Saturday, January 21, 2012

చంద్రబాబు వరంగల్లు యాత్ర సఫలమైందా?

ఉధృతంగా జరిగిన సకల జనుల సమ్మెను ప్రభుత్వం మొండితనంతో అణచి వేయడంతో తెలంగాణా ఉద్యమం కొంత వెనక్కు తగ్గినట్టుగా అనిపించ సాగింది. ఏ ఉద్యమమైనా నిరంతరాయంగా ఒకే రకమైన ఊపుతో కొనసాగ జాలదు. ఉధృతి పెరగనైనా పెరుగుతుంది, లేదా నెమ్మదిస్తుంది. ప్రభుత్వాలు మొండి వైఖరి వహించిన నేపథ్యంలో అలా నెమ్మదించక పోతే ఆ ఉద్యమం కాస్తా యుద్ధంగా మారే ప్రమాదం వుంది. కాని ప్రస్థుత తెలంగాణా ఉద్యమానికి అంతటి అవసరం లేదు. ఎందుకంటే ప్రజాస్వామ్య మార్గాలు ఇంకా పూర్తిగా మూసుకొని పోలేదు. 2014 ఎన్నికల్లో సమైక్యవాద పార్టీలకు గుణపాఠం చెప్పడానికి తెలంగాణా ప్రజలు సంసిద్ధంగా వున్నారు. ఆ ఎన్నికల్లో సరయిన ఫలితాలు గనుక ఆశిస్తే పాలక పార్టీ ఈలోపే నిర్ణయం తీసుకునే అవకాశం కూడా వుంది.

ఈ పరిస్థితులను సరిగా అంచనా వేయలేని తెలుగుదేశం పార్టీ ఇక తెలంగాణా వాదం ముగిసి పోయినట్టేనని చంకలు గుద్దుకుంది. సహజంగా సమైక్యవాదాన్ని సమర్థించే ఈ పార్టీ తెలంగాణాలో తన బలం పెంచుకోవ డానికి ఇదే తగిన సందర్భమని భావించింది. తద్వారా ఇక్కడ తెలంగాణావాదం లేదని నిరూపించి తెలంగాణా ప్రక్రియను నిర్వీర్యం చేయడమే తెలుగుదేశం పార్టీ అసలు లక్ష్యం. 

డిసెంబరు 9 ప్రకటన తర్వాత సమైక్యవాదాన్ని చంద్రబాబు నాయుడు తలకెత్తుకోని ఇతర పార్టీల లోని సమైక్యవాద శక్తులకు నాయకత్వం వహించి NTR ట్రస్టుభవన్ కేంద్రంగా డబ్బు సంచుల కృత్రిమ ఉద్యమాలు నడిపించడం ఇదివరకే చూసి వున్నాం. చంద్రబాబు తన కుటిల నీతిని ప్రదర్శించి సమైక్యవాద శక్తులను ఏకీకృతం చేసి మరోసారి తెలంగాణా వాదాన్ని చావుదెబ్బ తీయాలనే అత్యాశతో వ్యవహరించిన తీరుకు వరంగల్లు యాత్ర అద్దం పడుతుంది. అలా సమైక్యవాద శక్తులను తనకు మాత్రమే చేతనైన లోపాయికారీ రాజకీయాలతో ఏకీకృతం చేయడంలో ఆయన సఫలీకృతం అయ్యాడు కూడా.

ఆయన వరంగల్లు పర్యటనకు కిరణ్ కుమార్ రెడ్డి కల్పించిన భద్రతా ఏర్పాట్లు, తెరవెనుక జరిగిన గూడుపుఠానీకి ప్రత్యక్ష సాక్ష్యంగా నిలుస్తాయి. అయిదు వేలమంది పోలీసులు, మరో వేయి మంది సుశిక్షితులైన గ్రేహౌండ్స్, ప్రత్యేక రక్షణ దళాలు, ఇన్సాస్, ఏకే 47 లాంటి ఆధునిక తుపాకులు, మెషిన్ గన్నులు, బాష్పవాయు కానన్లతో సమకూర్చిన బందోబస్తు ఇంతవరకు ఇక్కడ జరిగిన ఏ ప్రధానమంత్రి సభలకు కూడా ఏర్పాటు జరిగి ఉండలేదు. వీటికి తోడు ఆరేడు వేల వాహనాలతో  దుడ్డుకర్రలతో సహా వచ్చిన గూండాలను చూసినప్పుడు అది ఒక రాజకీయపార్టీ నేత పర్యటన మాదిరిగా అనిపించలేదు. ఏ ఈదీ ఆమీనో, రాబర్ట్ ముగాబేనో పర్యటనకు వెళ్లినట్టు అనిపించింది. 

ఈ విధంగా ఐదువేల జనాభా కూడా లేని పాలకుర్తికి యాభైవేల మందీ మార్బలంతో చంద్రబాబు పర్యటన కొనసాగింది. ఆయన వెళ్ళే రోడ్లనిండా పోలీసులు ప్రజల్ని రోడ్లమీదికి రాకుండా విచక్షణా రహితంగా లాఠీ చార్జీలు చేసి మరీ అడ్డుకున్నారు. అయినా కూడా అడుగడుగునా ఆయనకు ఆగ్రహించిన ప్రజల చేత కోడిగుడ్లు, చెప్పుల వర్షం తప్పలేదు. ఆయన పర్యటించిన ప్రాంతం మొత్తం 144 సెక్షను విధించి ప్రజలను ఇల్లనుంది బయటకు కూడా రానివ్వలేదు. మరి 144 సెక్షను ఉన్న చోట ఆరువేల వాహనాల కాన్వాయ్ కి ఎలా అనుమతించారో ముఖ్యమంత్రికే తెలియాలి. స్థూలంగా చెప్పాలంటే చంద్రబాబు ప్రభుత్వ సహాయంతో జనాన్ని, పోలీసులను వెంట తెచ్చుకొని  పాలకుర్తిలో సభ జరుపుకుని వెళ్ళాడు.  

దీన్ని పర్యటన అనడం కన్నా ప్రభుత్వం, ప్రతిపక్షం కలిసి ఒక మారుమూల ప్రాంతంపై తలపెట్టిన దురాక్రమణ అంతే సరిగ్గా సరిపోతుంది. ఇలా జరుపుకున్న సభను విజయవంతమైన పర్యటనగా తన మీడియా చేత తెలుగుదేశం ప్రచారం చేసుకునేందుకు ప్రయత్నం చేసింది. కాని వాస్తవాలను ప్రజల ముందు దాచడం అంత సులభం కాదు. తమ కుట్రలు బెడిసి కొట్టాయని తెలుసుకున్న ఆ పార్టీ, తెరాస, JAC నాయకులపై తెలంగాణాకు చెందిన తెలుగుదేశం నాయకుల చేత వ్యక్తిగత దూషణలకు దిగింది. 

తెలంగాణా ఉద్యమ నాయకత్వంలో లోపాలుండ వచ్చు. కాని ప్రత్యాన్మాయం లేనంత వరకూ ప్రజలు వారినే ఆదరిస్తారు. తెలంగాణా తెలుగుదేశం నాయకులకు నిజంగా చిత్తశుద్ధి వుంటే వారే నిజాయితీగా ఉద్యమం నడిపించవచ్చు. అప్పుడు ప్రజలే ఆదరిస్తారు. అంతే గానీ ఇలా సమైక్యవాద నాయకుని పాద పూజలు చేస్తూ, అంతో ఇంతో తెలంగాణా కోసం పని చేస్తున్న వారిని దూషించడంవల్ల ఇప్పటికిప్పుడు అధినాయకుని డబ్బు మూతలు ముట్టొచ్చేమో కానీ, ప్రజల చేత శాశ్వత తిరస్కారానికి గురికాక తప్పదు. 

8 comments:

  1. "నేను ఏనాడు తెలంగాణాను అడ్డుకోలేదు ...అడ్డుకొను... భవిష్యత్తులో అడ్డుకోబోను. !"
    ఇది చంద్రబాబు నాయుడు అందుకున్న కొత్త పల్లవి. .

    దీనిని ప్రజల్లోకి తీసుకెళ్ళి ప్రజలను మభ్యపెట్టి మారేడు గాయ చేయాలని తెలంగాణా తీదీపి బానిస నాయకులు తహ తహ లాడుతున్నారు.

    ఆనాడు వై.ఎస్. రాజ శేకరరెడ్డి కూడా "నేను తెలంగాణాకు అడ్డు కాను నిలువూ కాను " అంటూ చెప్పిన దొంగ మాటలకు చంద్రబాబు ఇప్పటి నక్క జిత్తుల మాటలకు మధ్య తేడా ఏమీ లేదు.

    ఇద్దరూ తెలంగాణా పాలిటి గోముఖ వ్యాఘ్రాలే. !

    తెలంగాణా సమస్య పరిష్కారం కాంగ్రెస్ పార్టీ చేతుల్లో సోనియా గాంధి చేతుల్లో వుందట.... కాంగ్రెస్ ని తిట్టకుండా మమ్మల్ని ఎందుకు ఆడి పోసుకుంటారు ...
    మేం తెలంగాణా ఇయ్యమంటే ఇస్తారా... మా చేతుల్లో ఏముంది ... ఇవీ టీ డీ పీ తెలంగాణా చవట నాయకుల అమాయకపు మార్కు నయ వంచన డైలాగులు !

    ఒర్ నక్క జిత్తుల నాయక శిఖండులారా
    మీ చేతుల్లో ఏముందని రైతు పోరు బాట చేస్తున్నారు ?
    మీ చేతుల్లో ఏముందని కరంట్ చార్జీలు, పెట్రోల్ చార్జీలు తగ్గించాలని రోడ్దేక్కుతున్నారు?

    ఒక్క తెలంగాణా విషయం వచ్చే సరికే మీ చేతుల్లో ఏమీ లేదా?
    ఎందుకు ఈ బుకాయింపులు.
    మీ చేతుల్లో ఏమీ లేనప్పుడు మడుచుకుని ఇంట్లో పడుకోక
    ఈ తమాషా ఏందీ? ఇంకా ఎవర్ని ఎన్నాళ్ళు మోసం చేస్తార్రా?

    - Pratapa Rudra Dev , Warangal

    ReplyDelete
    Replies
    1. ప్రతాపరుద్ర,

      బాగా చెప్పారు. నరనరాన సమైక్యవాదం నింపుకున్న వీళ్ళకు, తెలంగాణాలో సమైక్యవాదం నినాదంతో పోటీ చేసే ధైర్యం మాత్రం లేదు. ఇలా మోసాలు చేస్టూ సీట్లు గెలిచి, తర్వాత ఇక్కడ తెలంగాణా వాదం లేనే లేదని మరో ప్రచారం మొదలు పెడతారు. గతంలో ఎలా వున్నా ఇప్పుడు మాత్రం వీరిని నమ్మే పరిస్థితి ఎంతమాత్రం లేదు.

      Delete
  2. నేను ఒక సమైక్యవాదిని. చంద్ర బాబు సమైక్య వాది అయితే నేను సంతోషిస్తాను. కానీ నాకు చంద్ర బాబు సమైక్యవాది అనిపించటం లేదు. అతను ఒక స్వార్ధ వాది. సమైక్య వాదం అతని ప్రయోజనాలను కాపాడినంత వరకూ ప్రత్యక్షం గానో పరోక్షం గానో సమైక్యవాదాన్ని సమర్ధిస్తాడు. తెలంగాన రాక తప్పని పక్షం లో అతను తెలంగాణ లో తెలంగాన పాట అందుకుంటాడు. రెండు ప్రాంతాలలో తన పట్టు నిలబెట్టుకోవటమే అతని లక్ష్యం.

    ReplyDelete
    Replies
    1. ఆంధ్రుడు,

      నా దృష్టిలో చంద్రబాబే కాదు కేసీయార్ కూడా స్వార్థవాదే. ఈ కాలంలో ఏ రాజకీయ నాయకుడు ఏ వుద్యమం చేసినా దాన్లో కొంతైనా సొంతలాభం వుండే వుంటుంది. కాకపోతే అతడు తీసుకున్న మార్గం ప్రజలకు ఉపయోగం అనిపిస్తే, ప్రజలు ఆదరిస్తారు.

      ఇక చంద్రబాబు ఏ మాటలు చెప్పినా తెలంగాణా ప్రజలు ఆమోదించే పరిస్థితిలో లేరు. డిసెంబరు తొమ్మిది నాడు ప్రకటన రాగానే చంద్రబాబు ప్రవర్తించిన తీరు ప్రజలు ఇంకా మరిచి పోలేదు. అలాగే రాజశేఖర్ రెడ్డి 2009 ఎన్నికలు తెలంగాణాలో జరిగిన వెనువెంటనే (సాయంత్రం ఐదు గంటలకు) మాట్లాడిన మాటలు కూడా.

      Delete
  3. Are meerendukura bai if he did wrong he will definitly fail in elections why you always concentrated on babu by leaving azad and kiran and sonia.
    i think you lost brain because its not in his hand its in your hand dont vote babu then you definitly get telangana insted why you wanted to stop babu by saying illogical reasons.did you stop azad ...?

    ReplyDelete
    Replies
    1. Anonymous Jan 21, 2012 03:18 PM,

      "నీకెందుకురా బై నేనేదో రాసుకుంటే" అని నేనూ అనగలను. ఆజాద్, సోనియా వచ్చినా వారికీ నిరసనలు ఎదురవుతాయి. కిరణ్ కుమార్ రెడ్డికి కూడా నిరసనలు ఎదురవుతూనే వున్నాయి. అమాయక జనం అంతకన్నా ఏం చేయగలరు? వేదాది సైన్యాన్ని తుపాకులతో సహా తీసుకొని వస్తుంటే.

      మీరన్నట్టు ఇక ముందు జరిగే ఎన్నికల్లో తప్పకుండా ప్రజలు తమ సత్తా చూపిస్తారు, వీరు చెప్పే దొంగ మాటలు ఇప్పటికే విన్నారు కాబట్టి ఇకముందు నమ్మే అవకాశం లేదు. కాకపోతే తమకు ప్రాంతంలో ఎలాంటి బలం లేకపోయినా, తమ మీటింగులకు ఎవరూ రాకపోయినా కూడా బయటినుండి జనాన్ని పోలీసులను తీసుకు వచ్చి మీటింగు పెట్టుకుంటున్నారు. ఆ మీటింగు ఫోటోలను, వీడియోలను తమ మీడియాలో వేసుకొని, తమ సభలు విజయవంతం అయ్యాయని ప్రచారాలు ఒకటి. వీటిని చూసి అమాయకులైన ఇతర తెలంగాణా ప్రాంతపు ప్రజలు నిజమని అపోహ పడే అవకాశం వుంది. అందుకే స్థానిక ప్రజలు తప్పకుండా నిసనలు తెలుపుతారు. అది వారి హక్కు.

      Delete
    2. If it is not in his hand, why did he pass resolution in politbureau? Why did he include in party manifesto?

      ఈమధ్య ఇదొక కొత్త ఫాషన్ మొదలైంది. "మేము ఇచ్చేటొల్లం కాదు కాబట్టి మమ్మల్ని ఏమనొద్దు". మీరియ్యలేదని అన్నమా? వచ్చిన తెలంగాణా మీరు ఆపిన్రా లేదా?

      Delete
    3. Jai,

      Well said.

      ప్రజలు వాళ్ళను తెలంగాణా ఇవ్వమని ఏమైనా చెప్పిన్రా? మీ స్టాండ్ ఏమిటో చెప్పమని మాత్రమే అడిగిన్రు. ఆ విషయమే చిదంబరానికి ఒక ఉత్తరంలో చెప్పమని చెప్పిన్రు. ప్రజలు కోరిందాన్ని చెయ్యమంటే మా చేతుల లేదంటరు. అవసరం లేని యాత్రలు మాత్రం బందో బస్తు పెట్టుకొని మరీ చేస్తరు.

      Delete