Thursday, October 3, 2013

జయహో తెలంగాణ!

తెలంగాణా రాష్ట్ర ఏర్పాటు పథంలో ఈరోజు రెండొ కీలకమైన మైలు రాయి దాటిన సందర్భంగా తెలంగాణా వాదులందరికీ అభినందనలు.

1969 ఉద్యమంలో తీవ్ర అణచివేతకు గురైన దరిమిలా, తెలంగాణా రాష్ట్రం అసలు ఎప్పటికైనా ఏర్పడుతుందా? అన్న శంకతో ఉన్న ప్రజలను తట్టిలేపి తన మార్గంలోకి రప్పించిన ఘనత మాత్రం KCRదే. అందుకే రాష్ట్రం ఏర్పాటును వ్యతిరేకించే ప్రతి ఒక్కడూ ఆయన్ను తిట్టని తిట్టు లేదు.

KCR స్థాపించిన TRS పార్టీ ఇచ్చిన ప్రేరణ వల్ల అనేక ఇతర ప్రజా సంఘాలు JACలు, కవులు, కళాకారులు, నెటిజన్లు, బ్లాగర్లు ఇలా ఒకరేమిటి? ప్రతి ఒక్కరు నదులు, ఏర్లు, పిల్ల కాలువలై తెలంగాణా పోరాట స్రవంతిలో భాగంగా మారారు. తమవంతు కర్తవ్యాన్ని నిర్వహించారు. వారందరికీ నా ఉద్యమాభివాదాలు.

ఒకవైపు బలమైన శతృవులను నిర్భీతిగా ఎదుర్కుంటూ KCR అభిమన్యునిలా పోరాడుతుంటే, మరో వైపు ధర్మరాజులా తొణకని కుండలాంటి మూర్తిమత్వంతో కోదండరాం తెలాంగాణా పోరాటానికి వెలకట్టలేని నాయకత్వాన్ని అందించారు. వీరందరినీ మించి ఉద్యమంలో స్తబ్దత నెలకొన్న ప్రతీసారీ, తమ ప్రాణాలను తృణప్రాయంగా భావించి, పణంగా పెట్టి ఉద్యమ స్పూర్తిని రగిలించిన అమరవీరులది వెలకట్టలేని పాత్ర.

తెలంగాణా రాష్ట్ర ఏర్పాటుకై ఇప్పటివరకూ జరిగిందానితో పోలిస్తే ఇకముందు జరగాల్సింది నల్లేరు మీద బండి నడక. అయినా మనం అప్రమత్తంగానే వుందాం, సీమాంధ్ర నాయకుల కుట్రలను కలిసికట్టుగా ఎదుర్కుందాం!

ఈ సందర్భంలో తలుచుకోవలసిన మరొక పేరు సోనియా గాంధీ. సీమాంధ్ర నాయకులు ఎన్ని అడ్డంకులు సృష్టిస్తున్నా తొణక్కుండా ధీరవనిత అనిపించుకున్నారు! తెలంగాణా ఏర్పాటులో తన ప్రయోజనాలు తనకుండొచ్చు, కాని ప్రయోజనాలు లేకుండా ఎవరూ ఏమీ చేయరు. తెలంగాణా రాష్ట్రం సాకారమైన తర్వాత ఈ ప్రాంతపు ప్రజలు గుర్తుంచుకోవాల్సిన పేరు ఆమెది.

ఇక పోతే సీమాంధ్ర ప్రజలకు ఒక విఙ్ఞప్తి. ఇప్పటికైనా కలవడానికి ఇష్టం లేని ప్రాంతాన్ని కలపుకోవడానికి చేసే దొంగ సమైక్యతా ఉద్యమాలు గుర్తింపుకు నోచుకోవని, ఉన్మాదంగా భావించబడతాయని తెలుసుకోండి. అలాగే, పరాయి ప్రాంత భూభాగాలను కబళించడం తప్పని ఇకనైనా గుర్తించి సొంత రాజధాని ఏర్పాటు కోసమై గట్టి ప్రయత్నం చేయండి. అందుకై కేంద్రంపై పోరాడండి. అందుకోసం తెలంగాణా వాదులం పూర్తి సంఘీభావం తెలుపుతాం.


No comments:

Post a Comment