Friday, October 11, 2013

ఏది సమన్యాయం?


ఎన్నొ అడ్డంకులను ఎదుర్కున్న తెలంగాణా ఉద్యమం చివరికి సాకారం కాబోతున్న దశలో కొన్ని విష సర్పాలు పడగలెత్తి విషం చిమ్ముతూ తమ చివరి ప్రయత్నంలో భాగంగా సర్వ శక్తులూ ఒడ్డుతున్నాయి. ఆ సర్పాల్లో ఒకటి జగన్ అయితే రెండోది చంద్రబాబు నాయుడు.

తెలంగాణా విషయంలో డజన్ల సార్లు 'U' టర్న్‌లు తీసుకున్న చంద్రబాబు ఢిల్లీలో దీక్ష డ్రామాలు ఆడుతూ, రాబోతున్న తెలంగాణాను ఆపడానికి కొంతమంది మూడో ఫ్రంట్ నాయకులతొ తెరవెనుక మంతనాలు చేస్తూ బిజీగా వున్నారు. ప్రజలను ప్రభావితం చేయగల నాయకత్వ పటిమ లేనటువంటి చంద్రబాబు, మొదటి నుండి తన రాజకీయ మనుగడకు కుట్రలను, కుతంత్రాలను ఆసరా చేసుకుంటూ నెట్టుకొస్తున్నారు.

కేంద్రం రాష్ట్ర విభజన ప్రకటన చేసిన వెంటనే చంద్రబాబు దాన్ని సూత్ర ప్రాయంగా అంగీకరిస్తూ, కొత్త రాజధానికి ప్యాకేజీని కోరుతూ ప్రకటన ఇచ్చారు. కానీ దాన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళడం లో విఫలం చెంది, చివరకు సమ న్యాయం అంటూ దొంగనాటకాలు ఆడడం మొదలు పెట్టారు. రాజ్‌దీప్ సర్ సర్దేశాయ్ అనే CNN-IBNకి చెందిన జర్నలిస్టు తెలంగాణా విషయంలో చంద్రబాబు భావ దారిద్ర్యాన్ని నగ్నంగా బహిర్గత పరచారు. ఆయన చేసిన ఇంటర్వూలో తన వద్ద ఈ సమస్యకు ఎలాంటి పరిష్కారం లేదని, తాను తెలంగాణా ఏర్పాటును కాని, సమైక్యవాదాన్ని కాని బలపరచ లేనని ఒప్పుకున్నారు. పైగా ఈ నిర్ణయం వల్ల తన పార్టీ దెబ్బతింటుంది కాబట్టి వ్యతిరేకిస్తున్నానని స్పష్టంగానే సెలవిచ్చారు.

తెలంగాణా పార్టీ నష్టపోతుంది కాంగ్రెస్ నిర్ణయం వల్ల కాదు, కేవలం ఆ పార్టీ రాజకీయ జడత్వం వల్ల. సమస్యను గుర్తించి రాజకీయ పరిష్కారాన్ని అన్వేషించే విషయంలో అది ఘోరంగా విఫలమైంది. అటువంటి పరిస్థితిలొ పరిష్కారానికి ప్రయత్నిస్తున్న ఇంకో పార్టీని వ్యతిరేకించే నైతిక హక్కు అది ఎప్పుడో కోల్పోయింది. ఈ దీక్ష వల్ల తెలుగు దేశం పార్టీకి అటు సీమాంధ్రలోనూ, ఇటు తెలంగాణాలోనూ ఒనగూరే ప్రయోజనం ఏమీ లేదు మరోసారి తన రాజకీయ దివాళాఖోరు తనాన్ని బయట పెట్టుకోవడం తప్ప.

సమన్యాయం కావాలని కోరుతున్న చంద్రబాబు ఆ సమన్యాయం అంటే ఏమిటో నిర్వచించడానికి మాత్రం ప్రయత్నం చేయడం లేదు. కారణాలు సుస్పష్టం. అందుకోసం తర్కించినకొద్దీ నిర్ణయాలు తెలంగాణాకు అనుకూలంగా మారుతాయే తప్ప సీమాంధ్రకు కాదు. అది చంద్రబాబుకు బొత్తిగా ఇష్టం లేని విషయం. ఏదో ఒక వంక చెప్పి రాష్ట్ర విభజనను ఆపడమే ఆయన ధ్యేయంగా కనపడుతుంది.

ఇంతకీ సమన్యాయం అంటే ఏమిటి? ఐదు దశాబ్దాలుగా అన్ని రకాలుగా దోచుకున్న తెలంగాణాకు ఏ విధంగా సమన్యాయం చేస్తారు? కేటాయింపులు లేక పోయినా లక్షల ఎకరాల్లో క్రిష్ణా జలాలను పారించుకుంటున్న విషయాన్ని స్వయంగా ముఖ్యమంత్రే ఒప్పుకున్నారు. వాటికై ఎంత పరిహారాన్ని చెల్లిస్తారు? పక్కనే కృష్ణా పారుతున్నా తమ ప్రాంతీయ పక్షపాతంతో నల్లగోండ ప్రజలను దశాబ్దాలుగా ఫ్లోరీన్ వాతకు గురి చేసిన నేరానికి ఎంత పరిహారం చెల్లిస్తారు? తెలంగాణా ప్రాంతానికి చెందిన వేలాది ఉద్యోగాలను అక్రమంగా అనుభవిస్తూ, ఇక్కడి ప్రజలను అన్యాయానికి గురిచేసినందుకు ఎంత పరిహారాన్ని చెల్లిస్తారు? పైగా ఇక్కడే తిష్ట వేస్తాం అంటూ బీరాలు పలుకుతున్నారే!

చంద్రబాబుకు కానీ మరో సీమాంధ్ర నాయకునికి గానీ తెలంగాణాని ఆపాలని ఎంత కోరిక ఉన్నా, 'సమన్యాయం' అన్న వాదనను పట్టుకుంటే అది చివరికి తెలంగాణాకు ప్రయోజనం చేకూరుస్తుందే తప్ప సీమాంధ్రకు కాదు. కారణం న్యాయం తెలంగాణా వైపు వుంది కాబట్టి. సమైక్య వాదులు కోరుతున్నది ప్రాంతీయ దోపీడీని స్థిరీకరించడం కాబట్టి వారి కోరికలో న్యాయం లేదు. అంతకన్నా విభజనానంతరం సీమాంధ్రకు చేకూర వలసిన నిర్దిష్ట ప్రయోజనాలకోసం పోరాటం చేస్తే భవిష్యత్తులోనైనా వారు ఆ ప్రాంత ప్రజల మనస్సులను గెలుచుకో గలుగుతారు.


No comments:

Post a Comment