Showing posts with label పోలవరం. Show all posts
Showing posts with label పోలవరం. Show all posts

Friday, May 6, 2011

సమైక్యవాదులూ, మీకో మంచి అవకాశం

పోలవరం ప్రాజెక్టుపై మొదటినుండి వివాదాలే నడుస్తున్నయి. అటు ఒరిస్సా ప్రభుత్వం, ఇటు పర్యావరణ వాదులు ఈ ప్రాజెక్టు ఒద్దంటే ఒద్దని మొత్తుకుంటున్నరు. అక్కడ నివసిస్తున్న లక్షలాది ఆదివాసీలు తమ భవిష్యత్తు గురించి దేవుని మీద భారం మోపిన్రు. అయినా వారి గోడు వినేదెవరు?

ఈ ప్రాజెక్టు కట్టితే ఎంత భూమి అదనంగా సాగవుద్దో, అంతకంటే ఎక్కువ భూమి మునిగి పోతదంటే అందరు ముక్కు మీద వేలేసుకుంటున్నరు. 

ఒకపక్క ప్రాజెక్టు కట్టి కాలవలు తొవ్వకుండా శ్రీరాం సాగర్ అట్లనే పెట్టిండ్రు. ఇంకో పక్క అనుమతులున్న ప్రాణహిత పక్కకు పెట్టినరు. ఏ అనుమతులు లేక, పైనుంచి పక్క రాష్ట్రాల కేసులతో నలుగుతన్న పోలవరం మీద మాత్రం ఎక్కడ లేని ప్రేమ జూపిస్తున్నరు. వేల కోట్ల రూపాయలు కుమ్మరిస్తున్నరు.     

ఈ పోలవరం ప్రాజెక్టు కట్టితే రెండు లక్షల ఎకరాల భూమి నీళ్ళల్ల మునిగి పోతది. రెండు లక్షలకు పైపెచ్చు ప్రజలు ఇండ్లు వాకిళ్ళు పోగొట్టు కుంటరు. ఇక లక్షలాది జంతువులు, మిలియన్లాది చెట్లు కనుమరుగైతయి. ఇంట భీభత్సం సృష్టించి ఈ ప్రాజెక్టు కట్టేది ఎందుకు, మూడో కారు నికరం జేసుకోనీకి.

ఎంత అన్యాయమో చూడున్రి. ఒకవైపు నీళ్ళు లేక, బోర్లు ఎండిపోయి రైతన్నలు ఆత్మహత్యలు చేసుకుంటున్నరు. ఒక్క కారుకు నీల్లోచ్చినా చాలురా దేవుడా అని మొత్తుకుంటున్నరు. ఇంకోపక్క రెండు కార్ల పంటకు నీల్లున్నా, మూడో కారు కూడా నికరంగా పందాలేనని చెప్పి మందిని ముంచే ఎవ్వారాలు చేస్తున్నరు. ఇది న్యాయమా, అన్యాయమా ఒక్కసారి ఆలోచించున్రి.

అదే ప్రాణహిత కట్టితే తెలంగాణా కరువుసీమల కనీసం ఒక కారుకు ప్రాజెక్టు నీళ్ళు వస్తయి. కరెంటు కష్టాలు, బోర్ల కష్టాలు తప్పుతయి. ఎత్తిపోతలకు కొంత కరెంటు కాలినా, బోర్ల మీద కరెంటు కర్చు తగ్గి, కరెంటు ఆదా అవుతది. రైతులు సిటీలకు వలసలు బొయ్యి కూలి పని చేసుకునుడు తప్పుతది.    

ఇప్పుడు తాజాగ కేంద్ర ప్రభుత్వం ఒక్క ప్రాజెక్టుకే సహాయం చేస్తం అంటుంది. అది ప్రాణహితో, పోలవరమో తేల్చి చెప్పమని మనలనే అడిగింది. 

సమైక్యవాదులారా, ఇప్పుడు చెప్పున్రి. మీరు ఏది కావాలంటరు? ప్రాణహిత చేవెల్ల కావాలంటరా? పక్కవాడు ఎట్లబోతే మాకేంది, మాకు పోలవరమే కావాలెనని మొండికేస్తరా? మీ సమైక్యవాదం ఎంత నికార్సైనదో దీన్ని బట్టి తెలుస్తది.

మీ సమైక్యవాదాన్ని నిరూపించుకోనీకి మీకొక మంచి అవకాశం వచ్చింది. మీ వీర సమైక్యవాద ఎంపీలు లగడపాటి, రాయపాటి, కావూరి తదితరులు మాకు పోలవరం వద్దు, ప్రాణహిత ఇవ్వండి అని కేంద్రానికి ఒక మెమొరాండం ఇయ్యన్రి.

మీ సమైక్యవాద ఎమ్మెల్యేలంత కలిసి పోలవరాన్ని ఆపి, ప్రాణహితకు కేంద్ర అనుమతి ఇయ్యమని అసెంబ్లీల తీర్మానం చేయించి కేంద్రానికి పంపున్రి. 

మీ సమైక్యవాద జేయేసీలేమన్న ఉంటె అయ్యన్ని కలిసి "పోలవరం వద్దు, ప్రాణహిత ముద్దు" అని ఉద్యమం జేయ్యున్రి. ముద్దుల ఉద్యమాలు మీకు కొత్తేం గాదుగా! గప్పుడు మీ మాటలు మేం నమ్మగలుగుతం. మీకు మీ ఉద్యమం నిజాయితీ మీద నమ్మకం ఉంటె అది నిరూపించు కుంటందుకు ఇదొక మంచి అవకాశం. 

ఇది జెప్పంగనే ఒకాయన "మేం గట్ల చేస్తే మీ ఉద్యమం మానేస్తామని గ్యారంటీ ఇస్తారా?" అని ఆడుగుడు మొదలు పెడ్తడు.  దానికి సమాధానం గూడ ఇప్పుడే చెప్త. 55 ఏండ్ల నుండి మీరు చేసిన పనుల తోని నమ్మకాన్ని పోగొట్టు కున్నరు. ఇప్పుడు న్యాయం దిక్కు మాట్లాడి మీ విశ్వాసనీయతని పెంచుకొండ్రి. మీరు నిజాయితీ పరులే అని తెలంగాణా ప్రజలు నమ్మితే ఉద్యమం దానంతట అదే పోతది.