కేసీయారు తెలంగాణా వాదాన్ని అమ్ముకుంటున్నాడని ఎవరో నక్సలైటు నాయకుడు ప్రకటన ఇచ్చాడట. అంతే, కొన్ని సమైక్యవాద నక్కలు ఊళ పెట్టడం మొదలు పెట్టాయి.
కేసీయారు నిస్వార్థంగా తెలంగాణాకోసం పోరాడుతున్నాడని తెలంగాణా ప్రజలు భావిస్తున్నారనుకొంటే అది వీరి అవివేకం తప్ప మరోటి కాదు. కేసీయారైనా, బీజేపీ ఐనా మరో పార్టీ అయినా వారి స్వార్థ లాభాల కోసమే సమర్థిస్తున్నాయి తప్ప మరోటి కాదు. అలాగే వ్యతిరేకించే పార్టీలకూ అలాంటి స్వార్థ లాభాలే వున్నాయి.
అసలు దేశానికి స్వాతంత్ర్యం వచ్చాక ఒక్కడైనా స్వార్థం లేని నాయకుడు అందలం ఎక్కాడా అన్నది కోటి డాలర్ల ప్రశ్న. స్వార్థానికి ఏ నాయకుడూ అతీతుడు కాదన్నది పచ్చి నిజం. కాబట్టి ఈ స్వార్థపర నాయకుల్లోంచే ఎవరినో ఒకరిని ఎన్నుకొని బలపరచాల్సిన అవసరం ప్రజలకు వుంది.
మరి తెలంగాణా ప్రజలు ఎవరిని సపోర్టు చేయాలి? తెలంగాణా వనరులను ఆంధ్రాకు కట్టబెట్టే నాయకులకా? లేదా తెలంగాణా కోసం పోరాడే నాయకులకా? ఆ విషయంలో తెలంగాణా ప్రజలు స్పష్టంగానే వున్నారు. ఆంధ్రా నాయకుల కుట్రలన్నీ బట్ట బయలైన తర్వాత, తమ నాయకులెవరో, వ్యతిరేకులేవరో ప్రజలకు స్పష్టంగా తెలిసింది.
ఇక పొతే తెలంగాణా వాదాన్ని కేసీయార్ అమ్ముకున్నాడా లేదా అనేది ప్రశ్న. ఇపుడు తెలంగాణలో ఆయన తిరుగులేని నాయకుడు. అమ్ముకుంటే ఎంతకు అమ్ముకుంటాడు? ముష్టి పోలవరం కాంట్రాక్టు కోసం అమ్ముకునే వాడైతే, అలాంటివి 'చేతి'లోని పనే గాబట్టి ఎప్పుడో ఇచ్చి చిరంజీవి లాగా దుకాణం మూయించే వారు కాంగ్రెస్ వారు! అంతే గానీ ఓ ప్రాజెక్టు కోసమో, ఇంకో పదవి కోసమో తెలంగాణా ప్రాంతంలో తమ పార్టీకి డిపాజిట్లు కూడా రాణి పరిస్థితి తెచ్చుకునేంత తెలివి తక్కువ వారా కాంగ్రేసు వారు?
కాంగ్రేసు వారు తెలివి తక్కువ వారే అనుకుందాం. తెలంగాణాలో తనకున్న బలం గురించి, దానివల్ల దీర్ఘ కాలిక భవిష్యత్తులో తనకూ, తన పార్టీకి ఒనగూడే ప్రయోజనాలు తెలియని వాడేం కాదు చంద్రశేఖర్ రావు. అంత చీప్ గా అమ్ముడుపోయే రకం అసలే కాదు.
ఇక పోతే, చంద్రశేఖర రావు అమ్ముడు పోదామన్నా, కాంగ్రెస్ ఆయన్ని కొందామన్నా అది జరిగే పనీ కాదు. ఎందుకంటే ఇప్పుడు తెలంగాణా ఉద్యమం ఒక్క కేసీయార్ చేతిలోనో, ఇంకొక్క కోదండరాం చేతిలోనో లేదు. తెలంగాణా జేయేసీలో 187 ప్రజాసంఘాలు చైతన్యవంతంగా వున్నాయి. ఇంకోవైపు నుండి తెరాస వదిలి పెడితే ఉద్యమం పగ్గాలు అందుకోవడానికి బీజేపీ సిద్ధంగా వుంది. దాదాపు అన్ని పార్టీల్లోనూ తెలంగాణా విభాగాలు ఏర్పడి తమ తెలంగాణా వాదాన్ని, వానిని కనీసం వినిపిస్తున్నాయి. అవకాశం వస్తే తెలంగాణా వాదులు గా ముద్ర వేసుకోవడానికి అవన్నీ తహ తహ లాడుతున్నాయి.
ఇదంతా ఎందుకు? తెలంగాణా ప్రజల్లో ఉద్యమ బహావన బలంగా పాతుకుని వుంది కాబట్టి. ప్రజల్లో ఉద్యమం ఉన్నంత వరకూ, కేసీయారో, బీజేపీయో మరోటో వస్తూనే వుంటాయి. ఉద్యమాన్ని ముందుకు తీసుకు వెళ్తూనే వుంటాయి. దాన్ని ఆపే శక్తి గాదె కింది పందికొక్కుల్లా తినమరిగిన సమెక్కుడు వాదులకు లేదు.
ఇక పోతే కేసీయార్ పైనో, జేయేసీ పైనో ఆరోపణలు చేసిందెవరు? తెలంగాణా ఉద్యమాన్ని 'తీవ్రంగా' బలపరుస్తున్న మావోయిస్టు పార్టీ. తన స్వార్థ ప్రయోజనాల కోసం తెలంగాణా రావడానికి కేసీయార్ చేయాల్సినంత చేయడం లేదనేదే ఆ ప్రకటన సారాంశం (ఒక వేళ అది నిజందే అయినా). అంటే మరింత చిత్త శుద్ధితో మరింత తీవ్రంగా ప్రయత్నిచాలంటున్నారు వారు. దానికి సమెక్కుడు వాదులు భజంత్రీలు వాయించడం చూస్తే వారి మానసిక పరిస్థితినే అనుమానించాల్సిన అవసరం కనిపిస్తుంది.