చాలా కాలం కింది మాట. ఆ వూర్లో నీటి ఎద్దడి ఉండేది. మంచి నీళ్ళకు మరింత కొరత. ఊరి సర్పంచి ట్యాంకరు ఏర్పాటు చేసి ఇంటింటికి మంచినీటి పంపిణీ చేయించాడు. ఆ పంపిణీ ఇంటిలో ఉన్న జనాభా ప్రాతిపదికన జరిగేది. అలా సాగుతుండగా ఒక రోజు ఒక ఇంటి నుంచి పేచీ వచ్చింది.
వారిదో ఉమ్మడి కుటుంబం. అన్న, తమ్ముడి కుటుంబాలు ఒకే ఇంట్లో కలిసి వుంటున్నారు. సర్పంచి తమ్మున్నడిగాడు, "ఏమిటి యాదగిరి, ఎందుకు పంచాయితీలో పేచీ పెట్టావ్?"
"ఏం చెప్పేదయ్యా? మీరుండగా ఈ వూళ్ళో అన్యాయం జరగదనుకున్నాను. కాని పరిస్థితి వేరుగా వుంది. ఎవరిపైనా ఆరోపణలు చేయ దలుచుకొలేదు. మా అన్నదమ్ములను వేరుపాటు చేయండి, చాలు".
సర్పంచి సాలోచనగా తల పంకించాడు. "కారణం చెప్పకుండా వేరుపాటు ఎలా కుదురుతుంది? ఎందుకు వేరు పడాలను కుంటున్నావు?"
యాదగిరి చెప్ప సాగాడు, "కారణాల కేం చాలానే వున్నాయి. మచ్చుకు ఒకటి చెప్తాను, వినండి... మీరు ఊరి బాగుకోసం మంచి నీటి ఏర్పాటు చేశారు, బాగానే వుంది. కాని దానివల్ల నా కుటుంబానికి ఒరిగింది ఏమీ లేదు. మీరు జనాభా ప్రాతిపదికన మా ఇంటికి ఐదు బిందెల నీరు కేటాయించారు. కాని నా కుటుంబానికి మాత్రం దాంట్లో ఐదు గ్లాసుల నీళ్ళు కూడా మిగలటం లేదు. నీళ్ళు మొత్తం మా అన్నగారి కుటుంబానికే సరిపోవటం లేదు", విషయం చెప్పాడు యాదగిరి.
సర్పంచి అన్న వైపు ప్రశ్నార్థకంగా చూశాడు, "ఏం సుబ్బయ్యా? మీ ఇంట్లో ఉన్న పది మందికి ఐదు బిందెలని నేనే లెక్క గట్టాను. మరి ఎందుకు సరిపోవడం లేదు?"
సుబ్బయ్య సర్పంచికి వంగి దండం పెట్టుకున్నాడు, "అయ్యా, ధర్మ ప్రభువులు, మీరు సరిగానే నిర్ణయించారయ్యా, దాంట్లో తప్పులేదు. కాని ఇంట్లోకి నీళ్ళు తెచ్చుకున్నాక ఇంటి అవసరాలకు తగ్గట్టు పంచుకుంటాం కాని ఇలా వీధిన పడతామేవిటండీ? మీరే మా తమ్ముడికి గట్టిగా బుద్ధి చెప్పండయ్యా."
సర్పంచి చిరాగ్గా మందలించాడు. "సుబ్బయ్యా, ఊకదంపుడు మానేసి అడిగిన దానికి సమాధానం చెప్పు. నీరు ఎందుకు సరిపోవడం లేదు?"
"ఎం చెప్పమంటారయ్యా? మా కుటుంబానికి అవసరాలు ఎక్కువ. మా చంటి దానికి మంచి నీళ్ళతోనే స్నానం చేపించాలి. నాకేమో కాళ్ళ తిమ్మిర్లు... వేడి చేసిన మంచి నీళ్ళలో కాళ్ళు పెట్టుకొమ్మని నాటు వైద్యుడు చెప్పాడు. మా ఆవిడకి ఉప్పునీళ్ళ తో స్నానం చేస్తే దుద్దుర్లు వస్తాయి, కాబట్టి మంచి నీళ్ళే కావాలి. ఇవికాక మిగిలిన నీళ్ళు మా వంటకు సరిగ్గా సరిపోతాయి. అయినా కూడా మేం కొంచం తగ్గించుకుని అప్పటికీ అర బిందె నీళ్ళు మా తమ్ముని కుటుంబానికి ఇస్తున్నాం. ఉమ్మడి కుటుంబం అన్న తర్వాత ఎలాగోలా సద్దుకోవాలి కాని, ఇలా పేచీలు పెడితే ఎలాగయ్యా?"
సర్పంచికి విషయం అర్థమయ్యింది. "దీంట్లో నా తప్పు కూడా వుంది. ఇంటి అవసారాలకు తగ్గట్టు నీటి సరఫరా చేస్తున్నాననుకున్నాను కాని, ఇంటిలోని కుటుంబాలకు అవి సరిగా చేరుతున్నాయో లేదో అని చూడలేదు. గుమస్తాగారూ, సుబ్బయ్య కుటుంబానికి స్పెషల్ గా మన పంచాయితీ నియమాల పుస్తకంలో ఒక పేరా చేర్చండి... దాని ప్రకారం సుబ్బయ్య భార్యకు మూడు బిందెలు, అయన తమ్ముని భార్యకు రెండు బిందెలూ సపరేట్ గా నీళ్ళు అందించాలి."
గుమస్తా గ్రామ పెద్ద చెప్పినట్టు చేశాడు, "నియమాల పుస్తకం పేజీ నంబరు 371, ఐటం D ప్రకారం సభ్యుల సంఖ్య ప్రాతిపదికన సుబ్బయ్య భార్యకు 3 బిందెలు, యాదగిరి భార్యకు 2 బిందెలు అందించ వలసినదిగా ట్యాంకర్ డ్రైవరుకు ఆదేశాలు జారీ చేయడమైనది."
*****
కట్ చేస్తే ...
*****
నలభై సంవత్సరాలు గిర్రున తిరిగి పోయాయ్. తీర్పు చెప్పిన సర్పంచి, నమోదు చేసిన గుమస్తా గాల్లో కలిసి పోయారు. ఈసారి సుబ్బయ్య, యాదగిరి మధ్యన సర్దుకోలేనంతగా విభేదాలు పెరిగాయి. యాదగిరి విదిపోతానన్నాడు. సుబ్బయ్య కలిసి ఉండాల్సిందే అని మొండికేశాడు. వాదనలు విన్న పంచాయితీ యాదగిరి వాదనలో న్యాయం వున్నట్టు గ్రహించి, విభజన వైపు మొగ్గింది.
"సుబ్బయ్యా, ఇక మీ కుటుంబాలు కలిపి ఉంచే పరిస్థితి కనిపించడం లేదు. పంచాయితీ సభ్యులం మీ కుటుంబం విడిపోవాలని నిర్ణయించాం, ఇక నువ్వు చెప్పుకునేది ఏమైనా ఉందా?", సర్పంచి అడిగాడు.
సుబ్బయ్య కోపంతో ఊగి పోయాడు, "బయటివాళ్ళు మీరు ఎలా విడదీస్తారండీ, పచ్చని కుటుంబాన్ని? మీ తీర్పు చెల్లుబాటు కాదు."
"చూడు సుబ్బయ్యా గ్రామ నియమాలు మూడో పేజీలో కుటుంబాలు విడదీసే తీర్పులు చెప్పే హక్కు పంచాయితీకి ఉంటుందని స్పష్టంగా వుంది. కాబట్టి ఈ నిర్ణయం తీసుకొనే హక్కు మాకుంది, పైగా మీ తమ్ముడు విభజన కోరుతున్నాడు. ఆయన్ని ఒప్పించ లెంత వరకు నువ్వు విభజనను అడ్డుకోలేవు".
"మీకు తెలియని బ్రహ్మాస్త్రం నాదగ్గరొకటి వుంది!" కొంటె నవ్వొకటి నవ్వాడు సుబ్బయ్య. "నియమాలు 371 వ పేజీలో పేరా D చదవండి మీకే తెలుస్తుంది!! దాంట్లో సుబ్బయ్య ఉమ్మడి కుటుంబానికి 3:2 బిందెలు విడిగా ఇవ్వాలని స్పష్టంగా పేర్కొన బడింది".
"ఐతే?"
"అది ఉన్న తర్వాత మూడో పేజీలోని నియమం చెల్లదు".
సర్పంచికి చిర్రెత్తు కొచ్చింది "నీ నక్క జిత్తులు నా వద్ద కాదు సుబ్బయ్యా! గతంలో నువ్వు చేసిన నీటి దోపిడీ ఆపడానికే ఆ నియమం చేర్చ బడింది. అయినా నీ దోపిడీలు ఆగక పోగా మరింత పెరిగినందుకే ఇప్పుడు విభజన చేస్తున్నది. ఆ నియమం చూపించి విభజన ఎలా ఆపగలవు? మీ కుటుంబం విడిపోగానే ఆ నియమం దానంత అదే రద్దై పోతుంది".
యాదగిరి పంచాయితీకి దండం పెట్టుకున్నాడు. సుబ్బయ్య ముఖం తెల్ల బోయింది!
No comments:
Post a Comment