మన రాష్ట్రం తో వచ్చిన గొడవేమిటంటే, రాజధాని తక్కువ జన సంఖ్యా కలిగిన ప్రాంతమైన తెలంగాణలో వుండడం. అధిక శాతం జనం కలిగిన ప్రాంతమైన ఆంధ్రాకి రాజధాని లేక పోవడం.
అధిక జనాభా వాళ్ళ వచ్చిన బ్రూట్ మెజారిటీతో గత యాభై నాలుగేళ్ళుగా ఆంధ్రా వారు రాష్ట్ర రాజకీయాలను ప్రభావితం చేస్తూ వచ్చారు. తమకు కలిగిన మెజారిటీని దుర్వినియోగం చేస్తూ, మైనారిటీ ప్రాంత ప్రజల ప్రయోజనాలను పరిరక్షించ వలసిన బాధ్యత మరచారు. తద్వారా అభివృద్ధిలో తారతమ్యాలు పెరిగాయి. పర్యవసానంగా ప్రాంతీయ భావోద్వేగాలు పెచ్చరిల్లాయి.
ఈ పర్యవసానాలన్నింటికి ఆంధ్రా ప్రాంతంలో నివసించే సాధారణ పౌరుడు ఎంతవరకు బాధ్యుడు? అన్న ప్రశ్న సహజంగానే మనసులోకి వస్తుంది. నిజానికి ఈ పర్యవసానాలకూ, ఆంధ్రా ప్రాంతంలోని సాధారణ ప్రజలకూ ఎలాంటి సంబంధం లేదు. తెలంగాణా ప్రజల్లానే వారు కూడా అమాయకులు.
మరి బాధ్యులెవరు?
గత ఐదు దశాబ్దాలుగా రాష్ట్రం పై ఏక చత్రాదిపత్యం వహిస్తున్న ఆంధ్రా ప్రాంతం నాయకులు. వీరు నాయకులుగా సమతూకం పాటించ వలసిన అవసరాన్ని విస్మరించారు.
బ్రిటిష్ వారి దయా దాక్షిణ్యాల(?) వల్ల మెకాలే చదువులు వంట బట్టించుకొని ఆఫీసర్ గిరీ వెలగ బెడుతూ, తద్వారా వచ్చిన అధికారాలతో తమకు తామే ఐన్ స్టీన్ లలా ఫీలవుతూ అత్యుత్సాహంతో తమ సంస్కృతి మాత్రమే సంస్కృతి అనీ, తమది మాత్రమే చరిత్ర అనీ చెప్ప జూశారు. ఆ క్రమంలో తెలంగాణా ప్రాంత చరిత్ర సంస్కృతులను కాల రాయడానికి ఏమాత్రం సంకోచించ లేదు.
ఆయకట్టు భూముల వల్ల వచ్చిన అదనపు డబ్బులతో తెలంగాణా ప్రాంతంలోని భూములు కొని వ్యాపారాలు ప్రారంభించారు. వీటిలోని ఉద్యోగాలను మాత్రం తమ ప్రాంతంలోని చుట్టాలకు పక్కాలకు మాత్రమే కట్టబెట్టి ఈ ప్రాంతంలో ప్రచ్చన్న నిరుద్యోగం పెరగడానికి దోహద పడ్డారు.
అలాగే సినిమా వ్యాపారాలు పెట్టి తమ గోదావరి యాస తప్ప మిగతా అన్ని యాసలనూ తూలనాడారు. ముఖ్యంగా తెలంగాణా యాసను రౌడీలకు, కమేడియన్లకు అంటగడుతూ, తెలంగాణా ప్రజలు తమ యాస పట్ల తామే ద్వేషం పెంచుకునేలా ప్రవర్తించారు.
ఇలా చెప్పుకు వెళ్తే అంతుండదు.
ప్రజల మనసులను ఇంతగా గాయపరచిన తర్వాత, కేసీయారో, కేసీయార్ కాకపోతే మరో కిషన్ రెడ్డి, ఇలా ఏవరో ఒకరు తమ ప్రయోజనాల మేరకే అయినప్పటికీ, సమస్యను తప్ప పైకి తీసుకు వస్తారు. ఎవరు సమస్యను పైకి తెచ్చారన్నది కాదు, అసలు సమస్యకు కారకులెవరో వారిదే అసలు బాధ్యత.