Saturday, March 16, 2013

అభినవ సుయోధనులు


అవున్నిజమే మనమిన్నది
వాడు తెలంగాణాకు
రూపాయి కూడా ఇవ్వడట!
వాని తాత సోమ్మైనట్టు...

ఇక్కడి భూములు, నీళ్ళు
ఇక్కడి పన్నులు, వనరులు
అన్నీ ఎగబీల్చుకుంట
అడ్డంగా బలిసేతోల్లకు
అంతకన్నా ఏమాట లొస్తయి?

అంతకు ముందెవడో...
పాండవులకు ఐదూళ్ళు ఇవ్వనని
వెకిలిగా మాట్లాడితే...
చివరకు తొడలు పగిలినై

ఒకడు వీసా అంటడు
ఇంకోడు తోక పార్టీ అంటడు
మరొకడు  తెలంగాణా ఏది అని
అమాయకంగ అడుగుతడు
దోసెలు వేసుడుతోటి పొలుస్తడు

అయినా వాళ్ళను కాదు అనవలసింది
వాళ్ళు విసిరే ఎంగిలి మెతుకులకు
గోతి కాడి కాకుల్లెక్క
వాళ్ళ సుట్టు తిరుక్కుంట
చెక్క భజన చేస్తున్న
మన నాయకులకు
రాజకీయ సమాధి కట్టాలె   

Tuesday, January 29, 2013

ఉద్యమం దిశ ఎటువైపు ఉండాలి?


కాంగ్రెస్ తెలంగాణా ఇవ్వదని తేట తెల్లమైన ఈ సమయంలో 2014 లోపల తెలంగాణా వచ్చే అవకాశాలు సన్నగిల్లినట్టే. ఈలోపు ఏదన్నా జరిగి ప్రభుత్వాలు కూలిపోయి మధ్యంతర ఎన్నికలు జరిగి కొత్త ప్రభుత్వం వస్తే తప్ప తిరిగి తెలంగాణా ఏర్పాటు వైపు  అడుగులు పడే అవకాశం లేదు. ఈ పరిస్థితుల్లో తెలంగాణా ఉద్యమం దిశ ఎటువైపు ఉండాలి?

ఇక ఎన్నికల్లోపు తెలంగాణా రాదనీ ఊరుకుందామా? సీమాంధ్ర మీడియా విజృంభిస్తుంది. ఉద్యమమే లేదు, అంతా చల్లబడి పోయింది అని ఊదర గొడుతుంది. చెవిటి వాడి ముందు శంఖమూదినట్టు ప్రజల ఆకాంక్షలను పట్టించుకోని ప్రభుత్వం ముందు ఎన్ని ఉద్యమాలు చేస్తే మాత్రం ఏం లాభం? అనే ప్రశ్న వస్తుంది.

ఉద్యమం పేరుతో బందులు, స్కూళ్ళు, కాలేజీల మూసివేత, రవాణా ఇబ్బందులు మొదలైన వాటితో ప్రజలు విసిగి పోయే అవకాశం వుంది. సకల జనుల సమ్మెతో సహా ఇప్పటివరకు జరిగిన అన్ని ఉద్యమాలలో తెలంగాణా ప్రజలే బాధలు పడుతున్నారు తప్ప సీమాంధ్ర దోపిడీ దారులపై ఎలాంటి ప్రభావం పడడం లేదు. ఇక ప్రభుత్వమేమో అత్యాధునిక ఆయుధాలను సమకూర్చుకొని తెలంగాణా ప్రజలు, విద్యార్థులు చేసే ఉద్యమాలను అత్యంత నీచమైన అప్రజాస్వామికమైన పద్ధతుల్లో అణచి వేస్తుంది.

ఇంతటి ఉద్యమం వేడిలోనూ పోలీసు రిక్రూట్ మెంటు, గవర్నమెంటు స్కూళ్ళ అప్ గ్రేడేషన్, హంద్రీ నీవా, పోలవరం మొదలైన రూపాల్లో తెలంగాణపై దోపిడీ యధేచ్చగా సాగుతూనే వుంది. దోపిడీ శక్తులు తెలంగాణా ప్రజలు చేసే ప్రజాస్వామిక ఉద్యమాలను చాలా తేలికగా తీసుకుంటున్నాయి. తమ పోలీసు బలగాలతో ఉద్యమాలను అణచి వేస్తూ, తాము ఎలాగైనా బరితెగించ గలమని, ఏమైనా చేయగలమన్న భరోసాను కలిగి ఉన్నాయి. దోపిదీలో భాగం దొరుకుతుంది కాబట్టి  కేంద్ర ప్రభుత్వం కూడా అటువంటి దోపిడీ శక్తులకే వత్తాసు పలుకుతుంది.

ఇటువంటి పరిస్థితులలో తెలంగాణా ఉద్యమం తన దిశను మార్చుకోన వలసిన అవసరం ఉంది. ప్రజాస్వామిక పద్ధతులను వీడకుండానే ఉద్యమ విధానాలలో కొద్ది పాటి మార్పు చేసుకోవడం వల్ల మంచి ఫలితాలను పొందవచ్చు. డిల్లీలో జరిగిన  అన్నా హజారే, రేప్ కేసు ఉద్యమాలను కూడా అధ్యయనం చేయాలి.

మీడియాకు ఇష్టం ఉన్నా లేకపోయినా అది ఉద్యమ వార్తలు ప్రచారం ప్రచారం చేయవలసిన అనివార్య పరిస్థితులను కల్పించాలి. ఉద్యమ కార్యాచరణను రూపొందించడంలో దీన్ని దృష్టిలో పెట్టుకోవాలి.
ఉద్యమం వల్ల తెలంగాణా, ఆంద్ర ప్రజలకు కాక, సీమాంధ్ర దోపిడీ శక్తులకు, సమైక్య వాదులకు, నాన్పుడు ధోరణితో కాలం వెళ్ళదీస్తున్న రాజకీయులకు ఎక్కువ నష్టం కలిగించేవిగా ఉండాలి. ఆ నష్టం భౌతిక మైనదే కావలసిన అవసరం లేదు.
సీమాంధ్ర దోపిడీ, అక్రమాల గురించి ప్రతి రొజూ ప్రచారం జరుగుతున్నా, వాటిని ఎదుర్కునే ప్రయత్నాలు ఎక్కువగా జరగడం లేదు. ఉదాహరణకు సాగర్ నీళ్ళు, పోతిరెడ్డి పాడు జలాల తరలింపు. రాజోలి బండ, రిక్రూట్ మెంట్లు, నిధుల మళ్లింపు మొదలైనవి. తెలంగాణా ఉద్యమంలో భాగంగా వీటిపై కూడా ఉద్యమించాలి. తమ దోపిడీకి అడ్డంకులు వస్తున్నాయని భావించినప్పుడు దోపిడీ దారుడు కూడా భద్రమైన ప్రదేశాలు (సీమాంధ్ర) వెతుక్కోవడానికి ప్రయత్నిస్తాడు. 

ఉద్యమాల సంఖ్య తగ్గించి, ఉద్యమ కార్యాచరణను ప్రకటించే ముందే, దాని స్వరూప స్వభావాలను, ఫలితాలను, శత్రువుకు కలిగించే నష్టాలను గురించి సమగ్రమైన విశ్లేషణ చేసుకోవాలి.

తెలంగాణా కనుచూపు మేరలో కనిపించని ప్రస్తుత పరిస్థితులలో ఉద్యమ కార్యాచరణపై పునఃపరిశీలన జరుపుకోవడం అత్యవసరం.
   

Sunday, January 27, 2013

ఉండవల్లి అరుపులకు కారణాలేమిటి?




ఉండవల్లి జై ఆంధ్ర ఉద్యమానికి నలభై ఏళ్ళు పూర్తైన సందర్భంగా రాజమండ్రిలొ ఒక మీటింగు పెట్టాడు. దానికి జై ఆంధ్ర అని కాకుండా జై ఆంధ్ర ప్రదేశ్ అని పేరు పెట్టినప్పుడే దాని దివాళాఖోరు తనం అర్థమయ్యింది. ఇక ఆయన జై ఆంధ్ర ఉద్యమ వివరాలను చెప్పకుండా దాటవేసి, వేదికను తెలంగాణాను తిట్టడానికి వాడుకున్నాడు. తెలంగాణా వాదులను రజాకార్లతో పోలుస్తూ, అన్యాపదేశంగా వారికీ రజాకార్ల గతే పడుతుందని బెదిరింపులకు దిగాడు. నిజానికి, ఒకప్పుడు తెలంగాణా ప్రజల స్వాతంత్ర్య ఆకాంక్షకు  కాశీం రజ్వీ నాయకత్వంలో రజాకార్లు అడ్డు పడ్డట్టే, ఇప్పుడు సీమాంధ్ర పెత్తందార్లు లగడపాటి నాయకత్వంలో అడ్డు పడుతున్న విషయం పరిశీలిస్తే ఎవరు రజాకార్లో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.

ఉండవల్లి అరుణ్ కుమార్, మధ్యే వాదిగా పేరుపడ్డ వాడు. అంతో ఇంతో తర్కం ఉపయోగించి మాట్లాడే వానిగా పేరు పొందాడు. ఇదివరలో ఎప్పుడూ తెలంగాణా ఉద్యమంపై తీవ్ర విమర్శలు చేసిన దాఖలాలు లేవు. పైగా అప్పుడప్పుడూ కరడు గట్టిన సమైక్య వాదులను మందలించిన సందర్భాలూ చూశాం. మరి ఇప్పుడు హటాత్తుగా తెలంగాణా వాదులపై విరుచుకు పడడానికి కారణమేమిటి?

ఈ విషయం తెలుసు కొవాలంటే మొదట ఉండవల్లి ఎవరో తెలుసుకోవాలి. ఆయన పెద్దగా ప్రజాబలం లేని, తెలివితేటలే పెట్టుబడిగా కలిగిన రాజకీయ వేత్త. సోనియా గాంధీ ఉపన్యాసాలు అనువదించడం ద్వారా ప్రచారం పొందాడు. సోనియా గాంధీకి వీర విధేయతతో పదవులు పొందేవాడు. సోనియా అనుఙ్ఞ లేకుండా నోరు తెరిచి ఆవులించడానికి కూడా వెనుకాడే వాడు. మరి అలాంటి వాడు ఎందుకు రాజమండ్రిలో అదీ తెలంగాణా పై కేంద్రం నిర్ణయం తీసుకునే సందర్భంలో ఇలా తన నిజ స్వభావానికి విరుద్ధంగా మూర్ఖ వాదనలకు దిగాడు?

ఇదంతా చూస్తే సోనియా అనుమతి లేకుండా ఉండవల్లి ఇలా పెట్రేగడం ఊహించలేం. కచ్చితంగా రాజమండ్రి సమావేశం సోనియా దర్శకత్వం లోనే జరిగిందని భావించ వలసి వస్తుంది. మరి జనవరి 28న నిర్ణయం తీసుకోవలసిన సమయంలో సోనియా ఇలాంటి మీటింగు పెట్టుకోమని ఎందుకు పురిగొల్పుతుంది?

షిండే సమావేశం నుండి చింతన్ శివిర్ చివరి వరకు కూడా కాంగ్రేస్ కదలికల్లో తెలంగాణా ఏర్పాటుకు అనుకూలత కనిపించింది. మధ్యలో సమైక్య వాదుల లాబీకి కూడా రవి, అజాద్ల దూషణ, తిరస్కారాలు ఎదురయ్యాయి. కాని, KVP రామచంద్ర రావు ఆధ్వర్యంలో సీమాంధ్ర లాబీ ఢిల్లీలోని పెద్ద నాయకులను కలిసిన తర్వాత పరిస్థితులు మారాయి.

KVP ఢిల్లీ పెద్దలకు రాష్ట్రం సమైక్యంగా వుంచితే కాంగ్రేస్‌కు కలిగే ప్రయోజనాలను వివరించినట్టు వార్తలు వచ్చాయి. రాష్ట్రం కలిపి వుంచితే 2014 వరకు జగన్‌ను కాంగ్రేసులో చేరుస్తానని ఆయన మాట ఇచ్చాడు. 2014లొపు కలిస్తే అది తెలుగుదేశం పార్టీకి అనుకూలిస్తుంది. జగన్ అవినీతి పై పెద్ద పెట్టున ప్రచారం చేసి TDP లబ్ది పొందుతుంది. కాబట్టి ఎన్నికల లోగా ఇవి రెండు కలిసే అవకాశం లేదు.

కాంగ్రెస్ వ్యూహం ఇలా కనిపిస్తుంది. ఎన్నికల వరకూ జగన్‌తో పోరాడినట్టు నటించడం. పైగా జగన్, TDPతో సహా అన్ని పార్టీలు తెలంగాణాకు అనుకూలించినా, తాము సమైక్యత కోసం నిలబడ్డట్టు సీమాంధ్రలో బిల్డప్ ఇవ్వడం. ఇక తెలంగాణాలోని కాంగ్రెస్ నాయకులు పార్టీ పంథాను వ్యతిరేకిస్తూ బయటికి వస్తారు. వారు TRSలో చేరకుండా ప్రత్యేక ఫ్రంట్ ఏర్పాటు చేసి వీలయినన్ని తెలంగాణా వాదంపై పోరాడే సంస్థలను కలుపుకుంటారు. వాటి సహకారంతో ఎన్నికల్లో పోటీ చేసి వీలయినన్ని సీట్లు గెలుస్తారు. ఇక TDP తాను కూడా తెలంగాణా ఏర్పాటుకు లేఖ ఇచ్చానని ప్రచారం చేసుకొని కొన్ని సీట్లు తెచ్చుకుంటుంది. BJP ముందునుంచీ తెలంగాణా వాదాన్ని వినిపించే పార్టీ కాబట్టీ అది కూడా కొన్ని సీట్లు గెలుస్తుంది.

ఇలా 2014 ఎన్నికల్లో బహుముఖ పోటీ ఏర్పడ్డం వల్ల  పద్మ వ్యూహంలో అభిమన్యుడిలా ఒంటరిగా మారి, TRS గత ఎన్నికల మాదిరిగానే అతి తక్కువ సీట్లకు పరిమిత మవుతుంది. తెలంగాణా వాదం మరొకసారి నీరు గారుతుంది. ఇదీ స్థూలంగా KVP ప్లాన్. దానికి నాందీ వచనమే రాజమండ్రి మీటింగ్. దానికి స్క్రిప్టు  KVPది అయితే, దర్శకత్వం సోనియాది, నటుడు ఉండవల్లి.

తెలంగాణా ఏర్పడే వరకూ ఇలాంటి కుట్రలు ఎన్ని ఎదురవుతాయో చెప్పలేం. 2014 ఎన్నికల వరకూ తెలంగాణా వచ్చే అవకాశం ఎలాగూ కనిపించడం లేదు. కాబట్టి తెలంగాణా ప్రజలు నిరంతరం అప్రమత్తంగా వుండి ఆ ఎన్నికల్లొ తెలంగాణా వాదం కొసం నిబద్ధతతో పనిచేసే ఏకైక పార్టీ అయిన TRSని మాత్రమే పూర్తి మెజారిటీతో 17 లోక్‌సభ సీట్లలో గెలిపించాలి. అదోక్కటే ప్రస్థుతానికి సీమాంధ్ర కుట్రలను ఎదుర్కొనే తరుణోపాయం.

Friday, January 25, 2013

సమైక్యత


అమ్మా, అన్న కొడుతున్నడమ్మా... నేను వానితోటి ఆడుకోను... పక్క రూంలో ఆడుకుంట.

ఒరే పెద్దోడా. వాణ్ని మళ్ళా కొట్టినవా? ఒక్క నిముషమన్నా నిమ్మలంగ ఉండవు కదా!

లేదమ్మా, నేను కొట్టలేదు. తమ్ముడే నన్ను కొట్టిండు, గిచ్చిండు.

నువ్వు కొట్టక పోతే వాడెందు కేడుస్తడు?

వాడివన్నీ దొంగేడుపులు. నా వాటరు బాటిలు అడుక్కొని నీళ్ళు తాగుతడు. నేను తినే చాక్లేట్టులో వాటా అడుగుతాడు. మళ్ళీ నన్నే కొడుతుంటడు. వాడు చెప్పేవన్నీ నూటొక్క అబద్ధాలు.

అవునా? అయితే వాణ్ని పక్క రూములో ఆడుకోనియ్యి. నువ్వు ఈ రూములో ఆడుకో.

అస్సలు కుదరదు. వాడూ, నేనూ ఒక్క దగ్గరే ఆడు కోవాలి!

ఎందుకురా? నువ్వు చెప్పే మాటల ప్రకారం వాడు లేక పోతే నీకే మంచిదిగా?

ఇప్పుడు వాడు పక్క రూములో ఆడుకుంటే... రేపు పక్కింట్లో పిల్లలు వేరు వేరు రూముల్లో ఆడుకుంటారు. మరుసటిరోజు పొరుగూరు పిల్లలు కూడా వేరు వేరు రూముల్లో ఆడుకుంటారు. ఎల్లుండి దేశం మొత్తం అలాగే ఆడుకుంటారు. అప్పుడు దేశం లోని అన్నల సంగతేం కావాలి?

ఏమవుతుంది? ఎవరి మానాన వాళ్ళుంటారు...

కాదు. పక్క రూములో ఆడుకునే తమ్ముడు నాకు వేలకు వాటర్ బాటిలు నింపుకొచ్చి ఇస్తాడా? వాడి వంతు చాక్లెట్లు కూడా నేను తినగలనా? వాడు లేక పోతే నాకు కాళ్ళు ఎవరు వత్తుతారు?

అమ్మ దొంగా! ఇదా నీ సంగతి!!


 

Sunday, January 20, 2013

సీమాంధ్రలో సమైక్యవాద ఉద్యమం తీవ్రతరం చేస్తాం!


"సీమాంధ్రలో సమైక్యవాద ఉద్యమం తీవ్రతరం చేస్తాం."

తరచుగా సమైక్యవాదులు వినిపించే మాట ఇది. గత రెండు మూడు రోజులుగా మరింత ఎక్కువగా వినబడుతుంది. కేవలం సీమాంధ్రలో ఉద్యమం చేస్తే అది సమైక్యవాదం ఎలా అవుతుంది? గీతకు రెండువైపులా ఉంటేనే అది సమైక్యవాదం అవుతుంది. కేవలం ఒక ప్రాంతం వారు రెండో ప్రాంత భవిష్యత్తు పై ప్రభావం చూపాలనుకుంటే అది దౌర్జన్యం అవుతుంది తప్ప సమైక్యవాదం కాదు.

బ్రిటిష్ ప్రభుత్వం ఇండియాకు స్వాతంత్ర్యం ఇస్తుంటే బ్రిటిషర్లు ఎలా వుంటుందో అలా వుంటుంది. కనీసం బ్రిటిష్ వారు మనకు పాలకులు, మనం బానిసలం. అయినా వారు అలాంటి ఉద్యమాలు చేయలేదు. కాని కొన్ని సమైక్యవాద ముఠాలు సామ్రాజ్యవాదుల కన్నా హీనం. వీరు కనీసం తాము వలసగా మార్చుకున్న ప్రాంతం ఒక ప్రత్యేక రాష్ట్రంగా మారడం కూడా సహించలేరు.

వీరికి తెలంగాణా ప్రాంతం కూడా స్వతంత్ర భారత దేశంలో ఒక భాగమని, ఈ దేశంలో వీరికి ఎన్ని హక్కులు ఉన్నాయో వారికి కూడా అన్ని హక్కులే ఉన్నాయని ఏమాత్రం గుర్తించరు. పైగా తెలంగాణా ఒక రాష్ట్రంగా ఉండాలో, ఉండకూడదో తామే నిర్ణయించ గలమన్న అహంభావాన్ని ప్రదర్శిస్తున్నారు. ప్రజాస్వామ్య సూత్రాలమీద ఏమాత్రం గౌరవం ఉన్నవారైనా ఇలాంటి ఫాసిస్టు ఆలోచనలు చేయరు.

సీమలో, ఆంధ్రలో ఉన్న అనేకులైన సహృదయులు తెలంగాణా ఉద్యమానికి అడ్డు చెప్పడం లేదు. వారు తెలంగాణా ప్రజలయోక్క న్యాయబద్ధమైన ప్రత్యేక రాష్ట్ర ఆకాంక్షను ఆమోదిస్తున్నారు. కాని కొంతమంది వేళ్ళమీద లెక్క పెట్టగలిగిన పెట్టుబడి దారులు మాత్రం సమైక్య మంత్రం జపిస్తున్నారు. వీరిని పెట్టుబడి దారులు అనడం కంటే, 'న్యాయం నాలుగు పాదాల నడిస్తే, జగన్ తో చంచల్ గూడా జైలులో షటిల్ ఆడవలసిన వారు' అంటే బాగుంటుంది. వీరికి రాష్ట్ర ప్రయోజనాలు, ప్రజల ఆకాంక్షల కంటే తాము చేస్తున్న అక్రమ వ్యాపారాలు, భూకబ్జాల పైనే ఎక్కువ మక్కువ. రాజకీయాన్ని, అధికారాన్ని అడ్డం పెట్టుకుని వారి తప్పులను కప్పి పుచ్చుకోవడానికి వారు సమైక్యవాదం పేరు చెపుతూ అక్కడి ప్రజలను రెచ్చగొట్టడానికి డబ్బులు వెచ్చిస్తూ శాయ శక్తులా ప్రయత్నాలు చేస్తున్నారు.

వివేచనా పరులైన ఆంద్ర ప్రజలు మాత్రం సమైక్యవాదుల మాటల గారడీ ప్రభావానికి లోను కావడం లేదు. కాని వీరి చెప్పు చేతల్లో ఉండే మీడియా మాత్రం వీరు చేసే చిన్నా చితకా ఉడత చప్పుళ్ళను సింహ గర్జనలుగా చూపడానికి తమ శాయ శక్తులా ప్రయత్నిస్తున్నాయి. ఉదాహరణకు ఈరోజు విజయవాడలో జరిగిన  NGO సమైక్యవాద మీటింగును ప్రత్యక్ష ప్రసారం చేసిన ఈ చానెళ్ళు ఒక్క సారి కూడా కెమెరాను ప్రేక్షకుల వైపు తిప్పిన పాపాన పోలేదు. అలా తిప్పితే అసలు స్టేజి మీది హుంకారాలకు, స్టేజి కింది సభికుల సంఖ్యకు పొంతన కుదరదని వారికి తెలుసు.