Tuesday, April 19, 2011

రేపు "జై ఉత్తర తెలంగాణ" అంటే ఏంచేస్తరు?

ఏ వాదన దొరుకని సమైక్యవాదులు చేసే పిచ్చి వాదనలల్ల ఇది ఒకటి. ఉన్న విషయాల మీద సమాధానాలు చెప్ప చాతకాక, లేని విషయాలను కల్పించి ఏదో మైలేజీ సాధిద్దం అనుకోవడమే ఇట్లాంటి అర్థం లేని వాదనలకు కారణం. 

అసలు "జై ఉత్తర తెలంగాణ" నినాదం ఎందుకు వస్తది? నిధులో, నీళ్ళో కొల్లగొడితేనే కదా? మరి నిధులు, నీళ్ళు కొల్లగోట్టినప్పుడు ఎవడైనా ఏం జేస్తడు? 1952 ల ఆంధ్రావాడు ఏం జేసిండో గదే జేస్తడు. అట్లాంటి పరిస్థితి రాకుండా ఉండాలనంటే సమన్యాయం చూపెట్టాలె. అది చాతగానప్పుడు విడి పోతమంటే గమ్మునుండాలె. 

ఇంత పెద్ద ఎత్తున ఉద్యమం జరుగు తుంటె, ప్రతి రోజు వివక్ష గురించి అన్ని వేదికల మీద వాదోప వాదాలు జరుగుతుంటెనే మొన్నటికి మొన్న, నాబార్డు నిధులల్ల 110 కోట్లు ఆంధ్రల కేటాయిస్తే, 10 కోట్లు తెలంగాణాల కేటాయిస్తరు. బీబీనగర్ నిమ్సు కడప రిమ్సు ఒకే సారి మొదలు పెట్టినరు. రిమ్సు కట్టడం పూర్తైతే, నిమ్సు మాత్రం మూలకు బడె. ఇదే మన సమైక్యాంధ్రల సమ న్యాయం. పైనించి ఇప్పుడు నిమ్సు కట్టుడు చేతగాదని కామినేని కిస్తరట!

తెలంగాణ యూనివర్సిటి, కడప యూనివర్సిటి ఒకే సారి మొదలు పెట్టిన్రు. కడప యూనివర్సిటీకి 350 కొట్లిస్తే, తెలంగాణ యూనివర్సిటీకి 27 కొట్లిచ్చిన్రు. ఇట్ల ప్రతి దాన్ల పక్షపాతం చూపిస్తా వుంటే ప్రత్యేక ఉద్యమాలు రాకపోతే ఏం వస్తయి? 

రేపు ఉత్తర తెలంగాణకి న్యాయం జరగక పొతే ఉద్యమం తప్పకుండ వస్తది. అప్పుడు ఉత్తర తెలంగాణ గూడ ఇయ్య వలసి రావచ్చు. అంటే కాదు ఉత్తరాంధ్రల ఉద్యమం వచ్చినా రాయల సీమల ఉద్యమం వచ్చినా అదే పరిష్కారం తప్పదు. 
 

విగ్రహాలు కూల్చినా బుద్ధి రాని ప్రభుత్వం

రాష్ట్రంల ప్రముఖుల విగ్రహాల ఏర్పాటు కోసం మార్గదర్శకాలు రూపొందించేటందుకు ప్రభుత్వం అయిదుగురుతో మంత్రివర్గ ఉపసంఘాన్ని ఏర్పాటు చేసిందట. దానికి ఛైర్మన్‌గా వట్టి వసంత్‌కుమార్, సభ్యులుగా జానారెడ్డి, మహీధర్‌రెడ్డి, రఘువీరారెడ్డి, ధర్మాన ప్రసాదరావు నియమిచబడ్డరు.

కమిటీల నలుగురేమో సీమాంధ్ర మంత్రులట! చైర్మన్ గూడ ఆంధ్రా వాడే. ఏదో మొఖమాటానికి ఒక తెలంగాణా మంత్రిని పెట్టిన్రు. ఆయన్ను గూడ ఎందుకు పెట్టిన్రో మరి? మొత్తం వాళ్ళే ఉంటే పోయె గదా?  

ఇప్పుడు ఒకవైపు నుండి విగ్రహాలు పెట్టడంల అన్యాయం జరుగుతుందని గొడవ జరుగుతనే ఉన్నది. ప్రజలు దానికి నిరసన తెలుపుకుంట మొన్ననే ట్యాంకుబండు మీద విగ్రహాలు కూలదోసి తమ ఆగ్రహాన్ని తెలియ జేసినరు. ఇంత చేసినా ఈ సీమాంధ్ర పక్షపాత బుద్ధి మారలేదని ప్రభుత్వం తాజా నిర్ణయం తోటి తెలుస్తున్నది.

ఇట్లాంటి పక్షపాత కమిటీ తీసుకొనే నిర్ణయాలు ఎట్ల ఉంటయో ముందుగనే చెప్పొచ్చు. మల్ల కొన్ని వందల సీమాంధ్రుల విగ్రహాలు తెలంగాణా గడ్డ మీద మొలుస్తయన్న మాట!

ఇంతటి ఉద్యమం జరుగుంటేనే ఎక్కడి కక్కడ నియామకాల్లో, నిర్ణయాలలో చేతి వాటం చూపెట్టే సమైక్యాంధ్ర పాలకులు, తెలంగాణా కేదో ఉద్దరిస్తరనేది కలలో మాట.

ఇది వీళ్ళకు కొత్తకాదు. ఉద్యమం జరుగు తున్నప్పుడే నాబార్డు నిధుల్ల 92% నిధులు ఆంధ్రాకు పంపకం జెయ్యడం చూసినం. ఉద్యమం జరుగుతున్నప్పుడే సిగ్గు లేకుండ అక్రమంగా పోలీసు నియామకాలు జరపడం చూసినం. నీతి నియమం లేని ఈ సమైక్య ప్రభుత్వం ఎంతకైనా తెగిస్తదనే దానికి ఇది తాజా ఉదాహరణ.    

రెండోరోజే జై ఆంధ్రా అనకుంటే ఒట్టు



ఇది 1972-73 లలో సినీ నటుడు కృష్ణ వేయించిన కరపత్రం.  (Curtesy సాహిత్య అభిమాని గారి బ్లాగు). దీంట్ల ఏం రాసి వుందో ఒక్కసారి చూడున్రి. ముల్కీ రూల్సుని సమర్థించుకుంట సుప్రీం కోర్టు తీర్పు ఇచ్చిందని, ప్రత్యేక రాష్ట్రం కోసం ఉద్యమం చేసిన్రు. 

సుప్రీం కోర్టు తీర్పును గౌరవించని వాల్లు ఇప్పుడు శ్రీకృష్ణ కమిటీ గురించి చెప్పుతున్నరు. ముల్కీ రూల్సు కూడా ఓర్వని వాల్లు ఇప్పుడు ఐకమత్యపు నీతులు చెప్పుతున్నరు.  అప్పుడు ఆంద్ర ప్రజానీకం గురించి మాట్లాడిన వారు ఇప్పుడు అంటా ఆధ్రులమే అంటున్రు.

ఆ శ్రీకృష్ణ పిచ్చోడి లెక్క ఆరో సిఫార్సు ఇచ్చిండు గని, ముల్కీ రూల్సుకే ఓర్వని వాల్లు తెలంగాణాకు ప్రత్యేక రక్షణలు పెట్టాల్నంటే ఓరుస్తరా? పెట్టి చూడున్రి, రెండోరోజే జై ఆంధ్రా అనకుంటే ఒట్టు!     

Monday, April 18, 2011

హైదరాబాదుపై అత్యాశ

మాట్లాడితె హైదరాబాదును మేం అభివృద్ధి చేసినం అంటరు కొందరు సమైక్య వాదులు. వాళ్ళు ఇక్కడికి వచ్చి అభివృద్ధి  చెందడం తప్ప ఇక్కడ అభివృద్ధి చేసిందేం లేదు. ఇక్కడ జరిగిన అభివృద్ధి ఇక్కడి వాతావరణం, సహజ వనరుల కారణంగానే జరిగింది.

బెంగుళూరు తర్వాత ఉత్తమమైన సమశీతోష్ణ వాతావరణం ఉండే నగరం హైదరాబాదు. ఈ మధ్య పొల్యూషన్ వల్ల వేడి ఎక్కువైంది కానీ, ఎండాకాలం కూడా చెమట ఎరుగని ప్రదేశం హైదరాబాదు. అందుకనే ఆంధ్రా వాళ్ళైనా, వేరే వాళ్ళైనా ఇక్కడి కొచ్చి సెటిల్ కావాలెనని ఉవ్విల్లూరుతరు. సెటిల్ కావాలె నని ఉవ్విల్లూరితే ఫరవాలేదు. ఇక్కడి ఆస్తులను అక్రమంగా కబ్జా జేసుడు, ఇక్కడి ఉద్యోగాలు దొంగ సర్టిఫికెట్లు పెట్టి కొల్ల గొట్టుడు, బినామీ పేర్లు బెట్టి అర్బన్ సీలింగ్ యాక్టులకు విరుద్ధంగా వందల ఎకరాలు ఆక్రమించు కునుడు మొదలు బెట్టిన్రు.

వందల సంవత్సరాల నుండి హైదరాబాదుకు దేశ విదేశాల నుండి ఎంతో మంది వచ్చి హైదరాబాదుల సెటిల్ అయ్యిన్రు. ఇక్కడి వ్యాపారాలల్ల పాలు పంచుకున్నరు. వారు ఇరానీలు కావచ్చు, అఫ్గన్లు కావచ్చు, పార్సీలు కావచ్చు, పంజాబీలు, మరాఠీలు, మార్వాడీలు, రాజస్తానీలు, సింధీలు, బంగ్లాదేశీయులు, బీహారీలు, నేపాలీలు ఇలా ఒకరని ఏమిటి దేశం మొత్తం హైదరాబాదుల కనిపిస్తది. ప్రతి ఒక్కరు ఇక్కడి అభివృద్ధిల పాలు పంచుకుంటున్నరు, దానితో పాటు వాళ్ళు కూడ అభివృద్ధి చెందుతున్నరు. కాని ఎవ్వరు కూడ హైదరాబాదును మేమే అభివృద్ధి చేసినం అని చెప్పలే. 

తమ అధికారం తోని, ఆశ్రిత పక్ష పాతం తోని ఇక్కడి భూములవల్ల, జాగలవల్ల, అక్రమంగా సంపాదించిన ఉద్యోగాల వల్ల ఎవరు అందరికన్న ఎక్కువ లాభపడ్డరో, వాళ్ళు ఇయ్యాల మేం హైదరాబాదుని డెవలప్ చేసిన మంటున్రు. అదే ఆంధ్రా వ్యాపార/రాజకీయ దోపిడీదార్ల నీతి!

ఇదెట్ల ఉందంటే, ఇల్లు లేక నీ ఇంటికి వచ్చినోడు, ఇల్లంత ఆక్రమించి, ఇంట్ల నిన్నొక మూలకు నెట్టి, నీకు కొంచెం రొట్టె ముక్క పడేసి, నిన్నే అభివృద్ధి చేస్తున్న అని చెప్పినట్టు ఉంది.

హైదరాబాదు అసలు ఎప్పుడు డెవలప్ అయ్యింది? నిజాం నవాబు నిజాం రాజ్యం మొత్తం పీల్చి పిప్పి చేసినా, ఆ డబ్బులు పెట్టి హైదరాబాదు మాత్రం బాగానే డెవెలప్ చేసిండు. ఆ రోజుల్లనే ఫీవర్ హాస్పిటల్, మెటర్నిటీ హాస్పిటల్, ఆర్తోపెడిక్ హాస్పిటల్, పిల్లల హాస్పిటల్ వంటి స్పెషాలిటీ దావఖానల తోడు, ఉస్మానియా జనరల్ హాస్పిటల్ కూడ కట్టిచ్చిండు. ఉస్మానియా యూనివర్సిటీని అత్యంత వైభవంగ కట్టించిండు.

ఆంధ్రల కరెంటు అంటె తెలువని రోజులల్ల, హైదరాబాదుల ప్రపంచం మొత్తం మీద ఆధునికమైన పవర్ ప్లాంటు ఉండేది, ఇప్పటి నెక్లెస్ రోడ్డు ప్రాంతంల. ఆంధ్రల ఉన్న ఏ నగరంల లేని విధంగ ఇక్కడ మంచినీటి సరఫరా, డ్రైనేజీ వ్యవస్థ ఉండేది.     
      
స్వాతంత్ర్యం వచ్చే నాటికే హైదరాబాదు ఐదో పెద్ద నగరం. ఈ సమైక్య వాదుల పాలన పుణ్యమా అని ఇప్పుడు ఐదో స్థానాన్ని బెంగుళూరుకి సమర్పించుకో వలసి వస్తుంది. ఇదీ వీళ్ళు చేసిన డెవెలప్ మెంటు!

హైదరాబాదు తెలంగాణల అంతర్భాగం. ఇది తెలంగాణ నుండి వేరు చేసుడు ఎవ్వని తరంగాదు. తాహతు లేకున్నా ఒకప్పుడు మద్రాసు కొరకు పోరాడినోల్లు, అదే రకమైన అత్యాశతో ఇప్పుడు హైదరాబాదు పైన కన్నేసిండ్రు. అప్పడు ఏవిధంగ శృంగభంగం చెందిన్రో, ఇప్పుడు కూడా అలాంటి శ్రుంగభంగం తప్పదు వీరికి. అత్యాశ కొంపకు చేటుగదా మరి!

తెలుగు జాతి ఐక్యత గురించి మాట్లాడే వానికి హైదరాబాద్ ఎందుకు?

నేల విడిచి సాము చేసే సమైక్యవాదులకు ఉద్యమం ఉధృతి పెరుగుతున్న కొద్ది గుండెలలో గుబులై పోతుంది. ఇంక తెలంగాణా ఏర్పాటు తప్పదని నిర్ణయించు కున్నంక కొత్త రాగం పాడుడు మొదలు పెట్టిన్రు. హైదరాబాదు కేంద్ర పాలిత ప్రాంతం చెయ్యాలెనట!

ఇనాళ్ళు సమైక్య వాదం, తెలుగుజాతి అని చెప్పింది అన్ని ఉట్టి మాటలేనని వాళ్ళంత వాళ్ళే బట్ట బయలు చేసుకున్రు. అంటే హైదరాబాదు వస్తే 'తెలుగుజాతి, గిలుగు జాతి జాన్తానై' అన్న మాట!

మొదటినుండి వీరి కన్ను హైదరాబాదు మీదనే ఉన్నది. 1956 ల వీళ్ళు తెలంగాణా తోటి కలిసింది కూడా హైదరాబాదు మీద మోజు తోటి గాని మరొకటి గాదు. ఆ విషయం 1953 లనే ఆంధ్రా అసెంబ్లీల నీలం సంజీవ రెడ్డి స్పష్టంగనే చెప్పిండు.   

ఎవడైనా విడిపోతున్నప్పుడు తన వాటా సంగతి చూసు కుంటడు. నీళ్ళో నిప్పులో సరిగ్గ పంచమని బేరమాడుతడు. విడిపోతే తన ప్రాంతం వాళ్ళు పడే కష్ట నష్టాల గురించి ఏమన్నా ఉంటె చెప్పు కుంటడు. అది తన ప్రాంతపు ప్రజల మీద ప్రేమ ఉన్నోడు చేసే పని. 

ప్రజలెక్కడ పోతే మాకేంది? మా వ్యాపారాలు, మా రియల్ ఎస్టేట్లు, మా కబ్జాలు సల్లగుండాలె  అనుకునేటోడు ఏంజేస్తడు? హైదరాబాదు మీద కన్ను బెడుతడు. నా ప్రాంతం గాదు, నాకు హైదరాబాదే ముఖ్యం అంటడు. ఊళ్లు అభివృద్ధి చేయ్యలేనోడు హైదరాబాదు అభివృద్ధి చెస్తడట! వీళ్ళు చేసేది హైదరాబాదు అభివృద్ధి కాదు, హైదరాబాదుల వీళ్ళ అభివృద్ధి అని ఆంధ్రా జనం తెలుసుకుని మేలుకుంటె ఇప్పటికయినా మంచిది. గట్ల తెలుసుకొకుండ, గా నాయకులనే నమ్మితిరా, వాళ్ళు తడిగుడ్డ తోటి  గొంతు కొయడానికయినా వెనుకాడని రకాలు! జర జాగ్రత్తగ ఉండున్రి.

దళితులూ, ప్రజా సంఘాలు, కవులు, మేధావులు ఇప్పటికే మేలుకున్నరు. సమైక్య వాదం జపించే దొంగ నాయకుల కుట్రలను పసిగట్టిన్రు.  మిగిలిన వాళ్ళు కూడ తెలుసుకుని 'జై ఆంధ్ర, జై తెలంగాణా' అని నినదించే రోజు దగ్గరలనే ఉంది.

అన్న దమ్ముల్లాగా విడిపోదాం, అన్న దమ్ముల్లాగా ప్రేమగ మెలుగుదాం.