- గనుల్లో కొలువుదీరిన బెజవాడ దుర్గమ్మ
- తెలంగాణ సంస్కృతిపైనా ఆధిపత్యం
- దేవుళ్లపైనా వివక్ష ప్రదర్శిస్తున్న అధికారులు
తెలంగాణ కొంగు బంగారమైన సింగరేణిలో పాగా వేసిన ఆంధ్రా అధికారులు ఇక్కడి సంస్కృతిపైనా ఆధిపత్యం చెలాయిస్తున్నారు. కోల్‌బెల్ట్‌లోని గనులపై కొలువుదీరిన గ్రామదేవతల స్థానంలో బెజవాడ కనకదుర్గమ్మ గుళ్లను నిర్మించారు. దుర్గాదేవి ఉత్సవాలకు కార్మికుల జీతం నుంచి చందాలు వసూలు చేసి మేనేజ్‌మెంటు బలవంతంగా నిర్వహించటం మొదలైంది. సీమాంధ్ర అధికారులు ఇక్కడి వనరుల దోపిడీతోపాటు సంస్కృతిపైనా వివక్ష ప్రదర్శిస్తున్నారు. ఆచారాలు, మొక్కుబడులు వేరైనప్పటికీ, భగవంతుని రూపంలో ప్రకృతిని ఆరాధించడం... నలుగురూ ఒక చోట సంబరాలు చేసుకోవడం ఏ ప్రాంతంలోనైనా కనిపిస్తుంది. తెలంగాణలోని గ్రామ దేవతల సంస్కృతి ఆంధ్రా అధికారులకు రుచించలేదు. అలాగని బెజవాడ దుర్గమ్మను తెలంగాణ ప్రజలు కొలవరని విభేదించడం లేదు. నిత్యం అక్కడికి వెళ్లే భక్తులున్నారు. భవానీ మాల ధరించేవాళ్లు కూడా కోకొల్లలు. కానీ శతాబ్దాలుగా సాగుతున్న సంస్కృతిని ఆంధ్రా అధికారులు పాతెయ్యడం పైనే విమర్శలున్నాయి.
మైసమ్మకు మొక్కడం ఆనవాయితీ
తెలంగాణ జీవనంలో గ్రామ దేవతలకు అత్యంత ప్రాధాన్యత ఉంది. తెలంగాణ వ్యాప్తంగా ఘనంగా నిర్వహించే బోనాల పండుగ గ్రామదేవతలకు ఉన్న ప్రాధాన్యం ఏంటో చెబుతోంది. పోచమ్మ, మైసమ్మ, ఉప్పలమ్మ, ఎల్లమ్మ... ఇలా అనేక రూపాల్లో వెలసిన ఏడుగురు అక్కచెల్లెల్ల ప్రతిరూపమే తెలంగాణ గ్రామదేవతలు. కాకతీయుల కాలంలోనూ సప్తమాతృకలకు ప్రత్యేక పూజలు జరిగేవి. కాకతీయులు నిర్మించిన ప్రతి ఆలయంలోనూ సప్తమాతృకల విగ్రహాలను చూడవచ్చు. ప్రతి చెరువు వద్ద మైస మ్మ, ఇంటి ఆవరణలో ఉప్పలమ్మ...గుళ్లు తెలంగాణలో కనిపిస్తాయి. ఆ క్రమంలో గనులపైనా మైసమ్మ, ఉప్పలమ్మ, పోచమ్మ వంటి దేవతలను సింగరేణి కార్మికులు అనాదిగా పూజిస్తున్నారు. గనుల్లోకి వెళ్లే ముందు ప్రతి కార్మికుడు చల్లగా చూడు తల్లీ అని బావి మైసమ్మకు మొక్కడం ఆనవాయితీ. గనుల్లో కొత్త యంత్రాలు ప్రవేశపెట్టినా, ఆషాఢ, శ్రావణ మాసాలు, బోనాల పండుగ, ఏదైనా సంబురం చేసుకోవాలనుకుంటే కార్మికులు బావి మైసమ్మ వద్దే కోళ్లు, గొర్రెలు, మేకలను బలి ఇచ్చి విందు చేసుకుంటారు. గ్రామదేవతలను పూజించేందుకు వేదాలు చదవాల్సిన పని లేదు. కొన్ని సాధారణ కులాల వాళ్లే పూజారులుగా వ్యవహరిస్తారు.
ఆచారాన్ని గౌరవించిన బ్రిటీష్ దొరలు
ఈ సంస్కృతిని నాటి బ్రిటీష్ అధికారులు కూడా గౌరవించారు. వారే స్వయంగా బావి మైసమ్మకు పూజలు కూడా చేశారు. వందేళ్లకుపైగా సాగుతున్న ఈ సంస్కృతి ఆంధ్రప్రదేశ్ ఏర్పాటు తర్వాత క్రమంగా మసకబారింది. తెలంగాణ ప్రజల వేష, భాషలను సింగరేణిలోని సీమాంధ్ర అధికారులు అపహాస్యం చేయడం మొదలైంది. చివరకు సంస్కృతి, సంప్రదాయాలను చులకన చేశారు. ఫలితంగా బొగ్గు బావుల మీద బావి మైసమ్మ మాయమైంది. ఆ స్థానంలో బెజవాడ కనకదుర్గమ్మ కొలువు దీరింది. అప్పటి వరకు బావి మైసమ్మ వైపు తొంగి చూడని ఆంధ్రా అధికారులు కొత్తగా వెలిసిన దుర్గాదేవి ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించడం పూజారులు, హరికథ కాలక్షేపాలు, గీతాపారాయణాలు మొదలయ్యాయి. అంతకు ముందు ఉన్న చిన్న గుళ్లు కాస్తా దుర్గాదేవి ఆలయాలుగా మారాయి. బలవంతంగా కార్మికుల జీతాల నుంచి చందాలు వసూలు చేసి దుర్గాదేవి ఉత్సవాలను మేనేజ్‌మెంట్ ఏటా నిర్వహిస్తోంది. ఆంధ్రా వలసవాద ఆధిపత్యపాలనలో తెలంగాణ ప్రజలు సహజ సంపదలను, భూములను, బతుకు దెరువును కోల్పోయారు. సంస్కృతి, సంప్రదాయాలు, సల్లంగా చూసే దేవతలను కూడా కోల్పోయారు. కొన్ని నెలల కిందట హైదరాబాద్ సెక్రటేరియట్‌లోని నల్లపోచమ్మ ఆలయ బోర్డును తొలగించి జయదుర్గ దేవాలయంగా మార్చడంతో తెలంగాణవాదులు భగ్గుమన్నారు. రోజుల వ్యవధిలోనే గుడికి పాతపేరును మార్చారు. గని కార్మికుల నుంచి పెద్దగా వ్యతిరేకత రాకపోవడంతో సింగరేణిలో అంధ్రా అధికారుల ఆధిపత్యం కొనసాగుతోంది.
Curtesy: Namaste Telangana
No comments:
Post a Comment