మాట్లాడితె హైదరాబాదును మేం అభివృద్ధి చేసినం అంటరు కొందరు సమైక్య వాదులు. వాళ్ళు ఇక్కడికి వచ్చి అభివృద్ధి చెందడం తప్ప ఇక్కడ అభివృద్ధి చేసిందేం లేదు. ఇక్కడ జరిగిన అభివృద్ధి ఇక్కడి వాతావరణం, సహజ వనరుల కారణంగానే జరిగింది.
బెంగుళూరు తర్వాత ఉత్తమమైన సమశీతోష్ణ వాతావరణం ఉండే నగరం హైదరాబాదు. ఈ మధ్య పొల్యూషన్ వల్ల వేడి ఎక్కువైంది కానీ, ఎండాకాలం కూడా చెమట ఎరుగని ప్రదేశం హైదరాబాదు. అందుకనే ఆంధ్రా వాళ్ళైనా, వేరే వాళ్ళైనా ఇక్కడి కొచ్చి సెటిల్ కావాలెనని ఉవ్విల్లూరుతరు. సెటిల్ కావాలె నని ఉవ్విల్లూరితే ఫరవాలేదు. ఇక్కడి ఆస్తులను అక్రమంగా కబ్జా జేసుడు, ఇక్కడి ఉద్యోగాలు దొంగ సర్టిఫికెట్లు పెట్టి కొల్ల గొట్టుడు, బినామీ పేర్లు బెట్టి అర్బన్ సీలింగ్ యాక్టులకు విరుద్ధంగా వందల ఎకరాలు ఆక్రమించు కునుడు మొదలు బెట్టిన్రు.
వందల సంవత్సరాల నుండి హైదరాబాదుకు దేశ విదేశాల నుండి ఎంతో మంది వచ్చి హైదరాబాదుల సెటిల్ అయ్యిన్రు. ఇక్కడి వ్యాపారాలల్ల పాలు పంచుకున్నరు. వారు ఇరానీలు కావచ్చు, అఫ్గన్లు కావచ్చు, పార్సీలు కావచ్చు, పంజాబీలు, మరాఠీలు, మార్వాడీలు, రాజస్తానీలు, సింధీలు, బంగ్లాదేశీయులు, బీహారీలు, నేపాలీలు ఇలా ఒకరని ఏమిటి దేశం మొత్తం హైదరాబాదుల కనిపిస్తది. ప్రతి ఒక్కరు ఇక్కడి అభివృద్ధిల పాలు పంచుకుంటున్నరు, దానితో పాటు వాళ్ళు కూడ అభివృద్ధి చెందుతున్నరు. కాని ఎవ్వరు కూడ హైదరాబాదును మేమే అభివృద్ధి చేసినం అని చెప్పలే.
తమ అధికారం తోని, ఆశ్రిత పక్ష పాతం తోని ఇక్కడి భూములవల్ల, జాగలవల్ల, అక్రమంగా సంపాదించిన ఉద్యోగాల వల్ల ఎవరు అందరికన్న ఎక్కువ లాభపడ్డరో, వాళ్ళు ఇయ్యాల మేం హైదరాబాదుని డెవలప్ చేసిన మంటున్రు. అదే ఆంధ్రా వ్యాపార/రాజకీయ దోపిడీదార్ల నీతి!
ఇదెట్ల ఉందంటే, ఇల్లు లేక నీ ఇంటికి వచ్చినోడు, ఇల్లంత ఆక్రమించి, ఇంట్ల నిన్నొక మూలకు నెట్టి, నీకు కొంచెం రొట్టె ముక్క పడేసి, నిన్నే అభివృద్ధి చేస్తున్న అని చెప్పినట్టు ఉంది.
హైదరాబాదు అసలు ఎప్పుడు డెవలప్ అయ్యింది? నిజాం నవాబు నిజాం రాజ్యం మొత్తం పీల్చి పిప్పి చేసినా, ఆ డబ్బులు పెట్టి హైదరాబాదు మాత్రం బాగానే డెవెలప్ చేసిండు. ఆ రోజుల్లనే ఫీవర్ హాస్పిటల్, మెటర్నిటీ హాస్పిటల్, ఆర్తోపెడిక్ హాస్పిటల్, పిల్లల హాస్పిటల్ వంటి స్పెషాలిటీ దావఖానల తోడు, ఉస్మానియా జనరల్ హాస్పిటల్ కూడ కట్టిచ్చిండు. ఉస్మానియా యూనివర్సిటీని అత్యంత వైభవంగ కట్టించిండు.
ఆంధ్రల కరెంటు అంటె తెలువని రోజులల్ల, హైదరాబాదుల ప్రపంచం మొత్తం మీద ఆధునికమైన పవర్ ప్లాంటు ఉండేది, ఇప్పటి నెక్లెస్ రోడ్డు ప్రాంతంల. ఆంధ్రల ఉన్న ఏ నగరంల లేని విధంగ ఇక్కడ మంచినీటి సరఫరా, డ్రైనేజీ వ్యవస్థ ఉండేది.
స్వాతంత్ర్యం వచ్చే నాటికే హైదరాబాదు ఐదో పెద్ద నగరం. ఈ సమైక్య వాదుల పాలన పుణ్యమా అని ఇప్పుడు ఐదో స్థానాన్ని బెంగుళూరుకి సమర్పించుకో వలసి వస్తుంది. ఇదీ వీళ్ళు చేసిన డెవెలప్ మెంటు!
హైదరాబాదు తెలంగాణల అంతర్భాగం. ఇది తెలంగాణ నుండి వేరు చేసుడు ఎవ్వని తరంగాదు. తాహతు లేకున్నా ఒకప్పుడు మద్రాసు కొరకు పోరాడినోల్లు, అదే రకమైన అత్యాశతో ఇప్పుడు హైదరాబాదు పైన కన్నేసిండ్రు. అప్పడు ఏవిధంగ శృంగభంగం చెందిన్రో, ఇప్పుడు కూడా అలాంటి శ్రుంగభంగం తప్పదు వీరికి. అత్యాశ కొంపకు చేటుగదా మరి!