Thursday, May 19, 2011

సమైక్య రాష్ట్రం ఎవరి కోసం?

ఉద్యమ కారులల్ల రెండు రకాల వాళ్ళు ఉంటరు. ఒకటి, ఉద్యమం మీద కమిట్ మెంట్ ఉండి, ప్రతిక్షణం ఉద్యమం కోసం పాటు పడేటోల్లు. రెండు, ఉద్యమం తీవ్రతరమైనపుడు తమ రాజకీయలబ్ది కోసం ఆ మంటల చలి కాసుకునేటోల్లు. మన తెలంగాణా కాంగ్రెస్, తెలుగుదేశం నాయకులు ఈ రెండో కేటగిరీకి వస్తరు. ఉద్యమ ఉధృతి కనపడంగనే వీళ్ళు మాకన్న గొప్ప ఉద్యమకారులు లేరన్నట్టు మాట్లాడుతరు. అందరికన్న గట్టిగ అరుస్తరు. శవాల దగ్గర ప్రతిజ్ఞలు చేస్తరు.

జర ఉద్యమం చల్లబడ్డట్టు అనిపిచ్చిందా? ఇంక పత్తా ఉండరు. మన రాజకీయ నాయకులంత వ్యాపారస్తులే అనేది అందరికి తెలిసిన రహస్యమే. వీళ్ళకి ప్రతిదీ సప్లై, డిమాండు సూత్రం లెక్కనే కనిపిస్తది. ప్రజల్ల ఉద్యమానికి డిమాండు ఉంటె వీళ్ళు ఉద్యమాలు చేస్తున్నట్టు నటిస్తరు. ఆ విధంగా ప్రజలను ఆకట్టు కుంటందుకు ప్రయత్నం జేస్తరు.

గీ సూత్రాన్ని అనుసరించే జూపల్లి కృష్ణారావు పాదయాత్ర చెయ్య బట్టిండు. నాగం జనార్థన్ రెడ్డి పార్టీ జండాను కింద పారేసి ఉద్యమం జేస్త నంటున్నడు. ఇంక ఎరబెల్లి, ఇంక కొంత మంది తెలుగు దేశం జండాకు వేలాడు కుంటనే, రెండుకళ్ళ చంద్రబాబు కాళ్ళు మొక్కు కుంటనే తెలంగాణా ఉద్యమం చేస్తమంటున్నరు. 

దీన్ని బట్టి ఏం తెలుస్తున్నది? తెలంగాణా ఉద్యమం ఇప్పుడు బలంగా ఉన్నదనే కదా? ఇప్పుడు ప్రజల్ల తెలంగాణా రాష్ట్రం ఏర్పాటుకు డిమాండు ఉన్నది. అందుకనే ప్రజలను ఆకట్టుకోవాలె నంటే ఉద్యమాలు చేస్తున్నట్టు నటిచుడు తప్పదు ఎవరికైనా.

అయితే ఆంధ్రల మాత్రం ప్రజలల్ల సమైక్యతా గురించి ఎటువంటి డిమాండు లేదు. అటువంటి డిమాండు ఉంటే బొత్స సత్యనారాయణ, హర్ష కుమార్, దివాకర్ రెడ్డి లాంటోల్లు తెలంగాణాకు అనుకూలంగ మాట్లాడిన్రు. మిగిలిన నాయకులల్ల చాలా మంది గూడ అధిష్టానం చెప్పిన దానికి కట్టుబడి ఉంటం అని చెప్తున్నరు. దీన్ని బట్టి ఆంధ్ర ప్రజలల్ల తెలంగాణా కి వ్యతిరేకంగ ఎటువంటి డిమాండు లేదని అర్థమైతుంది.

ఐతే కొంతమంది పదవులను అడ్డం పెట్టుకొని తమ కబ్జా వ్యాపారాలు, అక్రమ లావాదేవీలు కొనసాగించే  నయా రాజకీయ బ్రోకర్లు మాత్రం తెలంగాణాను అడ్డుకునేటందుకు సర్వ శక్తులూ ఒడ్డుతున్నరు అనేది వాస్తవం. వీళ్ళ ప్రయోజనాలు సమైక్య రాష్ట్రం తోటి ముడివడి ఉన్నయి. 

రాష్ట్రం ఎంతపెద్దగ ఉంటె అంతపెద్ద కాంట్రాక్టులు వస్తయి. ఎంత పెద్ద కాంట్రాక్టులు వస్తే అంత ఎక్కువ పైసలు దండుకోవచ్చు. సీమాంధ్ర పక్షపాతంతో కూడి ఉన్న ప్రభుత్వాన్ని అడ్డం పెట్టుకొని ఇష్టమొచ్చినట్టు హైదరాబాదుల భూములను కబ్జా చెయ్యొచ్చు.

హైదరాబాదు తప్ప తెలంగాణాతో కలిసి ఉండుడు పైన ఎటువంటి మోజు లేదని వీళ్ళు ఇప్పటికే బయటపడి పోయిన్రు. వీళ్ళు ఇప్పటిదాంక చెప్పిన అన్నదమ్ములు, ఒక్క జాతి అనేటి కథలు తప్పని వీళ్ళే ఒప్పుకున్నరు. అయితే ఈ హైదరాబాదు పైన మోజు ఎవరికి?

ఆంధ్రాల ఉన్న సామాన్య పౌరునికి హైదరాబాదు మీద ఏమాత్రం మోజూ లేదు, హైదరాబాదు తోని పనిలేదు. ఇంక వాళ్లకు దగ్గెర్ల ఇంకొక రాజధాని ఉంటెనే మరింత సౌకర్యంగ ఉంటది. ఆ సంగతి ఆంధ్ర ప్రజలకు బాగనే తెలుసు. అందుకనే అక్కడి ప్రజలల్ల ఎటువంటి ఉద్యమం లేదు, పైసలిచ్చి ఉద్యమాలు నడిపించే రాజకీయ నాయకులల్ల దప్ప. అందుకనే సమైక్య గర్జన సభ జరిపితే 2000ల మంది కూడ రాలేదు.     

ఓ సీమాంధ్ర సోదరులారా, రాష్ట్రం విడిపోవుడు తప్పదు గాక తప్పదు. విడిపోయినంక మాత్రం ఈ రాజకీయ బ్రోకర్లు, భూబకాసురులు, లక్షల కోట్ల సామ్రాజ్యాలు కూడ పెట్టేటొల్లకు మళ్ళా పట్టంగట్టకండి. వీళ్ళకు మా, మీ తేడా లేదు. వీళ్ళకు అధికారం ఇస్తే మిమ్ములను సర్వనాశనం బట్టిస్తరు.

Tuesday, May 17, 2011

ఆజాద్ వద్ద సీమాంధ్ర నాయకుల డిమాండ్లు

ఆజాదు ఆంధ్ర నాయకుల తోని మీటింగు పెట్టిండు. ఆ మీటింగు ప్రారభించుకుంట ఎమ్మెల్యేల చెప్పుడు మొదలు పెట్టిండు. "నేను ఇంతకు ముందే తెలంగాణా నాయకులతోని మీటింగు పెట్టిన. గాళ్ళు మాత్రం సమైక్యాంధ్ర ఒద్దంటే ఒద్దని చెప్పుతున్నరు. తెలంగాణా విడగొట్టుడు తప్ప దేనికి గూడ ఒప్పుకోరట. మరి మీరేమంటరు?" అని అడిగిండు.

వెంటనే ఒకాయన లేచి అందుకున్నడు.

"అదెలా కుదురుతుందండీ? మాదంతా తెలుగుజాతి. మా జాతి సమైక్యత కోసం ప్రాణాలైనా అర్పిస్తాం. అంతే గాని ఆంధ్రులను చీల్చడానికి మాత్రం ఒప్పుకోం."

ఆజాదు అర్థంగాక అడిగిండు. "అదేంది? కాసేపు తెలుగంటవు. కాసేపు ఆంధ్రా అంటవు. నీది తెలుగుజాతా? ఆంధ్రా జాతా?"

"అయి రెండూ పర్యాయ పదాలేనండీ" ఇంకొకాయన సర్ది చెప్పిండు.

"అట్లనా! మరి జాతి సమైక్యత గురించి మీరే ఎందుకు బాధ పడుతున్నరు? ఆల్లెందుకు బాధ పడుతలేరు? ఇద్దరు అనుకుంటెనే గద సమైక్యత సాధ్యపడేది?" అడిగినడు ఆజాదు.

"వారు కూడా సమైక్యత కోరుకొనే మాతో కలిసేరు. అరవై ఏళ్ళు గడిచాక ఇప్పుడెందుకు వద్దనుకుంటున్నారో అర్థం కావడం లేదు."

"సరే, నాకర్థమయ్యింది లెండి." అన్నడు ఆజాదు. "కానీ మీరెంత చెప్పినా ఇంకా ఆంధ్రప్రదేశ్ కలిపి ఉంచుడు సాధ్యం కాదు. మొన్న జరిగిన ఎన్నికలల్ల మీరు జగన్ను అరికట్ట లేక పోయిన్రు. మీ ఆంధ్రాల పార్టీ మొత్తం జగన్ వైపు తిరుగుతదని సర్వేలు చెప్పుతున్నై. ఇంక తెలంగాణాల నన్న పార్టీ నిలబడాలె నంటె తెలంగాణా ఏర్పాటు తప్పనిసరిగా చెయ్యాలే. గదే విషయం మేడం మీకు చెప్పమన్నరు. రాష్ట్రం విడిపోతది. ఇప్పుడు చెప్పున్రి, కలిసుండుడు తప్ప ఇంకేమన్నా కండిషన్లు ఉన్నయా?"

"అలాగైతే హైదరాబాదు మాకిచ్చేయండి"

"డిల్లీ కూడా" ఇంకొకాయన అన్నడు.

"వార్నీ, డిల్లీ ఎందుకు?" ఆశ్చర్యం తోని అడిగిండు ఆజాదు.

"మరే, మా బాబాయి కొడుకు అక్కడో కిరాణా కొట్టెట్టి డిల్లీని డెవలప్పు చేసేడు. మరి డిల్లీని డెవలప్పు చేసింది మేమే కదా? మరలాంటప్పుడు డిల్లీ మాదే కదా?"

"మీ అసాధ్యం కూలా! కాసేపాగితే న్యూయార్కు కూడా మాదే ననే లాగున్నరే!" ఆశ్చర్య పోయిండు ఆజాదు.

"అంతే కాదు, ఇంకా ఉన్నాయ్ కండిషన్లు"

"అట్లనా, చెప్పుండ్రి నాయనా, విని తరిస్తా!"

"కృష్ణా, గోదావరి నీళ్ళు ఒక చుక్క కూడా తెలంగాణలో వాడ్డానికి వీల్లేదు. ఇప్పుడు ఎలా వాడుకుంటున్నామో, అప్పుడు కూడా మొత్తం నీళ్ళు మేమే వాడుకోవాలి."

"వీలైతే నదులకు ఆపక్కా, ఈపక్కా పక్కా గోడలు కట్టించాలి, తెలంగాణలో" వెనకనించి అరిచిండు ఇంకొకాయన.

"వార్నాయనో, ఇంత తెలివి తేటలున్న మిమ్ములను ఎట్ల భరించార్రా నాయనా వాల్లిన్ని రోజులూ?" ముక్కుమీద వేలేసుకుండు ఆజాదు. "ఇంతకు ముందే కదరా జాతి సమైక్యతా, తొక్కా తోలూ అన్నరు? సరే, ఇంకా జెప్పున్రి, విని రాసుకుంట".

"మరేం లేదండీ, మాకుర్రోల్లు అడిగితే కాదనకుండా తెలంగాణా లోకల్ కేండిడేట్ సర్టిఫికేట్ జారీ చేయాలి. దీనికోసం తెలంగాణా సెక్రెటేరియట్ లో ఒక సెల్ పెట్టాలి."

"అంతే కాదు, ఆంధ్రా కేండిడేట్లకు తెలంగాణా ఉద్యోగాల్లో 80 శాతం వాటా ఏర్పాటు చేయాలి. వింటున్నారా ఆజాద్ గారూ?"

ఇంకెక్కడి ఆజాద్! మూర్చొచ్చి పడిపొయ్యిండు.

Friday, May 6, 2011

సమైక్యవాదులూ, మీకో మంచి అవకాశం

పోలవరం ప్రాజెక్టుపై మొదటినుండి వివాదాలే నడుస్తున్నయి. అటు ఒరిస్సా ప్రభుత్వం, ఇటు పర్యావరణ వాదులు ఈ ప్రాజెక్టు ఒద్దంటే ఒద్దని మొత్తుకుంటున్నరు. అక్కడ నివసిస్తున్న లక్షలాది ఆదివాసీలు తమ భవిష్యత్తు గురించి దేవుని మీద భారం మోపిన్రు. అయినా వారి గోడు వినేదెవరు?

ఈ ప్రాజెక్టు కట్టితే ఎంత భూమి అదనంగా సాగవుద్దో, అంతకంటే ఎక్కువ భూమి మునిగి పోతదంటే అందరు ముక్కు మీద వేలేసుకుంటున్నరు. 

ఒకపక్క ప్రాజెక్టు కట్టి కాలవలు తొవ్వకుండా శ్రీరాం సాగర్ అట్లనే పెట్టిండ్రు. ఇంకో పక్క అనుమతులున్న ప్రాణహిత పక్కకు పెట్టినరు. ఏ అనుమతులు లేక, పైనుంచి పక్క రాష్ట్రాల కేసులతో నలుగుతన్న పోలవరం మీద మాత్రం ఎక్కడ లేని ప్రేమ జూపిస్తున్నరు. వేల కోట్ల రూపాయలు కుమ్మరిస్తున్నరు.     

ఈ పోలవరం ప్రాజెక్టు కట్టితే రెండు లక్షల ఎకరాల భూమి నీళ్ళల్ల మునిగి పోతది. రెండు లక్షలకు పైపెచ్చు ప్రజలు ఇండ్లు వాకిళ్ళు పోగొట్టు కుంటరు. ఇక లక్షలాది జంతువులు, మిలియన్లాది చెట్లు కనుమరుగైతయి. ఇంట భీభత్సం సృష్టించి ఈ ప్రాజెక్టు కట్టేది ఎందుకు, మూడో కారు నికరం జేసుకోనీకి.

ఎంత అన్యాయమో చూడున్రి. ఒకవైపు నీళ్ళు లేక, బోర్లు ఎండిపోయి రైతన్నలు ఆత్మహత్యలు చేసుకుంటున్నరు. ఒక్క కారుకు నీల్లోచ్చినా చాలురా దేవుడా అని మొత్తుకుంటున్నరు. ఇంకోపక్క రెండు కార్ల పంటకు నీల్లున్నా, మూడో కారు కూడా నికరంగా పందాలేనని చెప్పి మందిని ముంచే ఎవ్వారాలు చేస్తున్నరు. ఇది న్యాయమా, అన్యాయమా ఒక్కసారి ఆలోచించున్రి.

అదే ప్రాణహిత కట్టితే తెలంగాణా కరువుసీమల కనీసం ఒక కారుకు ప్రాజెక్టు నీళ్ళు వస్తయి. కరెంటు కష్టాలు, బోర్ల కష్టాలు తప్పుతయి. ఎత్తిపోతలకు కొంత కరెంటు కాలినా, బోర్ల మీద కరెంటు కర్చు తగ్గి, కరెంటు ఆదా అవుతది. రైతులు సిటీలకు వలసలు బొయ్యి కూలి పని చేసుకునుడు తప్పుతది.    

ఇప్పుడు తాజాగ కేంద్ర ప్రభుత్వం ఒక్క ప్రాజెక్టుకే సహాయం చేస్తం అంటుంది. అది ప్రాణహితో, పోలవరమో తేల్చి చెప్పమని మనలనే అడిగింది. 

సమైక్యవాదులారా, ఇప్పుడు చెప్పున్రి. మీరు ఏది కావాలంటరు? ప్రాణహిత చేవెల్ల కావాలంటరా? పక్కవాడు ఎట్లబోతే మాకేంది, మాకు పోలవరమే కావాలెనని మొండికేస్తరా? మీ సమైక్యవాదం ఎంత నికార్సైనదో దీన్ని బట్టి తెలుస్తది.

మీ సమైక్యవాదాన్ని నిరూపించుకోనీకి మీకొక మంచి అవకాశం వచ్చింది. మీ వీర సమైక్యవాద ఎంపీలు లగడపాటి, రాయపాటి, కావూరి తదితరులు మాకు పోలవరం వద్దు, ప్రాణహిత ఇవ్వండి అని కేంద్రానికి ఒక మెమొరాండం ఇయ్యన్రి.

మీ సమైక్యవాద ఎమ్మెల్యేలంత కలిసి పోలవరాన్ని ఆపి, ప్రాణహితకు కేంద్ర అనుమతి ఇయ్యమని అసెంబ్లీల తీర్మానం చేయించి కేంద్రానికి పంపున్రి. 

మీ సమైక్యవాద జేయేసీలేమన్న ఉంటె అయ్యన్ని కలిసి "పోలవరం వద్దు, ప్రాణహిత ముద్దు" అని ఉద్యమం జేయ్యున్రి. ముద్దుల ఉద్యమాలు మీకు కొత్తేం గాదుగా! గప్పుడు మీ మాటలు మేం నమ్మగలుగుతం. మీకు మీ ఉద్యమం నిజాయితీ మీద నమ్మకం ఉంటె అది నిరూపించు కుంటందుకు ఇదొక మంచి అవకాశం. 

ఇది జెప్పంగనే ఒకాయన "మేం గట్ల చేస్తే మీ ఉద్యమం మానేస్తామని గ్యారంటీ ఇస్తారా?" అని ఆడుగుడు మొదలు పెడ్తడు.  దానికి సమాధానం గూడ ఇప్పుడే చెప్త. 55 ఏండ్ల నుండి మీరు చేసిన పనుల తోని నమ్మకాన్ని పోగొట్టు కున్నరు. ఇప్పుడు న్యాయం దిక్కు మాట్లాడి మీ విశ్వాసనీయతని పెంచుకొండ్రి. మీరు నిజాయితీ పరులే అని తెలంగాణా ప్రజలు నమ్మితే ఉద్యమం దానంతట అదే పోతది.     

Wednesday, May 4, 2011

తెరాస ను ఎందుకు బలపరచాలి?

తెలంగాణా లోని ఇతర పార్టీల నాయకులకు తెలంగాణా సాధన పైగల చిత్తశుద్ధిని శంకించవలసిన అవసరం లేదు. కానీ ఇతర పార్టీలకు తెలంగాణా ఒక అంశమే కానీ అదే ప్రధానం కాదు. పైగా ఆయ పార్టీల అధినాయకత్వానికి ఒక పొలిటికల్  కంపల్స్హన్ వచ్చినప్పుడే గతంలో తెలంగాణా కు అనుకూలంగా నిర్ణయం తీసుకోవడం జరిగిందే కానీ స్వతహాగా వారికీ తెలంగాణా ఏర్పాటు పట్ల ఏమాత్రం చిత్తశుద్ధి లేదు. 

తెలుగుదేశం పార్టీనే తీసుకుంటే, 2009 ఎన్నికల ముందు వరకు సమైక్య నినాదం తో ఉన్న ఆ పార్టీ కేవలం కాంగ్రెస్ ను ఓడించడానికి, తెరాస తో పొత్తు పెట్టుకోవడానికే తెలంగాణా కు అనుకూల నిర్ణయం తీసుకుంది. 2009  డిసెంబర్ 9 ప్రకటన ముందువరకు తెలంగాణా విభజనకు అనుకూలమన్న వాళ్ళు డిసెంబర్ 23 ప్రకటనను వ్యతిరేకించక పోగా కొత్తగా  రెండు కళ్ళ సిద్ధాంతాన్ని ప్రవేశపెట్టారు. పార్టి వేదికపై పార్టీ అధికార విధానానికి వ్యతిరేకంగా ఆంధ్ర నాయకులు మాట్లాడుతుంటే ఎక్కడా అభ్యంతర పెట్టడం లేదు. 

కాంగ్రెస్ విషయానికొస్తే, 2004 లో ప్రజల్లో ఉన్న తెలంగాణ సెంటిమెంటు ను ఉపయోగించుని తెలుగు దేశం నుంచి అధికారం లాక్కోడానికి తెలంగాణ జపం చేసిన ఆ పార్టీ అధికారం లభించగానే తెలంగాణ అంశాన్ని పక్కన పెట్టింది. 2004 డిసెంబర్ 9 న  తప్పని పరిస్థితిలో తెలంగాణ ఏర్పాటు ప్రకటన చేసి మళ్లి డిసెంబర్ 23 కల్లా వెనక్కు తిసుకుంది. ప్రజల మనోభీస్తానికి అనులంగా, చిరకాలంగా ఉన్న డిమాండు ను పరిష్కరించే దిశగా ఆలోచించాల్సిన పార్టీ, ఆలోచించగలిగే అవకాశం కలిగి ఉన్న పార్టీ తమ తక్షణ రాజకీయ అవసరాలకోసం తెలంగాణా ప్రజల జీవితాలతో ఆడుకుంటూ వందలాది విద్యార్థుల, యువకుల మరణానికి కారనమవుతూంది.

తమతమ రాజకీయ అవసరాల కోసం తెలంగాణా అంశం పై రోజుకో వైఖరి తీసుకునే పార్టిలు రేప్పొద్దున ఇదే పొలిటికల్ కంపల్స్హన్ తో తెలంగాణా కు వ్యతిరేకంగా అధినాయకత్వాలు నిర్ణయం తీసుకుంటే అప్పుడు ఏమిటి పరిస్థితి? అప్పుడు  పార్టీల నుంచి బయటకు వచ్చే నిర్ణయం తీసుకున్నా అప్పటికే కాలాతీతం కాదా?

తెరాస పార్టీకి మరో ౩౦ సీట్లు ఉన్నట్లయితే ఇప్పుడీ పరిస్థితి ఉండేది కాదన్నది సుస్పష్టం. కనుక తెరాసను బలోపేతం చేయాలనే కెసిఆర్ నిర్ణయం లో ఏతప్పూ లేదు. 

కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీల తెలంగాణా నాయకులు కూడా ఈ విషయం గ్రహించి తమ తమ పార్టీల నుంచి బయటికి వచ్చి తెలంగాణా కోసం పోరాడాల్సిన అవసరం ఉంది.  వాళ్ళు తమ తమ పార్టీ లలో తెలంగాణా శాఖలు ఏర్పాటు చేసుకుని స్వతంత్రం గ పని చేయడం మంచిది లేదా ఒక ఉమ్మడి వేదిక పైకి వచ్చి పని చేయాలి. ఒకవేళ వారికి తెరాస పట్ల గాని, కెసిఆర్ పట్ల గాని ఎమన్నాఅభ్యంతరాలుంటే, తెలంగాణా రాష్త్రం ఏర్పడిన తరువాత మళ్లి ఎవరి గూటికి వాళ్ళు వెళ్లి పోవచ్చు. 

తెలంగాణా సాధన తప్ప మరే సమస్య ప్రస్తుత సమయం లో ముఖ్యం కాదనే ఆలోచనలో ప్రజలు ఉంటె ఈ నాయకులు మరో ప్రాంతం ఎన్నికల్లో తమ పార్టీ విజయం గురించి ఆలోచించడం సరైంది కాదు.

వీరంతా తక్షణమే ఒక సరైన నిర్ణయం తీసుకోవాలని ఆశిద్దాం.

సమైక్యం గురించి మాట్లాడే ఆంధ్రోల్లు దురాక్రమణ దారులే

1956 కెళ్ళి చూడ బడితిమి. ఒప్పందం ప్రకారం ఒక్కటిగ కలిస్తిమి. అది మొదలు మోసాల మీద మోసాలు జరుగుతనే ఉండే.

మొదటి దెబ్బ కలిసిన తెల్లారే ఉపముఖ్య మంత్రి పదవికి తెడ్డు జూపిండ్రు. నిన్నటిదాంక ఉపముఖ్యమంత్రి చేసినాయనకు కూడ ఉప ముఖ్యమంత్రి అంటే ఆరో వేలు లెక్క కనపడ్డది. కనీసం ఆ ఆరోవేలు కూడా ఇయ్య దరియ్యలేదు గాయనకు. 

రెండో దెబ్బ రీజనల్ డెవలప్మెంట్ బోర్డు పీకేసిండ్రు. ఇంక విచ్చల విడిగ ఇక్కడి భూములు కొనేటోనికి అడ్డే లేకుంట పొయ్యింది. 

మూడో దెబ్బ ముల్కీ రూల్సు పీకేసుడు. కోర్టుల ముల్కీ రూల్సు కేసుల తెలంగాణాకి అనుకూలంగా తీర్పు వస్తే దానికి వ్యతిరేకంగా ఒక ఉద్యమమే నడిపిండ్రు. ముల్కీ రూల్సుకి ఓర్వలేని వాళ్ళు ఏదో ఇక్కడ ఉద్దరిస్తున్నట్టు చెప్పుతారు. ఇక్కడి వనరులు మింగుడు దప్ప ఇంకోటి తెలువని వానికి సమైక్యంగ ఎన్ని రోజులు ఉంటె అంత మంచిగుంటది. అందుకనే సమైక్యతా రాగం.

ఇట్ల లెక్క పెట్టుకుంట పొతే ఎన్నో మోసాలు. కృష్ణా బేసిన్ నీళ్ళు పెన్నకు పంపుతరు. ఇక్కడి ప్రాజెక్టులు పాతికేండ్లు, యాభయ్యేండ్లు ఎనుకకు పోయినా సరే, ఇక్కడ నికర జలాలకు తికానా లేక పోయినా సరే, అక్కడ మాత్రం మిగులు జలాకకు రయ్యి, రయ్యి మనుకుంట ప్రాజెక్టులు పూర్తయితయి. 

హైదరాబాదు ఉద్యోగాలను ఫ్రీజోను కింద మారుద్దమని సూస్తరు. దొంగ సర్టిఫికెట్లు తెచ్చి ఇక్కడి ఉద్యోగాల్ల దూరుతరు. ఇయ్యన్ని ఎవరో పోరగాల్లు చెప్పే ఉత్తుత్త మాటలు గాడు, గిరగ్లానీ అనేటాయన పరిశోధించి చెప్పిన మాటలు.

ఇయ్యన్ని ఒక ఎత్తయితే అధికారాన్ని అడ్డం పెట్టుకొని ఇక్కడి భూములు, జాగలు కబ్జా చేస్తరు. ఆ కబ్జాలు చేసుడు కూడా అభివృద్ధే నని కతలు చెప్పుతరు.

ఈ దోపిడీలను ఆపే పేరుతోటి 610 జీవోలను తీసినా, జలయజ్ఞాలను చేస్తున్నమని చెప్పినా, అన్నీ గూడ వాళ్ళ మేళ్ళ కోసమే పెట్టుకుంటున్నరని ప్రతి ఒక్కరికి తెలిసి పొయ్యింది. మీ 610 జీవోలు తెలంగాణా వాళ్ళను ట్రాన్స్ఫర్ చెయ్యడానికి మాత్రమె పనికొస్తయి. మీ జలయజ్ఞాలు పోతిరెడ్డిపాడు, పోలవరం కట్టేతందుకే పనికొస్తయి. అంతే గని వీటితోని తెలంగానోల్లకు వీసమెత్తన్నలాభముండదని ఇప్పటికే చాలా సార్లు రుజువైంది.      

ఇన్ని సంవత్సరాల తర్వాత తెల్సిన దేంది? ఆంధ్రా దోపిడీ దారుల అక్రమాలు ఆగిపోవాలంటే తెలంగాణా రాష్ట్రం ఏర్పాటు తప్ప వేరే మార్గం కనపడుత లేదు. ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటయితే అన్ని అద్భుతాలు జరుగక పోవచ్చు. కనీసం పక్కోడు వచ్చి ఆక్రమిస్తుంటే కొమ్ము కాసే ప్రభుత్వం ఉండదు. (ఒక వేళ ఉన్త్తడి అనుకున్నా సమైక్య వాదులకు నష్టం లేదుగా?). ఇక్కడి నిధులు పక్క రాష్ట్రంల కరసు పెట్టే అవకాశం ఉండదు. ఇక్కడి నీళ్ళకు పక్క రాష్ట్రంల ప్రాజెక్టులు కట్టే పరిస్థితి ఉండదు. ఆ విధంగ రాష్ట్రం విడిపోతే కొన్ని చాలా సమస్యలకు ఆటోమేటిగ్గా పరిష్కారాలు దొరుకుతయి.  

మరి ఇన్ని నిజాలు చూసుకుంట ఇంకా సమైక్యంగా ఉండాలె, మీకిష్టం లేక పోయినా మీతోటే కలిసుంటాం అనేటోళ్ళను ఏమనాలె? దురాక్రమణ దారులంటే తప్పేంది? ఆంద్రాల ఉన్న సామాన్య ప్రజలు, ఇక్కడి కొచ్చి బతుకుతున్న సామాన్య ప్రజలమీద ఇక్కడి వాళ్లకు కోపం లేదు. కాని తెలంగాణా ప్రజల ఆకాంక్షలను పట్టించుకోక, సమైక్యాంధ్ర అని మాట్లాడే వారు ఎవరైనా సరే తెలంగాణా వ్యతిరేకులు, దురాక్రమణ శక్తుల అనుకూలురు అనే మేం అనుకుంటం.