Tuesday, April 26, 2011

ప్రజలను విడదీయడం పాపమా?

ప్రజలను విడదీయడం పాపమని ఒకాయన అన్నడట! అంటే పక్కోడు పాపాలు చేస్తున్నా కూడా, వాని పాపాలు ఎదుర్కునే టందుకు విడిపోవడం తప్ప మార్గం లేకున్నా కూడ విడిపోవద్దన్న మాట.

అవును మరి, వానికి మెజారిటీ ఉంది. మెజారిటీ తోటి మైనారిటీ నోరు మూయిస్తడు. నోరు ముయ్యని ఒకరిద్దరు నాయకులను కొనేస్తడు. ఇంకెవరైన మిగిలితే బెదిరిస్తడు. ఫాక్షనిస్టుల పురమాయిస్తడు. చావుకు భయపడేటట్టు చేస్తడు. అప్పుడు కూడ కలిసే ఉండాలె. విడి పొతే పాపమట!  

మరి 1953 ల మద్రాసు నుండి విడిపొయ్యి నప్పుడో? అంటె వేరే భాష వానితోటి విడిపోవచ్చన్న మాట. వాడు గూడ మన దేశంల మనిషైనా సరే. వాడు తమిళుడంటం. తెలుగోనికి వేరే రాష్ట్రం గావాలంటం. జాతీయ వాదాన్నివొదిలి భాషావాదాన్ని నిర్లజ్జగా తలకెక్కించు కుంటం.  

మన భాష మాట్లాడేటోళ్ళు మాత్రం విడిపోతే పాపం. మనం వాళ్ళ భాషని, యాసని ఎంత గేలి చేసినా సరే. విడిపోవద్దు.అట్లనే అణిగి మణిగి ఉండాలె, వాళ్ళ కాళ్ళ కింది చెప్పుల్లెక్క. అది మన సమైక్య వాదుల నీతి.  

ప్రాతం పేరున విడిపోవడం పాపమైతే, భాష పేరుమీద విడిపోవడం పాపం కాదా? ఆ లెక్కన 1953 లనే పాపిష్టులుగా మారినోల్ల తోటి మేమెందుకు కలిసుండాలే? సమైక్య వాదులారా, మీ పాపాలను నిజంగ కడుక్కోవాలె నని మీకుంటే మాకు అడ్డం రాకున్రి. పూర్తిగ కడుక్కోవాలెనంటె పొయ్యి తమిళనాడుల కలువున్రి, వాళ్ళు కలుపుకుంటే.

మీరు మోకాలడ్డం పెట్టినా, మొత్తంగా అడ్డం పండుకున్నా, మిమ్మల్ని దాటి రాష్ట్రం ఎట్ల తెచ్చుకోవాలనో మాకు బాగనే తెలుసు.

Thursday, April 21, 2011

ఐకమత్యం అంటే ఏమిటి

ఐకమత్యం అంటే ఏమిటి
ఒకే ఇంట్లో కలిసుండడమా
మనసు మనసు కాగా ఒక్కటి
ఒక్క మాటై పలికే ప్రేమా

నమ్మకాలవి వమ్మై నప్పుడు
కలసి ఉండుడు కలయే కాదా
ఎదుటి వాడి హృదయపు చప్పుడు 
వినగ నొప్పని వాదం నీదా

ఉద్యోగస్తులు రాష్ట్రమంతటా
రెండు గుంపులు పెట్టు కొంటిరి
చదువుకునే పోరలు కూడా 
ఒకరి నొకరు సహించ మంటిరి 

కులము కులము రెండుగ చీలెను
ప్రాంత మంతా ఒకటై పోయెను
మతము మతము వేరై పోయెను 
ప్రాంత వాదన మతమై పోయెను

ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు,
పార్లమెంటు ఎంపీ లందరూ
ప్రాంత ప్రాంతము వేరు గుంపులు
చూడనట్టు నటిస్తరు కొందరు 
  
కలిసి ఉండి కలెబడ వలెనా
విడిగ ఉండుడు ఉత్తము కాదా
రాజధానులు విడిగా ఉన్నా 
రాక పోకల మార్గం లేదా? 

Wednesday, April 20, 2011

విభజన ఇక అనివార్యం, కడపే దానికి ఆద్యం

విసుగెత్తిరి ప్రజలంతా
వినలేక సమైక్య వంత
తప్పదు విడిపోద మనిరి
దళితులు మేధావులంత

దోపిడినే బలుపంటూ
తొండిగ మాట్లాడువారు
చీకటినే వెలుగంటూ
ఎవరిని నమ్మించ గలరు?

ఊకదంపుడును దంచే
నైపుణ్యం నీ పెన్నిధి
దాయాదుల కబళించే
సంకల్పం నీకున్నది

దోపిడీ దారులకది
మహా పెద్ద సిండికేటు
ఐకమత్యమే పునాది
డబ్బే తన కనికట్టు

జనమంతా గమనించిరి
మీ ముద్దులు కౌగిళ్ళు
ఇకనైనా మారకుంటె
హూనం జేస్తరు ఒళ్ళు

విశాలాంధ్ర మాట ఇంక
పనికి రాని చిల్ల పెంక
జగమెరిగెను ఈ సత్యం
విభజన ఇక అనివార్యం
కడపే దానికి ఆద్యం
కాగల గంధర్వ కార్యం

బోర్ వెల్సున్నై గద, వేరే ప్రాజెక్టు లెందుకు?

తెలంగాణాల బోర్ వెల్సున్నై గద, వేరే ప్రాజెక్టు లెందుకు?

ఇవి ఒక విశాలాంధ్ర సమైక్యంగా ఉండాలెనని సుద్దులు జెప్పే పెద్దమనిషి మాటలు. ఈయన లెక్కల తెలంగాణా రైతులు బోర్ వెల్ తోవ్వుకొని మంచిగ సాగుజేసు కుంటున్నరు కాబట్టి వాళ్లకు ప్రాజెక్టులు అవసరం లేదట! తెలంగాణాల లిఫ్టు ఇర్రిగేషను ప్రాజెక్ట్లులు కడితే కరెంటు కర్సు ఎక్కువైతదట. వాళ్ళు బోర్ వెల్ బాయిలు తొవ్వుకొన్నరు కాబట్టి వాటి మీదనే బతకాలె నట. ఇది ఆ పెద్దమనిషి తీరు.

ఆంధ్రాల ప్రాజెక్టులు కట్టుకొని, కాలువలు తోవ్వుకోని ఆరాంగ సాలుకు మూడు కార్లు పండించు కోవాలె. తెలంగాణకి లిఫ్టు ఏ ఇర్రిగేషను ప్రాజెక్టులో పెట్టినా గూడ నష్టమే. అప్పో సప్పో జేస్తి బోర్ల మీద బోర్లు వేసుకోవాలే. వాటిల గూడ నీళ్ళు పడక పొతే భూమి ఏ ఆంద్ర ఫాక్టరీకో అమ్ముకొని హైదరాబాదుకు పొయ్యి రిక్షా తొక్కు కోవాలె. 

తప్పి జారి నీళ్ళు పడితె మోటార్లు పెట్టుకోవాలే. అయ్యి కాలి పోతుంటే వైరింగులు జేపిచ్చు కోవాలె. కొత్త మోటార్లు కొనుక్కోవలె. కరెంటు ఎప్పుడొస్తదో, ఎప్పుడు పోతదో తెల్వక పొద్దు మాపు ఇల్లు సంసారం ఒదిలేసి పొలంలనే పండుకోవలె. ఇన్ని జేసిన తర్వాత, లో వోల్టేజీలు, ట్రాన్స్ఫార్మర్లు పేలి పోవుడులు. దాని తోటి పోలాలెండిపొతే ఉరేసుకొని ఆత్మహత్యలు చేసుకోవాలె.

అదీ ఈ విశాలాంధ్ర సమైక్యవాది చెప్పే సమైక్య నీతి.

బోర్ల మీది పంపుసెట్ల సాగు కంటే లిఫ్టు ఇర్రిగేషన్ ప్రాజెక్టులు ఏ విధంగా మెరుగో తెలుసుకోవల్నంటే ఈ ఏది సత్యం? టపా చదువున్రి.             

పొట్టి శ్రీరాములు వేర్పాటు వాదైతే నేనూ వేర్పాటు వాదినే

అసలు సమైక్య వాదం అనేదే ప్రపంచంల ఎక్కడ వినబడని కుటిల వాదన. సమైక్య వాదం అంటే జర్మనీని ముందుకు తీసుకొచ్చి మాట్లాడుతరు. జర్మనీ సామ్రాజ్య వాదుల చేర బలవంతంగ రెండు దేశాలుగ విడదియ్య బడ్డది. ప్రచ్చన్న యుద్ధం ముగిసిన తర్వాత రెండు దేశాల వాళ్ళు కలవాలె నని అనుకున్నరు, కలిసి పోయ్యిన్రు. ఇప్పుడు కలిసిన జర్మనీల గూడ 15 రాష్ట్రాలున్నయి. ఆ ముచ్చెట మాట్లాడంగనే సమైక్యా వాదులకు ముచ్చెమటలు పోస్తై. వీళ్ళకి దేశం వేరు, రాష్ట్రం వేరు అన్న ఇంగితం తెలువక గాదు, ఏదో గుడ్డి వాదన చేయాలె, కింద బడ్డా నాకాలే మిర్రని చెప్పాలె.

ఏ వాదన చేతగాని సమైక్య వాదులు ప్రత్యేక తెలంగాణా వాదులని వేర్పాటు వాదులని పిలుసుడు మొదలు పెట్టిన్రు. వెనుకట ఖలిస్తాన్ దేశం కొరకు పోరాటం చేసినోల్లను, ఇప్పుడు కాశ్మీర్ ప్రత్యేక దేశం కొరకు పోరాటం చేసేటోల్లను తెలుగుల వేర్పాటు వాదులని చెప్పుడు మామూలు. వాళ్ళతోటి కలిపి ప్రత్యేక రాష్ట్రం కోసం పోరాటం చేస్తున్న తెలంగాణా వారిని కూడా వేర్పాటు వాదులు అని పిలవడం వీళ్ళ కుట్రబాజీ మనస్తత్వాన్ని బయట పెడుతుంది.

కొంతమంది మరింత ముందుకు పొయ్యి తెలంగాణా వాళ్ళను తెలబాన్లంటున్నరు. అంటే అన్యాపదేశంగ ఆఫ్గన్ తాలిబాన్లతోటి పోల్చడం అన్న మాట. రాజ్యాంగ బద్ధంగ ప్రత్యేక రాష్ట్రం కోరుడు తాలిబానిజం ఎట్లయితది అని అడిగితె దానికి సమాధానం ఉండదు.

మరి 1952 ల మద్రాసు రాష్ట్రం నుండి విడిపోతమని పోరాటం చేసిన విషయం ఎవ్వరికి గుర్తు లేదు అనుకునుడు, పిల్లి కండ్లు మూసుక పాలు తాగుకుంట ఎవ్వరు చూస్తలేరు అనుకున్నట్టు ఉంటది. అది మరిచి పొయ్యినా 1972 ల జై ఆంధ్ర ఉద్యమం చేసిన విషయం గూడ జనం మరిచి పోతరని అనుకునుడు వీరి మాయ మాటలు చెప్పే నైజాన్ని మాత్రమె బయట పెడుతది.
              
అవును, పొట్టి శ్రీరాములు వేర్పాటు వాదైతే నేనూ వేర్పాటు వాదినే. పొట్టి శ్రీరాములు తాలిబానైతే నేనూ తాలిబాన్నే. ప్రాంతీయ విచక్షణకు వ్యతిరేకంగ అధ్బుతమైన పోరాటం చేసి మీరే మాకు మార్గ దర్శకంగా ఉన్నరు. మీ అడుగు జాడలల్లనే మేం గూడ పోరాటం చేస్తం, ప్రత్యేకరాష్ట్రం సాధించుకుంటం.

జై తెలంగాణా.