని మన సమైక్యవాదులు సహజ సూత్రాలకు అతీతులు కదా మరి!


Friday, August 12, 2011

అవసరం



మా నాయన గారికి క్యాటరాక్టు ఆపరేషన్ చేయించాను. ఆ తర్వాత చూపులొ తేడా వస్తుంది కాబట్టి అద్దాలు మార్పించుకోవాలి. కాని ఎన్నిసార్లు అద్దాలు మార్పించడానికి వెళ్దామన్నా ఒకటే తంతు.

"బాపూ, దావఖానకు పోదాం, అద్దాలు మార్పించుకోవాలెగద!"

"ఎందుకుర? నడుస్తుందిగద నడువనియ్య రాదు!"

"ఆపరేషన్లన్ని చేసుకున్నంక అద్దాలకు వెనుకకు పోవుడెందుకు? ఒక్క పూట దావఖానకు వస్తివంటే, పాయింటు చూసుకున్నంక అద్దాలు నేనే పట్టుక వస్త."

"ఆ! యెందుకు? ఇప్పుడు నడుస్తనే వుంది గద. లేకపోతెమాయె తియ్యి."

"మరి చూపు కనబడుతుందా బాపు?"

"టీవీ మంచిగనే కనబడుతుంది. కింది అక్షరాలు కూడ తెలుస్తున్నయి. గా పేపరే, చదువక పోతె యేంది? అన్ని టీవీలనే వస్తున్నయి గద! అవసరమైతె చూద్దాంలే"

ఇలా కొంతకాలం గడిచింది. ఎప్పుడూ నేను అద్దాల గురించి అడుగుడు, ఆయన వాయిదా వేసుడు మామూలుగా జరుగ సాగింది. కొన్నాళ్ళకు నేను అడగడమే మానివేశాను.

ఒక రోజు హటాత్తుగా బాపే అడిగిండు. "అద్దాలకు పోదామంటివి గదర!"

"ఆ, పోదాం"

"ఇప్పుడు పోదామా?"

"ఈ టైముల డాక్టరుండడు. రేప్పొద్దున పోదాం"

"సరే" ముఖంలో కొంచెం నిరాశ కనిపించింది.

నాకు ఆశ్చర్యమేసింది. ఇన్నాళ్ళు బయటికి రావడానికే నిరాకరించిన మనిషి ఈరోజు తనంత తానే అడిగాడేమిటా అని!

అప్పుడు చూశాను. చేతిలో కనపడింది... నమస్తే తెలంగాణా!

చిత్తూరుకేనా సీఎం..?!


చిత్తూరుకేనా సీఎం..?!

నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి రాష్ట్రానికి ముఖ్యమంత్రా...? లేక ఆయన సొంత జిల్లా చిత్తూరుకా...? ఇంకా చెప్పాలంటే ఆయన సొంతూరు కలికిరికా..? ఇటీవల ఆయన తీసుకుంటున్న నిర్ణయాలు ఈ అనుమానాలను రేకెత్తిస్తున్నాయి. ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత... చిత్తూరు జిల్లా కోసం ఆయన తీసుకున్న కొన్ని కీలక నిర్ణయాలు ఏమిటో చూద్దాం. తొలుత కలికిరి ప్రభుత్వ జూనియర్ కళాశాలకు తన తండ్రి నల్లారి అమర్ నాథ్ రెడ్డి పేరును ఖరారు చేస్తూ జీవో జారీ చేశారు.

అప్పటి నుంచే ఆయన తన సొంత జిల్లా, నియోజకవర్గంపై అమితమైన ప్రేమ చూపడం మొదలైందన్న విమర్శలు ఉన్నాయి. బడ్జెట్ లో కూడా తన నియోజకవర్గమైన పీలేరు అభివృద్ధి కోసమంటూ 50కోట్ల రూపాయలను అధికారికంగా కేటాయించుకున్నారు. గతంలో ఏ ముఖ్యమంత్రి కూడా బడ్జెట్ లో తన సొంత నియోజకవర్గం కోసం అంటూ నిధులను ప్రత్యేకంగా కేటాయించుకోలేదు. ఈ ఘనతను కూడా నల్లారి కిరణ్ కుమార్ రెడ్డికే దక్కించుకున్నారు.

ఇక చిత్తూరు జిల్లాలో మామిడి పండించే రైతులకు ప్రత్యేక పథకం కింద 60కోట్లను కేటాయించాలంటూ కేంద్రానికి ఇటీవలే ప్రతిపాదనలు పంపారు. దీన్ని కేంద్రం గనుక అంగీకరిస్తే చిత్తూరు జిల్లా రైతాంగానికి సుమారు 200కోట్ల రూపాయల వరకు ప్రయోజనం చేకూరనుంది. ఇక పాడి పరిశ్రమలో కూడా చిత్తూరు జిల్లా రైతులనే ఆదర్శంగా తీసుకోవాలని ఉన్నత స్థాయి సమీక్ష సమావేశంలో కూడా చెప్పడం విశేషం.

ఎన్నో ఏళ్ల కృషి తర్వాత మన రాష్ట్రానికి మొన్నటికి మొన్న మంజూరైన సైనిక్ స్కూల్ ను కూడా తన సొంత నియోజవకర్గానికే పంపడం తాజా ఉదాహరణ. అంతేనా ఇంకా ఉన్నాయి. ముఖ్యమంత్రిగా పీఠమెక్కాక చిత్తూరు జిల్లా మున్సిపాలిటీలను కార్పొరేషన్ల స్థాయికి పెంచారు. రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా ఏ పైలట్ ప్రాజెక్టును ప్రారంభించినా ఆ జాబితాలో చిత్తూరు జిల్లా పేరు తప్పని సరిగా ఉండాల్సిందే. ఇంకో ముఖ్యమైన విషయం ఏమిటంటే నేషనల్ అడ్వయిజరీ కౌన్సిల్ లో రెండు కొత్త పోస్టులను చేర్చారు.

అందులో ఛైర్మన్ గా ముఖ్యమంత్రి, వైస్ ఛైర్మన్ గా ఆర్ అండ్ బీ మంత్రి వ్యవహరించేలా నిర్ణయం తీసుకున్నారు. ఇందులో ఒకరు చిత్తూరు జిల్లాకు చెందిన వారు కాగా, మరొకరు శ్రీకాకుళం జిల్లావాసి. ఇలా చెప్పుకుంటూ పోతే ఇంకా ఎన్నో కీలక నిర్ణయాలు ఆయన ఆశ్రిత పక్షపాతినికి నిదర్శనంగా కనబడుతాయన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.

ముఖ్యమంత్రిగా రాష్ట్ర ప్రయోజనాలకంటే చిత్తూరు జిల్లా అందులో మరీ ముఖ్యంగా తన సొంత నియోజకవర్గ ప్రయోజనాలకే పెద్ద పీట వేస్తున్నారనడానికి ఇవన్నీ ఉదాహరణలు మాత్రమేనన్న విమర్శలు లేకపోలేదు.


Curtesy: HMTV

ఇదివరలో రాజశేఖర్ రెడ్డి హైదరాబాదులో భూములు తెగనమ్మి డబ్బులను కడపకు, ఇడుపులపాయకు, తన సొంత ఇంటికి తరలించాడు. ఇప్పుడు కిరణ్ కుమార్ రెడ్డి వచ్చీ రాగానే తన ప్రతాపం చూపిస్తున్నాడు. తెలంగాణా వాదులు తమ వాదం వినిపించడానికి గత చరిత్రలు తవ్వి తీసే పని లేకుండా, ప్రస్తుత నాయకులే రోజూ లైవ్ సినిమా చూపిస్తున్నారు. ఇలాంటివన్నీ చేస్తూ కూడా ఇంకా సమైక్యవాదంతో  జనాన్ని నమ్మించాలని అనుకోవడం వీరికే చెల్లింది.

రాష్ట్ర ఎమ్మెల్యేలలో సీమాంధ్రులు అధికం కాబట్టి ఎప్పుడూ ఏదో ఒక జిల్లానుంచి సీమాంధ్రుడే ముఖ్యమంత్రి అవుతాడు. తనప్రాంతాన్ని, తనజిల్లాని మాత్రమే అభివృద్ధి చేసుకుంటాడు. ఒకవేళ ఎప్పుడో ఒకసారి తెలంగాణా వాడు ఏ అధిష్టానం దయతలిస్తెనో ముఖ్యమంత్రి అయినా కూడా వాడు తమకు కీలుబొమ్మగా వుంటే తప్ప సంవత్సరం కూడా సీమాంధ్రులు వాణ్ని కుర్చీలో కూచోనివ్వరు. కాబట్టి సమైక్య రాష్ట్రంలో తెలంగాణాకి భవిష్యత్తు లేదు.