Saturday, January 22, 2011

తెలంగాణా కాంగ్రెస్ నాయకులు


గారడీలు మానండి కాంగ్రెస్ నాయకులారా 
ప్రజలంతా వింటున్నరు పనికిరాని మీమాటలు 

తెచ్చేదీ మేమంటరు ఇచ్చేదీ మేమంటరు
తెలంగాణా రాకపోతే తెలుసు మీరే సస్తరు

శవాలపై ఒట్టుపెట్టి శాన శాన వాగిన్రు 
మంత్రి పదవి దొరుకంగనే మాట మర్చి పోయిన్రు 

మందిలోకి వచ్చినపుడు మాటల వీరంగం
ఢిల్లీకి వెళ్ళంగనె పిల్లే మీకంటె నయం

ప్రణభును కలిసిన మంటరు బాతఖాని కొడుతుంటరు
కనబడితే చాలు వాని కాళ్ళమీద పడిపోతరు

రాజీలే మీబతుక్కు రాజీనామా లింకెక్కడ
సీమాంధ్రులు విసిరేసే చిల్లరకోసం గడబిడ

సాగవింక మీ ఆటలు చావు తెలివితేటలు 
ఊల్లె అడుగు పెట్టలేరు ఉద్యమించ కుంటే

Wednesday, January 19, 2011

ఉద్యమ శంఖారావం

పగలే సూరిని కాల్చి భాను పారి పోతుంటే
పట్టలేని పోలీసులు బయలుదేరు తున్నరట

ఉవ్వెత్తున ఎగిసిపడే ఉద్యమాన్ని ఆపేందుకు
బందూకులు పట్టుకోని పరుగున వస్తున్నరట

అదనపు బలగాలిమ్మని అడుగుతున్రు కేంద్రాన్ని
రబ్బరు బుల్లెట్లె కాదు రైఫిల్లను తెస్తున్నరు!

వీల్లకు తెలిసిన విద్య జైల్లను నింపడమొకటే
అసహాయుల పట్టుకొని అడ్డంగా బాదడమే

పిల్లకాకి కేమి తెలుసు పెనుతుఫాను హోరెంతో
పాలకులకు ఏమితెలుసు ప్రజాశక్తి బలమెంతో

ఉవ్వెత్తున జనకెరటం ఉరకలేసి వస్తుంటే
బ్రతుకుజీవుడా అంటూ పరుగెత్తే రోజొస్తది

తంగెడు పుల్లల మంటే దావానల మైపోతది
ఉరికివచ్చి యువకెరటం ఉప్పెనగా మారుతుంది

ఉద్యమ శంఖారావం ఊరూరా పాకుతుంది
తెలంగాణా గొంతు విని దిగివస్తది ఢిల్లీయే!

Monday, January 10, 2011

శ్రీకృష్ణ కమిటీ

శ్రీక్రిష్ణ కమిటీ రాంగనే, కొంతమంది ఆంధ్రా బ్లాగర్లు సంకలు గుద్దుడు మొదలు పెట్టిన్రు. ఇంక తెలంగాణ మన పర్మినెంటు కబ్జకి వచ్చింది అనుకుంట మురువ బట్టిన్రు.

గక్కడనేమొ లగడపాటి, రాయపాటి, కావూరి, వెంకటేశు, దివాకర్‍లు నవ్వాల్నో, ఏడ్వాల్నో తెలువక చేతులు పిసుక్కుంట కూసున్రు. గిట్ల ఎందుకైందో శ్రీకృష్ణ మిటీ నివేదిక చదివినోనికి ఊరికనే తెలుస్తది.

గా నివేదికల రాయల తెలంగాణ ఒద్దని చెప్పె.  గ్రేటర్‍హైద్రాబాదుతోని  కలిపి,  నల్లగొండ,  మహబూబ్‍నగర్‍ల  కొంత జాగ కలిపి కేంద్ర పాలిత ప్రాంతం చేస్తరేమో అంటే గదిగూడ ఒద్దని చెప్పిరి. కనీసం హైద్రాబాదును కేంద్రపాలిత ప్రాంతం చెయ్యాలంటె గూడ ఒప్పుకోక పొయిరి.

గిప్పుడున్న తీర్గ సమైక్యాంధ్ర అసలుకే ఒద్దన్నరు.

ఇంతకి, వాళ్ళు చెప్పిందేంది?

గా 1956లనే మరిచి పొయిన పెద్దమనుషుల ఒప్పందానికి దుమ్ము దులిపిన్రు. పొయ్యి దాంట్లె చూసుకోని గండ్ల జెప్పినట్టు ప్రాంతీయ అభివృద్ధి మండలి పెట్టమని చెప్పిన్రు. దానికి చట్టభద్రత ఉంటదట. దానికి ఒక చైర్‍మన్ ఉంటడట. ఆయనకు మంత్రి హోదా ఉంటదట. గా మండలి గీ తెలంగాణా లోపల జరిగే నియామకాలు, నీల్లు, డబ్బు కేటాయింపులు వగైరాలు సూస్తుంటదట. ఏమయిన తప్పులు జరిగితే జీహుజూర్ అనుకుంట ముఖ్యమంత్రికి చెప్పుకోవాల్నంట. ఏ పని చేసినా అసెంబ్లీకి జవాబు దారీగ ఉండాల్నంట.

తెల్వకడుగుత, ముఖ్యమంత్రి  ఎప్పుడయిన మన చరిత్రల గిట్లాంటోల్లు చెప్పిన మాట ఇన్నడా? కనీసం అసెంబ్లి ఎప్పుడన్న తెలంగాణ పాట పాడుతదా? దాంట్లె ఎక్కువ మంది ఎవ్వరు ఉంటె గాల్ల పాటే పాడుతది.

గీ ముచ్చట జెప్పనీకి శ్రీకృష్ణ కమిటీకి యాడాది పట్టిందంటె నమ్మబుద్ధి కాదు! తెలంగాణల చిన్న పిల్లగాడు చెప్పుతడు, గియ్యన్ని అయ్యే పనులు కావని! గియ్యన్ని అమలుగావాలెనని పోరాడి పోరాడి అప్పుడే యాభైనాలుగేండ్లు గడిచిపాయె. పాడిందే పాటరా పాసుపండ్ల దాసరి అన్నట్టు, మల్ల గీ శ్రీకృష్ణ గారు పాతపాటే చెప్పబట్టె. గీ మాట చెప్పినందుకే మన ఆంధ్ర బ్లాగరు సోదరులు సంకలు నొప్పిపెట్టే దాన్క గుద్దుకుంటున్రు. ఇంక సాలురబై అన్నా గూడ ఇంటలేరు.

ఇంతకు శ్రీకృష్ణ ఏంజెప్పిండు? గిట్ల చేసుకో గలిగితే చేసుకోండ్రి అన్నడు. గిది జరుగని పని అని ఆంధ్రోల్లతో పాటు దేశంల అందరికి తెలుసు. అయితే మల్ల ఇంకేమన్న జెప్పిండా అంటె ఇంకోటి గూడ జెప్పిండు. గిది జరుగకపోతే తెలంగాణ, ఆంధ్ర విడదియ్యమన్నడు. విడదీసి తెలంగాణాకు హైద్రాబాదు రాజధాని జెయ్యమన్నడు. ఆంధ్రకు అక్కడ్నే ఏదన్న పట్టణంజూసి రాజధాని కొత్తగ పెట్టమన్నడు.

ఇప్పుడు కమిటీలు, కౌన్సిల్లు అనుకుంట ఊకదంపుడు మాటలు చెప్పితె ఇనేటోల్లు తెలంగాణల ఎవ్వరులేరు. గందుకోసమైనా కేంద్ర ప్రభుత్వానికి తెలంగాణ ఇచ్చుడు తప్ప వేరే మార్గం లేదు. 

Thursday, July 22, 2010

చంద్రబాబు కుతంత్రం

వోల్వో బస్సుల మాహారాష్ట్రకు పొయ్యి ఏర్ బస్సుల తిరిగి వచ్చిండు చంద్ర బాబు.

తెలంగాణాల ఈయన పరపతి ఇసుమంత కూడా పెరగ లేదు. ఇప్పటికీ తెలంగాణాల చూపెట్టుతందుకు ముఖం లేదు. ఎలాగోలా బాబ్లీ పేరు చెప్పి తెలంగాణాను ఇంకోసారి మోసం చెయ్యడానికి బాగనే ప్రయత్నం చేసిండు. కాని ఈయన పన్నాగాలు తెలంగాణాల పారలేదు.

ఇంకా ఈయన సాధించింది.

ముఖ్యమంత్రి ఢిల్లీకి వెళ్లి చర్చలు జరుపుదాం అన్నా వినకుండా అరెస్టు చేస్తరని తెలిసి కూడా బాబ్లీకి వెళ్ళడం. అక్కడికి వెళ్లి తన్నులు తిని తెలుగువాడి పరువుని గొదావరిల కలపడం.

తిరిగి వచ్చి తెలుగు తమ్ముళ్ళ చేత మహా రాష్ట్ర లారీలు, బస్సులు తగల బెట్టించడం.

మహారాష్ట్ర దురభిమాని 'బాల్ థాకరే' ఏదో అన్నడని ఆయన దిష్టి బొమ్మ తగుల బెట్టించి తాను కూడా 'ఆంద్ర దురభిమాని' గా చాటు కోవడం. 
 
ఇంతా చేసిన తర్వాత ఇప్పుడు బాబ్లీ ఆగుతుందా? మళ్ళీ చర్చలు జరప వలసిందే. కేసు కోర్టుల తెల వలసిందే. 

పైనించి ఈయన మాహారాష్ట్ర వాళ్ళను రెచ్చగొట్టి వచ్చిండు. బాబ్లీ పైన వాళ్ళ పట్టుదలలను పెంచిండు. ఇప్పుడు మహారాష్ట్రల అధికార పక్షం, ప్రతి పక్షం అంత ఒక్కటై బాబ్లీని రక్షించు కుంతందుకు తయ్యారయ్యిండ్రు.

ఈయనకు ఇదంత జరుగుతదని తెలువదా?

ఎందుకు తెలువదు? బాగా తెలుసు. అరెస్టయిన గంటల లోపే ఫ్లేక్సీలు గూడ రడీ అయినాయి అంటేనే తెలుస్తది ఈయన ఎంత ప్లాను మీద ఉన్నడో!

మరి మంచి కన్నా చెడే ఎక్కువ జరుగుతది అని తెలిసి గూడ ఎందుకు ఈవిధంగ చేసిండు?

ఈయనకు తెలంగాణా మీద ఎప్పుడూ ప్రేమ లేదు.

ఏ శ్రీరాం సాగరు కొరకైతే బాబ్లీ సమస్య ఎత్తుకున్నడో ఆ శ్రీరాం సాగరు కాలువలు తొవ్వేటందుకు ఈయన ఎప్పుడూ ప్రయత్నం చెయ్యలే. శ్రీశైలం ఎడమ కాలువ తోవ్వడానికి గూడ ప్రయత్నం చెయ్యలే. ప్రతిపక్ష నాయకుని హోదాల కూడా పట్టించుకోలే.

రాజోలిబండ గేట్లు ఇరగ్గొట్టి ఈయన హయాంల రాయలసీమకు నీళ్ళు కొనబోయ్యి, మహబూబ్ నగర్ని ఎడారిగ మారిస్తె ఈయన తెలంగాణా కన్ను గుడ్డి పోయింది.

పోతిరెడ్డి పాడు అక్రమంగ కడుతుంటే ఒక్క సారి గూడ ఖండిస్తూ చిన్న స్టేట్ మెంట్ గూడ ఇయ్యలే.

పోలవరం ప్రాజెక్టు కింద లక్షలాది తెలంగాణా బిడ్డలు మునిగి పోతుంటె ఈయనకు అదేమి పట్టదు.

ఇలాంటి మనిషి తెలంగాణాను ఉద్ధరిస్తడు అనుకునేటందుకు తెలంగాణా ప్రజలు ఎడ్డోళ్ళు కారు. గుడ్దోల్లు అంతకంటె కారు.

ఇన్ని చెప్పే అవసరం లేదు. డిసెంబరు 9న ప్రకటన వచ్చినంక, సైంధవుని లెక్క ఈయన ఎట్ల అడ్డం బడ్డడో తెలంగాణా బిడ్డ లెవ్వరు ఇంకా మరిచి పోలే.

ఈయన నక్క ఎత్తులు, జిత్తుల ఆంధ్రల పారుతయేమో కాని తెలంగాణాల కాదు.    
 

Sunday, March 21, 2010

భయం

మధ్యానం మూడు గంటల సమయం. ఇరానీ హోటలు ఖాలీగ ఉన్నది. వెంకటేశ్ ని రెండున్నరకే రమ్మని చెప్పిన. ఇంకా రాలేదు. ఇప్పటికే రెండు చాయలు తాగుడయింది. ఇంకా తాగితె వాంతి కొచ్చే టట్టుంది. ఎందుకొస్త లేడు వెంకటేశ్ గింత సేపైనా? ఇంక లాభం లేదని బయటికొచ్చి నిలబడ్డ.

వెంకటేశ్ చెప్పిన టైముకు నిముషం గూడ లేటు చెయ్యడు. గియ్యా లేంది? గిట్ల యాది మరిచిండు?

వారం రోజుల నుంచి చూస్తున్న. వెంకటేశ్ అదో తీరుగ ఉండ బట్టిండు. ఎటో అలోచిస్తడు. ఏది చెప్పినా సరిగ్గా ఇనడు.

ఏందిరా వారి, ఎంకటేసు, ఎందుకురా గిట్లుంటున్నవ్. ఏమైందిర?

అడుగనే అడిగిన నిన్న నిన్న సాయంత్రం మొకం బట్టుకొని.

నాకేంగాలే, బాగనే ఉన్న.

సూస్తె తెలుస్త లేదా ఎట్లున్నవో? అద్దంల మొకం జూసుకో, తెలుస్తది. ఏమైతుందిర నీకు?

నాకేమైతలేదన్న, అయ్యేదంతా తెలంగాణకే. గా ఎమ్మెల్యేలు చూడు. గింత లొల్లి జరుగు తుంటే కూడ రాజీనామాలు చేస్త లేరైరి. మొన్న యూనివర్సిటీల కొచ్చి ఒక్కొక్కడు ఎట్లా మాట్లాడినరో చూస్తివి గద? ఇప్పుడు ఒక్క డన్న కాన పడుతున్నాడె?

నాకు ఒళ్ళంతా జల్లున ఒనికినట్టయింది. గీ పోరడు గూడ ఏదైనా అఘాయిత్యం చేస్తడా ఏమి?

అరె వెంకటేసు. గయ్యన్ని మన కెందుకుర? రాజకీయ నాయకులు లక్ష చెప్పుతరు, చూస్త లేమా? గట్లనే గిది. ఎట్లయ్యేది గట్లనే అయితది. మనం ఆప్తె ఆగదు, నడువమంటే నడువదు.

అన్నా! మీరంతా గిట్ల మాట్లాడ బట్టే తెలంగాణా మొత్తం గీ పరిస్తితి కొచ్చింది. మీరంతా చూస్తానే ఉండున్రి, రేపు తెలంగాణా మొత్తం సాపు సాపు చెయ్యకుంటే చూడున్రి.

గీని మాటలు చూస్త ఉంటె నాకు భయం ఎక్కువ గాబట్టింది. గీ ఆవేశం ఎక్కడికి దారి తీస్తదో?

అరే వెంకటేసు, తెలంగాణా ఒచ్చేది ఖాయంరా. గిప్పుడు తెలంగాణల ఐదు సంవత్సరాల పోరడు గూడ తెలంగాణ కావాలె అంటుండు. నువ్వేం భయపడకు. తెలంగాణా తప్ప కుండ వస్తది. మనం చూస్తం. దేనికైనా ఓపిక పట్టాలె.
ఇంకా ఓపికేందన్నా? ఇన్నాళ్ళు పోరాటం చేసినం. చిదంబరం ఒప్పుకొని స్టేట్ మెంట్ గూడ ఇచ్చిండు. గిప్పుడు అంత మొదటి కొచ్చె.

ఒస్తెమాయే లేర. ఇంకొక యాడాది బడుతది. అంతేగా? శ్రీకృష్ణ కమిటీ ఏసిన్రు గా? ఇప్పటి దాంక ఏ కమిటీ ఏసినా గూడ తెలంగాణకి అన్యాయం చెయ్యలే. గట్లనే ఈ కమిటీ గూడ తెలంగాణకే ఫేవర్ జేస్తది.

ఎక్కడున్న వన్న నువ్వు? గీ కమిటీల తోని తెలంగాణ ఒస్తదను కున్నవా? ఫజలలీ ఏం జెప్పిండు? తెలంగాణ సపరేటుగా ఉండాలే అన్నాడు. ఏమైంది? తెలంగాణను ఆంధ్ర ప్రదేశ్ ల కలిపేసిన్రు. గట్లనే గీ కమిటీ చెప్పంగనే తెలంగాణ ఒస్త దనుకోవడమే తప్పు. పోరాటం చేస్తేనే తెలంగాణ వస్తది.

ఏం జెప్పాలెనో అర్థం గాలేదు నాకు. నా మనసుల మెదులు తున్న ఆలోచన వాని కెట్ల చెప్పుదు? చెప్పి వానికి లేని పోని ఆలోచనలు మనసుల చొప్పిద్దునా? ఎటూ సమజ్ ఆయిత లేకుండె నాకు.

సరే గని గిప్పుడు గాదు, రేపు మధ్యానం రెండున్నరకు మొగల్ దర్బారు కాడికి రా, మాట్లాడుదం. వెంకటేశ్ ఆవేశంగ ఏదో మాట్లాడుకుంట వెళ్లి పోయిండు.

ఆలోచిస్తుంటే అప్పుడే నాలుగయింది. ఏడి, పోరడు ఇంకా రాక పోయె?

గప్పుడు గుర్తుకొచ్చింది నాకు. ఇయ్యాల గన్ పార్కు దగ్గర ర్యాలి ఉన్నది. ఒక దిక్కు గుండె దబ దబ కొట్టు కోవట్టింది. నాకు తెల్వ కుంటనే అడుగులు గన్ పార్కు దిక్కు పడ సాగినై.

ఎదురుగ పెద్ద గుంపు. ఎవరో మాట్లాడు తున్నారు. చుట్టూ అందరు గుమి గూడి ఉన్నరు. దగ్గరి కెళ్ళి చూసిన. వెంకటేసు ఆవేశంగా మాట్లాడు తున్నడు. కండ్లు ఆవేశం తోని మెరుస్తున్నై.

... మనం తెలంగాణ వచ్చే దాంక కొట్లాడాలే. ఒదిలి పెట్టేది లేదు. మనం ఏమాత్రం అజాగ్రత్త చేసినా తెలంగాణ రాదు. గట్లని ఎవ్వరు గూడ ఆత్మహత్యలు చేసు కోవద్దు. ధైర్యంగ పోరాడాలె...

ఇంక తర్వాత చెప్పేది నేను వినలే. ఇప్పుడు నా మనసు గాలిల తేలుతుంది. వెంకటేసుకి నేను చెప్పే పని లేదు. వాడే నలుగురికి చెప్పేటోడైండు.