Monday, April 30, 2012

పాలనలో మార్పు వస్తే సరిపోతుందా?


"రాష్ట్రం కొత్తగా ఏర్పాటు కావడం వల్ల ఒరిగే దేమీ లేదు. ఒక కొత్త ముఖ్యమంత్రి రావడం తప్ప. అప్పుడూ ఇలాగే అవినీతి వుంటుంది. అప్పుడూ ఇలాగే దోపిడీ వుంటుంది. కాబట్టి రాష్ట్రం ఏర్పాటు కోసం పోరాడడం కన్నా, అవినీతిని, దోపిడీని అంతం చేయడానికి పోరాడితే బాగుంటుంది."

ఒక వైపు తాము తెలంగాణా ఏర్పాటుకు అడ్డు కాదు అని చెబుతూనే, లోక్ సత్తా వంటి మధ్యేవాద పార్టీలు, సీపీయం వంటి సమైక్యవాద పార్టీలు ఇలాంటి విచిత్ర వాదనలు చేస్తుంటాయి.

పై మాటల్లో అవినీతి అనే పదం లోక్ సత్తాది, దోపిడీ అనే పదం మార్క్సిస్టు పార్టీది.

నిజంగా అవినీతి రాష్ట్రంలో అంతమైంది అనుకుందాం. మరి దాని ప్రభావం విధాన నిర్ణయాల్లో ఉంటుందా? ఒక ప్రాంతానికి అనుకూలంగా నిర్ణయాలు తీసుకునే పాలకులపై అవినీతి వ్యతిరేక చట్టం ఎలాంటి నిఘా ఉంచ గలుగుతుంది? ఒక ప్రాంతం యొక్క చరిత్రను, సంస్కృతిని నాశనం చేయాలనుకునే వారిని ఎలా నియంత్రించ గలుగుతుంది?

అవినీతి నిరోధక చట్టం ఒక ప్రాజెక్టు నిర్మాణంలో అవకతవకలను నియంత్రించ గలుగుతుందే తప్ప, అసలు ప్రాజెక్టు ఎక్కడ నిర్మించాలనే విషయం మీద ఎలాంటి ప్రభావం చూప గలుగుతుంది? పై ప్రశ్నలన్నింటికి ఒకటే జవాబు, 'లేదు' అని. 

మరి అలాంటప్పుడు అవినీతి పై పోరాటం అనవసరమా? లేదు, తప్పకుండా చేయవలసిన పోరాటమే. కాని అది దేశం మొత్తం కలిసి చేయవలసిన పోరాటం. అందులో తెలంగాణా కూడా తప్పక భాగస్వామ్యం కలిగి వుంటుంది. కాని ఆ పోరాటం వల్ల మాత్రమే తెలంగాణా సమస్యలు తీరవు. 

తెలంగాణా ప్రాంతానికి వున్న సమస్యలు అవినీతిపై పోరాటం కన్నా పెద్దవి. తెలంగాణా పోరాటం అంతటి అవినీతి వ్యతిరేక ఉద్యమం దేశమంతా వచ్చి వుంటే ఈ పాటికి అవినీతి అంతమై ఉండేది. కాని బలమైన ప్రజా ఉద్యమం నిరంతరం కొనసాగుతున్నా కూడా తెలంగాణా రావడంలో జాప్యం జరుగుతుంది. దాన్ని బట్టే అర్థం చేసుకోవచ్చు, తెలంగాణా వ్యతిరేక శక్తులు ఎంత బలంగా వున్నాయో! అవి అవినీతి వ్యతిరేక శక్తుల కంటే కూడా బలమైనవి!!

ఇక మార్క్సిస్టుల వాదన పరిశీలిద్దాం.

వీరి నిర్వచనం ప్రకారం ప్రజలు రెండు వర్గాలుగా వుంటాయి. ఒకటి దోచుకునే వర్గం. రెండు దోపిడీకి గురికాబడే వర్గం.  ఇది సర్వత్రా రుజువు కాబడిన సూత్రమే. అయితే ఏది దోపిడీ వర్గం అని నిర్వచించడమే వచ్చిన చిక్కు. కారల్ మార్క్సు ఆర్థిక శాస్త్రం రాసిన తర్వాత అనేక రకాల దోపిడీలు నిర్వచించ బడ్డాయి. వాటన్నిటినీ పరిగణన లోకి తీసుకో లేక పోవడం మార్క్సు తప్పు కాక పోవచ్చు. ఎందుకంటే ఆయన జీవితంలో అలాంటి దోపిడీ వైపరీత్యాలు చూసి ఉండలేక పోవచ్చు.

మనదేశంలో ఇప్పటికీ కులవివక్ష కొనసాగుతుంది. ఇది దోపిడీ కన్నా ఏమాత్రం తక్కువ విషయం కాదు. ఆర్ధిక, సాంఘిక సంబంధమైన హోదాతో సంబంధం లేకుండా తక్కువ కులాలవారు విచక్షణకు గురి కాబడుతున్నారు. ఈ విషయంలో మార్కిజం నిస్సహాయత బయట పడింది. కొండొకచో ఆయా మార్కిస్టు, మావోయిస్టు పార్టీలలోనే కులగజ్జి ప్రకంపనలు వెలుగు చూశాయి. గద్దర్ లాంటి వారు బహిరంగంగానే విమర్శలు చేసి బయటకు వచ్చారు.

అలాగే లింగ వివక్ష. దోపిడీ వర్గం, దోచుకోబడే వర్గం, ఉన్నత కులం, నిమ్న కులం వీటిలో దేనితో సంబంధం లేకుండా స్త్రీ అన్ని వర్గాల్లోనూ విచక్షణకూ, దోపిడీకీ గురికాబడుతుంది. ఈ సమస్యలకు మార్క్సిజంలో స్పష్టమైన సమాధానాలు దొరకలేదు కాబట్టే, ఆయా రకాలైన పోరాటాలు వేటికవే ప్రత్యేకంగా జరుగుతున్నాయి.   

అలాంటిదే ప్రాంతీయ దోపిడీ. ఇక్కడ జరుగుతున్నది ఒక ప్రాంతంపై ఏక మొత్తంగా వేరొక ప్రాంతం జరుపుతున్న దోపిడీ. అవి జల వనరులు కానీయండి, పుస్తకాలలో పాఠాలు కానీయండి, నిధులలో, ఉద్యోగాలలో వివక్ష కానీయండి. గత ఐదు దశాబ్దాలుగా జరిగిన వివక్ష ఇప్పటికే బట్టబయలైంది. ఒక వేళ కమ్యూనిజమే అధికారంలోకి వచ్చినా ఈ వివక్ష అంతమౌతుందన్న భారోసా ఎంతమాత్రం లేదు. (అసలు వివక్షనే గుర్తించలేని పార్టీలు, దాన్ని అంతం చేస్తాయంటే ఎలా నమ్మగలం?) 

ఈ రకమైన ప్రాంతీయ దోపిడీకి వ్యక్తులుగా ఎవరూ బాధ్యులు కాక పోవచ్చు. కాని దోపిడీకి గురి కాబడుతున్న ప్రాంతానికి తమ అస్తిత్వాన్ని, తమ జాతి సంస్కృతిని, చరిత్రను, నుడికారాన్ని కాపాడుకునే బాధ్యత, తమ తర్వాతి తరాలు అంతరించి పోకుండా కాపాడుకోవలసిన కర్తవ్యం వున్నాయి. అది ఈ ప్రాంతాన్ని ప్రత్యేక రాజ్య విభాగంగా గుర్తింప జేసుకోవడం వల్లనే అది సాధ్యం.

ప్రత్యేక రాష్ట్రం ఏర్పడడం వల్ల వెంటనే అవినీతి తొలగిపోదు. మిగతా వివక్షలు సమసి పోవు. వాటికోసం దేశంలోని ప్రజలందరితో కలిసి ఉద్యమాలు చేయవలసిందే. కాని, రాష్ట్రం ఏర్పడడం వల్ల మాత్రమే ప్రాంతీయ దోపిడీ సమసి పోతుంది. 

ప్రత్యేక రాష్ట్రం ఏర్పడితే ఈ గడ్డ పై ఏ చరిత్ర బోధించాలనే విషయం పొరుగువాడి నిర్ణయంపై ఆధార పడి వుండదు. ఈ గడ్డఫై పుట్టిన మహనీయుల విగ్రహాలు నెలకొల్పుకోవడానికి పొరుగువాడిని దేబిరించాల్సిన అగత్యం వుండదు. ఈ గడ్డపై తమకు హక్కుగా రావాల్సిన నియామకాల కోసం తరతరాలుగా నిరంతర విఫల పోరాటాలు చేయవలసిన అగత్యం వుండదు. అలాగే ఈ గడ్డపై జాలువారుతున్న జలాలను ఇక్కడ ఉపయోగించుకోవడం కోసం ఇంకొకడిని ప్రాధేయ పడుతూ విఫల యత్నాలు చేయవలసిన అవసరం అంతకంటే ఉండదు. అందుకే ఈ పోరాటం అత్యవసరం.

Saturday, April 14, 2012

ఆంధ్రా దోపిడీ శక్తులను ఎదిరించాల్సిన అవసరం ఏమిటి?


తెలంగాణా వారి నీళ్ళు, నిధులు, ఉద్యోగాలు దోపిడీకి గురికావడం అనేది ప్రత్యక్షంగా కనపడుతున్న, సమైక్య వాదులు కూడా కాదనలేని సత్యం. ఇలాంటి వాటిని రుజువులతో సహా చూపినప్పుడు, వీరు సమాధానం చెప్పలేక దాట వేసే ధోరణి లోకి దిగుతుంటారు.

"ఆ! ఏముంది లెండి! దోపిడీ ఎక్కడ లేదు? కాంగ్రేసు వారు మన ఒక్క రాష్ట్రమే నేమిటి? దేశం మొత్తమూ దోచుకుంటున్నారు. ఆ దోపిడీలో భాగమే ఈ దోపిడీ. దీంట్లో ప్రత్యేకంగా ఆంధ్రా వారు తెలంగాణా వారిని దోచుకుంటున్న దేమీ లేదు." అనేది వీరి వాదన.

అవును, దేశంలో రక రకాల దోపిడీలు, వివక్షలు కొనసాగు తున్నాయి. వీటిలో బాధిత వర్గాలు, బాధించే వర్గాలూ వున్నాయి. బాధిత వర్గాలు బాధించే వర్గాల పై ఎప్పుడూ పోరాటం చేస్తూనే వున్నాయి. పోరాటం వారి వారి బాధల నుండి విముక్తి కోసమే కాని, ఎదుటివారిని బాధించాలనే ఉద్దేశం ఎంతమాత్రం కాదు.

అలాగే బాధితులు తమ బాధల గురించి ఆలోచిస్తారు కాని, ఇంకో వర్గం వారు కూడా బాధ పడుతున్నారు కదా అని సంతృప్తి పడిపోయి సంతోషించరు. అవసరమైతే దమన కాండకు గురౌతున్న ప్రతి ఒక్కరినీ కలుపుకు పోవడానికి ప్రయత్నం చేస్తారు.

తెలంగాణా ప్రాంతం లోనే వున్న కొంతమంది భూస్వాములు, పెట్టుబడి దారులు ఆంధ్రా పెట్టుబడి దారుల మాదిరిగానే అవినీతి, ఆశ్రిత పక్ష పాతం, దోపిడీ మొదలైనవి చేస్తూ ఉండొచ్చు. అంతమాత్రాన ఆంధ్రా ప్రాంతం వలన తెలంగాణా ప్రాంతానికి జరిగిన దోపిడీ ఒప్పై పోదు.

రకరకాల దోపిడీలపై రకరకాల ఉద్యమాలు నడుస్తున్నాయి. దోపిడీ శక్తుల పై పైచేయి సాధించి తద్వారా వారి నుండి విముక్తి పొందడానికి ప్రయత్నం చేస్తున్నాయి.

దోపిడీ శక్తులు ఎప్పుడూ మైనారిటీ గానే వుంటాయి. కాని అవి ప్రజలకు చేసే హాని మాత్రం అధికంగా, ప్రానాన్తకంగా వుంటుంది. ఉదాహరణకు దేశంలో అవినీతికి రారాజులుగా మారి కోట్లకు కోట్లు భోంచేసే వారు, ఆ అవినీతి వల్ల బాధకు గురయ్యే ప్రజలతో పోల్చినప్పుడు చాలా తక్కువ మందే. అలాగే తెలంగాణాపై సాగుతున్న ఆంధ్రా ప్రాంతీయ దోపిడీకి కూడా కారకులు కొంతమంది మాత్రమే. అయినా కూడా ఆ అవినీతి సామ్రాట్టుల పై ఉద్యమాలు చేసి పై చేయి సాధించ డానికి ప్రజలకు శక్తి సరిపోవడం లేదు. కాని అంతిమ విజయం మాత్రం ఎప్పుడైనా ప్రజలదే.

అలాగే కొంత కాలం తర్వాత అవినీతి వ్యతిరేక ఉద్యమాలు పై చేయి సాధించి కఠినమైన చట్టాలను అమలులోకి తెచ్చినా, దాని వల్ల అన్ని సమస్యలు తీరుతాయనుకోవడం పొరబాటు. దళిత విముక్తి ఉద్యమాలు, బహుజన సాధికారతా ఉద్యమాలు, మహిళా ఉద్యమాలు దేనికవిగా కొనసాగ వలసిందే. అలాగే ప్రాంతీయ ఉద్యమాలు కూడా. ప్రతీ ఉద్యమానికి స్పష్టమైన లక్ష్యాలున్నాయి.

ఒక ఉద్యమంలో మంచి ఫలితాలు వస్తే, అది మరో ఉద్యమానికి ప్రేరణ ఇవ్వవచ్చు తప్ప, మిగతా ఉద్యమాల లక్ష్యాలేవీ వాటంత అవే పరిష్కారమై పోవు. అంతే కాదు, ఒక విధమైన దోపిడీ శక్తులు అంతరించిన సందర్భంలో, మరో రకమైన దోపిడీ శక్తులు ఉద్భవించ వచ్చు కూడా.

అంటే, తెలంగాణా ఉద్యమం సఫలమై, తెలంగాణా రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత ఆంధ్రా దోపిడీ శక్తులు ఈ ప్రాంతంలో బలహీన పడి, తెలంగాణా భూస్వామ్య, పెట్టుబడిదారీ శక్తులు విజృంభించ వచ్చు. ఆ విషయం పై ప్రజలు ఎప్పుడైనా అప్రమత్తంగా ఉండ వలసిందే.

అంతమాత్రం చేత ఇప్పడు నడుస్తున్న ఆంధ్రా దోపిడీ శక్తులను ఎదిరించాల్సిన అవసరం ఏమిటి? అనే సందేహం రావచ్చు. దీనికి సమాధానం చెప్పడానికి సమస్యను మరింత లోతుగా పరిశీలించాల్సిన అవసరం వుంది.

దోపిడీ వివిధ రూపాలలో దేశమంతా వుందనే విషయం జగమెరిగిన సత్యం. వాటికి వ్యతిరేకంగా ఉద్యమాలు కూడా జరుగుతూనే వున్నాయి. కాని ఆ ఉద్యమాలలో దేని అంతిమ లక్ష్యం కూడా తెలంగాణా ప్రాంతం పై జరుగుతున్న దోపిడీ, విచక్షణలు కావు. ఆయా ఉద్యమాల సాఫల్యత పై తెలంగాణా సమస్యలు తీరే అవకాశం లేదు.

ఇంతకూ ముందే అనుకున్నట్టు, ఈ రకమైన ప్రాంతీయ దోపిడీకి కారకులు కొంతమందే. కాని దాని దుష్పరిణామాలు అనుభవించ వలసి వస్తున్నది మాత్రం తెలంగాణా ప్రజలే. అలాగే ప్రత్యక్షంగానో పరోక్షంగానో లాభ పడుతున్నది మాత్రం ఆంధ్రా ప్రజలే. అందువల్ల సహజంగా ఆంధ్రా ప్రాంతపు ప్రజలు తమ ప్రాంత పక్షపాతిగా వ్యవస్తీకృతమైన రాష్ట్ర అధికార ప్రక్షాళనకు ముందుకు రారు, పైగా నిర్లిప్తత వహిస్తారు. మెజారిటీ ప్రజలు వారు కాబట్టి పదే పదే అదే రకమైన పక్షపాత పూరితమైన పాలన నెలకొల్ప డానికి కారకులవుతారు. ఇక తెలంగాణా ప్రజలకు మిగిలింది ప్రత్యేక రాష్ట్రం కోసం పోరాడడం తప్ప మరో మార్గం లేదు.

అలాంటప్పుడు, తెలంగాణాను దోపిడీ విముక్తం చేయడానికి ఎవరు ఉద్యమించాలి? ఖచ్చితంగా తెలంగాణా ప్రజలే. వారు ఇప్పుడు చేసేది కూడా అదే! తమ ప్రాంతం యొక్క అణచివేత పోరాటంలో విజయం సాధించిన తర్వాత, తప్పకుండా తెలంగాణా ప్రజలు దేశంలో కొనసాగుతున్న మిగతా ఉద్యమాలలో భాగస్వాములు కావడమే కాదు, వాటికి ప్రేరణ కల్పిస్తారు కూడా.
  

Friday, April 13, 2012

సూట్ కేసు


ట్రైను వైజాగులో ఆగింది. సూట్ కేసు బ్యాగూ తీసుకొని రొప్పుతూ లోనికి వచ్చాడు సుబ్బారావు. జేబులోంచి టికెటు తీసి బెర్తు నంబరు చూసుకున్నాడు. అప్పరు బెర్తు.

కింద బెర్తు మీద అంతకు ముందే అక్కడ ఇంకొకాయన కూచున్నాడు. పక్కన ఒక సూట్ కేసు పెట్టుకున్నాడు. దాని పక్కన ఇంకో మనిషి కూచునేంత జాగా వుంది. పై బెర్తు మూసి ఉండడంతో, ఇంకా రాత్రి కాక పోవడం కింద వున్న బెర్తు మీద కూర్చున్నాడు. మెల్లగా పక్క నున్నతనితో మాటలు కలిపాడు సుబ్బారావు.

"పేరేంటి అండీ?"

"యాదగిరి"

"మీది పై బెర్తా?"

"కాదు, కింది బెర్తు"

సుబ్బారావు బయట కొనుక్కొచ్చిన కూల్ డ్రింకు బాటిలు, చిప్సు ప్యాకెట్, నీటుగా సూట్కేసు మీద అమర్చాడు. "యాదగిరి గారూ, తీస్కోండి" అంటూ కొన్ని చిప్సూ, కొంత కూల్ డ్రింకు యాదగిరి కి ఇచ్చాడు. ఇలా కొంతసేపు లోకాభి రామాయణం నడిచింది. ఇంతలో చీకటి పడింది.

"అన్నా, కొంచెం పైకి వెళ్తవా? నాకు పండుకొనే టైమైంది".

"పైకెళ్ళడ వేంటి. నేను ఐదున్నర గంటల నుండీ నేను ఈ సీటుపై ఉంటేనూ? ఇప్పుడు పైకెళ్ళ మానడం న్యాయమా?"

"గదేంది వయ్యా గట్లంటవూ? గీ సీటు నాది. నేను రిజర్వు చేసుకున్నది. నీ సీటు పైది. కూసుంట నంటే కూసోనిచ్చి నందుకు నాదే అనబడితివి?"

"ఊరికే కూచున్నానా? నా చిప్సు, కూల్ డ్రింకు నీ సూట్ కేసు మీదనే కదా పెట్టాను? ఇద్దరం కలిసే కదా ఆరగించాం? వాటి పెట్టుబడి నేనే కదా పెట్టాను. ఇప్పుడు వెళ్ళమంటే ఎక్కడికి వెళ్తాను?".

"ఏందన్నా, గట్ల మాట్లాడ వడితివీ? కూసొంగనే సీటు నీదైతాదే? మర్యాదగ లేచిపో. లేక పొతే బలవంతంగా లేపవలసి వస్తది."

"ఏంటీ? బలవంతంగా లేపుతారా? నా ఆత్మా గౌరవం(?) దెబ్బతింది. నువ్వు క్షమాపణ చెప్పి తీరాలి. లేకపోతే నేను చచ్చినా లేవను."

"ఏందన్నా! కాలికి వేస్తే మెడకు వెయ్య బడితివి? నువ్వు అంత నొచ్చుకుంటే నేనే తప్పైందని ఒప్పుకుంట తియ్యరాదే! కొంచెంలే అన్నా, నీకు పుణ్యముంటది. అసలే నాకు నిద్రొస్తుంది."

"అయినా సరే, నేను లేవను. లేవనంటే లేవను. క్షమాపణ చెప్పగానే సరిపోలేదు.. నా చిప్సు పాకెటు, కూల్ డ్రింకు వచ్చినప్పుడు నీ సూట్ కేసు మీద పెట్టాను. వెళ్తే గిల్తే ఆ సూట్ కేసు తీసుకుని మరీ వెళ్తాను. అంతే తప్ప ఊరికే పోయే ప్రసక్తే లేదు. నువ్వు సూట్ కేసు వదులుకో, నాకు వెళ్ళడానికి అభ్యంతరం లేదు."

"^&*^$#*%*^*$!!!"
    

Wednesday, April 11, 2012

ఎవరు, దొంగేడుపు లేడుస్తున్నదీ?

పేరు భుజంగంలా వినిపించడమే కాదు, తెలంగాణా మాట వినబడితే చాలు, బుసలు కొట్టే పెద్దమనిషి ఒకాయన, (అంతకన్నా ఏం చేయగలడు లెండి?) ఈయన ఉండేది పరాయి దేశంలో, ఈయనకు ఇంకో ఆంద్రదేశం కావాలట! అయితే సమైక్యవాదం కాకపోతే ఆంద్రదేశం. ఏదో సామెత గుర్తుకు రావడం లేదూ?

అయినా మనకెందుకు లెండి, ఎవరి రాతలు వాళ్ళిష్టం! కాకపోతే ఈయన ఏవో పేపరు కటింగులు తెచ్చి తింగర వాదనలు చేస్తూ వుంటే మాత్రం సమాధానం చెప్పక తప్పదనిపించింది. ముందుగా ఈయన తెచ్చి పెట్టిన పేపర్ కటింగు చూద్దాం. ఇది పేపర్ కటింగే నండోయ్! ఈనాడు వారిది! సదరు పెద్దమనిషి సొంత సమాచారం ఎంతమాత్రం కాదు, ఇంగ్లీషోడి కాపీరైటు చట్టం అడ్డం రావడానికి!

  
ఇక ఈయన అవాకులు చూద్దాం.

గుంటూరులో దేబ్బయ్యారు శాతం మాత్రమె సొంతిల్లు కలవారు ఉన్నారు కాబట్టి, అదే మహబూబునగర్లో తొంభయ్యొక్క శాతం మంది వున్నారు కాబట్టీ, మహబూబునగర్ గుంటూరు కన్నా అభివృద్ధి చెందింది అని ఈయన గారి అభిప్రాయం.

ఈయనగారి లెక్కనే తీసుకుంటే మరి రంగారెడ్డి జిల్లాలో అరవై శాతం మందికి మాత్రమే సొంతిల్లున్నాయి. అంటే సగం హైదరాబాదు విస్తరించి వున్న రంగారెడ్డి కన్నా కూడా మహబూబునగర్ అభివృద్ధి చెందిందన్న మాట! భేష్! తమరి మేధావి తనానికి జోహారులు. 

ఇక హైదరాబాదు నగరం లో చూద్దును కదా, యాభై శాతం మందికి కూడా సొంతిల్లు లేవట! సదరు పెద్దమనిషి లెక్క ప్రకారం హైదరాబాదు మహబూబునగర్ కన్నా వెనుక బడింది! మరి ఇన్నాళ్ళూ మేం డెవలప్ చేశాం, మేం డెవలప్ చేశాం అనేదంతా ఉత్తుత్తిదేనా? భేష్! నా మహబూబు నగరం ఎంత గొప్పది! జంట నగారాలకన్నా, విశాఖ కన్నా, పశిమ, తూర్పు గోదార్ల కన్నా, గుంటూరు కృష్ణాల కన్నా గొప్ప జిల్లా అన్న మాట మా జిల్లా! ఎంత గొప్ప సత్యం తెలిసిందో కదా ఇన్నాళ్ళకు!

ఇక మన మేధావి గారు తన పూరింటి సిద్ధాంతాన్ని వివరించిన విధంబెట్టిదనిన: మహబూబు నగర్లో ఇరవై ఐదు శాతం పూరిల్లు వున్నాయి. గుంటూరులో ఇరవై శాతమే వున్నాయి. కాని జనాభా ఎక్కువ వుండడం వలన మహబూబు నగర్లో కన్నా గుంటూరులో పూరిల్లలో ఉండేవారు ఎక్కువ. కాబట్టి మహబూబు నగరు అభివృద్ధి చెందిన జిల్లా! 

ఇలాంటి సిద్ధాంతాలు క్రోడీకరించగల అభినివేశం మన సారు సొంతం. ఇళ్ళ విషయం లో పనికొచ్చిన శాతాలు పూరిల్ల విషయంలో పనికి రాలేదు మన మేధావికి! ఇక్కడ నెంబర్లు పనికి వచ్చాయి.పై పట్టిక చూడండి. కడప కన్నా ఎక్కువ పూరిల్ల శాతం (అవును, నేను శాతాలే చెపుతున్నాను) వున్నాయి కాబట్టి కరువుతో అల్లాడే అనంతపురం,  కడప జిల్లాల కన్నా గుంటూరు బీద జిల్లా అయిపోయింది మరి! ఎంతటి విధి వైపరీత్యము!

ఇక మన ప్రత్యేకదేశవాది (పైకి మాత్రమే, లోలోన కరడు గట్టిన సమైక్యవాది) తమ దృష్టి మరుగుదొడ్ల మీదికి ప్రసరించారు. సరే, ఆయనిచ్చిన పట్టికనే చూద్దును కదా, గుండె ఆగినంత పనైంది. 

హతవిధీ, గుంటూరులో ముప్పై తొమ్మిది శాతం మందికి మరుగుదొడ్లు లేవా? అయ్యో అనుకుంటూ తల కాస్త పైకి తిప్పి మహబూబు నగర్ వైపు చూద్దును కదా, మూర్చ వచ్చినంత పనైంది. ఎందుకో తెలుసా? మహబూబు నగర్ జిల్లాలో దేబ్బయ్యోక్క శాతం మందికి మరుగుదొడ్లు లేవు? మరి ఈ పెద్దాయనేంటీ, తలా తోకా లేని లెక్కలు చెపుతాడు? తాను శ్రమపడి తెచ్చుకున్న పేపర్ కటింగు కూడా చదవలేదా పాపం!

ఇక పోతే బైకు, టీవీ, కంప్యూటరు అంటూ ఏకరువు పెట్టాడు. శాతాలు సహకరించలేదేమో గురూ గారికి! తలకాయల్లెక్క మొదలు పెట్టాడు. ఎవరు, దొంగేడుపు లేడుస్తున్నదీ? 

Monday, April 9, 2012

నీ మంచికే కలిసున్న!



"అన్నా ఇంక కలిసుండుడు కుదరదు గని విడిపోదామే. మనం కొట్టుకునుడు, ఇంట్ల పెళ్ళాలు కొట్టుకునుడు, పిల్లలు కొట్టుకునుడు బాగ లేదే"

"అట్లనా తమ్మీ. విడిపోనీకి నాకు ఏం బాధ లేదు తమ్మీ. నా బాధంతా నీగురించే. విడిపోతే నువ్వు, నీ కుటుంబం ఎట్ల బతుకుతారా అని ఆలోచిస్తున్న"

"గట్లంటవేందన్న, నాకేమయిందని?"

"నీ పెళ్లానికా ఏం వండాల్నో తెలువదు. నా పెళ్ళాం ఉయ్యాల్ల గూచొని ఏం వొండాల్నో చెప్తేనే గది వండుతది. రేపు విడి పోతే గామాట ఎవరు జెప్తరు తమ్మీ?"

 "అట్లనా? సల్లని మాట జెప్పినవన్న! మా వదిన చెప్తే గాని నా భార్యకు వండుడు తెల్వదన్న మాట! ఏదో తోచింది వండుకుని తినటం లేరాదే"

"గట్లంటే ఎట్ల తమ్మీ? నీ భార్య సంగతటుంచు, నీ పనే చూడరాదు! నేను పేకాట క్లబ్బు నుంచి, మందు నిషా తగ్గినప్పుడు సెల్ ఫోను చేసుకుంట అరుసుకుంటే గాని పొలానికి ఏ కలుపు తీయాలే, ఏ మందు కొట్టాలె నీకు తెలవదు. గట్లాంటిది నాతోని విడిపోతే గయ్యన్ని ఎవరు అరుసుకుంటరు? నీకొచ్చే కష్టాలు తలుసు కుంటేనే భయమైతుంది తమ్ముడూ"

"ఆహా! కూరగాయలు అమ్మిన బాపతు డబ్బులు పంపమని చెప్పుడు తప్ప ఇంకో ఫోను కాలు నీతాడి నుండి వచ్చినట్టు యాదికి లేదే! అయినా గా ఫోన్ల సంగతి నాకెందుకులే గని ఏదో చేసుకుంట లే అన్న, నాకు తోచినంత పని; నాగురించి దిగులు పడొద్దు"

"అట్లగాదురా. నేనెంత కమీనా గాన్నో నీకు తెలియంది గాదు. తిమ్మిని బమ్మి చేసేటోన్ని నేను. రేపు మనం వేరు బడ్డంక నీ పొలానికి నీళ్ళు దొరుక కుండ కాలువ తిప్పుకో గలను. నువ్వు కొన్న ఎరువులు రాత్రికి రాత్రి నేను చల్లుకో గలను. నువ్వు కొన్న పురుగుల మందులు నేను వాడుకొని ఆ డబ్బలల్ల నీళ్ళు కలిపి పెట్ట గలను. అంతెందుకు? నువ్వు పండించిన ధాన్యం కూడా నేనే షావుకారికి అమ్ముకొని,  ఆ డబ్బులతో జల్సా చేసుకోగలను. ఇంకా చేప్పాల్నంటే ... "

"!*^(%&*$*&#%!"

Sunday, April 1, 2012

ప్రజలు తెలంగాణా వాదాన్నే గెలిపిస్తరు


ఊరందరిది ఓదారి అయితే ఐలయ్యది ఇంకో దారి.

మొన్నటి ఎన్నికలు చూసి కరడు గట్టిన సమైక్యవాది కూడా నోరు మెదుపుడు బందు జేసిండు. ఇంక తెలంగాణా మీద ఆశ వదులుకొని హైదరాబాదు రాగం తీసుడు మొదలు బెట్టిండు.

ఐతే ఐలయ్యకు మాత్రం దీంట్లె తెలంగాణా వాదం కనపడ లేదట! కులం, మతం మాత్రమే కనపడ్డయట!

అందరి కుందేళ్ళకు నాలుక్కాల్లయితే, ఐలయ్య కుందేలుకు మూడే కాళ్లట!

అవును మరి! TRS మహబూబ్ నగర్ల ముస్లిముకు టికెట్ ఇస్తే గాయనకు దాంట్లె హిందూయిజం కనపడ్డదట! ఇబ్రహీమును కావాలనే TRS వాళ్ళు ఓడించిన్రట! కుట్రలు చేసి రెండువేల కంటే తక్కువ మేజారిటీ తోటి వోడించుడు ఎట్లా సాధ్యమైతదో ఐలయ్యే చెప్పాలే. 

స్థానిక JAC వాళ్ళు BJP కి వేస్తే వేసి ఉండొచ్చు. BJP అభ్యర్థి గెలిచే ఉండొచ్చు. కాని TRS పార్టీ BJP అభ్యర్థిని గెలిపించాలని చూసిందని చెప్పుడు ఎంత అన్యాయం? మరి ఏ శక్తులు ఐలయ్యని ఈ విధంగా మాట్లాడేటట్టు చేస్తున్నయి? తెలంగాణా ప్రజలు ఇటువంటి వ్యక్తుల పట్ల అప్రమత్తంగా మెలగ వలసిన అవసరం వుంది.

ఒక వేళ 2009 ఎన్నికల్ల బరిలో నిలిచి తక్కువ మార్జిన్ల ఓడిపోయి పార్టీకి సేవ చేస్తున్న ఇబ్రహీంకు కాక ఇంకో హిందువుకు KCR టికట్ ఇచ్చి వుంటే, KCR ముస్లిం ద్వేషి అని ఈ ఐలయ్యే గొంతు చించుకునే వాడు కాదా? దానికి ఆంధ్రా మీడియా, ఆంధ్రా పార్టీలు వంత పాడే వాళ్ళు కాదా?

TRS ఒక ఫక్తు రాజకీయ పార్టీ. అది తన బలం పెంచుకోవాలని మాత్రమె చూస్తది. అట్లనే BJP కూడా. అదీ తెలంగాణా వాదం అడ్డం పెట్టుకొని తన బలం పెంచుకోవాలనే చూస్తది. తెలంగాణా ప్రజలు కూడా అంతే. తెలంగాణా వాదాన్ని బలపరచే పార్టీలనే గెలిపిస్తరు. ఇది అందరు అర్థం చేసుకుంటే మంచిది.