Wednesday, May 4, 2011

అమెరికాకు ఆ హక్కు ఎవరు ఇచ్చారు?


ఉగ్రవాదాన్ని కానీ, ఒసామా బిన్ లాడెన్ చేసిన పనులను కానీ ఎవ్వరు సమర్ధించరు. (నిజానికి ఈ వాక్యం ఇక్కడ అప్రస్తుతం) ఐనా అమెరికా కు పాకిస్తాన్ భూభాగం మీదనుంచి ఆ దేశం అనుమతి లేకుండా రహస్య సైనిక చర్యలు చేబట్టే హక్కు లేదు  

అమెరికాకు ఈవిధమైన చర్యలకు పూనుకునే అధికారమిచ్చే అంతర్జాతీయ చట్టాలు ఎమన్నా ఉన్నాయా? కేవలం అగ్రరాజ్యమనే అహంకారం, తన ఆర్ధిక మరియు ఆయుధ బలాన్ని చూపి అన్ని మానవీయ సూత్రాలను, అంతర్జాతీయ న్యాయ సూత్రాలను తుంగలో తొక్కి, యదేచ్చగా వ్యవహరించడం సరైంది కాదు.

అమెరికా చేసింది సరైనదే అయితే,ఇదే విధంగా ఉగ్రవాద చర్యలకు గురైన ప్రతి దేశం ఆయా  తివ్రవాదులు తల దాచుకున్న దేశాలలో ప్రతి చర్యలు చేపట్టవచ్చు కదా? పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాద పిడితురాలైన భారత దేశానికి పాకిస్తాన్ పై యుదానికి దిగే అధికారం ఉంటుంది. అదే విధంగా, బంగ్లాదేశ్ లోనుంచి భారత్ లో ప్రవేశిస్తున్న ఉగ్రవాదులను ఆపడానికి బంగ్లాదేశ్ పై సైనిక చర్యలకు దిగవచ్చు కదా?

నిజానికి  తనకు అవసరమైనప్పుడు ఉగ్రవాదాన్ని పెంచి పోషించి ఆయ ప్రభుత్వాలను పడగొట్టి తనకు అనుకూలమైన ప్రభుత్వాలను ఏర్పాటు చేసిన  చరిత్ర అమెరికాదే. తన అధికారానికి అడ్డంకి  అనుకున్నప్పుడు, తన సరఫరాలకు అంతరాయం ఏర్పడుతున్నదనుకున్నప్పుడు, కార్పోరేట్ ప్రయోజనాలకు అవసరమైనప్పుడు ఉగ్రవాద బూచిని చూపించి తన బలగాలను దించి ఆయా దేశాలలో లక్షల సంఖ్యలో ప్రాణ నష్టానికి, విధ్వంసానికి పాల్పడిన చరిత్ర అమెరికాదే. 

అసలైన తెర్రోరిస్ట్, ప్రపంచానికి నిజమైన శత్రువు అమెరికానే. ఈవిషయం లో సరైన చర్చ జరగక పోతే, ఇదే విధంగా గుడ్డిగా అమెరికా ను సపోర్ట్ చేసుకుంటూ పోయినట్టయితే ఈరోజు ఆఫ్ఘానిస్తాన్, ఇరాక్ లో పరిస్థితే రేపు ఇతర దేశాలకు రాదని చెప్పలేము. ఉగ్రవాదానికి నిజమైన పరిష్కారం దానికి దారి తీసిన సమస్యల పరిష్కారమే కానీ సామ్రాజ్యవాద దాడులు  కాదు.  

Friday, April 29, 2011

అన్యాయపు మాటలు


బ్రహ్మయ్య గారూ, మీరు మీ వ్యాసం ('సామాన్యుల మాట ఏం టి?' ఆంద్ర జ్యోతి ఏప్రిల్ 26)లో సామాన్యులమీద జాలి చూపించి, మొసలి కన్నీరు కార్చారు. గణాంకాలతో పాటు మీరు ప్రస్తావించిన అన్ని విషయాలు ఎంత సత్యదూరాలో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. తెలంగాణలో జరుగుతున్న ఉద్యమాన్ని ఒక్క వారం రోజులు ప్రత్యక్షంగా పరిశీలిస్తే, మీరు వాస్తవాలను ఎంత వక్రీకరించారో, ఉద్యమాన్ని ఎంత చులకన చేసి చూపదలుచుకున్నారో ఎవరికైనా అర్థమవుతుంది. నిజానికి మీ వ్యాసానికి బదులివ్వడం అనవసరం.

ఎవ్వరు చెప్పకుండానే ఒక సామాన్య పాఠకుడు కూడా మీరు చెప్పినవన్నీ అసత్యాలేనని చెప్పగలడు. ఎవరూ మీ వక్రీకరణను ఖండించక పోతే, కొన్ని రోజులకు మీ అసత్య ప్రచారాలనే నిజాలనుకునే ప్రమాదముంది. అటువంటి ప్రమాదాన్ని నివారించడానికే ఈ ప్రతిస్పందన. ఇటీవలే కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన 2011 జనాభా లెక్కల్లో హైదరాబాద్ జనాభా ఎంతో మీకు తెలియదు అనుకోవడం కష్టం. కాబట్టి కావాలనే తప్పుడు లెక్కలు చూపించారని అనుకొనేందుకు అవకాశం ఉంది.

మొత్తం హైదరాబాద్ జిల్లా జనాభా 40,10,238. అలాగే రంగారెడ్డి జిల్లా జనాభా 52,96,386 (రంగారెడ్డి జిల్లాలోని కూకట్‌పల్లి, కాప్రా, అల్వాల్, ఉప్పల్, ఎల్‌బి నగర్, రాజేంద్రనగర్ లాంటి మునిసిపాలిటీలను కలుపుకొనే ఈ సంఖ్య). హైదరాబాద్ జిల్లాను చాలా విస్తరించి గ్రేటర్‌హైదరాబాద్‌గా చెప్పుతున్నారు. ఈ మొత్తాన్ని కలిపితే హైదరాబాద్ జనాభా 70-75 లక్షలకు మించదు. హైదరాబాద్ పాత సిటీలో కనీసం వెయ్యిమంది కూడా సీమాంధ్రులు ఉండరు. అక్కడ నూటికి నూరుశాతం తెలంగాణ ముస్లింలు, హిందువులే ఉన్నారు.

అలాగే ఎల్‌బి నగర్, కూకట్‌పల్లి, ఎస్సార్ నగర్ మొదలైన ప్రాంతాల్లో కొంత శాతం మంది కూలీలు, మధ్యతరగతి సీమాంధ్రులూ ఉన్నారు. ప్రత్యేకించి హైదరాబాద్ నగరానికి గత ఇరవై, ముప్పై ఏళ్లుగా తెలంగాణ జిల్లాలనుంచి పెద్ద ఎత్తున వలస వచ్చిన వ్యవసాయ కూలీలు లక్ష ల సంఖ్యలో ఉన్నారు. వీరు జగద్గిరిగుట్ట, బోరబండ, అడ్డగుట్ట, కుత్బు ల్లాపూర్, ఇంకా నగరంలో విస్తృతంగా ఉన్నటువంటి మురికివాడలలో నివశిస్తున్నారు. హైదరాబాద్ నగర పూర్వీకులు పాతనగరంతో పాటు కవాడి గూడ, నారాయణ గూడ, హియాయత్ నగర్ లాంటి కాలనీల్లో నివశిస్తున్నారు. వీరిలో మధ్య తరగతి కుటుంబీకులు ఎక్కువ.

బ్రహ్మయ్యగారు చెప్పిన సామాన్యులు కాని సీమాంధ్రులు 1000, 1500, 2000 చదరపు గజాలలో విశాలమైన భవంతులు కట్టుకున్నవారు బంజారాహిల్స్, జూబ్లిహిల్స్ ప్రాంతాలలో చాలామందే ఉన్నా రు. ఈ వాస్తవ గణాంకాలను పరిశీలిస్తే హైదరాబాద్‌లో ఉండే మొత్తం సీమాంధ్రుల సంఖ్య ఐదు నుంచి పది లక్షలకు మించదు. కానీ మీ వ్యాసాల్లో సీమాంధ్రులు 40 లక్షల వరకు ఉన్నట్టు లెక్కలు చెప్పారు.

ఈ కాకి లెక్కల సంఖ్య ఎందుకు చెప్పారో మీకే తెలియాలి. అంటే హైదరాబాద్ నగరంలో 70-75 లక్షల జనాభా ఉంటే వారిలో 40 లక్షల మంది సీమాంధ్రులేనా? లేక హైదరాబాద్‌లో తెలంగాణ వారు మైనార్టీ సంఖ్యలో ఉన్నారని చెప్పే ప్రయత్నమా? ఎవరైనా వాస్తవ గణాంకాలను పరిశీలించి దానికి అనుగుణంగా ఏమైనా చెబుతారు. కాని మీరు మాత్రం మీరు చెప్పదల్చుకున్న దానికి అనుగుణం గా గణాంకాలను మార్చారు. ఇది సీమాంధ్రుల తరహా పద్ధతే అనుకోండి.

మీరు చెప్పిన 40 లక్షల సీమాంధ్రుల లెక్క ఐటి., ప్రభుత్వ, ప్రైవేటు కార్పొరేట్లలో పనిచేసే అత్యధిక సీమాంధ్రులను చూసి చెప్పారేమో! అధిక ధనవంతులు, ముఖ్యమైన స్థానాల్లో ఉన్నవారు, పెద్ద పెద్ద వ్యాపారస్తులు అందరూ సీమాంధ్రులే కదా? అంతే కాదు, హైదరాబాద్ నగరంలో హైదరాబాద్, సికిందరాబాద్ పార్లమెంట్ స్థానా లు పూర్తిగాను, చేవెళ్ల, మల్కాజ్‌గిరి స్థానాల్లో కొంత భాగం ఉన్నాయి. అదే ముంబాయి, ఢిల్లీ, కలకత్తా, చెన్నై నగరాల్లో సుమారు కోటి జనాభా ఉన్నచోట ఒకొక్క దగ్గర 6 లేదా 7 పార్లమెంట్ స్థానాలున్నాయి. ఈ రకంగా చూసినా మీరు చెప్పిన లెక్కలన్నీ తప్పే కదా.

మీరు మీ వ్యాసంలో ఒక దగ్గర సామాన్యుల మీద దాడులు జరిగాయని చెప్పారు. మరో దగ్గర భౌతిక దాడి కాదు మానసిక దాడి అన్నారు. ఏ సామాన్యుడి మీద దాడి జరిగిందో చెబితే బాగుండును. తెలంగాణ ఉద్యమం ప్రజల్లో లేదు అని పరాకాష్ఠ (బాయిలింగ్) స్థాయికి చేరుకున్నది అనేది మీడియా ద్వారా తెలంగాణ నాయకులు చేస్తున్న ప్రచారమని చెప్పుకొచ్చారు. శ్రీకృష్ణ కమిటీ నివేదికలో మీడియా అంతా సీమాంధ్రులదేనని చెప్పారు. మరి సీమ్రాంధ్ర మీడియా తెలంగాణను సమర్థిస్తుందా? వాళ్లు ఎంతో తక్కువ చేసి చూపెడుతున్నారు.

అయినా మీరు ఇంత ఉలిక్కి పడుతున్నారు అంటేనే ఉద్యమం ఎంత తీవ్రంగా ఉందో మీరే చెప్పకనే చెప్పారు. అయినా ఒక వారం రోజులు తెలంగాణలో ఎక్కడ తిరిగినా, ఎవ్వరిని పలకరించినా తెలంగాణ వాదం ఎంత బలంగా ఉందో కండ్లు మూసుకొని చూసే వాళ్ళకు, చెవులు మూసుకొని వినేవాళ్ళకు తప్ప ఎవరికైనా అర్థమౌతుంది. తెలంగాణ ఉద్యమ నాయకులు పదే పదే చెబుతున్నారు- 'మా ఉద్యమం పొట్ట కొట్టే వాళ్ళకు వ్యతిరేకంగానే కానీ పొట్ట చేత పట్టుకొని వచ్చినవాళ్ళకు వ్యతిరేకం కాదని'.

అయినా మీరు ఇలాంటి అబద్ధాలను మీకు చేతనైనంత స్థాయిలో ప్రచారం చేస్తూనే ఉన్నారు. మీరు చెప్పిన ఆ అసామాన్య సీమాంధ్రులకు ఎన్నెన్ని ఆస్తులు ఉన్నాయే, ఎలా వచ్చాయో,హైదరాబాద్‌కి మొదటగా వచ్చినప్పుడు ఎంత ఆస్తి ఉంది, ఇప్పుడు ఎంత ఉందో చెబితే ఇంకా బాగుండేది. రాష్ట్ర విభజన జరిగితే ఎలా జరగాలో చెప్పుకొచ్చారు. కాని రాజ్యాంగంలోని అధికరణ 3-ఎ లో రాష్ట్ర విభజనలు జరిగితే ఎలా జరగాలో స్పష్టంగా చెప్పారు.

అంతే కాదు రాజ్యాంగాన్ని రూపొందించుకున్నప్పుడు 38 కోట్లు ఉన్న దేశ జనాభా 120 కోట్లకు చేరుకున్నప్పుడు రాష్ట్ర విభజన ఎంత అవసరమో డాక్టర్ అంబేద్కర్ చెప్పారు. ప్రత్యేక తెలంగాణను మొండిగా వ్యతిరేకించే క్రమంలో కనీసం అంబేద్కర్ లాంటి మహనీయుడిని అవమానం చేసే ప్రయత్నం చేయకండి.

- బి.వినోద్‌కుమార్
మాజీ ఎంపి; టిఆర్ఎస్ పొలిట్ బ్యూరో సభ్యులు
(Andhra Jyothi Friday, April 29th, 2011 Editorial page)

Thursday, April 28, 2011

భాష, యాస

ప్రజలు మాట్లాడేది భాష అయితది. ఆ భాష నించి వ్యాకరణం పుడుతది. అంతే గని వ్యాకరణం నించి భాష పుట్టదు. వ్యాకరణం నుంచి భాష పుట్టించుడు అంటె జలపాతాన్ని వెనుకకు మలిపేటందుకు ప్రయత్నించుడే.

ఇది తెల్వక ఒక ప్రాంతంలోని కొంత మంది దురభిమానులు మాదే అసలు యాస అనుడు మొదలు బెట్టిన్రు. యాస నించి భాష వచ్చినప్పుడు అసలు యాస ఏంది? నకిలీ యాస ఏంది?

నిజానికి మాది అసలు యాస అనేటోల్లకు అచ్చతెలుగు ఎట్లుంటదో తెలువదు.

తిక్కన, నన్నయ రాసిన పద్యాలల్ల ఎక్కడా 'వచ్చారు', 'వెళ్ళారు' అని ఉండదు. వచ్చిరి, వెళ్ళిరి అనే ఉంటది. దీన్ని ఒక ప్రాంతం వాళ్ళు వచ్చిన్రు, వెళ్లిన్రు అంటె, ఇంకొక ప్రాంత్రం వారు వచ్చినారు, వెళ్ళినారు అంటున్నారు. అయ్యన్ని కాదు, 'వచ్చారు', 'వెళ్ళారు' మాత్రమే కరెక్టు అనుడు కేవలం ఒక ప్రాంతపు ఆధిపత్య ధోరణి తప్ప ఇంకోటి కాదు. 

ఎక్కడ ఎవరు అట్లా అనలేదు. మేం మీ యాసను చాల బాగ గౌరవిస్తున్నం అనే వాళ్ళు లేరని కాదు. మరి ఎందుకు పుస్తకాలల్ల, పేపర్లల్ల, టీవీల్ల, సినిమాల్ల ఒక యాస తప్ప వేరే యాస జాడ లేకుంట పొయ్యింది?

ఒక్క తెలంగాణా వాడే కాదు, ఒక రాయల సీమ వాడు, ఒక ఉత్తరాంధ్ర వాడు కృత్రిమంగా రెండున్నర జిల్లాల కోస్తాంధ్ర మాండలికాన్ని ఈనాడు బలవంతంగా పలుకడానికి ప్రయత్నిస్తున్నరు. ఇంట్ల మాట్లాడుడు ఒకటి, బయట మాట్లాడుడు ఒకటి. ఇట్ల మాతృభాషనే రెండు రకాల మాట్లాడే టందుకు పడే మానసిక సంఘర్షణ పడేటోనికే అర్థమైతది కని ఇంకొకనికి కాదు.    

ఇంకా పొతే బహువచనాలు. ఆ బ్రిటీషు వాడు వచ్చి you అని అంటిచ్చి పోయిండు. రాజును సైతం 'హే రాజా' అని సంభోధించిన దేశం మనది. ఇప్పుడు ఏ అమెరికాలనో 'మిష్టర్ ప్రెసిడెంట్' అని పిలుస్తరట -  అని గుడ్లప్పగిచ్చి చెప్పుకుంటం మనం. గౌరవం మనసుల లేకుండ 'గారు', 'వారు' అనుకుంట ఈ కుహనా గౌరవ విభక్తి మనకు అవసరమా? 

Wednesday, April 27, 2011

తెలుగు జాతి వేల సంవత్సరాలుగా కలిసి ఉన్న జాతా?

కుహనా సమైక్యవాదులు చేసే మరో మోసపు వాదన ఏందంటే తెలుగు జాతి వేల సంవత్సరాలుగా కలిసి ఉన్న జాతి అని, ఇప్పుడు విడదీయడం పెద్ద అపరాధమనీ.

రాష్ట్రాలు పాలనా అవసరాల ప్రకారం, ప్రజల ఇష్టాయిష్టాల ప్రకారం ఏర్పాటు చేయ బడుతయి. అంతే గని అపరాధాలు, పాపాలు పుణ్యాల ప్రకారం మాత్రం కాదు.     

వాళ్ళ వాదన ప్రకారం చూసినా ఇప్పుడున్న ఇరవై మూడు జిల్లాలతో ఒక రాజ్యం గాని, ఒక రాజ్య విభాగం కాని చరిత్రల ఎప్పుడూ లేదు. ఏదో కొద్ది సంవత్సరాలు ఇప్పటి ఆంద్రప్రదేశ్ మొత్తం ఒక రాజ్యం కింద ఉన్నా, దీంతో పాటు మరి కొన్ని ఇతర భాషల ప్రాంతాలు కూడా కలిసే దేశంగా ఉండేవి తప్ప కేవలం తెలుగు వారితో మాత్రమే కూడిన రాజ్యం ఎప్పుడు గూడ లేదు. 

తెలుగుభాష ఉచ్ఛ దశలో ఉన్న కృష్ణదేవరాయల కాలంలో గూడా తెలుగు వాళ్ళందరూ ఒక్క దేశంల లేరు. కృష్ణ దేవరాయల దేశంల తెలుగు వాళ్ళు, తమిళులు, కన్నడులు ఉండేటోల్లు. ఇప్పటి తెలంగాణా బహామనీల కింద ఉండేది. ఉత్తరాంధ్ర గజపతుల కింద ఉండేది.

ఒక వేళ చరిత్రల ఎప్పుడన్నా ఒకసారి ఈ ఆంధ్ర ప్రదేశ్ మొత్తం ఇదివరకు ఒక దేశంగా ఉందనే అనుకుందాం. అంట మాత్రాన ఇప్పుడు గూడ ఒక రాష్ట్రంగా ఉండాలే అనేది ఏం లాజికో అడిగితె వీళ్ళు చెప్ప లేరు. మొఘల్ రాజుల కాలంల ఉత్తర భారత దేశం మొత్తం ఒక్కటే దేశంగా ఉంది. మరి ఉత్తర భారత దేశం మొత్తం ఒక్కటే రాష్ట్రం చేద్దామా అని అడిగితె సమాధానం ఉండదు. 

ఈ కుహనా సమైక్యవాదులకు  నిజాలు తెలువక కాదు. ఏదో ఒక మాయ మాట చెప్పి తెలంగాణా ప్రజలని మోసపుచ్చాలనే యావ తప్ప వీళ్ళ వాదనలకు మరొక్క కారణం కనిపించదు. 

చారిత్రక పటాలు చెప్తున్న చేదు నిజాలు

ఒకాయన ఏవో రెండు పటాలు గూగుల్ నుండి పట్టుకొచ్చి, తెలంగాణా, ఆంధ్రా భూమి పుట్టినప్పటి నుండి కలిసే ఉన్నయన్నట్టు మాట్లాడు తున్నడు. ఆయనకు సమాధానం చెప్పుదామని గూగుల్ వెతికిన. ఈ పటాలు చూసినంక తెలంగాణా, ఆంద్ర ఎన్ని రోజులు కలిసి ఉన్నయో మీరే చెప్పున్రి.


క్రీ.శ. 1

    క్రీ. శ. 200    

క్రీ. శ. 500 

క్రీ. శ. 1030 

   క్రీ. శ. 1200 

క్రీ. శ. 1560 

     
క్రీ. శ 1700         

క్రీ. శ. 1805 నుండి 1858 వరకు   

క్రీ. శ. 1860 

క్రీ. శ. 1934   

   1956 ఆంద్రప్రదేశ్ ఏర్పడక ముందు.

పై పటాలు చూసి చిన్న పిల్లవాడు కూడా తెలుసుకొనేది ఏమిటంటే, తెలంగాణా, ఆంధ్రా పూర్తిగా ఎప్పుడు కూడా కలిసి ఒక దేశంగనో ఒక రాష్ట్రంగనో లేవు. ఒక వేళ ఎప్పుడన్నా కలిసి ఉన్నా, వేరే ప్రాంతాలు కూడా వాటితో కలిసి ఉన్నయి. ఉదాహరణకి కన్నడ ప్రాంతాలో, మరాఠీ ప్రాంతాలో, ఒరిస్సా ప్రాంతాలో, తమిళ ప్రాంతాలో కూడా మనతోటి కలిసి ఉన్నయి. అంతేగాని ఇప్పుడు ఉన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం లాంటిది ఇంతకు ముందు ఎన్నడు గూడ ఏర్పడి ఉండలేదు. కాబట్టి ఈ రాష్ట్రానికి ఏదో చారిత్రక ప్రాముఖ్యత ఉన్నది అని కుహనా సమైక్య వాదులు ఎన్ని కతలు చెప్పినా చరిత్ర మాత్రం అబద్ధం చెప్పదు. 

(సీమలో పుట్టి తెలంగాణా వేదనను అర్థం చేసుకుని, సంఘీభావం తెలిపిన సదరు బ్లాగరికి వందనాలు.)