తెలుగుదేశం పార్టీ ఓటములను ఒక అలవాటుగా మార్చుకున్నట్టు అనిపిస్తుంది. ఒక్కో ఓటమి చవి చూస్తున్నా ఆ పార్టీ నడవడికలో గుణాత్మకమైన మార్పు కనిపించడం లేదు. రోజూ ప్రెస్ మీట్లు, అడపా దడపా యాత్రలు చేస్తూ, వాటి వివరాలను తమ భజన మీడియా చేత ప్రచారం చేయించుకోవడం తప్ప ఆ పార్టీకి మరోటి చేత కావడం లేదు.
2004 ఎన్నికల్లో తనకు ఎదురే ఉండబోదని గాల్లో తేలుతున్న బాబును ప్రజలు దభిల్లుమని భూమార్గం పట్టించింది మొదలు ఆ పార్టీకి ఓటముల పరంపర మొదలైంది. 2009లో నైనా గెలుస్తాననుకున్న పార్టీకి చిరంజీవి రూపంలో దెబ్బ తగిలింది. అనుకోని దెబ్బలను కూడా ముందు ఊహించ గలిగిన వాడే నాయకుడిగా నిలబడ గలడు. బాబుకు అది చేతకాలేదు. అందుకే ఇప్పుడు జగన్ రూపంలో మరొదెబ్బ తగిలే సరికి పూర్తిగా కుదేలయ్యాడు.
ఇలాంటి పరిస్థితుల్లో చంద్రబాబు పనికిరాని మంత్రాంగాలతో, ఆ పార్టీ నాయకులు బాబు భజనతో పొద్దు పుచ్చితే సరిపోదు. ఒక కొత్త పంథాను ఎన్నుకోవలసిన అవసరం వుంది. తమ పంథా పై ప్రజలకు గురి కుదిర్చి, తాము తమ పంథాలో నిబద్ధతతో పోరాటం చేస్తున్నామన్న నమ్మకం కలిగించాలి.
మరి ఇందుకోసం ఏం చేయాలి?
బాబా రాందేవ్ తో గడ్డాలు కలిపి అవినీతి పోరాటాలు చేద్దామంటే జనం మొఖం మీదే నవ్వుతున్నారు, ఈ అవతారానికి అవినీతి పోరాటాలా అని! అయినా లక్ష కోట్లు దిగమిమింగిన జగన్ నే గెలిపించిన ప్రజలు, ఈయన చేసే అవినీతి ఉద్యమానికి ప్రభావితులు అవుతారంటే అది భ్రమే. ప్రజలకు అంతకన్నా తక్షణ అవసరాలు వున్నాయి.
ఇక పోతే ఆయన ప్రకటించిన అన్నీ ఫ్రీ, నగదు బదిలీ లాంటి పథకాలు కూడా బెడిసి కొట్టాయి. ప్రజలు నమ్మలేదు. సబ్సిడీలకు వ్యతిరేకంగా నన్నయ లెవల్లో పుస్తకాలు రచించిన వ్యక్తి ఇలాంటి పథకాలు అమలు చేస్తాడంటే ఎవరు నమ్ముతారు?
ఇక పోతే కేసీయార్ తో చేయి కలిపి తెలంగాణా తెస్తానన్నా ప్రజలు నమ్మలేదు, పైగా ఇతనితో కలిసినందుకు కేసీయార్ కే బుద్ధి చెప్పారు. ఒక వేళ తెలంగాణా వచ్చినా ఆ క్రెడిట్ కెసిఆర్ కే వెళ్తుంది తప్ప ఇతనికి కాదు కదా?
ఎవరో ఒకరు ఇదివరకే ప్రారంభించిన ఉద్యమాలనో, విధానాలనో బాబు కాపీ కొట్టడం వల్ల ప్రజలు ఇతన్ని పట్టించుకోవడంలేదు. ఉదాహరణకు అవినీతి ఉద్యమం మాటకొస్తే ప్రజలు నమ్మితే గిమ్మితే జయప్రకాష్ నారాయణను నమ్ముతారు తప్ప ఇతన్ని నమ్మరు. అలాగే తెలంగాణా విషయంలో KCRను, సబ్సిడీల విషయంలో జగన్ను నమ్ముతారు.
కాబట్టి చంద్రబాబు ఏదన్నా కొత్తగా ట్రై చేస్తే బాగుంటుందనిపిస్తుంది. ఇంకేమున్నాయి? అన్ని ఉద్యమాలూ తలా ఒకరు తన్నుకు పోయాక, అనుకుంటున్నారా? అదేం కాదు, ఇంకోటి మిగిలే వుంది. అది ఇంకా ఏ రాజకీయ పార్టీ బలంగా టచ్ చేయలేదు. అదే జై ఆంధ్రా ఉద్యమం.
అన్నీ ఊడ్చుకు పోయిన చంద్రబాబుకు ప్రజల్లోకి వెళ్ళడానికి ఇదొక్కటే తగిన ఆయుధం. ఈ ఉద్యమం చేస్తే ఆంధ్రా ప్రజలు చీకొడతారని అనుకోవడానికి వీల్లేదు. ఎందుకంటే, జగన్ గెలిస్తే రాష్ట్రం చీలుతుందని దేశం, కాంగ్రెస్ లు ఢంకా వాయించి ప్రచారం చేసినా, జగన్ దాన్ని ఖండించక పోయినా ఆంధ్రా ప్రజలు జగన్ కే వోటు వేశారు. దాన్నిబట్టే తెలియడం లేదూ, ఆంధ్రా ప్రజలు రాష్ట్ర విభజనకు వ్యతిరేకంగా లేరని?
రాత్రికి రాత్రి కుహనా సమైక్యవాద ఉద్యమం ఎగదోయ గలిగిన చంద్రబాబుకు జై ఆంధ్రా ఉద్యమం సెగదోయడం పెద్ద కష్టం కాదు. ఏ హైకోర్టు బెంచి సమస్యతోనో, విజయవాడలో NIMS కోసమో ఉద్యమం మొదలు పెట్టి, దాన్నిమెళ్లిగా ప్రత్యేకాంధ్ర వైపుకు లాక్కెళ్ళ గలిగిన కుయుక్తులు చంద్రబాబుకు వెన్నతో పెట్టిన విద్య. కావల్సిందల్లా కాసింత సంకల్పం, కూసింత ఔటాఫ్ బాక్స్ తరహా ఆలోచనా సరళి. ఈ దెబ్బతో తెలంగాణా విషయంలో గోడమీది పిల్లిలా వ్యవహరిస్తున్న YSR, కాంగ్రెస్ పార్టీలను కూడా బాబు సందిగ్ధంలో పడేయ గలడు.
ఈ విధానంతో విభజన సమస్య ఎలాగోలా అంతం కావాలని ఆశిస్తున్న అంధ్రా ప్రజలతో పాటు, తెలంగాణా ప్రాంతంలో తన కేడర్ తో తెలంగాణా అనుకూల ఉద్యమం నడపడం ద్వారా, తెలంగాణా వారిని కూడా ఆకట్టుకోగలడు. పైగా తన రెండు కళ్ళ సిద్ధాంతానికి ఇది సరైన నిర్వచనం అవుతుంది.
కొత్తదనం లేని పద్ధతులతో వెళ్తుంటే 2014లో కాదుగదా కనీసం 2019లో కూడా గెలిచే అవకాశాలు లేని చంద్రబాబుకు దీనికి మించి మరో అవకాశం లేదు. పార్టీని బతికించుకోవడమే ముఖ్యం అనుకుంటే ఆయన ఈ విషయంపై తన పార్టీలోని సమైక్యవాద పెత్తందార్లను ఒప్పించ గలగాలి. లేదంటే మునిగిపోయే నౌకలోంచి ఏదో ఒకరోజు ఆ పెత్తందార్లు ఎలాగూ పక్క పార్టీల్లోకి వలస వెళ్తారు. నౌకతో పాటు మునిగి పోయేది బాబు మాత్రమే.
Same to you
ReplyDeleteశ్రీకాంతచారి గారు చెప్పినదాంట్లొ తప్పు లేదు ఆయిన విశ్లేషణ అయిన చేసినారు కాదంటే మీపద్దతిలో సరిగా విశ్లేషించవచ్చు.చాలామందికి అఙ్ఞాతలుగా అసభ్య కామేంట్స్ చేయటము తగదు.
ReplyDeleteబాబు ఏమి చెప్పినా వినే పరిస్తితిలో ప్రజలు లేరు
ReplyDelete