Thursday, August 8, 2013

అసత్యపూరిత సమై'ఖ్య' మిథ్యమాలు

 
ఈ ఉద్యమంలో మొదటి, అతి పెద్ద అబద్ధం పొట్టి శ్రీరాములు. ఆయన తన జీవితంలో ఎప్పుడూ సమై'ఖ్యాం'ధ్ర గురించి ఆలోచించి ఉండడు. ఆయన కోరింది మద్రాసు నుండి ప్రత్యేకాంధ్ర. నిర్లజ్జగా అది విస్మరిస్తూ ఆయన ఫోటో పెట్టుకుని మిధ్యమాలు చేస్తుంటారు ఈ అబద్ధాల కోరులు.

ఒకప్పుడు అపస్మారకంలో వుంది ఆయన చస్తుంటే కూడా, పట్టించు కోలేదు, వైద్య సహాయం అందించ కుండా ఆయన చావుకు కారకులయ్యారు. ఇప్పుడు ఆయన ఆశయాలను వక్రీకరిస్తూ ఆయన ఆత్మ హననానికి కూడా పాల్పడుతున్నారు.

పైపెచ్చు ఆయన కోరుకున్న సమైక్య 'ఆంధ్ర' రాష్ట్రం ఏర్పాటుకు కూడా ఒప్పుకోకుండా ప్రత్యేక రాయలసీమ, రాయల తెలంగాణా, గ్రేటర్ రాయలసీమ అనుకుంటూ కాట్లాడ కుంటారు. 
వీరి నాయకుల్లో ఎవడు మాట్లాడినా మొదటి వాక్యంతో సమై'ఖ్యాం'ధ్ర ముగిసి పొతుంది. ఆ వెంటనే హైదరాబాదుపై హక్కు సాధించు కుంటాం అనే ఆధిపత్య ధోరణి కనపడుతుంది. హైదరాబాదు వస్తే సమైక్యత అవసరం లేదన్న మాట! వారి సమై'ఖ్య'త అర్థం అదేనేమో!

అంటే అప్పటివరకూ వీరు చెప్పే తెలుగు జాతి, అన్నదమ్ములు వగైరా ఊకదంపుడు అంతా అబద్ధాలని తెలంగాణా వారికి ఎప్పటినుండో తెలుసు,కాని ఇప్పుడు ఆంధ్రా సోదరులకు కూడా అర్థమవుతున్నాయి.

సగటు ఆంద్ర పౌరుడు రాష్ట్రం విడిపోతే దగ్గరలో సొంత రాజధాని కావాలని అనుకుంటాడు. కాని ఈ సమెక్కుడు వాదులు మాత్రం రాష్త్రం విడిపోయినా, కలకాలం హైదరాబాదు రాజధానిగా కావాలను కుంటారట. అంటే రాజధాని కోసం రాష్ట్రం దాటి 200 కి మీ ప్రయాణిస్తారన్న మాట ప్రతి రోజూ!
వీరికి పక్కనున్న తెలంగాణా వారి బాధలు పట్టవు. అర్థ శతాబ్దంగా వీరు ఉద్యమం ఎందుకు చేస్తున్నారు అని ఒక సెకను మాత్రం కూడా ఆలొచించరు. కాని రాష్ట్రం విడిపోతుంది అనగానే వీరికి బోడోలాండ్ గుర్తుకు వస్తుంది. గూర్ఖాలాండ్ గుర్తుకు వస్తుంది. ఇంకా చెప్పాలంటే కలిసి పోయిన జర్మనీ గుర్తుకు వస్తుంది. 

భాషా ప్రయుక్త రాష్ట్రాలని వాదించే వీరికి గోర్ఖాలు, బోడోలు వారి సొంత భాషలు కలిగి ఉన్నారని తెలియదా?

జర్మనీ దేశాలుగా కలిసినా, ఆ దేశంలో జర్మను భాష మాట్లాడే పదుల కొద్దీ రాష్ట్రాలున్నాయని తెలియదా? వారికి అన్నీ తెలుసు, అయినా అసత్యాలు మాట్లాడడంలో అందెవేసిన చేతులు వారు. 

ఒక వైపు రాష్ట్ర రాజధానినుండి నలభై శాతం రెవిన్యూ వస్తోంది అని వారే ఒప్పుకుంటారు.  నిజాం కాలం నుండి కూడా రాష్ట్ర రాజదానిదే ఆదాయంలో సింహభాగం.  ఆ కాలంలోనే దేశంలో 5వ పెద్ద నగరం హైదరాబాద్. ఇప్పుడు కూడా దానిలో మార్పేమీ లేదు. రాష్ట్రం ఏర్పడ్డ నాటి నుండి కూడా హైదరాబాదు మిగులు ఆంధ్రాలో వినియోగించారు తప్ప, హైదరాబాదును వారు అభివృద్ధి చేసినదేమీ లేదు. కాని హైదరాబాదును మేమే అభివృద్ధి చేశామని బుకాయిస్తారు. 

వీరు హైదరాబాదుకు చేసిందేమీ లేదు, జలగలు రక్తం పీల్చినట్టు తెలంగాణా ఆదాయం పీల్చి సీమాంధ్ర ప్రాజెక్టులు నిర్మించుకోవడం తప్ప.  
తెలంగాణా వాదులు మొదటి నుండి నీళ్ళు, ఉద్యోగాల విషయంలో తమకు అన్యాయం జరిగిందని వాదిస్తూ వచ్చారు. కాని సమైక్యవాదులు ఆ వాదనను ఏనాడూ ఒప్పుకున్నా పాపాన పోలేదు.

నీళ్ళ విషయంలో తెలంగాణా వాదులు తమకు జరుగుతున్న అన్యాయాన్ని ప్రస్తావిస్తూ వచ్చినప్పుడల్లా  'నీరు పల్లమెరుగు కదా? మేం పల్లంలో ఉన్నాం కదా? మీ ప్రాంతంలో ప్రాజెక్టులు కట్టడానికి వీలు కాకపొతే మేమేం చేయాలి?' అంటూ అమాయకంగా ప్రశ్నించే వారు. తెలంగాణా ఏర్పాటుపై నిర్ణయం తీసుకుంటున్నట్టు కనిపించ గానే వీరి రాగం మారిపోయింది.

తెలంగాణా ఏర్పడితే కృష్ణా, గోదావరి నదులకు తెలంగాణా వారు అడ్డు కట్టలు వేస్తారట! ఒక్క చుక్క నీరు కూడా కిందకు దిగకుండా చేస్తారట! ఇంతకీ వీరి మాటల్లో ఏది నిజం? నిన్నటి వరకూ చెప్తున్నట్టు తెలంగాణలో ప్రాజెక్టులే కట్టడం వీల్లేదన్న మాటలా? లేక పోతే ఆంధ్రాకు చుక్క నీరు వదలకుండా ప్రాజెక్టులు కట్టుకుని తెలంగాణాలో వాడుకొనే వీలున్నదా?   

వీరు ఇన్నాళ్ళుగా అబద్ధాలు చెప్పారు, ఇప్పుడు చెప్తున్నదే నిజం అనుకున్నా, ఏ రాష్ట్రం కూడా తనకు కేటాయించిన జలాలు మాత్రమే వినియోగించుకో గలుగు తుంది. అది నిర్ణయించే టందుకు ట్రిబ్యునల్స్ ఉన్నాయి. ఇప్పుడున్న పరిస్థితిలో కూడా మన రాష్ట్రానికి ఇతర రాష్ట్రాలతో కలిసి నదుల పంపకం వుంది. మన పైవారు ఎవరూ నీటికి బిరడా బిగించు కొలేదే?

సమెక్కుడు వాదులూ, ఇలాంటి అబద్ధాల మిధ్యమాలతో మీరు ఆంధ్రా ప్రజలని నమ్మించ గలరేమో కాని, ప్రపంచాన్ని నమ్మించ లేరు. 

Saturday, August 3, 2013

కేంద్ర ప్రభుత్వ తక్షణ కర్తవ్యం

గత రెండు మూడు రోజులుగా జరుగుతున్న సమెక్కుడు ఉద్యమాలను చూసినప్పుడు ఒకటి మాత్రం స్పష్టంగా తెలుస్తోంది. కేంద్ర ప్రభుత్వ ఉద్దేశాలు ఎలా వున్నా ఇక్కడి PCC ప్రెసిడెంటు, ముఖ్యమంత్రి లకు ఈ ఉద్యమాన్ని కంట్రోలు చేసే ఉద్దేశం ఎంతమాత్రమూ లెదని. ఈ విషయం సమేక్కుడు చానెళ్ళ ఫూటింగులు చూస్తె ఈజీగా అర్థం చేసుకొవచ్చు.

తెలంగాణాలో చిన్న ధర్నా అయినా వేల సంఖ్యలో మొహరించే పోలీసులు అదే సీమాంధ్ర మచ్చుకైనా కనపడరు. పది మంది కలిస్తే విగ్రహ దహనాలు, ఇరవై మంది కలిస్తే రోడ్డు రొకోలు.



దహనాలకు పాల్పడుతున్నా, విగ్రహాలను కూలుస్తున్నా, పట్టుమని పదిమంది కలిసి క్యూలో నిలబడి హైవేపై రాస్తారోకో చేసినా పోలీసు అనే వాడు కనపడడం లేదు. కంపెనీలకొద్దీ బలగాలను సీమాంధ్రకు పంపించారని వార్తలు వచ్చాయి. ఏరీ? ఎక్కడా కనపడరే? ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు తెలంగాణలో పోలీసులు ఎలా వ్యవహించారో జనం ఇంకా మరిచి పొలేదు. కాబట్టి ఈ ఉద్యమం ప్రభుత్వం, పోలీసు పెద్దలు, సీమాంధ్ర మీడియా, పెట్టుబడి దారులు కలిసికట్టుగా ఆడిస్తున్న నాటకమని తెలుసుకోవడానికి పెద్దగా కష్టపడవలసిన అవసరం లేదు.

ఇలాంటి పెట్టుడు ఉద్యమాలు అధికారికంగా నడిపిస్తూ మరోసారి కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని మార్చాలని ఈ మూకలు చివరి ప్రయత్నం చేస్తున్నట్టు కనిపిస్తుంది. దీనికి విరుగుడు మందు పెట్టాలంటే కేంద్ర ప్రభుత్వం కొన్ని సత్వర నిర్ణయాలు తీసుకోక తప్పదు.
  • ముఖ్యమంత్రికి గట్టి వార్నింగ్ ఇవ్వాలి. అవసరమైతే మార్చాలి. 
  • DGP ని మార్చి మరో ఉత్తర భారతదేశానికి చెందిన ఎవరైనా నిస్పక్షపాత ఆఫీసర్ ని నియమించాలి. 
  • కాంగ్రెస్ పార్టీకి అలవాటుగా మారిన తాత్సారాన్ని విడనాడి, సత్వరమే వర్షాకాల సమావేశాల్లో తెలంగాణా ఏర్పాటు బిల్లును ప్రవేశ పెట్టాలి. 
  • సీమాంధ్రకు క్యాపిటల్ ప్రకటించి సదరు కాంట్రాక్టుల బూచీ చూపి కొందరు పెట్టుబడి దారులను కట్టడి చెయ్యొచ్చు. కాంట్రాక్టర్ల దృష్టి మరలితే పెట్టుడు ఉద్యమం హుష్ కాకీ అని వేరే చెప్పవలసిన పని లేదు. 
  • సీమాన్ధ్రకు ఒక IIT, ఒక AIIMS లను ప్రకటించాలి. అవి ఎక్కడ పెడతామో చెప్పకుండా నాంచాలి. దాంతో మాకంటే మాకు అని పేచీలు పెట్టుకుంటూ ఉద్యమం సంగతి పక్కకు పెడతారు. 
పై ఎజెండా శ్రీక్రిష్ణ కమిటీ ఎనిమిదో చాప్టరు కన్నా వంద శాతం ఉత్తమమైనదని ఘంటాపథంగా చెప్పగలను. 


KCR ఏమన్నాడు?

KCR ఆంధ్రోల్లని వెళ్లి పొమ్మని అన్నాడట. కాదు కాదు పంపించి వేస్తాం అన్నాడట. అది కూడా కాదు జాగో భాగో అన్నాడట. ఇదీ నిన్నటి నుంచి సీమాంధ్ర మీడియాలో మారు మోగుతున్న వార్త.

అసలు KCR అన్నదేంది?

NGO సంఘాలు రాష్ట్ర ప్రకటన వచ్చిన సందర్భంగా ఆయనను అభినందించడానికి వెళ్ళినప్పుడు ప్రసంగిస్తూ, వారిని ఉత్తేజ పరిచే సందర్భంలో అన్నమాటలు అవి. ఏమన్నాడో కింది వీడియో చూడండి.



ఇంతకీ ఆయన ఏమన్నాడు? రాష్ట్రాలు వేరు పడ్డ తర్వాత ఆంధ్రా ఉద్యోగులు ఆంద్రప్రదేశ్ రాష్ట్రానికి వెళ్లాలని. వారికి ఇక్కడే తిష్ట వేయడానికి ఆప్షన్లు ఏమీ ఉండవని.

దానిలో అంత అనకూడని విషయం ఏముందో సీమాంధ్ర మీడియాకే తెలియాలి. కోతికి కొరివి దొరికినట్టు ధర్నాలు చేస్తున్న ఆంద్ర ప్రాంతపు ఉద్యోగులకే తెలియాలి.

అంటే వీరి ఉద్దేశం ఏమిటట? ఇంతకాలం తెరగా తెలంగాణా కోటాలో దొడ్డిదారిలో ఉద్యోగాలు వెలగబెట్టింది కాక రాష్ట్రం విడిపోయినాక కూడా ఇక్కడనే తిష్ట వేయాలనా? ఆప్షన్లు అడిగితే హైదరాబాదు వదిలి వెళ్ళడానికి ఒక్కడైనా ఆప్షను ఇస్తాడా? మరి ఆంధ్రా ప్రభుత్వం నడిచేదేట్లా?

అయినా కొత్త రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత కూడా పది సంవత్సరాలు కామన్ క్యాపిటల్ గా హైదరాబాదు ఉంటుందని CWC ప్రకటనలో చెప్పనే చెప్పారు. అంటే ఆంధ్రకి చెందిన ఉద్యోగులు కూడా అప్పటి వరకూ హైదరాబాదులోనే కదా ఉండేది? కాకపొతే ఆంద్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన కార్యాలయాలలో హైదరాబాదులోనే పనిచేస్తారు. KCR చెప్పింది కూడా అదే. ఆంధ్రా ఉద్యోగులు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం లోనికి వెళతారు, కాబట్టి తెలంగాణ ఉద్యోగులకు మిగులు పోస్టులలో ప్రమోషన్లు వస్తాయి అని ఆయన చెప్పారు. దానికి అంట రాద్ధాంతం చెయ్యాల్సిన అవసరమేమిటి? కనీసం హైదరాబాదులో వున్నా ఆంధ్రా కార్యాలయానికి కూడా మారరా?

ఉన్న ఉద్యోగులను అందరినీ తెలంగాణలో వదిలించుకొని, ఆంధ్రాలో మళ్ళీ కొత్తగా రిక్రూట్ చేసుకోవాలి, తద్వారా లబ్ది పొందాలనేది సమెక్కుడు వాదుల దురాలొచనగా కనిపిస్తుంది. ఇప్పుడు KCR మాటలతో అది కాస్తా బయట పడింది! తెలంగాణా వాదులారా పారాహుషార్!! రాష్ట్రం నిజమయ్యే లోగా మరెన్నో ఇలాంటి కుట్రలను మీరు ఎదుర్కోవాల్సి వస్తుంది, జాగ్రత్త.

Friday, August 2, 2013

సమైక్యవాద డ్రామాలు


కుహనా సమైక్యవాద డ్రామాలు మళ్ళీ మొదలైనయి. దానికి తోడు సీమాంధ్ర మీడియా డప్పు వాయిన్చుడు కూడా మొదలైంది. కుహనా అని ఎందుకనవలసి వస్తుందంటే, సమైక్య ఉద్యమం కేవలం సీమాంధ్రల జరుగడమే. అక్కడ మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు రాజీనామాలు చేస్తున్నరంట. మరి ఇక్కడ సమైక్యతా కొరకు ఒక సర్పంచి, ఒక వార్డు మేమ్బరి కూడా చెయ్య లేదే? మరి గదేమి సమైక్యత? ఒక్కవైపే ఉండే సమైక్యతా ఏందో ఆ సమైక్య వాదులమని చెప్పుకునే మట్టి బుర్రలకు తప్ప ఎవ్వరికి అర్థం కాదేమో!

స్కూలు పిలగాండ్లతోని ఊరేగించుకుంట వాళ్ళు చేస్తున్న తాటాకు చప్పుళ్ళని పులి గర్జనల లెక్క చూపిస్తందుకు ఆంధ్ర మీడియా పడే పాట్లు చూస్తుంటే నవ్వాల్నో ఏడవాల్నో ఆర్థం అయితలేదు. ఎమ్మెల్యేలు మంత్రులు రాజీనామాలు చేస్తున్నరని నిముష నిముషానికి ఇచ్చే ప్రకటనలు, రాష్ట్రం రెండు ముక్కల కింద బద్దలైతున్నట్టు చూపెడుతున్న ఆనిమేశన్లు... చెప్ప తరం గాదు వాళ్ళ బాధలు.

A ని A లెక్క చూపెట్టే టందుకు బాధ పడే అవసరం లేదు. కాని A ని B లెక్కనో D లేక్కనో చూపెట్టాలె నంటెనే కష్ట పడవలసి వస్తది. ఆ సినిమా కష్టాలే ఇప్పుడు సీమాంధ్ర మీడియా పడుతున్నది. కడుపు రాకుండానే బిడ్డను కనేతందుకు పురిటి నొప్పులు పడుతున్నది. కాని ఆ చెప్పుట్లనే, చూపెట్టుట్లనే వాళ్ళ ఉద్యమాల అసలు రంగు దానంతట అదే బయట పడుతున్నది.

రాజీనామా లేఖలు దిగ్విజయ్ సింగుకు ఇచ్చినరట! రాష్ట్ర మంత్రులు ముఖ్య మంత్రికి ఇచ్చినరట! కొంతమంది బొత్సకు ఇచ్చిన్రట. మరి కొంతమంది ఫ్యాక్సు చేసిన్రట! ఎవనిగ్గావాలే ఈ ఊక దంపుడు?తెలంగాణా ఉద్యమం పుణ్యమా అని ఇప్పుడు పసి పిల్లగానికి కూడా ఎరుకే, రాజీనామా ఎవరికిస్తే ఏ పద్ధతిల ఇస్తే ఆమోదించ బడుతదో! మరి సిగ్గు లేని సీమాంధ్ర మీడియాకు ఎందుకు అర్థంగాదు?

మనుషులు రాకపోయినా ఉన్న కొద్ది మందినే క్లోజప్ ల చూపిస్తరు. ఎక్కడన్న దిష్టిబొమ్మ తగులబడితే దాన్నొక దావానలం లెక్క జూమ్ చేసి మరీ చూపిస్తరు. ఆంధ్రా అంటుకున్నదన్న భ్రమ కల్పించే ప్రయత్నం చేస్తరు. గత నలభై ఎనిమిది గంటల్లో ఈ చానళ్ళు సీమాంధ్ర, హింస అన్న పదాలను కలిపి ఎన్ని సార్లు వాడాయో లెక్క లేదు. వాటికి ఇప్పుడు సీమాన్ధ్రలో హింస కావాలె. అది జరుగుత లేనందుకు అవి పిచ్చెక్కి పొతున్నయి. ఎట్లనన్న రెచ్చ గొట్టాలె నని అవి చేయని ప్రయత్నం లేదు. 

కాని వీటికి అతీతంగా మెజారిటీ సీమాంధ్ర ప్రజలు తమ పనులు తాము చేసుకుంటున్నరు. ఒక ప్రాంతం ప్రజల వత్తిడి ద్వారా రెండు ప్రాంతాలను కలిపి వుంచడం ఎన్నటికీ సాధ్యం కాదు. కనీసం ఆ ఒక ప్రాంతపు ప్రజల మద్దతు కూడా లేని ఇలాంటి సిగ్గు మాలిన ఉద్యమాలు ఎన్నటికీ కొసెల్ల జాలవు.

Thursday, August 1, 2013

జయహో తెలంగాణా



తెలంగాణా సోదర సోదరీమణులకు శుభాభినందనలు. చిరకాల పోరాటాల అనంతరం ఊహించని సాఫల్యత లభించింది. తెలంగాణా ఇవ్వకుండా ఉండలేని రాజకీయ అనివార్యత కాంగ్రెస్ పార్టీని నిర్ణయం దిశగా పురి కొల్పింది. తెలంగాణా వాదులు మొదటి నుండి విశ్వసిస్తూ వచ్చిన రాజకీయ వ్యూహాలు నిజమని నిరూపించ బడ్డాయి. కాంగ్రెస్ పార్టీకి తెలంగాణా రాష్ట్రాన్ని ఏర్పాటు చేయక తప్పని అనివార్య పరిస్థితులను కల్పించాయి.

అయితే మనం అప్పుడే పండగ చేసుకోవలసిన అవసరం లేదు. సీమాంధ్ర పెట్టుబడి దారుల కుట్రల తీవ్రత మనకు తెలియనిది కాదు. పది జిల్లాలతో కూడిన రాష్ట్ర ఏర్పాటు పైన కేంద్ర కాబినెట్ నిర్ణయం వచ్చేంత వరకూ, పార్లమెంటులో బిల్లు పాసయ్యేటంత వరకూ నిరంతరం అప్రమత్తంగా ఉండవలసిన పరిస్థితి.

పది సంవత్సరాలు ఉమ్మడి రాజధాని అని ప్రకటించి హైదరాబాదుపై మరో సందిగ్ధత లేవ నెత్తారు. గతంలో రాష్ట్రాలుగా ఏర్పడ్డ చత్తీస్ గడ్, ఉత్తరాంచల్ లాంటి రాష్ట్రాలకు రాజధాని ఏర్పాటుకు ఎంత సమయం పట్టిందో ఉదాహరణ లున్నాయి. ఇప్పుడున్న టెక్నాలజీతో ఎంతటి వనరులైనా సమకూర్చడానికి ఒకటి రెండు సంవత్సరాల కన్నా ఎక్కువ సమయం అవసరం లేదు. అప్పటివరకూ ఆంద్రప్రదేశ్ రాష్ట్ర కార్యకలాపాలు తెలంగాణా రాష్ట్రంతో పాటు హైదరాబాదులోని వసతులను ఉపయోగించుకోవడానికి ఎవరికీ అభ్యంతరం ఉండవలసిన అవసరం లేదు.

కాని అప్పుడే కొన్ని నోళ్ళు కేంద్ర పాలిత ప్రాంతమని, నగరంపై ఉమ్మడి అధికారమని నోళ్ళు పారవేసుకోవడం మొదలు పెట్టాయి. తాత్కాలికంగా ఉమ్మడి రాజధానిగా వుండవచ్చు. అంత మాత్రాన అది ఉమ్మడి నగరం ఎంతమాత్రం కాదు. హైదరాబాదు తెలంగాణా సొత్తు. తెలంగాణలో అంతర్భాగం. దాన్ని తెలంగాణా నుండి ఎవ్వరూ వేరు చేయలేరు.

ఐదు లక్షల కోట్లతో హైదరాబాదు లాంటి కొత్త నగరం కట్టివ్వాలని ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు డిమాండు చేస్తున్నారు. పిర్రలు నావి కాకపోతే కంప మీదనుండి దేకుతానన్నాడట వెనకటికి ఎవడో. అలా వున్నాయి బాబు మాటలు. అలవి కాని కోరికలు కోరి ఇక్కడే తిష్ట వేయాలనే దురాలోచనలు కనబడుతున్నాయి వారి మాటల్లో.

ప్రకటన వెలువడగానే కృత్రిమ ఉద్యమాలు మళ్ళీ మొదలు పెట్టారు కుహనా సమైక్య వాదులు. యునిఫారం లోని విద్యార్థులు, కొన్ని రౌడీ మూకలు తప్ప ప్రజలే కనపడడం లేదు వాటిలో. దానికి తోడూ సీమాంధ్ర ప్రజాప్రతినిధుల ఫ్యాక్సు రాజీనామాలు నవ్వు తెప్పిస్తున్నాయి. సీమాంధ్ర ప్రజలారా, ఇలాంటి ఉద్యమాల పట్ల, నాయకుల పట్ల అప్రమత్తంగా వుండండి. వీళ్ళని నమ్మితే మిమ్మల్ని మీరు మోసం చేసుకున్నట్టే.

కాసుల గలగలలు తప్ప మరేదీ పట్టని సీమాంధ్ర పెట్టుబడి దారులు, యూ టర్న్ తీసుకోవడానికి ఎంతో  సమయం పట్టదు. రాష్ట్ర ప్రకటన వెలువడి కొత్త రాజధాని ఏర్పాటుకు టెండర్లు మొదలవగానే, వీళ్ళ ప్రాధాన్యతలు అనూహ్యంగా మారిపొతాయి. కాని అప్పటిదాకా జాగ్రత్తగా వచ్చిన రాష్ట్రాన్ని పసిబిడ్డ లాగా గద్దలు ఎత్తుకు పోకుండా కాపాడు కోవలసిన బాధ్యత తెలంగాణా ప్రజలదే.

జై తెలంగాణా!