Monday, March 3, 2014

ఎందుకు కలుపాలె ?

మొత్తానికి కాంగ్రెస్ తెలంగాణా ఇచ్చినట్టు చేసింది. జనం, నాయకులు ఉద్యమ కారులు పండుగలు చేసుకునుడు శురువు జేసిన్రు.

ఇదా సంపూర్ణ తెలంగాణా?


పదేండ్ల పాటు సీమాంధ్ర పిలగాల్లు ఇక్కడి కాలేజీ సీట్లల్ల సదువు కొవచ్చు. తెలంగానోల్లు మాత్రం సీమాంధ్రల సడువరాదు. 

పదేండ్ల పాటు తెలంగాణా ప్రభుత్వానికి హైదరాబాదు మీద అధికారం ఉన్దదు. గవర్నర్ చేతిల వుంటది. ఇంతకంటే అవమానం ఉంటదా ఏ రాష్ట్ర ప్రభుత్వానికైనా?

తెలంగాణా ప్రాంతాన్ని ముంచే పోలవరం ప్రాజెక్టును ఏ అనుమతులు లేకున్నా అడ్డదారిన కేంద్రం నెత్తికెత్తుకొని పూర్తీ చేస్తదట! వారి స్వార్థానికి అడ్డం రాకుండా, వచ్చినా అణగ దొక్కు తందుకు ముంపు గ్రామాలతో సహా సంబంధిచిన మండలాలు సీమాన్ధ్రకు ధారాదత్తం చేస్తున్నరు!

తెలంగాణలోని పది జిల్లాలలో తొమ్మిది దేశంలోని వెనుకబడ్డ జిల్లాల్ల లిస్ట్ల వున్నయని కేంద్ర ప్రభుత్వమే ఒకవైపు చెప్తున్నది. కాని దోపిడీ చేసి తెగ బలిసిన సీమాంధ్ర ప్రాంతానికి ప్రత్యేక హోదా ఇస్తున్నరట! ఇదెట్ల వున్నదంటే, దోచుకునే రౌడీ దోపిడీ ఆపెటందుకు రౌడీ మామూలు ఇచ్చినట్టు!!


ఎంత కాలానికి ఇచ్చింది తెలంగాణాని?


2004 లనే తెలంగాణా ఇస్తనని చెప్పి కాంగ్రెస్ అధికారం లకొచ్చింది.  ఐదేండ్ల పాటు మోసం చేసింది. 

తిరిగి 2009 ఎన్నికల్ల ఇచ్చేది తెచ్చేది మేమే ననుకుంట నమ్మ బలికింది. 2009 డిసెంబర్ ల ప్రకటన ఇచ్చినట్టే ఇచ్చి వెనుకకు మళ్ళింది. 1200 మంది ఉద్యమ కారుల చావులకు కారణమయ్యింది. 

2012ల తెలంగాణా ఏర్పాటు చేస్తే పార్టీని కాంగ్రెస్ ల కలుపుతామని తెరాస ఆఫర్ కూడా ఇచ్చింది. కాని కాంగ్రెస్ స్పందించ లేదు. ఉద్యమాన్ని అణగ దొక్కుతందుకే చూసింది.

ఎన్ని లాఠీ చార్గిలు, ఎన్ని విషవాయు ప్రయోగాలు, రబ్బర్ బుల్లెట్లు ప్రయోగించినా తెలంగాణా ప్రజలు వెనుకకు పొలెదు. ఉద్యమం ఒక ఇంచు కూడా సడలలేదు. సీమాంధ్ర వాద కాంగ్రెస్ టిడిపి లకు ఒక్క సీటు కూడా ఎన్నికల్ల దక్కలేదు. 

తెలంగాణా ఆపినా కూడా సీమాంధ్ర మొత్తంల ఎన్నికల్ల జగన్ చేతిల మట్టి గరిచినంక, కనీసం తెలంగాణాలనన్న బట్ట కట్టాలే నని భావించి తెలంగాణా ప్రక్రియ ప్రారంభించింది. 

ప్రక్రియ మొత్తంల కూడా సీమాంధ్ర నాయకులను కట్టడి చేస్తందుకు ఏమాత్రం ప్రయత్నించలేదు.  బరితెగించిన ముఖ్యమంత్రి తన పార్టీ పాలసీలకు విరుద్ధంగా ప్రవర్తించినా, రాష్ట్రపతినే ధిక్కరించడానికి ప్రయత్నించినా మాట మాట్లాడలేదు. ముఖ్యమంత్రిని మార్చ డానికో, రాష్ట్ర పాటి పాలన విధించడానికో ఏమాత్రం ప్రయత్నించ లేదు. 

కాని ఇప్పుడు సీమాంధ్ర నేతలు కోరగానే కొంపలు మునిగినట్టు రాష్రపతి పాలన విధించింది.

తెరాస ఆఫర్ ఇచ్చిన మాట నిజమే 


నిజమే, తెలంగాణా కోసం ఆత్మాహుతికి పాల్పడుతున్న యువకులను చూడలేక తనకు తాను  బలి అవుతందుకు సిద్ధ పడింది తెరాస. సంపూర్ణ తెలంగాణా ఇస్తే కాంగ్రెస్ పార్టీల విలీనం చెందేతందుకు ఒప్పుకుని, తెలంగాణా ఏర్పాటు చేయమని అర్థించిండు కెసిఅర్.  

కాని కాగ్రెస్ ఒప్పుకోలేదు. దానికి స్పందించ లేదు. ఆత్మాహుతవుతున్న ప్రజలు ఏమాత్రం భరోసా ఇవ్వడానికి కూడా ప్రయత్నం చెయ్యలేదు.    

ఇప్పుడెందుకు అంత తహ తహ?


పదేండ్లు తాత్సారం చేసి, పన్నెందొందల ఆత్మార్పణాలకు కారణమై, చివరకు వికలాంగు రాలిగా మార్చిన తెలంగాణాను ఏర్పాటు చేసింది కాంగ్రెస్. ఆ మాత్రం దానికి బిల్లు పాసైన మరుక్షణం నుంచే తెలంగాణా రాష్ట్ర సమితి విలీనం కావాలని వత్తిడి తెస్తుంది.

విలీనం అయితే?


పేరుకు తెలంగాణా రాష్ట్రం వచ్చినా ఇంకా సాధించు కావలసింది ఎంతో వుంది. వందలాది సంవతరాల రాజరికంలో, గత యాభై ఆరు సంవత్సరాల వలస పాలనలో తెలంగాణా క్రుంగి, కృశించింది.  పొరబాటున తెరాస కాని కాంగ్రేసుల విలీనం అయితే ఇప్పుడు తెలంగాణా గురించి మాట్లాడే నాధుడే వుండడు. BJP, కాంగ్రెస్ పార్టీలు అధిష్టానానికి బందీలు. TDP సీమాంధ్ర చంద్రబాబు చేతిలోని కీలుబొమ్మ. ఇప్పటివరకు తెలంగాణా పక్షాన మాట్లాడగల, పోట్లాడ గల ఒకే ఒక పార్టీ తెరాస. కాబట్టి పొరపాటున కూడా ఆ పార్టీ కాంగ్రేసులో విలీనానికి అనుకూలంగా నిర్ణయం తీసుకోవద్దు. అదే అశేష తెలంగాణా ప్రజల ఆకాంక్ష. 

అలా కాక కాంగ్రేసులో తెరాస విలీనం చెందడానికి నిర్ణయిస్తే, అది తెలంగాణా ప్రజల ఆశలపై నీళ్ళు చల్లినట్టే! తెలంగాణా ప్రజానీకానికి ద్రోహం చేసినట్టే!!
  

Sunday, February 16, 2014

లగడపాటి పెప్పర్ స్ప్రే వీడియో

లగడపాటి రాజగోపాల్ తెలంగాణా బిల్లును అడ్డుకోవడానికి పార్లమెంటులో పెప్పర్ స్ప్రే అనే బ్రహ్మాస్త్రాన్ని(?) ప్రయోగించాడు. రాష్ట్రం లోని కొన్ని పచ్చ చానెళ్ళు నిస్సిగ్గుగా సమర్ధించాయి కూడా. కాని నేషనల్ మీడియాలో తీవ్ర నిరసనలు వచ్చే సరికి, అలాగే దేశంలోని మేధావులంతా తీవ్రమైన విమర్శలు చేసే సరికి సదరు లగడపాటి ఆత్మరక్షణలో పడ్డాడు. చివరికి ఆత్మా రక్షణ కోసమే ఆ పని చేశానని బుకాయించ చూసాడు. కాని కెమెరాల కళ్ళు కప్పలేడు కదా?

అతడి  పచ్చి తీవ్రవాద చర్య ఆత్మరక్షణ కోసం ఎంతమాత్రం కాదని, కావాలని ముందస్తు పతాకంలో భాగమే నని అతడు స్ప్రే చేసిన విధానం తేట తెల్లం చేస్తుంది. దీన్ని  BJP ఇప్పటి వరకు ఖండించక పోవడం లోని ఔచిత్యం ఆ పార్టీకి, పచ్చ బాబుకే తెలియాలి.

Friday, February 14, 2014

డ్రామాలతో ఒరిగిందేమిటి?

తెలంగాణా బిల్లు అసెంబ్లీ గడప దాటినప్పటి నుంచి సీమాంధ్ర నాయకులు, మీడియా పిచ్చి కుక్కల కంటే అధ్వానంగా మొరుగుడు మొదలు పెట్టిన్రు.

అసలు బిల్లు అసెంబ్లీ దాట నివ్వం
రాష్ట్రపతి క్లియరెన్సు ఇవ్వదు
కోర్టు బిల్లును పార్లమెంటుకు పోకుండా ఆపి వేస్తది
అసలు పార్లమెంటులో పెట్టనే పెట్టరు.
బీజేపి అడ్డు కుంటది.

ఇట్ల ఇష్టం వచ్చినట్టు కూతలు కూసుడు మొదలు పెట్టిన్రు. కాని వీళ్ళు ఎట్ల ఎట్ల కూసిన్రో, సరిగ్గా దానికి వ్యతిరేకంగా జరిగినై.

బిల్లు అసెంబ్లీ దాటింది
రాష్ట్రపతి క్లియరెన్సు ఇచ్చిండు
కోర్టు చెత్త కేసులన్నీ కొట్టేసింది
బిల్లు పార్లమెంటుకు వచ్చింది

బీజేపి మాత్రం కొంత తొండి మాటలు మాట్లాడుడు మొదలు పెట్టింది. అయినా వాళ్ళ నాయకులు ఆ వెంటనే మేం తెలంగాణా ఏర్పాటుకు పూర్తీ మద్దతు ఇస్తాం అని కూడా చెప్తున్నరు. వాళ్ళు ఏం చెప్పినా... గలాటా చేస్తున్న సీమాన్ధ్ర ఎంపీలను ఇంటికి పంపిన కాంగ్రెస్, సొంత బలంతోనే బిల్లు నెగ్గిన్చుకుంటనని గట్టిగనే చెప్తున్నది.

తెలంగాణా ఉద్యమం పుణ్యమా అని రాష్ట్రంల ఈ పాటికే బఫూన్ గా మారిన లగడపాటి, పార్లమెంటు మెంబర్లు, స్పీకర్ పై  పెప్పర్ స్ప్రే దాడి చేసి  భారత దేశం మొత్తానికి తన బఫూన్ గిరీ చాటుకున్నడు. మిగతా సీమాంధ్ర ఎంపీలు కూడా పార్లమెంటులో గూండాయిజం చెలాయిస్తూ, తెలంగాణా ఇవ్వడం ఎంత అవసరమో ఇతర రాష్ట్రాల వారికి వివరంగా అర్థమయ్యేటట్టు చెప్పకనే చెప్పిన్రు. వీళ్ళ వికృత చేష్టలు చూసి చేష్టలుడిగిన దేశ ప్రజలు వీళ్ళ చెరనుండి తెలంగాణా విముక్తి ఎంత అవసరమో అర్థం చేసుకున్నారు. ఇప్పుడు ఏ బీజేపీ మొకాలడ్డినా బిల్లు పాసై తీరుతది.

రెండు కళ్ళ సిద్దాంతం చెప్తున్న చెంద్రబాబు ఎక్కిన కడుప, దిగిన కడుప అనకుండా తిరుగ బట్టిండు, తెలంగాణా ఆపెతందుకు. ఇంకోదిక్కు నుండి జగను, ఇంకో పక్కనుండి కిరణ్, మరో పక్కనుండి రెండు నాల్కెల నాగ భైరవ! వీళ్ళకు దగ్గట్టు పూటకో మాట చెప్పే బీజేపీ. వీళ్ళందరి గుణపాఠం ఒక్క బిల్లుతోటి కుదరబోతున్నది!

ఇందరి డ్రామాల మధ్యన నిజంగా మోసపొతున్నది మాత్రం సీమాన్ధ్ర ప్రజలే. బఫూన్ గాళ్ళను, పగటేశ గాండ్లను నాయకులుగా ఎన్నుకున్న పాపానికో ఏమో... పార్లమెంటుల వాళ్ళ పక్షంల మాట్లాడే సీమాంధ్ర నాయకుడే కరువయ్యిండు పాపం!

Wednesday, January 29, 2014

వీళ్ళా, మన నాయకులు?

తెలంగాణా ఏర్పాటు ముహూర్తం దగ్గర పడుతున్న కొద్దీ ఆంధ్రా నాయకుల కుయుక్తులు, కపట నాటకాలు బయట పడుతున్నాయి.

వీరికి ప్రజాస్వామ్యమన్నా, రాజ్యాంగమన్నా ఏమాత్రం గౌరవం లేదు. ఇన్నాళ్ళు రాష్ట్ర ప్రభుత్వాన్ని, అసెంబ్లీని తమ మంద బలంతో చెప్పుచేతల్లో ఉంచుకున్నట్టు, ఇప్పుడు కేంద్రాన్ని, రాష్ట్రపతిని కూడా ప్రభావితం చేయడానికి సాహసిస్తున్నారు.

కాని వీరి తాటాకు చప్పుళ్ళకు తెలంగాణా వాదులు భయపడవలసిన అవసరం లేదు.  వీరి పశుబలం కేవలం ఆంధ్రపదేశ్ సరిహద్దులకు మాత్రమే పరిమితమైనది. అవి దాటినా తర్వాత వీరేం చేయబోయిన పరమ మూర్ఖ శిఖామణులుగా ముద్ర వేయించుకోవడం తప్ప ఇంకోటి చేతగాదు వీరికి!

నాడు పార్లమెంటులో నాలుగు ముక్కలు మాట్లాడడానికి కూడా చేతగాక ఈడిగిల పడ్డారు. చంద్రబాబు డిల్లీలో దీక్షకు దిగి జాతీయ మీడియా సాక్షిగా పరువు బజారు కీడ్చుకున్నాడు. ఇప్పుడు కిరణ్ కుమార్ తన తెలివితక్కువ తనంతో డ్రాఫ్టు బిల్లని, తిప్పి పంపాలని వచ్చీ రాని తెలుగులో జనానికి వినోదం పంచుతూ తన అఙ్ఞానాన్ని ప్రకటించు కుంటున్నాడు.

కేంద్ర ప్రభుత్వానికి చెందిన ఈ బిల్లుపై కేవలం అభిప్రాయాలు మాత్రమే చెప్పమని, అంతకన్నా ఎక్కువగా ఏమీ చేయవద్దని సాక్షాత్తూ రాష్ట్రపతి గారినుండి ఆదేశాలు వచ్చినా, అంశాల వారీగా ఓటింగు పెట్టాలని కాసేపు, తప్పుల తడక అంటూ కాసేపు, సమయం సరిపోదు, పెంచాలని కాసేపు చెపుతూ వొస్తున్న ఈ ముఖ్యమంత్రి ... చివరకు ఆ పాచికలేమీ పారక పోయేసరికి తిప్పి పంపాలని నోటీసు ఇచ్చాడట!

శనివారం నాడు అసెంబ్లీలో తిప్పి పంపానని చంద్రబాబు చెప్పడం, ఆ వెనువెంటనే ముఖ్యమంత్రి నోటీసు ఇవ్వగలగడం చూస్తుంటే వీరు తెలంగాణా కు వ్యతిరేకంగా ఏవిధంగా కుమ్మక్కు రాజకీయాలు నడపగలరొ ప్రజలు అర్థం చేసుకోవాలి. తెలంగాణా కాంగ్రెస్ నాయకులు ఈ విషయంలో ముఖ్యమంత్రిని బాగానే తూర్పార బట్టారు. కాని తెలంగాణా తెలుగుదేశం వారు మాత్రం చంద్రబాబుని ఇంకా వెనకేసుకు రావడం చూస్తుంటే వారికి తెలంగాణా ఏర్పాటుపై ఏమాత్రం నిజాయితీ లేదని, తెలంగాణాకు అనుకూలంగా చెప్తున్నా వారి మాటలు కేవలం ఉత్తుత్తివేనని, అంతా నటనేనని స్పష్టంగా అర్థమవుతంది. 

రాజ్యాంగం పై, రాజ్యాంగ సంస్థల పై ఏమాత్రం గౌరవం లేని, కేంద్ర రాష్ట్ర అధికారాలపై ఏమాత్రం అవగాహన లేని వీరి పనులను చూస్తూ... ఛీ, వీళ్ళా మమ్ములను ఇన్నాళ్ళు పరిపాలించిన నాయకులు, అని తెలంగాణా ప్రజలు సిగ్గుతో తలవంచుకుంటున్నారు. మీరు ఇన్నాళ్ళు వెలగబెట్టింది చాలు, ఇక నైనా మాది మేము చూసుకుంటాం, దయచేయండి అంటున్నారు.

Saturday, January 4, 2014

దోపిడీ యావ తప్ప చర్చించే చేవ ఏది?

ఛీ... మాంధ్ర నాయకుల్లారా!!!

మీకు ప్రజాస్వామ్యం మీద నమ్మకం లేదు. రాజ్యాంగం పై విశ్వాసం లేదు. రాష్ట్రపతి మీద గౌరవం లేదు.

అసెంబ్లీకి తెలంగాణా బిల్లు వస్తే దానిమీద చర్చించి అందులో లోపాలు వెలికి తీసే దమ్ము లేదు.  అవునులే మంద బలం పోగేసుకొని ఇన్నాళ్ళు తేరగా తెలంగాణా మీద పది మెక్కి తినడం తప్ప మీకు ఇంకేమి తెలుసు గనక?

ఆ మందబలంతోనే ఇబ్బడి ముబ్బడిగా మీ వైపు ప్రాజెక్టులు కట్టు కుంటిరి.  వాటి మీద పండిన పంటలతో కోట్లకు పడగ లెత్తితిరి. ఆ డబ్బులతో తెలంగాణా భూములను స్వాహా చేస్తిరి. అవే డబ్బులతో అవినీతి చేసి తెలంగాణా ఉద్యోగాలను, కాలేజీ సీట్లను, అన్ని రకాల అవకాశాలను కొల్లగొడితిరి.

అందుకే  తేరగా తినమరిగిన మీకు తేనెపట్టులా వున్న తెలంగాణా ఇప్పుడు విడిపోతుంది అనేసరికి ఎక్కడ లేని దుఃఖం రాబట్టింది! మెదడు పని చేయడం మాని వేసింది!! తలా తోకా లేని పిచ్చి వాగుడు మొదలైంది.

మీకు మెజారిటీ వుంది కాబట్టి అది ప్రజాస్వామ్యమా? మైనారిటీ ప్రజల ఆకాంక్ష ప్రజాస్వామ్యం కాదా? మరి మీకన్నా మెజారిటీ గా వున్న తమిళ ప్రజలు నాడు కూడదంటే ఎందుకు విడిపోయి వచ్చారు? రాజ్యాంగం లో వున్నఆ  ఆర్టికల్-3 పెట్టిన భిక్ష వల్ల కాదా? ఇప్పుడు అదే ఆర్టికల్-3 పనికిరానిదైందా?

విభజనకు ఒప్పుకొని, వాగ్దానాలు చేసి, తెలంగాణా ప్రజల ఓట్లు కాజేసిన మీరు, అదే ప్రజలు గత పదేళ్లుగా విభజన తీర్మానం చేయమని కోరినా మోసపూరితంగా మొండి చెయ్యి చూపిన మీకు, ఇప్పుడు సమైక్య తీర్మానం కావలసి వచ్చిందా? మందబలం మీకే ఉందిగా? మరి ఆ సమైక్య తీర్మానం అప్పుడే  ఎందుకు చేయలేదు? మీ మోసాలు బయట పడతాయనే గదా? మీకు ఓట్లు, సీట్లు రావనే గదా?

ముఖ్యమంత్రి మీ వాడే. స్పీకరు మీవాడే! రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు, ప్రధాన ప్రతిపక్ష నాయకుడు మీవాడే! అయినా తృప్తి లేదు! ఏదో ఊడబొడిచేస్తాడేమోననే అనుమానంతో శాసన సభా వ్యవహారాల మంత్రిని కూడా తప్పించి రాజ్యాంగం మీద ఆవగింజంత అయినా విశ్వాసం లేని కరడు గట్టిన సమైక్యవాదిని ఆ స్థానంలో ప్రతిష్టించు కున్నారు! అయినా కూడా అసెంబ్లీలో చర్చించే ధైర్యం రావడం లేదు!!

మాట మాట్లాడితే బిల్లు తప్పుల తడక అంటరు. బిల్లులో తప్పులేమిటో చెప్పమనే గదా మిమ్మల్ని చర్చకు పిలిచింది?

అవునులే! దోపిడీ సొమ్ము తినడం తప్ప మరోటి తెలియని మీరు ఏమి చర్చించ గలరు? ఏమి సూచనలు చేయ గలరు?

విభజన తర్వాత కూడా దోపిడీలు యధేచ్చగా చేసుకోనిమ్మని అడగగలరా?

తెలంగాణా భూములను ఎండబెట్టి అర్హత లేని ప్రాంతాలకు అదనపు జలాలిమ్మని అడగగలరా?

తెలంగాణా ప్రాంతపు ఉద్యోగాలు కూడా మేమే చేస్తామని అడగగలరా?

తెలంగాణా కాలీజీల్లో కూడా మేమే చదువులు వెలగ బెడతామని చెప్పగలరా?

విభజన తర్వాత కూడా యధేచ్చగా (తెలంగాణా ప్రాంతంలో) ఫాక్షనిజం, కబ్జాలు చేసుకోవడానికి అనుమతి అడగ్గలరా?

ఇవన్నీ అడిగితే ప్రపంచం మొత్తం మీద మీ పరువు పోతుంది. అవి తప్ప మీరు అడగలిగిన విషయాలూ, బిల్లులో మార్పు చెయ్యదగిన సూచనలూ ఇంకేమీ మీ మనస్సులకు తట్టవు మరి!

అందుకే మీరు సభలో చర్చించ లేరు! సజావుగా చర్చకు రాలేని మీరు చేయగలిగిన ఒకే ఒక పని... దుశ్శాసనున్ని తలపించే విధమైన కౄర వికటాట్టహాసాలు.... ద్రౌపదీ వస్త్రాపహరణాన్ని తలపించే విధమైన బిల్లు కాగితాల చింపివేత!

మీ వికృత విన్యాసాల వల్ల సాధించ గలిగింది ఏమీ లేదు! జనవరి 23 తర్వాత బిల్లు దానంత అదే మాంత్రికుడి చెరలోని రామచిలక వలె విముక్తి చెంద బోతోంది! ఆ తర్వాత మీరు చేయగలిగింది శూన్యం. కాని ఆ లోపు సజావుగా చర్చ జరిపి సీమాంధ్ర ప్రజల న్యాయమైన కోర్కెలు వెల్లడించే చారిత్రిక అవకాశాన్నికోల్పోవడం, ఆ ప్రాంత ప్రజలు మీవంటి భక్షకులను ఎన్నుకున్నందుకు చేసుకున్న స్వయంకృతాపరాధం!!

ధర్మో రక్షతి రక్షితః