తెలంగాణకు టీడీపీ ఎంత కట్టుబడి ఉందో మరోసారి తేలిపోయింది. కాంగ్రెస్ పార్టీకి, కేంద్ర ప్రభుత్వానికి తెలంగాణ పట్ల కమిట్ మెంట్ ఎంత లేదో ఇంకోసారి తేలిపోయింది. పాదయాత్రల్లో వైఎస్‌ఆర్ పార్టీ తెలంగాణ పట్ల ఒలకబోస్తున్న ప్రేమ ఎంతో కూడా తేటతెల్ల మయింది. తెలంగాణలో తిరుగుతూ వాగ్దానాలు చేస్తూ ఓట్లకోసం గాలం వేస్తున్న రాజకీయ పార్టీల అసలు సిసలు రంగులు తేలిపోవడానికి డిసెంబర్ 28, 2012 అఖిలపక్షసమావేశం ఉపయోగపడింది. తెలంగాణ కావాలనుకునే వారికి ఏ పార్టీ అండగా ఉందో తెలుసుకోవడానికి ఈ సమావేశం లో బయటపడిన రాజకీయపార్టీల నిజస్వరూపం ఒక సాధనం.
తెలంగాణ ఎంపీలు చాలా కష్టపడి సాధించిన చిన్న ముందడుగు డిసెంబర్ 28 అఖిలపక్ష సమావేశం. తెలంగాణ ఇవ్వాలా వద్దా ఒక అభిప్రాయం చెప్పండి అని అడగకుండా, ఇద్దరు రండి అని ఆహ్వానం పంపడం ద్వారా 2009 డిసెంబర్ 9 నాటి కమిట్‌మెంట్ తనకు ఏ మాత్రం లేదని కేంద్ర ప్రభుత్వం తేల్చింది. అన్ని పార్టీలు ఇద్దరు ప్రతినిధులను పంపినప్పడికీ ఒకే అభిప్రాయం చెప్పిన పార్టీలు అయిదు. అందులో మూడు (టిఆర్‌ఎస్, సిపిఐ, బిజెపి) తెలంగాణకు స్పష్టంగా అనుకూలత ప్రకటించాయి.సిపిఎం, మజ్లిస్ తెలంగాణకు స్పష్టంగా వ్యతిరేకం కాదు. స్పష్టంగా సమైక్యతకు అనుకూలం కూడా కాదు. ఆ రెండు పార్టీలు విభజనకు అనుకూలం అని వారేచెప్పారు. కాంగ్రెస్ పార్టీ కేంద్రంలో, రాష్ట్రంలో అధికారంలో ఉండగానే 9 డిసెంబర్ 2009న తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేయాలనే ప్రకటనను స్పష్టంగా విడుదల చేసింది. అదే వరసలో అఖిలపక్ష సమావేశం పెట్టానని కేంద్రం ఇటీవలే మరో సారి చెప్పింది. నిజమైనా కాకపోయినా చెప్పిన విషయం అది.
తెలంగాణ ఏర్పాటుకు అనుకూ లం అని రెండు ప్రధాన పార్టీలు ఇదివరకే చెప్పాయి. తెరాసతో 2004లో కాంగ్రెస్, 2009లో టీడీపీ పొత్తుపెట్టుకోవడం, మానిఫెస్టోలో ఆవిషయం చెప్పడం, కలిసిపోటీ చేయడం దానికి సాక్ష్యాలు. అబద్ధాలు ఆడడమే రాజకీయమైతే దానికి రుజువులు చెప్పి ప్రయోజనం లేదు. ఈ లెక్కన సి పి ఎం, మజ్లిస్ తప్ప ఏపార్టీ కూడా సమైక్య రాష్ట్రానికి అనుకూలమని, తెలంగాణకు ప్రతికూలమని చెప్పలేదు. సిపిఎం సైద్ధాంతికంగా విభజనకు వ్యతిరేకమన్నా కేంద్రం నిర్ణయిస్తే అడ్డుకోబోమనడం ద్వారా షరతుతో కూడిన అంగీకారం తెలిపినట్టే. తెలంగాణ ఏర్పాటుకు తాము వ్యతిరేకం అని చెప్పినా మజ్లిస్ పార్టీ రాయల-తెలంగాణా ఏర్పాటు చేయాలని అనడం ద్వారా సమైక్యంగా ఉంచడానికి వ్యతిరేకం అని విభజనకు అనుకూలం అని వెల్లడించింది. వైఎస్‌ఆర్ పార్టీ కూడా రాజ్యాంగం ఆర్టికల్ 3 ప్రకారం నిర్ణయాధికారం కేంద్రానికి ఉంది కనుక తీసుకొమ్మని చెప్పింది. ఏకాభిప్రాయం లేకపోయినా, అసెంబ్లీ వ్యతిరేకంగా తీర్మానించినా, ఆర్టికల్ 3 ప్రకారం కేంద్రం, కొత్త రాష్ట్ర ఏర్పాటు చేయవ చ్చు. కనుక తెలంగాణకు అనుకూలం అనలేకపోయినా సమైక్యతకు వ్యతిరేకం అనలేము. అయితే కాంగ్రెస్, తెలుగుదేశం, వైఎస్‌ఆర్ పార్టీలు తెలంగాణకు అనుకూలం అనడానికి వారి చరిత్ర, వర్తమానాలలో ఏమాత్రం అనుకూలమైన వాతావరణం లేదు.
కేంద్రంలో రాష్ట్రంలో ఏలుతున్న కాంగ్రెస్ నెలరోజుల్లోగా ఏ నిర్ణయం తీసుకుంటుందో చెప్పలేము. ఎన్నికలలో ఉపయోగపడుతుందనే అవకాశ వాదం తప్ప ఆ పార్టీకి మరో విధానం కనిపించదు. తెలంగాణ రాష్ట్రం ఇవ్వాలని వారు నిర్ణయిస్తే అందుకు ఏకాభిప్రాయం ఉన్నట్టే. రాజ్యాంగం ఆర్టికిల్ 3 కింద అధికారాన్ని వినియోగించడానికి పూర్తిగా అవకాశం ఉంది. రాజకీయంగా, రాజ్యాంగపరంగా అనుకూల నియమాలు ఉన్నాయి. అయి నా ఇది కేంద్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ పూర్తి విచక్షణకు సంబంధించిన విషయం కనుక ఇవ్వకుండా కూడా పోవచ్చు. ప్రవర్తన, ప్రకటన, పరిస్థితుల ఆధారంగా నిజానిజాలను నిర్ణయించాలి. అయితే బయటకు కనిపించే పరిస్థితులన్నిటి కన్న కనిపించే రాజకీయ అవసరాలతోపాటు, కనిపించని రాజకీయ లక్ష్యాలు, రహస్యంగా ఉండే రాజ్యాంగ వ్యతిరేక, రాజకీయాతీతం, అవకాశవాద పూరితం, సంపద, అధికారం, వ్యాపార ప్రయోజనాలు అనేవే కీలకాంశాలవుతాయి. కనుక ఏ లెక్కలూ నియమా లూ పనిచేయకుండా కేవలం కనపడని అవకాశవాదం ఆధారంగా తీసుకు న్న నిర్ణయాలే పైకి కనిపిస్తాయి.
కనుక చర్చించవలసింది అవకాశ వాదం గురించి. ఇందులో ఏ పార్టీకి మినహాయింపు లేదు. కాంగ్రెస్‌లో అవకాశ వాదం ఉంది. గెలుపోటముల సమీకరణాలను బట్టి నిర్ణయాలు తీసుకుంటారేగాని తెలంగాణ ప్రజలకు న్యాయం చేయాలని ఎవరికీ లేదు. రాష్ట్ర కాంగ్రెస్ పార్టీలో తెలంగాణను వ్యతిరేకించే కోస్తా, సీమ నేతలు కలిసి కట్టుగా ఉన్నా జాతీయస్థాయిలో తెలంగాణ వ్యతిరేకతలేని వారు ఉన్నారు కనుక, తెలంగాణకు న్యాయం చేయాలని అడిగేందుకు, న్యాయం కలిగేందుకు ఏదో ఓ మూల అవకాశం ఉంది. ప్రాంతీయ అవకాశవాద పార్టీలో ఆ ఆశలు ఉండవు.
టీడీపీ మరో అవకాశ వాద పార్టీ. కోస్తా, సీమ నాయకుల ఆధిపత్యం ఉన్న పార్టీ. ఆంధ్రప్రదేశ్ నుంచి విడిపోవడానికి తెలంగాణకు ఏ కారణాలున్నాయో టీడీపీలోంచి బయటపడడానికి తెలంగాణ నాయకులకు కూడా ఆ పార్టీలో అవే కారణాలు ఉన్నాయి. పదవులపై కోరిక వల్ల బయటకు రారు. అవేవీ మిగలవన్నప్పుడు వస్తారు. రెండు ప్రాంతాల్లో పార్టీని కాపాడుకోవడం నా బాధ్యత అన్న చంద్రబాబు మాట ఒక్కటే నిజం. మిగతా మాటలన్నీ ఆ ఇరుసుమీద ఆధారపడినవి మాత్రమే. తెలంగాణ విడిరాష్ట్రం అనే సమస్య టీడీపీకి లేనే లేదు. విడి రాష్ట్రం కాకుండా తెలంగాణ అనే పేరు, అంశం కూడా ఆ పార్టీకి ప్రాధాన్య తా క్రమంలో ఎక్కడ ఉందో వారు చెప్పలేరు.
తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు పట్ల కోస్తాంధ్ర టీడీపీ నేతల వ్యతిరేకత స్పష్టం. బాబు సీల్డ్ కవర్‌లో లేఖను కోస్తాంధ్ర నేత యనమల రామకృష్ణుడు ద్వారా ఇప్పించారు. తెలంగాణ నాయకుడు కడియం శ్రీహరి ద్వారా రెండో స్థాయి బాధ్యతగా మౌఖిక సందేశం ఇప్పించారు. ఆ రహస్యాన్ని వీలైనంత కాలం దాచిపెట్టారు. ఆ లేఖలో తెలంగాణ రాష్ట్రం గురించి తప్ప అనేక విషయాలు ఉటంకించారు. రాజకీయ అస్థిరత, భారీ అవినీతి, అసమర్థ సర్కారు, భిన్న రంగాలలో రాష్ట్రం దెబ్బతినడం, ప్రగతి వెనకపడడం, వ్యవసాయం, విద్యుచ్ఛక్తి దారుణంగా ఉండడం, అద్భుతమైన ఆర్థిక ప్రగతితో అలరారే రాష్ట్రాన్ని కాంగ్రెస్ వారు పతనం చేయించడం, పేదలకు ఉపాధి లేకుండా పోవడం, వగైరా గొప్పగొప్పవిషయాలు ప్రస్తావించారు. తాను 18.10.2008 నాటి లేఖను ఉటంకిస్తూ ప్రధానికి 26.9.2012 నాడు రాసిన లేఖను మళ్లీ ఉటంకించడం గురించి రాసారు. మేం 18.10.2008 నాటి మాటకు కట్టుబడి ఉన్నాం.
ఆ లేఖను వాపస్ తీసుకోలేదు అంటూ మీరో నిర్ణయం తీసుకొని అస్థిరతను దూరం చేయండి అని రాశారు. 28 అక్టోబర్ 2008 నాటి లేఖకు ఆధారం టీడీపీ కోర్ కమిటీ తీర్మానం. ఈ లేఖలో అంతకుముందు రాసిన లేఖగురించి చెప్పారు. తెదేపా కోర్ కమిటీ చాలా సమగ్రంగా చర్చించి తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుకు అనుకూలంగా తీర్మానించిందని, ఆ తీర్మానం ప్రతిని జతచేసామని రాశారు. ఇది టీఆర్ ఎస్ 2009 ఎన్నికల్లో పొత్తు కోసం షరతు విధించడం వల్ల తెలుగుదేశం ప్రణబ్ ముఖర్జీకి తెదేపా నేత విధిలేక రాసిన ఉత్తరం. అంతకుముందు ప్రణబ్ ముఖర్జీకి రాసిన లేఖలో ఎటూ తేలని అయోమయం ఉంది. ఈ లేఖలోనిది తెలంగాణ పట్ల తెదేపా చేసిన తొలి సానుకూల ప్రకటన.
రెండోది 2009 డిసెంబర్ 7న అఖిలపక్ష సమావేశంలో తెలంగాణపై మీరు బిల్లు పెట్టండి మేము మద్దతు ఇస్తాం అని చెప్పారు. ఆతరువాత 2009 డిసెంబర్ 8న అసెంబ్లీలో మీరు తెలంగాణకు అనుకూలంగా అసెంబ్లీలో తీర్మానం పెడితే మద్దతు ఇస్తాం. మీకు ధైర్యం ఉందా అని స్వయంగా తెదేపా అధినేత చంద్రబాబు సవాలు విసిరారు. తమ పార్టీలోని కోస్తాంధ్రులు వ్యతిరేకించినా తెలంగాణకు అనుకూలంగా తెదేపా ఎందుకు ప్రకటన చేసింది? తెలంగాణకు అనుకూలంగా ఉంటే కోస్తాలో తుడిచిపెట్టుకు పోతామేమోననే భయం తనకు ఉన్నట్టే కాంగ్రెస్ కు కూడా ఉందని కనుక తెలంగాణ ఇవ్వబోదనే నమ్మకంతో ఇచ్చింది. కాని టీడీపీతో సహా అన్ని పార్టీలు తెలంగాణ కు అనుకూలంగా ఉండడంతో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియను ప్రారంభిస్తున్నట్టు కేంద్రం ప్రకటించడం, కేసిఆర్ నిరశన విరమించడం జరిగింది.
కన్నడరాష్ట్రానికి చెందిన ఒకరు, తమిళనాడుకు చెందిన మరొకరు కలిసి ఆంధ్రకు ద్రోహం చేసారని చంద్రబాబు ప్రకటించారు. ఎన్నికలకు ముందు ప్రణబ్‌కు రాసిన లేఖలో, పొత్తు ద్వారా, మానిఫెస్టోలో, డిసెంబర్ 7, 8 ప్రకటనల ద్వారా చేసిన అయిదు కమిట్‌మెంట్‌లను కాలరాసిన ఘనత టీడీపీది. ఉత్తుత్తి రాజీనామాల వ్యూహాన్ని రచించి, కోస్తాంధ్ర కాంగీయుల తో చేతులు కలిపి, తెలంగాణ వ్యతిరేకతకు మనసా కర్మణా కట్టుబడి పకటనలు వేరే రకంగా ఉన్నాయి కనుక వాచా అనలేము) వత్తిడి పెంచి వచ్చిన తెలంగాణాను ఆపిన ఘనత వారిదని తెరాస అధ్యక్షుడు విమర్శించడంలో అతిశయోక్తి లేదు.
త్రికరణ శుద్ధిలో ద్వికరణ శుద్ధిని రద్దు చేసుకుని రెండు వైపుల చూసే రెండు కళ్ల సిద్ధాంతాన్ని ప్రతిపాదించిన తెదేపా పాతిపట్టిన ఆ 18.10.2008 నాటి కమిట్‌మెంట్ ను, ఆ పొత్తు కమిట్‌మెంట్‌ను, ఆ డిసెంబర్ 7, 8 నాటి కమిట్‌మెంట్‌లను వదిలేయడం వల్లనే వచ్చే తెలంగాణ రాష్ట్రం రాకుండాపోయిందని కళ్లు తెరిచి ఉన్న సగటుమనిషి ఎవరికైనా అర్థం అవుతుంది. తాను ఇవ్వలేకపోయినా వచ్చిన రాష్ట్రాన్ని ఆపడానికి గాను వదిలేసిన ఉత్తరాన్ని, నీళ్లొదిలిన పాత పనికి రాని ఉత్తరాన్ని, వాపస్ తీసుకోకపోయినా నిర్వీర్యం చేసిన ఉత్తరాన్ని, ఆ ఉత్తరంలో చెప్పిన పాత కమిట్‌మెంట్‌ను పాటిస్తానని ధైర్యంగా చెప్పలేక రహస్యంగా సీల్డ్ కవర్ లో పెట్టి తెలంగాణ వ్యతిరేక నాయకుడి ద్వారా ఇప్పించిన పార్టీకి కమిట్ మెంట్ అంటే ఏమిటో తెలుసా? యనమల స్పీకర్‌గా ఉన్నపుడు తెలంగాణ ప్రతిని ధి ప్రణయ్ భాస్కర్ తెలంగాణ గురించి మాట్లాడితే ఆ పదం వద్దని దాని బదులు వెనుకబడిన ప్రాంతం అనాలని పట్టుబట్టి రికార్డు నుంచి తొలగించాలని సూచించిన సభానాయకుడు చంద్రబాబు,
ఆయన ఆదేశం పాటించిన సభాపతి యనమల గార్లే, పాత లేఖలో ఉన్నదే మా కొత్త కమిట్‌మెంట్ అని చెప్పడం ఒక ఎత్తయితే, 2008 నాటి ప్రభుత్వం ఇప్పుడు లేదు కనుక ఆనాడు ప్రణబ్‌కు ఇచ్చిన లేఖ చెల్లదని చెప్పి తెలంగాణా వ్యతిరేకతను పదేపదే చాటిన యనమల తన మాట తానే దిగమింగి, ఆ పాత లేఖనే ప్రాణం ఉన్న లేఖ అంటూ హోంమంవూతికి కొత్తగా ఇవ్వడం మరొక ఎత్తు. 2008లో ప్రభుత్వం ఇప్పడి ప్రభుత్వం వేరయితే లేని ప్రభుత్వానికిచ్చిన చెల్లని ఉత్తరాన్ని ఇప్పడి ప్రభుత్వానికి ఇచ్చిన పార్టీ, ఏ కమిట్ మెంట్‌ను పూర్తిగా వదిలేసిందో అదే కమిట్‌మెంట్ చాలని కొత్తగా ఏమీ చెప్పబోమని చెప్పిన పార్టీ కమిట్‌మెంటును ఎవరు ఎందుకు నమ్మాల్నో ఎవరైనా చెప్పగలరా?
కొత్తగా ఇచ్చిన ఉత్తరంలో ఏవో సమస్యలు చెప్పిన టీడీపీ తెలంగాణ అంశం అని హోం మంత్రి లేఖలో భాగంగా ఉటంకించి ఇంకెక్కడా తెలంగాణ రాష్ట్రం అన్న మాట కూడా అనని టీడీపీ, తెలంగాణ ఇవ్వడానికి కాంగ్రె స్ సిధ్ధంగా లేదని తెలిసిన తరువాత ఉండీ లేనట్టు రాసీ రాయనట్టు రాసిన ఓ లేఖ ఆధారంగా తెలంగాణ ప్రజల్ని మభ్య పెడుతున్నట్టే, తాను తెలంగాణకు అనుకూలం అన్నది లేఖ వరసే మాటవరసే కాని పనివరస కాదని కోస్తాంవూధులకు రహస్యంగా హామీలు ఇవ్వలేదా, ఆ అస్పష్టతను కోస్తాలో వాడుకోరా? పాదయాత్ర సందర్భంగా ఒక బోనం కుండను ఎత్తి జైతెలంగాణ అని రాసి ఉన్నందుకు దించేసి జై తెలుగుదేశం అని రాసిన బోనంను ఎత్తుకున్న చంద్రబాబుకు తెలంగాణ కన్నా టీడీపీ ఎక్కువ అని రెండు కళ్లలో తెలంగాణ, కోస్తా ఆంధ్ర లేవని, ఒక కంట్లో కోస్తాంధ్ర మరోకంట్లో తెలుగుదేశం ఉన్నాయని తెలంగాణ ఎక్కడా లేదని తెలంగాణ ప్రజ లు ఎందుకుభావించకూడదు? 2008న ఇచ్చిన మాటను డిసెంబర్ 10, 2009న తప్పడానికి యూ టర్న్ తీసుకున్న తెదేపా, డిసెంబర్ 27న తెలంగాణా గడ్డ (కరీంనగర్ పొత్కపల్లి) మీదనుంచి రాసిన లేఖ ద్వారా మరొక యు టర్న్ తీసుకుని తెలంగాణకు గుండుసున్నా పూర్తి చేసారు. దీన్ని సర్క్యులర్ రెఫన్స్ అంటారు. ప్రతిసారి ఎడమవైపు తిరుగు అని నేత ఒకే మాట చెప్తూ ఉంటాడు, ఆ మాట ప్రకారం ఎడమకే తిరుగుతున్న వ్యక్తి చివరకు మొదలుపెట్టిన చోటికే వస్తాడు. అదీ తెలంగాణకు టీడీపీ ఇచ్చిన నిండుసున్న.
బంగ్లా యుద్ధవిజేత అయిన ఇందిరాగాంధీకి 1971లో మొత్తం దేశం విపరీతమైన మెజారిటీతో ఓట్లు గుమ్మరించి, సీట్లు సంపాదించి పెడితే ఇక్క డి ప్రజలు తెలంగాణ ప్రజాసమితి అభ్యర్థులను పదకొండు స్థానాల్లో గెలిపించి తెలంగాణ రాష్ట్ర వాంఛను చాటి చెప్పారు. అయినా మోసం చేశారు. మోసం చేయడానికి వీల్లేనంత మెజారిటీతో తెలంగాణలో తెలంగాణ పార్టీని గెలిపించడం.. మిగిలినవారిని మట్టిగరిపించడం ఒక్కటే కాంగ్రెస్ తెలుగుదేశం, వైఎస్‌ఆర్‌సీపీ అవకాశవాదాలను అంతం చేస్తుంది. తెలంగాణ ఆత్మగౌరవాన్ని మోసగాళ్లనుంచి రక్షించుకోవలసిన అవసరం ఉన్నది.
-మాడభూషి శ్రీధర్
నల్సార్ న్యాయ విశ్వవిద్యాలయం ఆచార్యులు,
మాధ్యమ న్యాయ శాస్త్ర పరిశోధనా కేంద్రం సమన్వయకర్త