Sunday, October 13, 2013

RTC వారు విలీనం ఎందుకు కోరుతున్నారు?






సమైక్యత కోసం సీమాంధ్ర ఉద్యోగులు చేసిన సమ్మెలో RTC ఉద్యోగులు ముందునుంచీ పాల్గొన్నారు. సాధారణంగా RTC ఉద్యోగులు రాష్ట్ర ఇతర ఉద్యోగులతో కలిసి సమ్మెల్లో పాల్గొనడం బహు అరుదు. ఎందుకంటే ఎప్పటికప్పుడు వారి సమస్యలే వారికి బోలెడన్ని వుంటాయి. వారి పని పరిస్థితులు (working conditions), వేతనాలకోసం చేసే సమ్మెలతోనే వారికి సరిపోతుంది. తెలంగాణాలో సకల జనులు సమ్మె చేసినా, RTC వారు ఏ కొద్ది రోజులో తప్ప ఆ సమ్మెలో పాల్గొనలేదన్న విషయం ఇక్కడ గుర్తించాలి.

అటువంటిది APNGOలతో భుజం కలిపి వారితో సమానంగా విధులను బహిష్కరించి సమ్మెలో RTC వారు పాల్గొనడం మొదటినుండి ఆశ్చర్యాన్ని కలిగిస్తూనే వుంది. అయితే అందుకు గల కారణాన్ని RTC కార్మిక నాయకులు LB స్టేడియంలో జరిగిన మీటింగులోనే వివరించారు. రాష్ట్రం విడిపోతే సీమాంధ్ర ప్రాంతంలో RTC ఒక్క రోజులో మూత పడుతుందని వారు చెప్పారు. అక్కడి ప్రాంతంలో EPK (Earnings per Kilometer) తక్కువగా వుండడం దానికి కారణంగా వారు వివరించారు.

రాష్త్రం మొత్తం RTC ఒకటే సంస్థ అయినపుడు ఆ ప్రాంతంలో EPK తక్కువగా ఎందుకు వుంటుంది? ఇది సహజంగా ప్రతి ఒక్కరికీ కలిగే ప్రశ్న. దీనిపై అధ్యయనం జరిపినప్పుడు కొన్ని పాలకుల సీమాంధ్ర పక్షపాతానికి సంబంధించిన వికృత వాస్తవాలు బయటికి వచ్చాయి.

తెలంగాణా ప్రాంతంలో RTC బస్సుల వినియోగం ఎక్కువ. ఆంధ్ర ప్రాంతంలో ప్రైవేటు బస్సులను ఎక్కువగా ఆదరిస్తారు. రైల్వే నెట్‌వర్కు ఎక్కువగా వుంటుంది. నౌకా ప్రయాణాలు కూడా ఎక్కువే. కాబట్టి అక్కడ RTC బస్సుల వినియోగం తక్కువ. వ్యాపారి ఎక్కువ ఆదాయం ఎక్కడ వస్తుందో అక్కడ ఎక్కువ పెట్టుబడి పెడతాడు. కాని RTC వారు మాత్రం ఈ చిన్న వ్యాప్రార సూత్రాన్ని విస్మరించారు. ఆదాయానికి మించిన బస్సులు, డిపోలు సీమాంధ్రకు కేటాయించారు. దాని ఫలితమే నేటి సమస్య. ఆదాయానికి తగిన దామాషాలో పెట్టుబడులు వుండాలన్న విషయం RTC మేధావులకు తెలియదా?

ఎందుకు తెలియదు? కాని అంతటా జరుగుతున్న తంతే RTCలోనూ జరిగింది. నిర్ణయాలు తీసుకునే అధికారుల్లో సింహభాగం తస్మదీయులు కావడమే అందుకు కారణం. లాభాలను ఇస్తున్న తెలంగాణాను గాలికి వదిలేసారు. కొత్త బస్సులు, లగ్జరీ బస్సులు, వోల్వో బస్సులు ఎక్కువ భాగం ఆంధ్రా ప్రాంతానికి కేటాయించడం మొదలు పెట్టారు.

దీనికి కారణాలు లేక పోలేదు. ఎక్కువ బస్సులు వుంటే తమ ప్రాంత జనానికి ఎక్కువ సౌకర్యవంతంగా వుంటుంది. తెలంగాణాలో మాదిరిగా top service చేయాల్సిన అవసరం లేదు. హాయిగా సీట్లలో కూర్చుని ప్రయాణించ వచ్చు. ఎక్కువ బస్సులుంటే ఎక్కువ డిపోలు వేసుకోవచ్చు. ఎక్కువ సిబ్బందిని నియమించుకోవచ్చు. తద్వారా ఎక్కువ ఉద్యోగాలు వస్తాయి. మరి వీరందరికీ జీతాలు ఎక్కడినుండి వస్తాయి? ఇంకెక్కడినుండి? తెలంగాణా వారు బస్సు టాపు మీద ప్రయాణించి సమర్పించుకున్న డబ్బులనుంచి. సంస్థను సపోర్టు చేసేది ఒకడైతే భోగాలు అనుభవించేది ఇంకోడన్న మాట!

కథ ఇక్కడితో ముగిసి పోలేదు. ఆదాయానికి మించి బస్సులను, డిపోలను, ఉద్యోగాలను సీమాంధ్రకు కేటాయించడం ఒక ఎత్తయితే, బస్ సర్వీసులను కూడా సమన్యాయం పాటించకుండా కేటాయించడం మరో ఎత్తు.

ఉదాహరణకి హైదరాబాదు - మచిలీపట్నం మధ్యన రోజుకు నాలుగు సర్వీసులు ప్రయాణిస్తాయనుకుందాం. అప్పుడు న్యాయప్రకారంగా హైదరాబాదుకు రెండు, మచిలీపట్నానికి రెండు సర్వీసులు (లేదా వాటికి అవసరమైన బస్సులు) కేటాయించాలి. కాని కేటాయింపులు అలా జరగలేదు. మీరు హైదరాబాదులోని మహాత్మాగాంధీ బస్ స్టేషనుకు వెళ్ళి పరిశిస్తే ఇట్టే అర్థమవుతుంది, అన్ని బస్సులూ ఆంధ్రాకే కేటాయించిన విషయం. విమర్శలు రాకుండా అక్కడక్కడా ఒకటీ, అరా మాత్రం తెలంగాణాకి కేటాయించారు.

ఇప్పుడు రాష్ట్రం విడిపోతే తెలంగాణా వారు, తమకు ఎన్ని బస్సులు వస్తాయో, అన్ని బస్సులూ తమ ప్రాంతం నుండి ఆ ప్రాంతానికి తిప్పుతామని అంటారు. ఆ విధంగా చూసినప్పుడు ఇప్పుడు వారు చెప్పుకుంటున్న EPK కన్నా కూడా వారి EPK మరింత తక్కువకు పడిపోతుంది. ఇప్పుడు ఉన్న ఆంధ్రా ప్రాంతపు EPKలో వారు అక్రమంగా తిప్పుకుంటున్న, న్యాయంగా తెలంగాణాకు చెదవలసిన EPK కూడా కలిసివుంది.

అదనంగా అనుభవిస్తున్న బస్సులు, డిపోలు, ఉద్యోగాలు ఎలాగూ వదులుకోలేరు కాబట్టి సీమాంధ్రకు చెందిన RTC నాయకులు ప్రభుత్వంలో RTCని merge చేయమని కోరుతున్నారు. అలా విలీనం చేయడం వల్ల ఆ నష్టాలను ప్రభుత్వమే భరిస్తుంది, తాము జవాబుదారీ కావలసీ అవసరం లేదని వారి వ్యూహంగా కనపడుతుంది. కాని వరల్డ్ బ్యాంక్ చేత శాసించ బడుతున్న ఈ ప్రపంచీకరణ రోజుల్లొ వారి కోరిక ఎంత వరకు నెరవేరుతుందో వేచి చూడాల్సిందే.

No comments:

Post a Comment