Sunday, June 24, 2012

బావి మైసమ్మ మాయం!


- గనుల్లో కొలువుదీరిన బెజవాడ దుర్గమ్మ 
- తెలంగాణ సంస్కృతిపైనా ఆధిపత్యం
- దేవుళ్లపైనా వివక్ష ప్రదర్శిస్తున్న అధికారులు

తెలంగాణ కొంగు బంగారమైన సింగరేణిలో పాగా వేసిన ఆంధ్రా అధికారులు ఇక్కడి సంస్కృతిపైనా ఆధిపత్యం చెలాయిస్తున్నారు. కోల్‌బెల్ట్‌లోని గనులపై కొలువుదీరిన గ్రామదేవతల స్థానంలో బెజవాడ కనకదుర్గమ్మ గుళ్లను నిర్మించారు. దుర్గాదేవి ఉత్సవాలకు కార్మికుల జీతం నుంచి చందాలు వసూలు చేసి మేనేజ్‌మెంటు బలవంతంగా నిర్వహించటం మొదలైంది. సీమాంధ్ర అధికారులు ఇక్కడి వనరుల దోపిడీతోపాటు సంస్కృతిపైనా వివక్ష ప్రదర్శిస్తున్నారు. ఆచారాలు, మొక్కుబడులు వేరైనప్పటికీ, భగవంతుని రూపంలో ప్రకృతిని ఆరాధించడం... నలుగురూ ఒక చోట సంబరాలు చేసుకోవడం ఏ ప్రాంతంలోనైనా కనిపిస్తుంది. తెలంగాణలోని గ్రామ దేవతల సంస్కృతి ఆంధ్రా అధికారులకు రుచించలేదు. అలాగని బెజవాడ దుర్గమ్మను తెలంగాణ ప్రజలు కొలవరని విభేదించడం లేదు. నిత్యం అక్కడికి వెళ్లే భక్తులున్నారు. భవానీ మాల ధరించేవాళ్లు కూడా కోకొల్లలు. కానీ శతాబ్దాలుగా సాగుతున్న సంస్కృతిని ఆంధ్రా అధికారులు పాతెయ్యడం పైనే విమర్శలున్నాయి.

మైసమ్మకు మొక్కడం ఆనవాయితీ
తెలంగాణ జీవనంలో గ్రామ దేవతలకు అత్యంత ప్రాధాన్యత ఉంది. తెలంగాణ వ్యాప్తంగా ఘనంగా నిర్వహించే బోనాల పండుగ గ్రామదేవతలకు ఉన్న ప్రాధాన్యం ఏంటో చెబుతోంది. పోచమ్మ, మైసమ్మ, ఉప్పలమ్మ, ఎల్లమ్మ... ఇలా అనేక రూపాల్లో వెలసిన ఏడుగురు అక్కచెల్లెల్ల ప్రతిరూపమే తెలంగాణ గ్రామదేవతలు. కాకతీయుల కాలంలోనూ సప్తమాతృకలకు ప్రత్యేక పూజలు జరిగేవి. కాకతీయులు నిర్మించిన ప్రతి ఆలయంలోనూ సప్తమాతృకల విగ్రహాలను చూడవచ్చు. ప్రతి చెరువు వద్ద మైస మ్మ, ఇంటి ఆవరణలో ఉప్పలమ్మ...గుళ్లు తెలంగాణలో కనిపిస్తాయి. ఆ క్రమంలో గనులపైనా మైసమ్మ, ఉప్పలమ్మ, పోచమ్మ వంటి దేవతలను సింగరేణి కార్మికులు అనాదిగా పూజిస్తున్నారు. గనుల్లోకి వెళ్లే ముందు ప్రతి కార్మికుడు చల్లగా చూడు తల్లీ అని బావి మైసమ్మకు మొక్కడం ఆనవాయితీ. గనుల్లో కొత్త యంత్రాలు ప్రవేశపెట్టినా, ఆషాఢ, శ్రావణ మాసాలు, బోనాల పండుగ, ఏదైనా సంబురం చేసుకోవాలనుకుంటే కార్మికులు బావి మైసమ్మ వద్దే కోళ్లు, గొర్రెలు, మేకలను బలి ఇచ్చి విందు చేసుకుంటారు. గ్రామదేవతలను పూజించేందుకు వేదాలు చదవాల్సిన పని లేదు. కొన్ని సాధారణ కులాల వాళ్లే పూజారులుగా వ్యవహరిస్తారు.

ఆచారాన్ని గౌరవించిన బ్రిటీష్ దొరలు
ఈ సంస్కృతిని నాటి బ్రిటీష్ అధికారులు కూడా గౌరవించారు. వారే స్వయంగా బావి మైసమ్మకు పూజలు కూడా చేశారు. వందేళ్లకుపైగా సాగుతున్న ఈ సంస్కృతి ఆంధ్రప్రదేశ్ ఏర్పాటు తర్వాత క్రమంగా మసకబారింది. తెలంగాణ ప్రజల వేష, భాషలను సింగరేణిలోని సీమాంధ్ర అధికారులు అపహాస్యం చేయడం మొదలైంది. చివరకు సంస్కృతి, సంప్రదాయాలను చులకన చేశారు. ఫలితంగా బొగ్గు బావుల మీద బావి మైసమ్మ మాయమైంది. ఆ స్థానంలో బెజవాడ కనకదుర్గమ్మ కొలువు దీరింది. అప్పటి వరకు బావి మైసమ్మ వైపు తొంగి చూడని ఆంధ్రా అధికారులు కొత్తగా వెలిసిన దుర్గాదేవి ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించడం పూజారులు, హరికథ కాలక్షేపాలు, గీతాపారాయణాలు మొదలయ్యాయి. అంతకు ముందు ఉన్న చిన్న గుళ్లు కాస్తా దుర్గాదేవి ఆలయాలుగా మారాయి. బలవంతంగా కార్మికుల జీతాల నుంచి చందాలు వసూలు చేసి దుర్గాదేవి ఉత్సవాలను మేనేజ్‌మెంట్ ఏటా నిర్వహిస్తోంది. ఆంధ్రా వలసవాద ఆధిపత్యపాలనలో తెలంగాణ ప్రజలు సహజ సంపదలను, భూములను, బతుకు దెరువును కోల్పోయారు. సంస్కృతి, సంప్రదాయాలు, సల్లంగా చూసే దేవతలను కూడా కోల్పోయారు. కొన్ని నెలల కిందట హైదరాబాద్ సెక్రటేరియట్‌లోని నల్లపోచమ్మ ఆలయ బోర్డును తొలగించి జయదుర్గ దేవాలయంగా మార్చడంతో తెలంగాణవాదులు భగ్గుమన్నారు. రోజుల వ్యవధిలోనే గుడికి పాతపేరును మార్చారు. గని కార్మికుల నుంచి పెద్దగా వ్యతిరేకత రాకపోవడంతో సింగరేణిలో అంధ్రా అధికారుల ఆధిపత్యం కొనసాగుతోంది.

Curtesy: Namaste Telangana

Wednesday, June 20, 2012

టిజి వారి చిలుక పలుకులు



మాది రాయలసీమ హక్కుల వేదిక మాత్రమే, సమైక్యవాదం కాదు.

ఓహో, మరి తెలుగు భాష, తెలుగు జాతి అంటూ ఇప్పటిదాకా ఆడింది దొంగనాటకమని ఒప్పుకుంటున్నారన్న మాట! భేష్! డిసెంబరు తొమ్మిది ప్రకటన తర్వాత ఆ నినాదాలతోనే కదా తమరు, మిగతావారు కుహనా సమైక్యవాద ఉద్య్మమం నడిపింది!

సమైక్యవాదం పేరుతో ఇప్పటికే రెండు సార్లు మునిగాం. ఇక మావల్ల కాదు.

సమైక్యవాదం అంటే ముంచుడేనని ఇప్పటికైనా అంగీకరిస్తున్నట్టేగా? మేం మొదటినుండి చెపుతున్నది అదేగా? ఎవడినో ఒకడిని మోసం చేసి ముంచాలి అంటే ముందు వాడితో కలిసున్నట్టు నటించాలి. దానికోసం వాడితో పొత్తు పెట్టుకున్నట్టు నటించాలి. అందుకోసం సమైక్యవాద జపం చేయాలి. అర్థమైందా టీజీ గారూ? అయినా మిమ్మల్నే మున్చాగాలిగిన సమైక్యవాదులతో మేమెంత చెప్పండి?

తెలంగాణాపై నిర్ణయం తీసుకునే ముందు రాయలసీమ నాయకులను సంప్రదించాలి.

 మంచిది, అలాగే.

Sunday, June 17, 2012

మునిగి పోయేది బాబు మాత్రమే




తెలుగుదేశం పార్టీ ఓటములను ఒక అలవాటుగా మార్చుకున్నట్టు అనిపిస్తుంది. ఒక్కో ఓటమి చవి చూస్తున్నా ఆ పార్టీ నడవడికలో గుణాత్మకమైన మార్పు కనిపించడం లేదు. రోజూ ప్రెస్ మీట్లు, అడపా దడపా యాత్రలు చేస్తూ, వాటి వివరాలను తమ భజన మీడియా చేత ప్రచారం చేయించుకోవడం తప్ప ఆ పార్టీకి మరోటి చేత కావడం లేదు.

2004 ఎన్నికల్లో తనకు ఎదురే ఉండబోదని గాల్లో తేలుతున్న బాబును ప్రజలు దభిల్లుమని భూమార్గం పట్టించింది మొదలు ఆ పార్టీకి ఓటముల పరంపర మొదలైంది. 2009లో నైనా గెలుస్తాననుకున్న పార్టీకి చిరంజీవి రూపంలో దెబ్బ తగిలింది. అనుకోని దెబ్బలను కూడా ముందు ఊహించ గలిగిన వాడే నాయకుడిగా నిలబడ గలడు. బాబుకు అది చేతకాలేదు. అందుకే ఇప్పుడు జగన్ రూపంలో మరొదెబ్బ తగిలే సరికి పూర్తిగా కుదేలయ్యాడు.

ఇలాంటి పరిస్థితుల్లో చంద్రబాబు పనికిరాని మంత్రాంగాలతో, ఆ పార్టీ నాయకులు బాబు భజనతో పొద్దు పుచ్చితే సరిపోదు. ఒక కొత్త పంథాను ఎన్నుకోవలసిన అవసరం వుంది. తమ పంథా పై ప్రజలకు గురి కుదిర్చి, తాము తమ పంథాలో నిబద్ధతతో పోరాటం చేస్తున్నామన్న నమ్మకం కలిగించాలి.

మరి ఇందుకోసం ఏం చేయాలి?

బాబా రాందేవ్ తో గడ్డాలు కలిపి అవినీతి పోరాటాలు చేద్దామంటే జనం మొఖం మీదే నవ్వుతున్నారు, ఈ అవతారానికి అవినీతి పోరాటాలా అని! అయినా లక్ష కోట్లు దిగమిమింగిన జగన్ నే గెలిపించిన ప్రజలు, ఈయన చేసే అవినీతి ఉద్యమానికి ప్రభావితులు అవుతారంటే అది భ్రమే. ప్రజలకు అంతకన్నా తక్షణ  అవసరాలు వున్నాయి.

ఇక పోతే ఆయన ప్రకటించిన అన్నీ ఫ్రీ, నగదు బదిలీ లాంటి పథకాలు కూడా బెడిసి కొట్టాయి.  ప్రజలు నమ్మలేదు. సబ్సిడీలకు వ్యతిరేకంగా నన్నయ లెవల్లో పుస్తకాలు రచించిన వ్యక్తి ఇలాంటి పథకాలు అమలు చేస్తాడంటే ఎవరు నమ్ముతారు?

ఇక పోతే కేసీయార్ తో చేయి కలిపి తెలంగాణా తెస్తానన్నా ప్రజలు నమ్మలేదు, పైగా ఇతనితో కలిసినందుకు కేసీయార్ కే బుద్ధి చెప్పారు. ఒక వేళ  తెలంగాణా వచ్చినా ఆ క్రెడిట్ కెసిఆర్ కే వెళ్తుంది తప్ప ఇతనికి కాదు కదా?

ఎవరో ఒకరు ఇదివరకే ప్రారంభించిన ఉద్యమాలనో, విధానాలనో బాబు కాపీ కొట్టడం వల్ల ప్రజలు ఇతన్ని పట్టించుకోవడంలేదు. ఉదాహరణకు అవినీతి ఉద్యమం మాటకొస్తే ప్రజలు నమ్మితే గిమ్మితే జయప్రకాష్ నారాయణను నమ్ముతారు తప్ప ఇతన్ని నమ్మరు. అలాగే తెలంగాణా విషయంలో KCRను, సబ్సిడీల విషయంలో జగన్ను నమ్ముతారు.

కాబట్టి చంద్రబాబు ఏదన్నా కొత్తగా ట్రై చేస్తే బాగుంటుందనిపిస్తుంది. ఇంకేమున్నాయి? అన్ని ఉద్యమాలూ తలా ఒకరు తన్నుకు పోయాక, అనుకుంటున్నారా? అదేం కాదు, ఇంకోటి మిగిలే వుంది. అది ఇంకా ఏ రాజకీయ పార్టీ బలంగా టచ్ చేయలేదు. అదే జై ఆంధ్రా ఉద్యమం.

అన్నీ ఊడ్చుకు పోయిన చంద్రబాబుకు ప్రజల్లోకి వెళ్ళడానికి ఇదొక్కటే తగిన ఆయుధం. ఈ ఉద్యమం చేస్తే ఆంధ్రా ప్రజలు చీకొడతారని అనుకోవడానికి వీల్లేదు. ఎందుకంటే, జగన్ గెలిస్తే రాష్ట్రం చీలుతుందని దేశం, కాంగ్రెస్ లు ఢంకా వాయించి ప్రచారం చేసినా, జగన్ దాన్ని ఖండించక పోయినా ఆంధ్రా ప్రజలు జగన్ కే వోటు వేశారు. దాన్నిబట్టే తెలియడం లేదూ, ఆంధ్రా ప్రజలు రాష్ట్ర విభజనకు వ్యతిరేకంగా లేరని?

రాత్రికి రాత్రి కుహనా సమైక్యవాద ఉద్యమం ఎగదోయ గలిగిన చంద్రబాబుకు జై ఆంధ్రా ఉద్యమం సెగదోయడం పెద్ద కష్టం కాదు. ఏ హైకోర్టు బెంచి సమస్యతోనో, విజయవాడలో NIMS కోసమో ఉద్యమం మొదలు పెట్టి, దాన్నిమెళ్లిగా ప్రత్యేకాంధ్ర వైపుకు లాక్కెళ్ళ గలిగిన కుయుక్తులు చంద్రబాబుకు వెన్నతో పెట్టిన విద్య. కావల్సిందల్లా కాసింత సంకల్పం, కూసింత ఔటాఫ్ బాక్స్ తరహా ఆలోచనా సరళి. ఈ దెబ్బతో తెలంగాణా విషయంలో గోడమీది పిల్లిలా వ్యవహరిస్తున్న YSR, కాంగ్రెస్ పార్టీలను కూడా బాబు సందిగ్ధంలో పడేయ గలడు.

ఈ విధానంతో విభజన సమస్య ఎలాగోలా అంతం కావాలని ఆశిస్తున్న అంధ్రా ప్రజలతో పాటు, తెలంగాణా ప్రాంతంలో తన కేడర్ తో తెలంగాణా అనుకూల ఉద్యమం నడపడం ద్వారా, తెలంగాణా వారిని కూడా ఆకట్టుకోగలడు. పైగా తన రెండు కళ్ళ సిద్ధాంతానికి ఇది సరైన నిర్వచనం అవుతుంది.

కొత్తదనం లేని పద్ధతులతో వెళ్తుంటే 2014లో కాదుగదా కనీసం 2019లో కూడా గెలిచే అవకాశాలు లేని చంద్రబాబుకు దీనికి మించి మరో అవకాశం లేదు. పార్టీని బతికించుకోవడమే ముఖ్యం అనుకుంటే ఆయన ఈ విషయంపై తన పార్టీలోని సమైక్యవాద పెత్తందార్లను ఒప్పించ గలగాలి. లేదంటే మునిగిపోయే నౌకలోంచి ఏదో ఒకరోజు ఆ పెత్తందార్లు ఎలాగూ పక్క పార్టీల్లోకి వలస వెళ్తారు. నౌకతో పాటు మునిగి పోయేది బాబు మాత్రమే. 

Friday, June 15, 2012

ఇటలీ నీతి!




కాకలు తీరిన రాజకీయ వేత్తకు
కాలు చెయ్యీ కదపకుండా రాష్ట్రపతి పదవి
రబ్బరు స్టాంపు గుద్దడం తప్ప మరి చేతగాని మనిషికి
దేశాన్ని నడిపించే ప్రధాని పదవి!

ఇదీ సోనియా గాంధీ ఇటలీ నీతి! 

నమ్మటం లేనట్టుంది!!


ఎనిమిదేళ్ళనుండి
అధికారం లేక
అలమటిస్తున్న
రెండుకళ్ళ సిద్ధాంతి

ఇప్పటికే ముగ్గురు
ముఖ్యమంత్రులను మార్చి
కాంగ్రేసు అధిష్టానం
ప్రజలకు నరకాన్ని చూపిస్తూ
తనకు తానే సైడిస్తున్నా

రాందేవ్ బాబాతో
గడ్డం గడ్డం కలిపినా
బియ్యం, వైద్యం, నగదు
అన్నీ ఫ్రీగా ఇస్తానన్నా
డిపాజిట్లకోసం
దేబిరించాల్సిన పరిస్థితి!

ఏ ఎండ కాగొడుగు పట్టే
చంద్రబాబు మాటలను
ఆంధ్రా ప్రజలు కూడా
నమ్మటం లేనట్టుంది!!

ఆనాడు ప్లేటు ఫిరాయించి
నాలుకను అడ్డంగా తిప్పిన
చంద్రబాబు కంటే
కోట్లు దిగమింగిన
ఫాక్షనిస్టే నయమని
భావిస్తున్నట్టుంది పాపం!!!


   

Saturday, June 9, 2012

నిర్ణయం




ఆంధ్రల వున్న పదిహేడు సీట్ల సంగతేమొ గని, సురేఖ రాజీనామా చేసిన పరకాల సీటు మాత్రం అక్కడి ప్రజలకు పెద్ద చిక్కే తెచ్చి పెట్టింది. ఇక్కడ YSR సచ్చిండన్న సానుభూతి లేదు. జగన్ జైల్ల బడ్డడన్న బాధ అసలుకే లేదు. చంధ్రబాబు, కిరణ్ కుమార్ పిలిస్తె పలికే దిక్కు లేదు.

కాని వొచ్చిన చిక్కంతా బిజెపి, టీఅర్ఎస్ మధ్యనే. ఈ రెండీట్ల దేనికి వోటెయ్యలె? ఇదీ పరకాల వోటరు సమస్య.

అవును, బిజెపి పార్టీ తెలంగాణ కోసం గట్టిగనే ప్రయత్నిస్తున్నది. కనీసం ఆ పార్టీ రాష్ట్ర శాఖ (తెలంగాణా ప్రాంతంల) బాగనే ఉద్యమంల పాల్గొంటున్నది.మరి కేంద్రంల పాగా వేసి తెలంగాణ ఇవ్వగలిగిన రెండు పార్టీలల్ల అదొకటి. అందులో ఒక పార్టీ (కాంగ్రేసు) ఇప్పటికే దాదాపుగ ఇయ్యలేననుకుంట చేతులెత్తింది. ఇక మిగిలింది ఇదొక్కటే.

మరి ఇప్పుడు తెలంగాణ ప్రజలేం జెయ్యాలె? తెలంగాణ ఇస్తనంటున్న బిజెపిని నమ్మాల్నా? తెలంగాణా కోసం పోరాటం చేస్తనంటున్న టీఅరెస్‌ను నమ్మాల్నా? పరకాలల ఎవరికి ఓటెయ్యాలె? ఇదొక పెద్ద చిక్కు సమస్య అయి కూసుంది.

బిజెపికి ఓటెయ్యకపోతె దానికెక్కడ కోపమొచ్చి తెలంగాణ ఇయ్యనంటదో? ఉన్న రెండు పార్టీలు తెలంగాణా ఇయ్యనంటె తెలంగాణా ప్రజలకు దిక్కేంది? ఇనంక టీఆర్ఎస్‌కి ఎయ్యక పోతె పన్నెండేండ్ల నుండి తెలంగాణా కోసమే పాటుపడుతున్న ఆ పార్టీ డీలా పదుద్దేమో? పరకాల వోటరుకు పెద్ద చిక్కే వచ్చింది.

నిజానికి పరకాల వోటరుకే కాదు, తెలంగాణా ప్రజలందరికీ, నిర్ణయించుకోవలసిన సమయం వచ్చింది. ఎందుకంటే ఈ రెండు పార్టీల మధ్యన సయోధ్య కుదురుద్దన్న ఆశ కనపడుతలేదు కాబట్టి. సయోధ్య కుదిరే ఆశ లేనప్పుడు, తెలంగాణా శక్తి క్షీణించకుండ ఉండాల్నంటే, ప్రజలంతా ఏదో ఒక వైపే ఉండి తీరాలి. లేదంటే డబ్బు, అధికారం దండిగా కలిగిన సమైక్యవాద శక్తులు మనలో మనకే చీలికలు తెచ్చి తెలంగాణా ఉద్యమాన్ని మరోసారి అణచి వెయ్యగలవు.

ఇక పొతే ఈ రెండు పార్టీల తీరు తెన్నులు ఒకసారి పరిశీలిద్దాం.

1969ల దారుణంగ అణచి వెయ్య బడ్డ తెలంగాణా ఉద్యమం టీఅర్ఎస్ పార్టీ పుట్టేవరకు తిరిగి నిలదొక్కుకోలేక పోయింది. అయితే టీఆర్ఎస్ పుట్టింది మొదలు ఉద్యమం దినదిన ప్రవర్థమానమైంది. ఒక్క రక్తపు బొట్టు చిందకుండానే టీఆర్ఎస్ తెలంగాణాను ఒక బలీయమైన నిర్ణయాత్మక శక్తిగా మార్చ గలిగింది.

టీఆర్ఎస్ మీద దాని ప్రత్యర్ధులు చేసే ఆరోపణలు పరిశీలిద్దాం.
1. తెలంగాణా పేరు చెప్పి కుటుంబంలో అంతా పదవులు పొందారు.
2. తెలంగాణా పేరు చెప్పి వసూళ్ళు చేసుకుంటున్నారు.

ఇంతకీ ఇప్పుడు కుటుంబ సభ్యులు రాని పార్టీ యేది దేశంలో? కేసీఆర్ కుటుంబ సభ్యులు ఊరికే పదవులు అనుభవించడం లేదు, వారు తెలంగాణా కోసం నిబద్ధతతో పనిచేస్తున్నరు.

ఇంక వసూళ్ళ సంగతి... ఇది ఇంతవరకూ ఎవ్వరూ నిరూపించలేదు. అయినా నిజమే కావచ్చు. కానీ వసూళ్ళు చేయందెవరు? మొన్నటికి మొన్న ACB ఎంక్వైరీలో బయట పడలేదా అబ్కారీ వసూళ్ళ తంతు గురించి? అధికార పక్షం, ప్రతి పక్షం, జర్నలిస్టులు, అధికారులు అని లేకుండా ప్రతి ఒక్కరూ గద్దల్లెక్క మేసిన వైనం?

అవినీతి అనేది దేశం మొత్తం చేయవలసిన ఒక ప్రత్యేక పోరాటం. దానికి తెలంగాణా ఉద్యమానికి సంబంధం లేదు. ఇక్కడ తెలంగాణా ప్రజలు చూస్తుంది, ఆయా పార్టీలకు  తెలంగాణా పై ఎంత నిబద్ధత ఉంది అని మాత్రమే!

ఇంక బిజెపీ సంగతి చూస్తే... ఆ పార్టీ తాను అధికారంలో వున్నప్పుడు తెలంగాణా ఇవ్వగలిగి కూడా చేతులెత్తింది. చంద్రబాబు మోకాలడ్డితే గప్‌చుప్‌గా ఊరుకున్నాం అని నిస్సిగ్గుగా చెప్పుకున్నారు. అలాంటి వారు మరి ఇప్పుడు ఎలాగివ్వగలరో మాత్రం చెప్పరు. రేప్పొద్దున చంద్రబాబో, జగనో NDA కు మద్దతు ఇస్తూ, తెలంగాణా ఏర్పాటును అడ్డుకుంటే... అప్పుడేం చేస్తారు? ఆ పరిస్థితిలో తెలంగాణా వారంతా బిజెపికి వోటేసి గెలిపించినా అది బూడిదలో పోసిన పన్నీరేగా? తెలంగాణాలో గెలిచిన బిజెపి ఎంపీలు అధిష్టానం మాటను ధిక్కరించ గలరా?

ఇంక బిజెపికి ఎంత నిబద్ధత వున్నది? అని చూస్తే అది కూడా నేతి బీరకాయలో నెయ్యి చందంగనే కనపడుతది. ఎండల లక్ష్మినారాయణ రాజీనామా చేస్తే, కిషన్‌రెడ్డి చెయ్యడు. ఈ కిషన్‌రెడ్డి ఇప్పుడు తెలంగాణా తెస్తనంటడు.

2G స్పెక్ట్రం గురించో మారోదానిగురించో నెలలకు నెలలు పార్లమెంటును స్థంభింపచేసే బిజెపికి ఒక్కరోజు తొమ్మిది మంది తెలంగాణా కాంగ్రెస్ సభ్యులు తమ అధికార పార్టీ పైనే పోరాటం చేస్తుంటే మటుకు వారికి చేదోడుగా నిలవాలని అనిపించదు. పైగా వారిని సస్పెండు చేయాలని అనిపిస్తుంది. ఇది బిజెపి ద్వంద్వ నీతికి ప్రత్యక్ష ఋజువు కాదా?

వీటన్నిటిని బట్టి చూసినప్పుడు జాతీయ పార్టీలను నమ్మడమంటే తెలంగాణా ప్రజలు తమ ఓటమి తాము కొని తెచ్చుకోవడమే. తెలంగాణా ప్రజలకు తమ వాణిని వినిపించే పార్టీ వుండడం తప్పని సరి. పార్లమెంటులోని బలాబలాను బట్టి ఎవరిని బలపరచాలి? ఎలా తెలంగాణా సాధించాలి అని తర్వాత ఆలోచించొచ్చు. ఇతరులను బలపరచాలంటే ముందు తెలంగాణా ప్రజలు బలమైన శక్తిగా ఎదగాలి. అందుకు ప్రత్యేక తెలంగాణా ఎజెండా గలిగిన ప్రాంతీయ పార్టీని బలపరచడమొక్కటే మార్గం. ప్రస్థుత పరిస్థితుల్లో అది TRS తప్ప మరోటి కాదు.

Wednesday, June 6, 2012

వాత పెట్టుడే!

1956ల కల్వక పోతె
మా చీమ కూడా
వచ్చేది కాదు
హైదారాబాదుకి
అంటున్నడు ఒకాయన

కని కలిసిన్రు
వచ్చిన్రు
చీమల దండు లెక్క

ఐతె
వాటితోటి కలిసి
కొన్ని పందికొక్కులు
గూడ వచ్చినై
అడ్డంగ మేసుడు
మొదలు పెట్టినై

చీమలతో కాదు
మాపోరు
పందికొక్కులతోటే

పందికొక్కులకు వంతపాడితే
చీమలక్కూడ
వాత పెట్టుడే!